ఇటీవల రామనాథ్ గోయెంకా ఆరవ మెమోరియల్ ఉపన్యాసంలో ప్రధాని మోడీ చేసిన ఒక వ్యాఖ్య విద్యా వ్యవస్థ మీద నడుస్తున్న దశాబ్దాల చర్చను మరోసారి ముందుకు తెచ్చింది. భారతీయ చదువుల చెట్టును 1835 మెకాలే మినట్ కూలదోసిందని, దేశీయ విజ్ఞానం పట్ల న్యూనతా భావాన్ని పెంపొందించిందని ఆయన ప్రస్తావించారు. మెకాలే మినట్కు 2035 నాటికి 200 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పటికల్లా ఈ మనస్తత్వం నుంచి బయట పడాలని ప్రధాని ప్రకటించారు.
ఈ సందర్భంలో ఆయన ఒక చారిత్రక సంఘటన గురించి వివరించారు.
గుజరాత్లో ఒక కుష్ఠు ఆసుపత్రి ప్రారంభానికి మహాత్మా గాంధీని ఆహ్వానించినప్పుడు- ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి “దాన్ని మూసే రోజున పిలిస్తే వస్తాను” అని అన్నారట. అదే ఆసుపత్రిని మూసివేసే అవకాశం తనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినట్టు ఒకింత గర్వంతో ఈ ప్రసంగంలో చెప్పారు. ఈ ఉదాహరణతో ఆయన 2035 నాటికి దేశంలోని మెకాలే చదువుల ఫ్యాక్టరీలకు తాళం వేయాలన్నదే తన స్వప్నమని ప్రకటించారు.
గుమాస్తా తయారీ నుంచి పరీక్ష ఆధిపత్యం వరకు..
భారతదేశంపై తమ పాలనను శాశ్వతం చేసుకోవడానికి బ్రిటిష్ వలస ప్రభుత్వం పరిమితమైన పాశ్చాత్య విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందుకు 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్‌ను అమలు చేశారు. దీని లక్ష్యం నిజమైన విద్యను ఇవ్వడం కాదు; ఆంగ్ల భాషను వలస పాలనకు అనుకూలమైన ‘బోధన’ సాధనంగా, ఒక ఆధిపత్యపరికరంగా నెలకొల్పడం.
“రక్తంలో, వర్ణంలో భారతీయులే అయినా- రుచుల్లో, అభిప్రాయాల్లో, నైతిక విలువల్లో, ఆలోచనల్లో ఆంగ్లేయుల్లా ఉండే ఒక వర్గం మనకు, మన పాలనలో ఉన్న లక్షలాది భారతీయులకు మధ్య అనువాదకులుగా నిలవడానికి తయారు చేయాలి”అని థామస్ మెకాలే తన లక్ష్యాన్ని మెకాలే మినట్లో స్పష్టంగానే తెలిపాడు.
అయితే, 19వ శతాబ్దం మధ్య నాటికి భారతదేశంలో ఒక మధ్యతరగతి ఆవిర్భవించడం ప్రారంభమైంది. వారందరూ “అభిప్రాయాల్లో, ఆలోచనల్లో ఇంగ్లీష్వారిలా” మారలేదు; చాలామంది తమ సహచర భారతీయుల పరిస్థితిపై ఆందోళన చెందారు. వారు సామాజిక సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించడంతో పాటు, భారత స్వాతంత్ర్య పోరాటానికి పునాది వేసే ప్రయత్నాలు చేశారు.
మెకాలే మినట్ భారత విద్యను జ్ఞాపకశక్తి ఆధారిత గుమాస్తా తయారీ వ్యవస్థగా మార్చిందన్న విమర్శ కొత్తది కాదు. విద్యార్థులు నేర్చుకునే వ్యక్తులుగా కాకుండా పరీక్ష రాయడానికి సిద్ధమయ్యే యంత్రాలుగా మారారని చాలాకాలంగా చెప్పుకుంటూనే ఉన్నాం. పరీక్షలకు ఉండాల్సిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, బండెడు సిలబస్‌తో పాఠ్యపుస్తకాలను భారంగా మార్చడం, విమర్శనాత్మక దృష్టిని దెబ్బతీయడం- సృజనాత్మకతను పెంపొందించలేకపోవడం, స్వతంత్ర్య ఆలోచనాపరులుగా పిల్లలను తీర్చిదిద్దలేకపోవడం- ఏ ఒక్కటి కొత్త సమస్య కాదు.
