గవర్నర్ల అధికారాలు- రాజ్యాంగ స్పష్టతకా! రాజకీయ చేష్టలకా? తన తీర్పు విషయంలో సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకోవడం దేనికి సంకేతం?
గవర్నర్లు, రాష్ట్రపతి బాధ్యతల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని రాజకీయ, న్యాయ నిపుణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు నిర్దిష్ట కాలపరిమితి విధించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టు ఈ తీర్పు కనిపించినా; దాని రాజకీయ పరిణామాలు గంభీరమైనవిగా, రాజకీయ వత్తిడికిలోనైన యూటర్న్ తీర్పుగా ప్రజల్లో అనుమానాలను రేకిత్తిస్తోంది.
రాజ్యాంగం ప్రకారం- రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి కాలపరిమితి రాజ్యాంగంలో నిర్దేశించలేదు. ఇదే రాజ్యాంగ శూన్యత(కాన్స్టిట్యూషన్ వాక్యూమ్)ను తన తీర్పులో సుప్రీంకోర్టు సూచించింది. అయితే, “రాజ్యాంగంలో నిర్దేశించని ప్రతి అంశంలోనూ కార్యాచరణ విధానాన్ని న్యాయవ్యవస్థ నిర్దేశించకూడదా? ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సమయపాలన ఎంతో అవసరం కదా?” అనే ప్రశ్నలు ఇక్కడ మెదలుతాయి.
న్యాయవ్యవస్థ చంచల స్వభావం..
2023 నవంబర్ 20న సుప్రీంకోర్టు తీర్పుకు ముందు, 2022 ఏప్రిల్ 8నాటి తీర్పులో సుప్రీంకోర్టే భిన్నమైన వైఖరిని తీసుకుంది. ఆ తీర్పులో రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. ఈ రెండు తీర్పుల మధ్య ఉన్న విరోధాభాసం న్యాయవ్యవస్థ అస్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తింది.
న్యాయవ్యవస్థలో ఇటువంటి “యూటర్న్లు” ప్రజల్లో న్యాయం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఒకే అంశంపై వేర్వేరు సమయాల్లో వేర్వేరు తీర్పులు వెలువడటం న్యాయ వ్యవస్థ స్థిరత్వానికి, ప్రజల విశ్వాసం, నమ్మకానికి భంగకరం కాదా?
రాజకీయ దుర్వినియోగం- చారిత్రక నేపథ్యం..
గవర్నర్ పదవి రాజకీయంగా దుర్వినియోగం చేయబడుతుందనే ప్రశ్న కొత్తదేమీ కాదు. 1960ల నుంచే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా ప్రవర్తించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సమస్య మరింత తీవ్రమైంది.
తమిళనాడులో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం చాలా కాలం పాటు నిలిపి వేయబడ్డాయి. ఇదే పరిస్థితి కేరళలోనూ ఉండడం విశేషం. ఈ రాష్ట్రాలు తమ హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది.
ప్రజాస్వామ్య సూత్రాలపై దాడి..
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ అధికారం. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆమోదించిన బిల్లులను, కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత కాలమైనా పక్కకు పెట్టవచ్చనే దుస్థితి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం.
గవర్నర్, రాష్ట్రపతి కేవలం రాజ్యాంగ ప్రతినిధులు(ట్యూటరీ హెడ్స్)మాత్రమే, నిజమైన ప్రజా ప్రతినిధులు (రియల్ ఎక్జిక్యూటివ్స్)కాదు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు(పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ) ఆమోదించిన బిల్లులను ఏకపక్షంగా ఆమోదించకపోవడం లేదా నిలిపివేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుంది.
న్యాయవ్యవస్థపై ఒత్తిడులు /బెదిరింపులు ఉన్నాయా!?
మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి తీర్పుపై వివరణ ఇస్తూ, రాజ్యాంగంలో కాలపరిమితి నిర్దేశించబడలేదని సూచించారు. కానీ రాజ్యాంగంలో నిర్దేశించబడని అనేక అంశాల్లో న్యాయవ్యవస్థ తన అధికారాన్ని ఉపయోగించి మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది.
పదవీ విరమణ చివరి రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి తీర్పులో మార్పు తెచ్చిన ఈ విషయం, న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ఒత్తిడుల గురించి అనుమానాలను రేకెత్తిస్తోంది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయడం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం.
ప్రజాస్వామ్యానికి రక్షణ అవసరం..
సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం సరైనది కావచ్చు. కానీ, అది రాజకీయంగా దుర్వినియోగానికి దారి తీస్తుందేమోనన్న భయం మేధావుల్లో, న్యాయ నిపుణుల్లో ఉంది. రాష్ట్రాల హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడం న్యాయవ్యవస్థ ప్రాథమిక బాధ్యత.
రాజ్యాంగంలో నిర్దేశించబడని అంశాల్లో కూడా, ప్రజాస్వామ్య సూత్రాలు, సమ న్యాయపాలన, న్యాయం/ ధర్మం వంటి మూలభూత అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. గవర్నర్ల అధికారాలు రాజకీయ ఆయుధంగా మారకుండా చూసుకోవడానికి రాజ్యాంగ సవరణ ద్వారా కాలపరిమితిని నిర్దేశించడం లేదా న్యాయవ్యవస్థ తన అధికారాన్ని ఉపయోగించి మార్గదర్శకాలను నిర్దేశించడం అత్యవసరం.
ప్రజాస్వామ్యం అంటే కేవలం నియమాలు మాత్రమే కాదు, అంతకు మించి; ఆ నియమాల వెనుక ఉన్న రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజాస్వామ్య సూత్రాలు కూడా. ఈ సూత్రాలు రక్షించబడాలి. లేకుంటే ప్రజాస్వామ్యం అర్థరహితమై, బలవంతుని మెజారిటీ, కార్య నిర్వాహక ఆధిపత్య పాలనగా మారిపోతుంది.
రాజ్యాంగం ప్రకారం శాసన నిర్మాణ శాఖ, కార్య నిర్వాహక శాఖ, న్యాయ శాఖ పరస్పర సహకారంతో “చెక్స్ అండ్ బ్యాలెన్స్” పద్ధతుల్లో భారత రాజ్యాంగం ఉన్నత స్థాయిని; ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర విలువలతో ప్రజాస్వామిక పద్ధతుల్లో; దేశ ప్రజలందరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం దక్కటమే మనం రూపొందించుకున్న- మనకు మనమే అంకితం చేసుకున్న భారత రాజ్యాంగ సార్ధకతను, విలువను కాపాడినట్టు అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
