దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ ఒక కీలక మలుపును సూచిస్తోంది.
ఈ బిల్ ద్వారా యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈవంటి సంస్థలను రద్దు చేసి, వీటి స్థానంలో ఒకే కేంద్ర నియంత్రణ సంస్థగా “వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ ”ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీని ఆధ్వర్యంలో ఉన్నత విద్యా సంస్థల(వైద్య, వెటర్నరీ, ఫార్మసీ, న్యాయ విద్యలను మినహాయించి) రెగ్యులేషన్ కోసం వికసిత్ భారత్ శిక్ష వినిమయన్ పరిషత్, ప్రమాణాల నిర్ధారణకు మానక్ పరిషత్, అక్రెడిటేషన్ కోసం గుణవత్త పరిషత్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.
భారత ఉన్నత విద్యలో సంస్కరణల అవసరం ఉందన్న విషయంపై ఎవరికీ విభేదం లేదు.
కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్(వీబీఎస్ఏ) బిల్లును చూస్తే- ఇది సంస్కరణల కోసం చేసిన ప్రయత్నమా, లేక నియంత్రణను కొత్త రూపంలో అమలు చేసే వ్యూహమానే సందేహం తలెత్తుతుంది.
ఈ బిల్లు సమర్థత, నాణ్యతల మాటలను మాట్లాడినప్పటికీ- దీని అసలైన ఉద్దేశ్యం కేంద్రీకృత నియంత్రణగా ఉంది.
ఈ బిల్లు విద్యను మెరుగుపరచడం కంటే, విద్య ద్వారా ప్రభుత్వం సాధించాలనుకునే రాజకీయ లక్ష్యాలపైనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.
అధికారాన్ని కేంద్రీకరించడానికి, సమాఖ్య వ్యవస్థను బలహీనపరచడానికి, ఉన్నత విద్యా సంస్థలను మరింత కఠినమైన రాజకీయ నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
ప్రభుత్వం ఈ బిల్లును “సింగిల్ విండో వ్యవస్థ”, “తక్కువ ప్రభుత్వం – మెరుగైన పాలన”, “స్వయం ప్రతిపత్తి”వంటి ఆకర్షణీయ పదాలతో సమర్థించుకుంటోంది.
కానీ ఈ మాటలకు బిల్లులోని వాస్తవ నిబంధనలకు మధ్య స్పష్టమైన అంతరం కనిపిస్తోంది.
ఎన్నడూ లేని విధంగా అధికార కేంద్రీకరణ
అనేక నియంత్రణ సంస్థల బదులు ఒకే సంస్థ ఉండటం వల్ల సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది.
కానీ వాస్తవంగా జరుగుతున్నది నియంత్రణల తొలగింపు కాదు, వాటి కేంద్రీకరణ.
ఇప్పటికే కష్టాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల స్వేచ్ఛను తగ్గించి, ఒకే అధికారానికి లోబడి పనిచేయాల్సిన పరిస్థితిని సృష్టిస్తోంది.
యూజీసీ , ఎన్సీటీఈ, ఏఐసీటీఈ చట్టాలను రద్దు చేసి అనేక నియంత్రణ సంస్థలను ఒకే కేంద్ర నియంత్రిత అధికార సంస్థలో విలీనం చేయడం ద్వారా- ఇంతవరకు ఎప్పుడూ లేని స్థాయిలో కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి అధికారం మారుతుంది.
చర్చకు, భిన్నాభిప్రాయాలకు, ప్రజాస్వామ్య పరిపుష్టికి విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా ఉండవలసినవి; కానీ ఇకపై అవి క్రమశిక్షణకు లోబడి, ఆడిట్‌కు గురై, సంపూర్ణంగా పై నుంచి నియంత్రించబడే సంస్థలుగా మారాలని ఈ బిల్లు సూచిస్తోంది.
ఈ బిల్లులో అత్యంత ప్రమాదకరమైన అంశాలలో ఒకటి యూజీసీ(విశ్వవిద్యాలయ గ్రాంట్ల కమిషన్) నుంచి ఆర్థిక అధికారాలను తొలగించి, గ్రాంట్ల కేటాయింపును విద్యా మంత్రిత్వ శాఖకు లేదా ప్రభుత్వ నియంత్రణలోని ప్రత్యేక సంస్థ(Special Purpose Vehicle – SPV)కు బదిలీ చేయడం.
అసమానతలను మరింత పెంచే అవకాశం
తీవ్ర అసమానతలతో కూడిన సమాజంలో నిధుల కేటాయింపులో నిర్ణయాలు ఎప్పటికీ తటస్థంగా ఉండలేవు.