ప్రధాన విద్యా కమిషన్లన్నీఈ సమస్యలను గుర్తించాయి. ఎన్ఈపీ- 2020 కూడా గుర్తించింది. అయితే, గుర్తించడమొక్కటే కాదు కావలసింది; వాటిని మార్చడం, పరిష్కరించడం కావాలి.
స్వాతంత్ర్యం వచ్చిన పిదప కూడా మనమెందుకు మన విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకోలేదు? ప్రస్తుత ప్రభుత్వ పదేళ్ళ పాలన పరిస్థితులను మెరుగుపరిచిందా? అన్న ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలను వెతికితే ప్రధాని ఆశయం సాధ్యమయ్యేది, లేనిది తెలుస్తుంది.
మౌలిక విషయాలు మారకపోతే ఫలితాలు రావు. చదువులు ఎందుకు బట్టీ విధానంగా మారాయి? పాఠ్యపుస్తకాలు ఎందుకు భారంగా ఉన్నాయి? పరీక్షలకు ఉండాల్సిన దానికంటే ఎందుకు అధిక ప్రాధాన్యత కొనసాగుతోంది? విమర్శనాత్మక దృక్పథం ఎందుకు పెంపొందడం లేదు? స్వతంత్ర ఆలోచన ఎందుకు పెంపొందడం లేదు? అందరికీ సమాన నాణ్యమైన విద్య ఎందుకు అందడం లేదు? ఇవన్నీ ఉపరితల సమస్యలు కాదు, విద్యా వ్యవస్థకు సంబంధించిన మౌలిక విషయాల విస్మరణ ఫలితంగా ఉత్పన్నమైనవి.
అసలు సమస్యలు ఎక్కడున్నాయి?
విద్యా రంగంపై మనం మాట్లాడేటప్పుడు, ఒక అసౌకర్యకరమైన నిజాన్ని ముందుగా అంగీకరించాలి. మన విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు చిన్నవి కావు; అలాని ఉపరితల సమస్యలు కావు— అవి లోతైనవి, వ్యవస్థాగతమైనవి, ఏళ్లుగా పేరుకుపోయినవి.
విచారకరం ఏమిటంటే ఈ లోతైన సమస్యలు ప్రజల దృష్టికి రాకుండా సామర్ధ్యాల కొరత, నైపుణ్యాల కొరత, ఉపాధ్యాయుల జవాబుదారీతనం తగ్గడంపై(వీటికి కారణాల చర్చ ఉండదు), అతి కొద్దిమంది విజయగాథలపై , నిరంతరం చర్చలు ఉంటాయి. పరీక్షా సంస్కరణలు, పోటీ పరీక్షలు పరిష్కారాలన్నట్లుగా చర్చలు చేస్తూ అసలు సమస్యలను దాటవేస్తుంటారు.
విద్యకు తగిన నిధులు ఇవ్వకపోవడం, నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల కొరత, నియంత్రణ లేని కోచింగ్ పరిశ్రమ, లాభాపేక్ష కలిగిన ప్రైవేటీకరణ అనేవి అసలైన సమస్యలు. వీటిని పరిష్కరించడానికి దీర్ఘకాలిక పెట్టుబడి, రాజకీయ సంకల్పం, నిజమైన సంస్కరణలు అవసరం ఉంది. కానీ ఇవి కష్టమైనవి. అందుకే సామర్ధ్యాల కొరత, నైపుణ్యాల కొరత, ఉపాధ్యాయుల జవాబుదారీతనం తగ్గడంపై, పరీక్షా సంస్కరణలు, పోటీ పరీక్షలు విషయాలపై దృష్టిని మల్లిస్తుంటారు, కొత్త పరీక్షా సంస్థలను ఏర్పాటు చేస్తుంటారు. నాణ్యత లేని ఉపాధ్యాయ విద్య, ఉపాధ్యాయుల కొరత గురించి చర్చ ఉండదు. కానీ ఉపాధ్యాయులను బాధ్యులుగా నిలబెట్టడం మీదనే ప్రాధాన్యత ఉంటుంది. తరచూ అది రాజకీయ ఆయుధంగా మారుతుంటుంది.
