తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన అభివృద్ధి నమూన కొనసాగుతోంది. దీనికి సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్, కొడంగల్ ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ నమూనా తెలంగాణ రాజకీయాలలో సవాళ్లను ముందుకు తెస్తున్నది. 1980ల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో అడుగు పెట్టింది మొదలు తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తెచ్చేందుకు యత్నించారు. ఈ పరంపరను అందుకున్న వారు తన్నీరు హరీష్ రావు. ఆ తర్వాత కేటీఆర్; ఈ ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రయినంక కొడంగల్నూ, మిగితా మూడు నియోజకవర్గాల సరసన నిలుపుతానని జన సమూహం మధ్య ప్రకటించారు. అంతేకాదు, తెలంగాణే కొడంగల్ నియోజకవర్గం ఢిల్లీకి నోయిడాలాగా చేస్తానని కూడా అన్నారు. దీన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిందే.
1991 అనంతరం పామూలపర్తి వెంకట నరసింహా రావు(పీవీ) ప్రధాని అయ్యారు. మన తెలుగువాడు, దక్షిణానికి చెందిన మహా మేధావి ఆ స్థాయికి వెళ్లినందుకు చాలా మంది సంతోషించారు. దక్షిణాదిపై అభివృద్ధి ముద్ర ప్రస్ఫుటంగా ఉంటుందని భావించినవారూ ఉన్నారు. అంతేకాదు, భారత దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన పీవీ తెలుగు నేలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన స్వగ్రామం వంగర అభివృద్ధి గురించి పాత్రికేయులు అడిగినప్పుడు “ఈ దేశంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తన ఊరు అభివృద్ధి చెందుతుంది” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆధునిక భారతదేశ గమ్యాగమనాలను నిర్దేశించిన, నిర్ధారించిన మార్గదర్శి పీవీ. తాను ఎదగడమే అభివృద్ధి కాదని, తన గ్రామమే అభివృద్ధిలో అగ్రగామిగా ఉండడడం సమంజసం కాదని; ఆచరణాత్మకంగా చూపించిన నాయకుడు ఈయన.
కవిగా, పండితునిగా, నిజాం రాచరిక వ్యతిరేక పోరాటం కాలం నుంచి తనదైన ముద్రను వేసుకున్నారు. అనంతరం, సాంకేతికత యుగానికి ద్వారాలు తెరిచి; సరికొత్త చరిత్రను సృష్టించారు. తాను ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకే కాదు. పరిపాలనకు మానతవతను జోడించాలని చెప్పిన “ఇన్సైడర్” పాములపర్తి.
రాజకీయం ఓ వైంకుఠపాళి..
రాజకీయాలలో గెలుపపోటములే ప్రధానం. ఇదొక వైంకుఠపాళి. నిచ్చెనలు వేసుకోని ఎదగాల్సిందే, లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే. ఈ విషయాన్ని, వాస్తవికతను గుర్తెరిగిన కొందరు తమ నియోజకవర్గాలపై బలమైన అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాభిమానాన్ని చూరగొట్టున్నారు.
1948 నుంచి 1950 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాడు ప్రజా సభకు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు సామూహిక అభివృద్ధి నమూనాను కొనసాగించారు. అనంతరం 1952 నుంచి 1980ల వరకు తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాలపై ప్రత్యేక అభివృద్ధి నమూనాను అమలు చేసినవారు లేరు కావొచ్చు.
గత అభివృద్ధి నమూనాకు భిన్నంగా, ప్రజా సమస్యలే కేంద్రంగా; అభివృద్ధిని కొనసాగించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్. తాను ఎమ్మెల్యే అయ్యేనాటికి సిద్ధిపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది.
తొలుత దాన్ని ఆయన పరిష్కరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో సీసీ రోడ్లు మురిగి నీటి పారుదల, నళ్లా సౌకర్యం ఇవన్నీ 2000 నాటికే ఈ నియోజకర్గ ప్రజల అనుభవంలోకి వచ్చాయి. ఆ తర్వాత ఈ అభివృద్ధి నమూనాను హరీష్ రావు పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ దేశంలోనే సుందరనందన నగరంగా సిద్ధిపేటను తీర్చిదిద్దారు.
అభివృద్ధి నమూనా, రాజకీయ చతురత..
అధికార పార్టీ ఏదైనా తన నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వరద పారించిన అరుదైన నాయకుడు హరీష్‌రావు. మన దేశంలో ఊహించిన మెజారిటీతో వరుసగా గెలుస్తూ సరికొత్త రికార్డును సృష్టిస్తున్న నాయకుడు ఇతనే. ఇదే వరుసలో కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. బహుశా ఈ అభివృద్ధి నమూనా కారణంగానే ఈ ఇద్దరు వరుసగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.
కేసీఆర్ సిద్ధిపేట నుంచి గజ్వేల్‌కు మారిన తర్వాత అక్కడా సరికొత్త అభివృద్ధి నమూనా అనుభవంలోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించింది కూడా ఒకానొక అభివృద్ధి ప్రధానంశంగా అక్కడివారు చెప్పుకుంటారు. ఈ తరహా రాజకీయాభివృద్ధి నమూనాను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ కొనసాగిస్తానని చెప్పకనే చెప్పారు.
ఎవరు కీలకమైన నాయకులో ఆ నియోజకవర్గాలే అభివృద్ధి చెందితే తమ గతేమిటనని మిగతా నియోజకవర్గాల ప్రజల నుంచి సవాళ్లు వస్తూనే ఉన్నాయి. ఈ తరహా అభివృద్ధి నమూనా, రాజకీయ చతురత ఆయా నాయకులను విజేతలుగా నిలబెడుతోంది. ఇదే సందర్భంలో పక్క నియోజకవర్గాల సొంత పార్టీ నేతలనే పరాజితులను చేసే అవకాశమూ ఉంది.
తనను నమ్మి ఓట్లేసిన ప్రజలను వృద్ధిలోకి తేవడం సముచితం. ఇదే సందర్భంలో సమతుల అభివృద్ధి అంతకంటే ముఖ్యం. ఈ విషయాన్ని పాలక పెద్దలు గుర్తించాలని, గుర్తిస్తారని ఆశిద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