దళిత, ఆదివాసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు చదివే విద్యా సంస్థలు ప్రధానంగా ప్రజానిధులపైనే ఆధారపడుతాయి. గ్రాంట్లు ఆలస్యమైతే, షరతులతో కూడినవిగా మారితే లేదా పూర్తిగా నిలిపివేయబడితే; దాని ప్రభావాలు వెంటనే- తగ్గిన స్కాలర్షిప్లు, శిథిలమవుతున్న వసతి గృహాలు, అధ్యాపక సిబ్బంది కొరతతో ఉన్న విభాగాల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ విషయాలన్నీ ముఖ్యంగా మొదటి తరం విద్యార్థులకు, ప్రత్యేకంగా మహిళలకు నిర్ణయాత్మకంగా మారుతాయి.
దీంతో చాలా మంది విద్యను మధ్యలోనే వదిలేసే ప్రమాదం ఉంటుంది.
సంస్కరణలుగా చూపబడుతున్న ఈ చర్యలు వాస్తవానికి ఇప్పటికే ఉన్న వర్గ, కుల, లింగ అసమానతలను మరింతగా పెంచుతాయి.
“సరైన పనితీరు కనబరచని ”(underperforming) సంస్థలుగా భావించబడేవాటిని ఆడిట్ చేయడం, స్థాయిని తగ్గించడం లేదా మూసివేయడం వంటి అధికారాలను ఈ బిల్లు నియంత్రణ సంస్థకు ఇస్తోంది.
కానీ ఒక విద్యా సంస్థ సరైన పనితీరు కనబరచకపోవడమనేది అనేక సంస్థాగత, వ్యవస్థాగత, సామాజిక విషయాలతో కలిసి ఉన్న సంక్లిష్ట విషయం.
కొలవగలిగిన విషయాలను మాత్రమే లెక్కలోకి తీసుకునే పనితీరు సూచికల ప్రాతిపదికన దాన్ని నిర్ణయించలేము. అది దశాబ్దాలుగా కొనసాగుతున్న నిధుల కొరత, నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన ఫలితం.
గ్రామీణ కళాశాలలు, మహిళా కళాశాలలు, మైనారిటీ సంస్థలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని రాష్ట్రాల విశ్వవిద్యాలయాలే అధికభాగం యువతకు విద్యనందిస్తున్నాయి.
ప్రస్తుతం అవి సరైన పనితీరు కనబరచని విఫల సంస్థలుగా మారబోతున్నాయి.
ఫలితంగా మూసివేతలు, దీంతో ఉన్నత విద్యకు ఉన్న ఏకైక అవకాశాన్నిఈ యువత కోల్పోయే ప్రమాదం ఉంది.
బిల్లులో అంతర్లీనంగా ఉన్న కేంద్రీకరణ, ఉమ్మడి జాబితాలోని విద్య సమాఖ్య స్వరూపాన్ని మరింత దెబ్బతీస్తుంది.
ఉన్నత విద్యలో అధిక భాగాన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వాలు; కానీ నిర్ణయాధికారం మొత్తం ఢిల్లీలో కేంద్రీకృతమవుతుంది.
పరిమిత ఆర్థిక సామర్థ్యమున్న రాష్ట్రాలకు, కేంద్రమద్దతు తగ్గిన పరిస్థితిలో ప్రాంతీయ అసమానతలు మరింత తీవ్రమవుతాయి. కొద్ది సంఖ్యలోని, బాగా నిధులు ఉన్న నగరాల్లోని సంస్థలు వికసించవచ్చు; కానీ రాష్ట్ర నిధులతో నడిచే కళాశాలలు నెమ్మదిగా మూతబడే స్థితికి చేరుతాయి.
ఆడిట్ల ఆధారిత పాలన, పనితీరు సూచికలు(performance metrics), నియంత్రణ చర్యలు అధ్యాపకుల ఉద్యోగ భద్రతను తగ్గిస్తాయి.
ఈ బిల్లు ఇప్పటికే విస్తృతంగా ఉన్న అకడమిక్ శ్రమ కాంట్రాక్టీకరణను మరింత తీవ్రతరం చేస్తుంది.
వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ సంస్థ ఎలా పనిచేస్తుందంటే
బిల్లు ప్రకారం, అత్యున్నత గొడుగు సంస్థగా ఉండే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్– ఒక చైర్‌పర్సన్‌తో పాటు మరో 12 మంది సభ్యులతో ఏర్పడుతుంది. వీరందరినీ భారత రాష్ట్రపతి నియమిస్తారు, దీని కింద పనిచేసే మూడు పరిషత్‌లలో ఒక్కో దానిలో 14 మంది సభ్యులు ఉంటారు.
