రెండు నెలల క్రితం ముగిసిన పంచాతీయ ఎన్నికలు, ఇటీవల ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో బీసీలు తమ సత్తా చాటుకున్నారు.
రాష్ట్రంలో తమ జనాభా దామాషాకు మించి పట్టణ స్థానిక సంస్థల చైర్ పర్సన్ల పదవుల్లో 61%, డిప్యూటీ చైర్ పర్సన్ల పదవుల్లో 41%, పంచాయతీ సర్పంచ్ పదవుల్లో 50%కు పైగా దక్కించుకున్నారు.
ఇది రాష్ట్ర రాజకీయ యవనికపై వస్తున్న మార్పును స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ ఫలితాలు వెనుకబడిన తరగతులలో నూతనోత్సాహాన్ని ఇస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యం 20కు మించలేదు.
వారి జనాభా దామాషా కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చాయి.
కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి.
ఆ తరువాత న్యాయస్థానాల తీర్పుల కారణంగా 20% కంటే తక్కువ స్థానాలను కేటాయించడం జరిగింది.
2025 డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2026 ఫిబ్రవరిలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదు.
రాష్ట్రాలకు అక్కడి జనాభాకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది.
అయినప్పటికీ, అధికారిక గణాంకాలు లేవనే నెపంతో న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయనే భావన బీసీలలో బలంగా నాటుకుపోయింది.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తానని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట హామీ ఇచ్చింది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, న్యాయపరమైన చిక్కుల పరంగా అసాధ్యమని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం ఒక మూలమలుపుగా చెప్పవచ్చు.
బీసీలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని గమనించే ఆ పార్టీ ఇలా వాగ్దానం చేసింది. తరువాత అధికారంలోకి వచ్చింది.
అయితే అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 19 మంది బీసీలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ ఆ పార్టీ రాజేసిన 42% రిజర్వేషన్ల చిచ్చుమాత్రం ఆరిపోలేదు.
శాసనసభలో తమ జనాభా దాషామాకు అనుగుణంగా ఎమ్మేల్యేలు గెలవకపోయినా, రాజకీయంగా తమకున్న ప్రాముఖ్యతను బీసీ డిక్లరేషన్ ముందుకు తెచ్చిందనే భావన వారిలో బలంగా నాటుకుపోయింది.
దీనిపై ప్రస్తుత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య(బీజేపీ) నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘంతో పాటు అన్ని బీసీ సంఘాలు నిరంతరం ఉద్యమాలు చేయడం మొదలు పెట్టాయి.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో(కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం) అసాధ్యమైన ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీ మీన మేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేసింది.
వాగ్దాన భంగమవుతుందనే కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది.
అనివార్యమైన పరిస్థితులలో జీవోలు, ఆర్డినెన్స్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించింది. కానీ, హైకోర్టు జీవోను రద్దు చేసింది.
చివరకు 2025 డిసెంబర్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అధికారికంగా 17% రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. కానీ, ఎన్నికలలో అనూహ్యంగా బీసీలు 50%కు పైగా స్థానాలు దక్కించుకున్నారు.
10,223 నాన్ షెడ్యూల్ గ్రామ పంచాయతీలలో వారికి రిజర్వు చేసిన 2,186 పంచాయతీలతో సహా 2,937 జనరల్ స్థానాల్లోనూ విజయం సాధించారు.
మొత్తం 5,123 సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు గ్రామ పాలనలో బీసీలు ఇక అనివార్య రాజకీయ శక్తిగా మారారని చాటిచెప్పాయి.
మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఏకంగా 60.95% సొంతం చేసుకుని, పట్టణాల్లో ప్రథమ పౌరులుగా అందలమెక్కారు.
ఎన్నికలు పూర్తయిన 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీలే చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ల పదవుల్లోనూ 41% మంది బీసీలే ఉన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లలోనూ బీసీలు సత్తా చాటారు.
ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, నాలుగు కార్పొరేషన్లలో బీసీలే మేయర్ పదవులు దక్కించుకున్నారు. మొత్తం పదవుల్లో ఇది 57.14%.
స్థానిక సంస్థలలో సాధించిన విజయాలు రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మారుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఫలితాల నేపథ్యంలో 2028 ఎన్నికలలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్‌ను బీసీ సంఘాల నాయకులు ముందుకు తెస్తున్నారు.
బీసీలలో విద్య, ఉద్యోగ, రాజకీయపరంగా వచ్చిన చైతన్యమే ఈ ఫలితాలు: ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యులు
1970ల నుంచి రాష్ట్రంలో నిరంతరం సాగుతున్న బీసీ ఉద్యమం ఫలాలు ఇప్పుడు రాజకీయంగా పరిపక్వతకు వచ్చాయని ఆర్ కృష్ణయ్య అన్నారు.
అంతేకాకుండా, “బీసీలలో ఇప్పటికీ ఆర్థిక వెనుకబాటు ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్వంటి పథకాలతో లబ్ధి పొందారు. ఉన్నత ఉద్యోగాలు పొందారు. ఆర్థికంగా బలపడ్డారు. రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. రాజ్యాధికారం ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలమనే స్పృహతో బీసీలు సంఘటితమవుతున్నారు” అని చెప్పుకొచ్చారు.
