రాష్ట్రాల శాసనసభలు ఆమోదించే బిల్లులకు ఆమోదం, సమ్మతి తెలిపే విషయంలో; గవర్నర్లకు, రాష్ట్రపతికి నిర్దిష్టమైన కాలపరిమితిని విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల విషయంలో గవర్నర్ల, రాష్ట్రపతి విజ్ఙతకే సుప్రీంకోర్టు వదిలేసిందా? అసలు ఈ తీర్పు దేనికి సంకేతం?
గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుసరిస్తున్న తీరు; వెలువరిస్తున్న తీర్పుల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఏర్పడుతుంది. కానీ రాష్ట్ర శాసనసభలు ఆమోదించే బిల్లులను ఆమోదించే అంశంపై గవర్నర్, రాష్ట్రపతికి నిర్దిష్ట కాలపరిమితిని విధించలేమని ఉన్నత న్యాయస్థానం ఊహించని విధంగా “యూటర్న్” తీసుకోవడం పట్ల చాలా వరకు ఆశ్చర్యాన్ని కలగజేసింది.
గవర్నర్కు, రాష్ట్రపతికి ఈ అంశంలో కాలపరిమితి విధించడం రాజ్యాంగంలో లేదని సుప్రీంకోర్టు నిర్ణయంపై వివరణ ఇస్తూ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి చెప్పారు. దీంతో శాసనసభ బిల్లుల ఆమోదం సమ్మతి తెలియజేయడం ఇక గవర్నర్, రాష్ట్రపతి ఇష్టాయిష్టాలకే వదిలేశారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
అయితే, ఇదే సుప్రీంకోర్టు 2025 ఏప్రల్ 8న రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించే బిల్లులను మూడు నెలల్లోగా ఆమోదం, సమ్మతిని తెలియజేయాలని- గవర్నర్, రాష్ట్రపతికి నిర్దిష్టమైన కాలపరిమితిని విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు భిన్నంగా గవర్నర్, రాష్ట్రపతికి కాలపరిమితి లేదని నవంబరు 20న స్పష్టం చేసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరిస్తున్న తీరుపై ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించకుండా ఏళ్ల తరబడి తమ వద్దనే పెట్టుకున్నారు. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఇదే అంశంపై ఆ కేసులో కేరళ ప్రభుత్వం కూడా భాగస్వామ్యమైంది.
అప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనల్లో అనేక మలుపులు తిరిగాయి. “మేము శక్తిహీనులుగా చూస్తూ ఉండలేము. మరో గత్యంతరం లేకపోవడంతో మేము జోక్యం చేసుకోవలసి వస్తుంది”అని ఒక దశలో సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై చర్చించుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని; గవర్నర్కు, తమిళనాడు ప్రభుత్వానికి పలుమార్లు సుప్రీంకోర్టు సూచించింది. అయినా పట్టించుకోకపోవడంతో జోక్యం చేసుకోవలసి వచ్చిందని కూడా అప్పట్లో కోర్టు చెప్పింది.
సమాఖ్య వ్యవస్థలో భాగం..
దేశం ఏర్పాటు చేసుకున్న సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో పాటు రాష్ట్రాలున్నాయి. అందుకే జాతి శ్రేయస్సుకు సంబంధించి 97 అంశాలతో హక్కులు, అధికారాలు, భాధ్యతలను కేంద్రానికి ఖరారు చేయగా; 67 అంశాలు రాష్ట్రానికి, మరో 47 అంశాలు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి జాబితాను రాజ్యాంగం ద్వారా పొందుపర్చడమైంది.
ఈ కేటాయింపుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా; ప్రజల అవసరాల మేరకు ఎప్పటికప్పుడు ఉన్న చట్టాలను సవరిస్తూ, కొత్త చట్టాలను తీసుకువస్తూ ఉంటాయి. చట్టంగా అమలు చేసే క్రమంలో ముందుగా కావల్సిన బిల్లులను శాసనసభలో ఆమోదించుకొని, ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు.
శాసనసభ ఆమోదం తర్వాత పంపించే బిల్లులపై సందేహాలు లేదా వివరణ కావాలంటే, గవర్నర్ ఆ బిల్లును తిరిగి ప్రభుత్వానికి పంపించవచ్చు. అయితే, రాష్ట్రపతి సమ్మతి అవసరమని భావించే అంశాల విషయంలో అలాంటి బిల్లును రాష్ట్రపతికి సిఫార్సు చేసేందుకు రాజ్యాంగంలోని 200 అధికరణ గవర్నర్కు అధికారం కల్పించింది.
గవర్నర్ల ద్వారా మెలికలు..
పార్లమెంటులో మెజారిటీ ఆధారంగా దేశ హితవు కోసమనే నెపంతో కేంద్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా బిల్లులను ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదింజేసుకుంటున్నాయి. అదే రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల ద్వారా కేంద్రం మెలికలు పెట్టడం 1960 దశకంలోనే ప్రారంభమై; ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో ఈ సంస్కృతి తారాస్థాయికి చేరుకుంది. దీంతో రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి.
రాజ్యాంగానికి లోబడే అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి; ఇందులో గవర్నర్, రాష్ట్రపతి నియమాకం- ప్రభుత్వాల ఏర్పాటు కూడా ఉన్నాయి. అయిన్నప్పటికీ ఉన్నత స్థానంలో ఉన్న గవర్నర్లు, రాష్ట్రపతులు రాష్ట్రాల హక్కులు, అధికారాలను హరించివేసేందుకు ప్రయత్నించే నేపథ్యంలో సుప్రింకోర్టు తాజా తీర్పుతో ఈ అంశాన్ని వారి విజ్ఙతకే వదిలేసిందా? లేక దేనికి సంకేతమిచ్చింది?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