ఆయా పరిషత్‌లకు సంబంధించిన అధ్యక్షుడిని, సభ్యులను search-cum-selection కమిటీ సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు.
యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈవంటి సంస్థలను వీబీఎస్ఏలో విలీనం చేయడం ద్వారా విభజన తొలగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే వైద్య, న్యాయ రంగాల నియంత్రణ సంస్థలను మాత్రం బయటే ఉంచడం గమనార్హం.
సమస్య విభజన కాదు, ఎవరిని నియంత్రించాలనే రాజకీయ నిర్ణయమనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తున్నది.
స్వయం ప్రతిపత్తి అనే పదం బిల్లులో చాలాసార్లు కనిపిస్తుంది.
కానీ ప్రమాణాలు, అక్రిడిటేషన్, నిధులపై పూర్తి నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉన్నప్పుడు, స్వయం ప్రతిపత్తి మాటల్లో మాత్రమే అనే విషయం తెలుస్తున్నది.
వనరుల కొరతతో మరింత వెనుకబడే అవకాశం
యూజీసీవంటి సంస్థలు లోపాలను కలిగిఉన్నా, విశ్వవిద్యాలయాలకు ఒక రక్షణ కవచంలా పనిచేశాయి. ఇప్పుడు ఆ కవచం తొలగిపోతుంది.
అక్రిడిటేషన్ వ్యవస్థను కేంద్ర అనుమతులకు లోబర్చడం ద్వారా, అది నాణ్యతను మెరుగుపరచే సాధనంగా కాకుండా విధేయతను నిర్ధారించే ఆయుధంగామారే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యవస్థలో పెద్ద ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుకు వస్తాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మాత్రం వనరుల కొరతతో మరింత వెనుకబడతాయి.
నిధుల పంపిణీని నేరుగా మంత్రిత్వ శాఖ చేతుల్లో పెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాల స్వతంత్రత మరింత బలహీనమవుతుంది.
ప్రభుత్వ పెట్టుబడి తగ్గుతూ, అప్పులు, స్వయం ఆర్థిక నమూనాలు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో “ఎక్సలెన్స్” అంటే విద్యా నాణ్యత కాదు, మార్కెట్లో నిలబడగల సామర్థ్యంగా మారే ప్రమాదం ఉంది. ఈ బిల్లులో సామాజిక సమానత్వం, అకాడమిక్ స్వేచ్ఛ, ప్రాంతీయ అసమానతలు, ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ నియంత్రణ వంటి అంశాలపై స్పష్టత లేదు.
విద్యార్థులు పెరుగుతున్న ఖర్చులతో బాధపడతారు. ఉపాధ్యాయులు స్వేచ్ఛ కోల్పోతారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరతతో కుంగిపోతాయి.
కానీ ప్రైవేట్ పెట్టుబడులకు మాత్రం ఇది సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
విద్యా వ్యవస్థలో సమాఖ్య ఆత్మకు ముప్పు
ఇంత పెద్ద సంస్కరణలో కేంద్ర విద్యా సలహా మండలి(సీఏబీఈ)పాత్ర లేకపోవడం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా, సమాఖ్య ఆత్మను పక్కనపెట్టి తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో విద్యా వ్యవస్థకు హానికరం కావచ్చు.
భారతదేశంలో విద్య ఎప్పుడూ కేవలం పరిపాలనా అంశం కాదు.
అది సామాజిక న్యాయం, ప్రాంతీయ వైవిధ్యం, ప్రజాస్వామ్య ఆత్మలతో ముడిపడి ఉన్న రంగం.
అందుకే రాజ్యాంగం విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచి, కేంద్రం– రాష్ట్రాలు కలిసి విధానాలు రూపొందించాలనే భావనను స్పష్టంగా ప్రతిపాదించింది.
ఈ సమాఖ్య స్వరూపానికి సంస్థాగత రూపమే కేంద్ర విద్యా సలహా మండలి(సీఏబీఈ).
సీఏబీఈ ప్రధాన ఉద్దేశం— విద్యా విధానాలు రూపొందించే ముందు కేంద్రం, రాష్ట్రాలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఇతర వాటాదారుల మధ్య విస్తృత సంప్రదింపులు జరగడం.