“2014 నుంచి బీసీ ముఖ్యమంత్రి నినాదం ముందుకు వచ్చింది. ఈసారి ఈ డిమాండ్ మరింత బలంగా మారనుంది” అని అన్నారు.
వాగ్దానాల వైఫల్యం, నిరుద్యోగం కారణంగానే ఈ ఫలితాలు: డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్
రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలు సంఘటితం కావడం మొదలైందని, దాని ఫలితమే ఈ విజయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
ఆయన ‘ది వైర్’ ప్రతినిధితో మాట్లాడుతూ, బీసీలలో పెరుగుతున్న నిరుద్యోగం కూడా ఒక కారణంగా చెప్పారు. బీసీ నిరుద్యోగ యువత రాజకీయాల్లోకి చురుగ్గా వస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా రాజకీయంగా సంఘటితమై తమ అభ్యర్థులను గెలిపించుకుంటున్నారని పేర్కొన్నారు.
“జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడానికి న్యాయవ్యవస్థ అడ్డుపడటం కూడా బీసీలలో పట్టుదలని పెంచుతోంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని 50% రిజర్వేషన్ పరిమితి బీసీల విషయంలో ఎందుకు ముందుకు తెస్తున్నారు”అని అరుణ్ కుమార్ ప్రశ్నించారు.
బీసీల అణచివేతకు రాజకీయంగా, న్యాయపరంగా జరుగుతున్న ప్రయత్నాలకు ప్రతిఘటనే ఈ ఫలితాలని పేర్కొన్నారు.
“గత ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న బీసీ ఉద్యమం కారణంగా- విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కారణంగా బీసీలు ఆర్థికంగా కూడా కొంత వరకు బలపడ్డారు. అటువంటి వారు రాజకీయాల్లోకి వచ్చి, అగ్రవర్ణాలతో సమానంగా ఎన్నికలకు ఖర్చు పెట్టగలిగారు”అని తెలియజేశారు.
“అగ్రవర్ణాలు ఏ విధంగానైతే పార్టీలకు అతీతంగా ఎలా సహకరించుకున్నారో, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీసీలు సంఘటితమై తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా ఉంటుందు”అని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
78 సంవత్సరాల రాజకీయ అణచివేతపై తిరుగుబాటే ఈ ఫలితాలు: బాలరాజ గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్
“స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలవుతున్నా బీసీలు ఇంకా అణచివేతకు గురవుతున్నారు. ఆ అణచివేతపై తిరుగుబాటుగానే ఈ ఫలితాలను చూడాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇవే ఫలితాలు రాబోతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిపి 100కు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతున్నారు. బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలనే డిమాండే ఈసారి ప్రధాన అజెండాగా ఉంటుందు”అని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ ‘‘ది వైర్’’కు తెలిపారు.
తెలంగాణ ఉద్యమం కారణంగా వాయిదా పడిన బీసీ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది: బాణాల అజయ్ కుమార్, అడ్వోకేట్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్
“ఇది శుభపరిణామం. బీసీలలో స్పష్టమైన చైతన్యానికి ఇది నాంది. రాబోయే రోజులలో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తుంది. తెలంగాణ ఉద్యమం కారణంగా బీసీ వాదం 20 సంవత్సరాలు వెనుకబడింది. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ బాపూజీవంటి ఉద్దండులు ముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాధాన్యతమిచ్చారు. ఈ తరుణంలో రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి కొంత విరామం వచ్చింది. మళ్లీ ఇప్పుడు ముందుకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది. బీసీ ముఖ్యమంత్రి కావాలనే నినాదం తప్పకుండా ముందుకు వస్తుంది” అని అడ్వోకేట్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ తెలిపారు.
అత్యంత వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం లేదు: మురళీ, ఎంబీసీ సంఘం నాయకుడు
ఇప్పడు వచ్చిన ఫలితాలు నాణేనికి ఒక వైపు మాత్రమేనని ఎంబీసీ సంఘం నాయకుడు మేదర మురళీ అభిప్రాయపడ్డారు. “బీసీలలో ఆర్థికంగా, రాజకీయంగా బలపడిన నాలుగు ఆధిపత్య కులాలు మాత్రమే అగ్రవర్ణాలతో సమానంగా పోటీపడి స్థానాలు గెలుచుకోగలిగాయి. కులాధిపత్యం ముందుకు వచ్చింది. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా బీసీలలోని ఆధిపత్య కులాలు సంఘటితమై విజయాన్ని దక్కించుకున్నాయి. కానీ, బీసీలలోని మిగతా కులాలకు కనీస ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. వార్డు సభ్యులుగా కూడా పోటీ చేయలేకపోయారు. అత్యంత వెనుకబడిన కులాలకు కూడా ప్రాతినిధ్యం దక్కినప్పుడు మాత్రమే బీసీలు విజయం సాధించినట్లు భావించాలి”అని అన్నారు.
మరింత చైతన్యానికి నాంది ఈ ఫలితాలు: అంబాల నారాయణ గౌడ్
“బీసీలు ఈ స్థాయిలో విజయాలు దక్కించుకోవడం రాజకీయాలపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. చట్టసభలలో జనాభా వాటాకు అనుగుణంగా ప్రాతినిధ్యం పెంచుకోవడానికి ఈ ఫలితాలు ప్రేరణగా నిలుస్తాయి”అని గౌడ, కల్లుగీత సంఘాల జేఏసీ కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ పేర్కొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
