లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిస్తూ, మణికర్ణిక ఘాట్ ఏఎస్ఐ పరిధిలోని రక్షిత కట్టడం కాదని స్పష్టం చేశారు. ఆ ఘాట్ పవిత్రతను కాపాడేందుకే అక్కడ పునరుద్ధరణ, పరిరక్షణ పనులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న పురాతన మణికర్ణిక ఘాట్, భారత పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చే రక్షిత స్మారక కట్టడం కాదని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
మణికర్ణిక ఘాట్ వద్ద జరుగుతున్న పునర్నిర్మాణ పనులపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
పునరుద్ధరణ పనులపై ఎంపీల ప్రశ్నలు
కథనం ప్రకారం, సోమవారం(మార్చి 9) లోక్‌సభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘మణికర్ణిక ఘాట్ గౌరవాన్ని కాపాడేందుకే అక్కడ పునరుద్ధరణ, పరిరక్షణ ప్రాజెక్టును చేపట్టాం’ అని ఆయన అందులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ సభలో మాట్లాడుతూ, ‘అభివృద్ధి’ పేరుతో అక్కడ చేపడుతున్న నిర్మాణాల వల్ల మణికర్ణిక ఘాట్ తన చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యతను కోల్పోతుందా? అని ప్రశ్నించారు.
అంతేకాకుండా, “ఈ నిర్మాణాల వల్ల ఘాట్ పురావస్తు ప్రాముఖ్యతకు ఎంతమేర నష్టం వాటిల్లిందనే దానిపై ప్రభుత్వం ఏదైనా స్వతంత్ర ఆడిట్ నిర్వహించిందా” అని కూడా ఆయన నిలదీశారు.
మంత్రి షెకావత్ సమాధానం
“మణికర్ణిక ఘాట్ ఏఎస్ఐ పరిధిలోని రక్షిత కట్టడం కాదు. వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ అందించిన సమాచారం ప్రకారం, ఘాట్‌ను బలోపేతం చేయడం, అంత్యక్రియల కోసం వచ్చే కుటుంబాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, గంగానది సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా చూడటం కోసమే ఈ పునరుద్ధరణ, పరిరక్షణ ప్రాజెక్టును చేపట్టారు” అని మంత్రి షెకావత్ స్పష్టం చేశారు.
ఆడిట్ నిర్వహణకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి నేరుగా సమాధానం ఇవ్వలేదు.
అయితే, అంత్యక్రియల కోసం వచ్చే కుటుంబాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మాత్రం ఆయన స్పందించారు.
ఘాట్ల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా స్థానిక అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.
స్థానిక ప్రజలు, సంఘాల సమన్వయంతోనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు షెకావత్ వెల్లడించారు.
గంగానది ప్రవాహానికి ముప్పు ఉందా?
భారీ కాంక్రీట్ నిర్మాణాల వల్ల గంగానది సహజ ప్రవాహానికి, ఘాట్ పునాదుల పటిష్టతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందా అన్న ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు.
“ప్రస్తుతం జరుగుతున్న పునరుద్ధరణ పనుల వల్ల ఘాట్ పునాదులు మరింత పటిష్టమవుతాయి. గంగానది సహజ ప్రవాహానికి కూడా ఎలాంటి ఆటంకం కలగదు” అని షెకావత్ తేల్చి చెప్పారు.
స్థానికుల ఆందోళనలు, అధికారుల వివరణ
వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్, హిందువుల అత్యంత పురాతన, పవిత్రమైన దహన సంస్కారాల ప్రదేశాలలో ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఇది ఎంతో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.
ఈ ఏడాది జనవరిలో మణికర్ణికా ఘాట్ వద్ద పునరాభివృద్ధి పనులు ప్రారంభించినప్పుడు వారణాసిలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ పనుల వల్ల ఘాట్‌లోని కొంత భాగం దెబ్బతిన్నదనే వార్తలు వచ్చాయి. దీనివల్ల నగర సాంస్కృతిక వారసత్వం దెబ్బతింటుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, జిల్లా యంత్రాంగం ఈ ఆరోపణలను కొట్టిపారేసినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొన్నది.
కథనం ప్రకారం- స్థానిక పాల్ సమాజ్ సమితి సభ్యులు, ఇతర స్థానికులు ప్రధానంగా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కేవలం అపార్థం, గందరగోళం వల్లే ఈ వివాదం చెలరేగిందని అధికారులు స్పష్టం చేశారు.
వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్ పత్రికలతో మాట్లాడుతూ, “అక్కడ కేవలం అభివృద్ధి పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఘాట్‌లోని ఏ భాగానికీ ఎలాంటి నష్టం జరగలేదు” అని స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