స్వాతంత్ర్యానికి ముందు 1920లో ప్రారంభమైన సీఏబీఈ, ఆర్టీఈ చట్టం (2009) వంటి కీలక సంస్కరణలకు మేధోపరమైన పునాదిని అందించింది.
ఇది చట్టబద్ధ సంస్థ కాకపోయినా, భారత విద్యా విధానాల్లో ప్రజాస్వామ్య సంప్రదింపుల వేదికగా కీలక పాత్ర పోషించింది. కానీ ఇటీవలి కాలంలో ఈ వేదికను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్ఈపీ 2020, తాజా ప్రతిపాదిత వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లాంటి కీలక సంస్కరణలు సీఏబీఈలో చర్చించకుండానే తీసుకురావడం, విధాన రూపకల్పనలో సమాఖ్య ఆత్మ ఎంతగా బలహీనపడిందో సూచిస్తోంది.
రాష్ట్రాల అభిప్రాయాలు, ప్రాంతీయ అవసరాలు, సామాజిక అసమానతలపై అవగాహన— ఇవన్నీ విధాన చర్చల నుంచి క్రమంగా తొలగిపోతున్నాయి.
సీఏబీఈను పక్కన పెట్టడం అంటే కేవలం ఒక సలహా మండలిని విస్మరించడం కాదు.
అది రాష్ట్రాలను విధాన రూపకర్తల నుంచి అమలుదారులుగా మాత్రమే మార్చే ప్రక్రియ.
విద్య వంటి సున్నితమైన రంగంలో ఒకే కేంద్ర నిర్ణయాలతో దేశమంతటికి ఒకే నమూనా విధానాలను రుద్దడం, భారత వైవిధ్యానికి విరుద్ధం.
గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన రాష్ట్రాలు, సామాజికంగా అంచున ఉన్న వర్గాల అవసరాలు ఇటువంటి కేంద్రీకృత నిర్ణయాలలో కనిపించవు.
మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, సీఏబీఈ స్థానంలో ఇప్పుడుబ్యూరోక్రటిక్, టెక్నోక్రటిక్ విధాన రూపకల్పనపెరుగుతోంది.
విద్య అనేది సంఖ్యలు, ర్యాంకులు, మెట్రిక్స్‌తో మాత్రమే కొలవదగిన రంగం కాదు.
అది సామాజిక సందర్భం, చారిత్రక అనుభవం, మానవ సంబంధాల మీద ఆధారపడిన ప్రక్రియ.
ఈ లోతైన అంశాలను అర్థం చేసుకునే వేదికలు లేకుండా తీసుకునే సంస్కరణలు, చివరికి విద్యను మరింత అసమానంగా మార్చే ప్రమాదం ఉంది.
విద్యా సంస్కరణలు నిజంగా ప్రజల కోసమైతే, సీఏబీఈవంటి సమాఖ్య, సంప్రదింపుల వేదికలను పునరుజ్జీవింప చేయడం తప్పనిసరి.
కేంద్రం వినాలి, రాష్ట్రాలు మాట్లాడాలి, విద్యావేత్తలు ప్రశ్నించాలి. ఈ సంభాషణే విద్యా ప్రజాస్వామ్యానికి ప్రాణం.
సీఏబీఈని నిర్లక్ష్యం చేయడం అంటే, ఆ ప్రాణవాయువును తగ్గించడమే. భారతదేశంలో బలమైన, సమానత్వపూరితమైన విద్యా వ్యవస్థ కావాలంటే, కేంద్రీకరణ కాదు— సంప్రదింపులు; ఆదేశాలు కాదు—సహకారం; నియంత్రణ కాదు— నమ్మకంఅవసరం. సీఏబీఈను పక్కన పెట్టి తీసుకునే ప్రతి సంస్కరణ, ఈ మౌలిక సత్యాన్ని విస్మరిస్తోంది.
భారత ఉన్నత విద్యకు సంస్కరణలు అవసరం. కానీ సంస్కరణల పేరుతో నియంత్రణను పెంచే విధానాలు కాదు.
విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కేంద్రంగా లేని మార్పులు మార్కెట్‌ను బలపరుస్తాయి. కానీ విద్యను కాదు. వికసిత భారత్ అనేది బలమైన విద్యాసంస్థల మీదే నిర్మించబడాలి, అందుకు అవసరమయింది, మరింత నియంత్రణ కాదు– విద్యపై నమ్మకం, విద్యాసంస్థలపై విశ్వాసం.
ఎడమ శ్రీనివాస రెడ్డి
అధ్యాపకులు, కాకతీయ ప్రభుత్వ కళాశాల(స్వ) హన్మకొండ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