విద్యకు ప్రతిపాదించబడిన బడ్జెట్ ఇప్పటివరకూ సమకూర్చబడలేదు. ఇప్పటికీ పాఠశాల స్థాయిలో సార్వత్రిక ఎనరోల్‌మెంట్ పూర్తికాలేదు. డ్రాప్‌అవుట్ సమస్య లేకుండా పోలేదు. పాఠశాలల్లో వనరుల కొరత, మంచినీరు, సానిటరి సౌకర్యాల కొరత ఇంకా ఉంది. అందరికీ సమాన, నాణ్యమైన విద్య అందే పరిస్థితులు లేవు. అంత్యంత కీలకమైన టీచర్ల విద్య అతి నిర్లక్ష్యానికి గురికాబడింది. ప్రైవేటీకరణ మితిమీరింది, పరిశోధనల స్థాయి అంతంత మాత్రమే, అకడమిక్ స్వేచ్ఛ దిగజారింది. వీటిపై చర్చ ఉండదు.
పరీక్షల ఆధిపత్యం ఎందుకు పెరిగింది?
పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకోవడం, అంచనా వేయడం, పోటీని కొలవడం సులువు. పరీక్షా ఫలితాల ఆధారంగానే విద్యాసంస్థల ప్రతిష్ట కొలవబడుతుంది. విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ పెరిగినకొద్దీ, ఫలితాల ఆధారంగా ర్యాంకులు సంపాదించడం, ప్లేస్మెంట్లు పొందడం, “ఉత్తమ పాఠశాల, ఉత్తమ కళాశాల” అనే ప్రచారం కోసం పరీక్షలు ప్రధాన సాధనాలుగా మారుతాయి.
ప్రైవేట్ పాఠశాలలు, కోచింగ్ సంస్థలు అత్యుత్తమ పరీక్షా ఫలితాలనే తమ ప్రధాన మార్కెటింగ్ సాధనంగా వాడుకుంటాయి. నేటి విద్యా మార్కెట్లో ఉత్తమ పాఠశాలలు, ఉత్తమ కళాశాలలు ప్రధానంగా పరీక్షా ఫలితాల మీదనే తమ ప్రతిష్ఠను నిర్మించుకుంటాయి. ఇది వారికి లాభదాయకం.
కాబట్టి పాఠ్యాంశాలు, బోధనా పద్ధతి, విద్యార్థి అనుభవం అన్నీ పరీక్షల చుట్టూ తిరుగుతాయి. అవసరమైతే అనైతిక మార్గాలూ అనుసరించబడతాయి. ఈ ఒత్తిడి ప్రభుత్వ పాఠశాలలకు కూడా చేరి, అవి కూడా పరీక్షలకే మక్కువ పెంచే విధానాలను అనుసరించే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొత్తం విద్యా వ్యవస్థ, సరిగా నేర్పించడం మీద కాకుండా, పరీక్షించడం మీద స్థిరపడిపోతుంది. ఈ పరీక్ష కేంద్రీత విద్యా వ్యవస్థ, విద్యా వ్యాపారులకూ ఉపయోగకరంగా ఉంటుంది, వ్యవస్థాపరమైన లోపాలను కప్పిపుచ్చడానికి ప్రభుత్వాలకూ కూడా బాగా తోడ్పడుతుంది. దీంతో ప్రభుత్వాలు ఈ పరీక్షా కేంద్రీత వ్యవస్థను ప్రోత్సాహిస్తాయి.
మెకాలే మైండ్‌సెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలను చెప్పకుండా ఉండటం అసాధ్యం.
