రెండు దశల్లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికలు మొత్తం దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగం, మహిళలకు సంబంధించిన అంశాలు కీలకంగా మారాయి.
బీహర్ చాలా వెనకబడిన రాష్ట్రం అక్కడ ఎక్కువగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏమీ లేవు. రాష్ట్ర యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు, చిన్నాచితక పనులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. 2025 నాటికి రాష్ట్ర మొత్తం జనాభా 13.43 కోట్లుగా అంచనా వేయబడింది, ఇందులో 22% యువత ఉంది.
బీహర్‌లో 2023- 24 వరకు నిరుద్యోగులు 10.8% ఉన్నారు. వీరిలో విద్యాధిక నిరుద్యోగల సంఖ్య 3.9% ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలుపరుస్తుంది. అందులో “ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయ భత్య” పథకం ఒకటి. ఇంటర్ పూర్తి చేసిన 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువతకు నెలకు రూ 1000 ఆర్ధిక సహాయాన్ని అందచేస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
అలాగే “ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన ” కింద ఇంటర్ పూర్తి చేసి, ఇంటర్న్‌షిప్ చేస్తూ ఐటీఐలో డిప్లోమా చేస్తున్న యువతకు నెలకు రూ 5000, పీజీ చేస్తున్న వారికి నెలకు రూ 6000 చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించనున్నారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బీహార్ యువకులు హైదరాబాద్‌తో సహా దేశంలోని ఇతర పెద్ద నగరాలకు వలస వెళ్తున్నారు. వివిధ రంగాలలో ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్‌లో అపార్టుమెంట్లు, విల్లాల సముదాయాలు, కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు- కళాశాలల్లో సెక్యూరిటీగార్డులుగా జీవనోపాధి పొందుతున్నారు.
ప్రధానాంశంగా మహిళలు..
మహిళలకు సంబంధించిన అంశాలు కూడా బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా మారాయి. ఓట్ల విషయానికి వస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 2010 తర్వాత మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. మహిళలే ఎక్కువగా ఓటు వేస్తున్నారు కూడా. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ 59.45% ఉండగా, పురుషులది 53% నమోదయింది.
గడచిన మూడు, నాలుగు ఎన్నికల నుంచి పురుషులకంటే మహిళలే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
“తాజాగా మహిళల కోసం “ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన” పేరుతో ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ 10వేల చొప్పున రూ 2,500 కోట్లను బదిలీ చేశారు.” బీహార్‌లోని జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యువతకు, మహిళలకు చాలా చేస్తున్నామని గొప్పలు చెప్పుతున్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర యువత, మహిళలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో వేచిచూడాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
