ఆ ఇద్దరిది ఒకే స్కూల్. పాఠాలు నేర్చుకున్న కాలాలు వేరు. ఆ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు.
ఒకరు తెలంగాణ ఉద్యమ సారథి, మరొకరు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి. కాలగమనంలో చాలా మార్పులు వచ్చాయి.
ఎంతటి సుశిక్షితులైన భంగపడక తప్పదు. బెంగటిల్లక తప్పదు. ఈ రెండు విషయాలు- ఈ ఇద్దరి నాయకుల విషయంలో సరిపోలుతున్నాయి.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఏం మాట్లాడిన చెల్లుతుందని కేసీఆర్ అనుకున్నారు.
60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పీడ కల అనుభవాలను చెల్లా చెదురు చేసిన అనుభవం ఆయన సొంతం.
అయినా, జనం మనోభావాలను గుర్తించలేక కేసీఆర్ ఓటమిపాలు కాక తప్పలేదు.
అంతేనా, ఉద్యమ సందర్భంలో కేసీఆర్ ఎన్ని పొరపాటు మాటలు చెప్పినా- ఆనాటి సమాజం ఆయనను కాపాడుకున్నది.
తనది ఫక్తు రాజకీయమని తానే చెప్పుకున్న తర్వాత, ఆ సమూహం ఆయన నుంచి దూరమైనది.
చరిత్ర సృష్టించిన నాయకుడిగా కేసీఆర్ మిగిలారు.
ఈనాడు ఆ శిబిరం లేదు. నేటి స్థితిగతి ఏమిటో బీఆర్ఎస్ నాయకులనే కాదు, ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇది కాలం రుజువు చేసిన సత్యం.
భస్మాసుర హస్తం..!
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. జనబాహుళ్యం చేత భేష్ అనిపించుకున్నారు.
రెండేళ్ల తన పాలన ఎట్లా ఉన్నా, ప్రజలు ఆయన పట్ల ఔదార్యంగా ఉన్నారు. ఏదో చేస్తున్నాడనే అభిప్రాయంతో ఉన్నారు.
చెరువుల పునరుజ్జీవనం రేవంత్ ఇమేజ్ మైలేజీని కాస్త పెంచింది. లోటు బడ్జెటని చెప్పినా, ఆరు గ్యారెంటీల అమలు ఏదని ఎవరు నిలదీయలేదు.
పైగా పంచాయితీ ఎన్నికల్లో హస్తం పార్టీకే పట్టం కట్టారు.
ఈ సందర్భంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తన పాపులారిటీకి ఆటంకంగా మారాయి. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును చౌరస్తాలోకి తీసుకొచ్చాయి. ఇంతకూ ఆయనేమన్నారు? “తెలంగాణలో టీడీపీ లేకుండా చేసిన బీఆర్ఎస్ను బొందపెట్టాలి” సుమారు ఇలాంటి హెడ్డింగ్లతో పత్రికల్లో వార్తలొచ్చాయి.
డ్యామెట్ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఎట్లా అంటే, చంద్రబాబు నాయుడు తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపిస్తున్నారని 1996 నుంచి 2003 వరకు తెలంగాణ రైతాంగం, తెలంగాణ వాదుల అభిప్రాయం.
ఇదంతా దశాబ్దం కిందటి చరిత్ర
కరువుతో అల్లాడుతున్న నాటి తెలంగాణ రైతాంగ వేదనను పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచింది. ఇది తెలంగాణ కరువు రైతాంగానికి శరాఘాతంలాంటి నిర్ణయం. దీని ఫలితంగా వేలాది మంది ప్రజలు “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాటి చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించి, ఉద్యమకారుల మీద నిర్దయతో కాల్పులు జరిపించింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు దేశం పార్టీ పాలనపై ఒక నెత్తుటి మరక.
కేసీఆర్ టీడీపీ నుంచే వచ్చారు. తొలుత టీఆర్ఎస్లో ఉండి, అనంతరం టీడీపీలోకి వెళ్లారు రేవంత్. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్లో కాలు మోపారు.
చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం తెలంగాణ వ్యతిరేకులని కేసీఆర్ పదేపదే చెప్పేవారు. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్ర నాయకుల రాజీనామాలకు తెర లేచింది. దీని కారకులు చంద్రబాబేనని కేసీఆర్, నాటి తెలంగాణ ఉద్యమకారులు బలంగా విశ్వసించారు. ప్రజలకు అదే చెప్పారు.
డైలాగ్ నష్టం ఎవరికి?
రేవంత్ ముఖ్యమంత్రై కాగానే ఆయన చంద్రబాబు శిష్యుడని బీఆర్ఎస్ భారీ ఎత్తున ప్రచారం చేసింది. వాటిని తొలుత రేవంత్, ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. కానీ ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు అంతులేని శక్తినిచ్చాయి. రెండు కళ్ల సిద్ధాంతం గురించి చెపుతున్న చంద్రబాబు స్వరూపం ఇదేనని విపక్ష పార్టీ నాయకులు తీవ్ర స్వరంతో ఆగ్రహిస్తున్నారు.
ఇక్కడ ముఖ్యమంత్రి అనుయాయిలు, అభిమానులు మరో విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
“ఖమ్మం సభలో రేవంత్ మాట్లాడుతున్నప్పుడు, కొందరు తెలుగు దేశం జెండాలతో వచ్చి నినాదాలు చేశారు. వారినుద్దేశించి, నినాదాలు తన వద్ద కాదని, టీడీపీ ఉనికిని దెబ్బతీసిన టీ(బీ)ఆర్ఎస్ గద్దెలు కూల్చాలనే కోణంలో రేవంత్ చెప్పారు తప్పా- తెలుగుదేశం మీద ప్రేమతో కాదు”అని రేవంత్ అనుయాయిలు అంటున్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ పండితులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఓ సందేశం పంపేందుకు ఇట్లా మాట్లాడరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ల సమన్వయాన్ని, సహకారలేమిని నిరసిస్తూ ఈ రూపంలో ఆవేదనను వ్యక్తీకరించారని మరి కొందరు అంటున్నారు.
ఎవరెట్లా వ్యాఖ్యానించినా, ఎవరెన్ని విధాలా విశ్లేషించినా అంతిమంగా ఈ డైలాగ్ నష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి కూడా. ఈ సమయాన్ని, సందర్భాన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం లేకపోలేదు.
రెండేళ్ల తర్వాత విపక్ష బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డే సువర్ణావకాశాన్ని ఇచ్చారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లే రేవంత్, ఈ విషయంలో ఎందుకు నోరుజారారోనని అర్థం కావడం లేదని సాధారణ జనాభిప్రాయం. దీనిపై రేవంత్ స్పష్టత ఇస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఆయనెట్లా స్పందిస్తారో తెలియదు కానీ, ఈ అంశం బీఆర్ఎస్కు బాగా అనుకూలిస్తుందని మరింతమంది అంటున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