పరీక్షా సంస్కరణలు ప్రభుత్వాలకు ఎలా లాభిస్తాయి?
పరీక్షా సంస్కరణలు మీడియాను బాగా ఆకర్షిస్తాయి. బాధ్యతను ప్రభుత్వంనుంచి పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులపైకి మళ్లించవచ్చు. అసలు సంస్కరణలు చేయకుండానే “మేము నిజాయితీగానే మార్పులు చేస్తున్నాం” అనే రాజకీయ కథనాన్ని నిర్మించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి.
విద్యా వ్యవస్థలో నిజమైన మార్పు రావాలంటే పరీక్షలను కాదు, వ్యవస్థను మార్చాలి. పోటీని కాదు, సమాన అవకాశాలను పెంచాలి. ఉపాధ్యాయులను నిందించడం కాదు, వారికి శక్తినివ్వాలి. పిల్లలపై భారాన్ని కాదు, పాఠశాలలపై పెట్టుబడిని పెంచాలి. పరీక్షలు ముఖ్యం. కానీ పరీక్షల పేరుతో అసలు సమస్యలను దాచడం- అది విద్యకు, సమాజానికి, భవిష్యత్తుకు నష్టదాయకం.
ఉద్దేశం మంచిదే, కాని పరిష్కారం కాదు
ఇక్కడే 2018 నుంచి నిర్వహించబడుతున్న ప్రధాని మరో జాతీయ కార్యక్రమం ‘పరీక్ష పే చర్చ’(PPC) గురించి మాట్లాడాలి.
ఈ కార్యక్రమం ఉద్దేశం మంచిదే— పరీక్షల ఒత్తిడిని తగ్గించడం, విద్యార్థులకు ఉత్సాహపరిచే మాటలు చెప్పడం. కానీ పీపీసీ మీద ఇప్పటి వరకు పార్లమెంట్ రికార్డుల ప్రకారం సుమారు రూ 70 కోట్లకు పైగా ఖర్చు అయింది. 2023లో ఒక్క సారిగా ఖర్చు రూ 27.70 కోట్లను దాటింది; 2024లో మరో రూ 16.83 కోట్లు, 2025లో రూ 18.82 కోట్లు.
ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తే చివరికి ఏం మారింది? ఒత్తిడి తగ్గిందా? పరీక్షల తీరు మారిందా? ప్రవేశ పరీక్షల ఒత్తిడి తగ్గిందా? పాఠ్య అంశాల భారం తగ్గిందా? సమాధానం అందరికీ తెలిసిందే.
విద్యార్థుల కోసం ఉన్న కొన్ని స్కాలర్షిప్లను తగ్గించి ఈ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కూడా విమర్శలకు లోనవుతోంది. ఇది అసలు సమస్యకు పరిష్కారాన్నిస్తుందా? లేదంటే ఒక రాజకీయ కార్యక్రమమా? అనే సందేహం సహజమే.
కానీ పీపీసీ ప్రాథమిక సమస్య ఏమిటంటే, ఇది ఒత్తిడిని అనుభవించే వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది, ఒత్తిడిని సృష్టించే వ్యవస్థను కాదు. పరీక్షల రూపం యథాతథంగా ఉంటే, పాఠ్యపుస్తక భారం తగ్గించే సూచనలు అమలులో అసమర్థంగా మారితే, ప్రేరణా ప్రసంగం ఎవరు ఇచ్చిన కూడా విద్యార్థుల భవిష్యత్తును మార్చలేదు. అన్నీ సమస్యలను తీరుస్తుందని చెప్పబడుతున్న ఎన్ఈపీ 2020 అమలు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. విద్యకు బడ్జెట్ కేటాయింపులు, ఉపాధ్యాయ శిక్షణ, మౌలిక సదుపాయాలు, భాషా అడ్డంకులు, డిజిటల్ అసమానత ఇవన్నీ ఇంకా పరిష్కార దశలోనే ఉన్నాయి.
పీపీసీ సూచనలు వినడానికి మంచివే. కానీ సమస్య విద్యార్థుల మానసిక ధోరణిలో కాదు. సమస్య విద్యా వ్యవస్థలోనే ఉంది. ఒత్తిడిని సృష్టించే నిర్మాణం యథాతథంగానే ఉంటే, ఒత్తిడిని తగ్గించే ప్రసంగాలు ఎంత విన్నా ఫలితం చాలా పరిమితమే. పరీక్షలు, ర్యాంకులనివ్వడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగితే, పాఠశాలలు మార్కుల కోసం పోటీ పడితే, కోచింగ్ సెంటర్లు ఇంకా పెరిగితే, విద్యార్థులు తాము నేర్చుకోవడం కాకుండా నిరూపించుకోవాడమే ప్రధానమైతే — మెకాలే ఫ్యాక్టరీలకు తాళం వేయడం సంగతి పక్కన పెడితే, వాటిలో కొత్త యంత్రాలు కూడా జోడించాల్సి వస్తుంది. ఆ పనిని సంస్కరణలని గొప్పలు పోతూనే ఉన్నాము.
మెకాలే మైండ్ సెట్‌ను రూపుమాపడానికి ఎన్ఈపీ- 2020 కృషి చేస్తున్నదని ప్రధాని తెలిపారు. ఈ సమస్యలను ఎన్ఈపీ- 2020 చర్చించింది, కొంతవరకు పరిష్కరించాలనుకుంటోంది. కాని ఆచరణలో సమస్యల మౌలిక రూపాన్ని మార్చే దిశలో లేదు. విద్యకు బడ్జెట్ కేటాయింపులు, పాఠశాలలకు అవసరమైన మౌలిక వనరులు, ఉపాధ్యాయులకు కావాల్సిన శిక్షణ, భాషా అడ్డంకులు, డిజిటల్ అంతరాలు— ఇవన్నీ ఇంకా విస్తృత అంచెల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. పైగా ప్రభుత్వరంగాన్ని బలపరచడం కన్నా ప్రైవేటు రంగానికి కొత్త మార్గాలను తెరుస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యాన్ని చూస్తే, 2035 నాటికి “మనసు మార్పు” రావడం కన్నా “వ్యవస్థ మార్పు” రావడం చాలా పెద్ద సవాలు.
ప్రధాని ఆశయం తప్పు కాదు, దేశం మెకాలే మైండ్‌సెట్ నుంచి బయటపడాలి, పరీక్షల ఆధిపత్యం తగ్గాలి- చదువు అసలైన విద్యగా మారాలి. కానీ ఈ మార్పు సమావేశాల్లో, ఉపన్యాసాల్లో, పీపీసీ వేదికలపై మాత్రమే జరగదు. ఇది జరగాలంటే ప్రభుత్వానికి, సమాజానికి, విద్యా సంస్థలకు, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థకు ఆ మార్పును భరించే సాహసం ఉండాలి. ఇప్పటికైనా నిజాయితీగా చెప్పుకోవాల్సిందల్లా విద్యలో సమస్యను సృష్టించింది మెకాలే కాదు; మెకాలే విధానాలను కొనసాగించడమే. ఎవరి ప్రయోజనాల కోసం ఆ కొనసాగింపు జరిగినదనేది విలువైన ప్రశ్న.
పరీక్షా కేంద్రిత విద్య నుంచి అభ్యాస కేంద్రిత విద్యకు(Learning Centered Education) మారడానికి రాజకీయ సంకల్పం అవసరం. ప్రైవేటీకరణను నియంత్రించడానికి ధైర్యం అవసరం. ప్రజా విద్యను బలపరచడానికి పెట్టుబడి అవసరం. ఇవి లేకుండా మనం మెకాలే ఫ్యాక్టరీల గురించి మాట్లాడతామే కాని, వాటికి తాళం వేయడం కష్టమే.
ఎడమ శ్రీనివాస రెడ్డి
అధ్యాపకులు, కాకతీయ ప్రభుత్వ కళాశాల(స్వ), కాకతీయ యూనివర్సిటి, హన్మకొండ.
9949905069, sreevare13@gmail.com
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
