భారతీయ సమాజంలో కులభావన అత్యంత బలీయంగా నిర్మీతమై ఉన్నది. తమకు తామే తక్కువవారమనే భావనను అట్టడుగు వర్గాల ప్రజలలో పాదుకొల్పిన దాష్టికపుతత్త్వం దానిది. ఇంతకు ముందు రోజుల్లాగా కులమెక్కడుందని చాలామంది అంటూ ఉంటారు. ఈ కమ్యూనికేషన్ యుగంలో ఇంకా కులాల గురించి మాట్లాడతారా? దీనికి మించిన వెనుకబాటుతనం మరొకటి లేదు. ఇలాంటి హితవచనాలను పలుకుతూ ఉంటారు.
ఎవరు ఎన్ని తీర్ల మాట్లాడినా, నర్మగర్భ వ్యాఖ్యలు చేసినా కులభావన అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. తాము ఏ కులం వారమో కొందరు చెప్పకనే చెప్పుకుంటారు. మరికొందరు వారి పేర్లను, ఆహారపు అలవాట్లను బట్టి ఓ నిర్ధారణకు వస్తారు. ఆహార్యాన్ని చూసి ఎవరే కులస్తులో తేల్చుకుంటారు. ఈ అన్నింటికి ఎన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతుల వ్యవహారం ఒక తాజా ఉదాహరణ అనుకోవచ్చేమో!
కర్ణాటక ప్రభుత్వం జనగణన చేస్తున్నది. ఇందులో భాగంగా వివరాల కోసం వెళ్లిన వారినుద్దేశించి- తాము వెనుకబడిన వర్గాలకు చెందినవారము కాదని, తమ వివరాలు చెప్పబోమని నారాయణమూర్తి దంపతులు అన్నట్టుగా మీడియాలో పెద్దెత్తున వార్తలు వస్తున్నాయి.
వేగంగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి..
ఈ దంపతుల వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెంటనే స్పందించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన వెనుకబడిన తరుగతుల సర్వే కాదని, ఇది ఏడు కోట్ల జనాభా సర్వే అని 20 సార్లు చెప్పామని సిద్ధరామయ్య అన్నారు. అగ్రవర్ణాలు, నిమ్నవర్గాల గురించిన సర్వే కాదనే విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ నారాయణ దంపతుల వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు గురవుతున్నది.
తమ గురించిన సమాచారం ఇస్తే ఇవ్వవచ్చు, లేకుంటే లేదు. కానీ తాము ఫలానా సామాజిక వర్గాలకు చెందిన వారము కాదని ఎందుకు చెప్పుకున్నారు? వారి ఉద్దేశ్యం ఏంటి? ఇతరుల పట్ల ఎందుకు వారికంత చులకన భావనా? ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ.
దాదాపు రెండు సంవత్సరాల కింద, ఇతరుల ఆహారపు అలవాట్లను కించపరుస్తూ సుధామూర్తి వ్యాఖ్యలు చేశారని అప్పట్లో విమర్శలకు గురైయ్యారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు చెంచాలను కూడా తాను తీసుకువెళ్తానని అన్నారు. అంటే తాను ఇతరుల కంటే ఎంత భిన్నమో చెప్పుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈమె వ్యాఖ్యల పట్ల, వ్యవహారశైలిపట్ల అంతర్జాతీయంగానే విమర్శలు వచ్చాయి. సాటి మనుషుల ఆహారపు అలవాట్లను గౌరవించలేని వారు ఏ స్థాయి వారైతేనేమిటి? ఏ హోదాలో ఉంటే ఏమిటి? నిష్ప్రయోజనం.
భారతీయ సామాజిక వ్యవస్థలో చాతుర్వర్ణ పద్ధతికి తాము నిబద్ధులమై ఉన్నామని సుధామూర్తి దంపతులు రుజువు చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది.
తాను పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానని, విస్మరణకు గురైన- సామాజిక అణిచివేతకు బలైన అబలలకు అండగా నిలబడ్డానని తన సాహిత్యం ద్వారా సుధామూర్తి చెప్పుకున్నారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతగా ఆమె స్పందన, ఆచరణ ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు. ఇలా అనుకునేవారి ఆలోచనలకు మద్దతునిస్తున్నట్టుగా ఈమె వ్యవహారశైలి ఉంటున్నది.
నిష్క్రమించని కులమనే మానసిక రుగ్మత..
తాజాగా కులగణన విషయంలో సుధామూర్తి దంపతులు తాము ఇతరులకంటే భిన్నమని చెప్పుకున్నటైంది. ద్విజులు, శూద్రులు వేరువేరు అనే భావన ఈ దంపతుల మాటల్లో వ్యక్తం అవుతున్నదని బహుజనులు భావిస్తున్నారు. తాము వెనుకబడిన తరగతులకు చెందినవారము కాదని, అందుకే సర్వేలే పాల్గొనడం లేదని ఆ దంపతులు చెప్పినట్టుగా ఓ వార్త డిజిటల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నది. సర్వేలో పాల్గొంటారా లేదా అనేది వారి వ్యక్తగతం కానీ, తాము ఫలానా వారము కాదని చెప్పడమే తీవ్ర అభ్యంతరం. ఇక్కడ వారి సామాజిక హోదా, ఆర్థిక హోదా కంటే కూడా కులం ఓ మెట్టు పైనే ఉందని అర్థమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది పరిచయస్తులుగా ఉన్న ఈ దంపుతుల వ్యవహారశైలి కులవ్యవస్థ తీరుతెన్నులను ప్రపంచానికి చాటి చెప్పిందని చాలామంది భావిస్తున్నారు. కులమనే మానసిక రుగ్మత ఇప్పుడప్పుడే ఈ దేశ ప్రజల మస్తిష్కాల నుంచి నిష్క్రమించదనే విషయం పదేపదే రూఢీ అవుతున్నది.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇంతకు ముందు కులగణనకు వ్యతిరేకంగానే ఉన్నది. తాజాగా జనకులగణన చేస్తామని చెప్పింది. అంటే, ఏ సామాజిక వర్గాల వారు, వారి జీవన స్థితిగతులు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సర్వేలో ద్విజులెవరైనా పాల్గొనబోమని అనగలరా? ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ప్రతిభ గురించి, పనితీరు గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మండలం- కమండలాల చర్చలే లేవు.
సుధామూర్తి దంపతుల మాటలను ఉద్దేశ్యించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు యావత్ దేశాన్ని ఆలోచింపజేస్తున్నాయి. “మేము నిర్వహిస్తున్న సర్వేకు సహకరించని మీరు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేకు ఏం సమాధానం చెపుతారు?” ఇది ఆయన విసిరిన సవాల్. మరి వీరి జవాబు ఏంటో చూడాలి.
నీతి వ్యాఖ్యాలు, సుమధుర, సుబోధక ప్రవచనాలు వినేందుకు బాగుంటాయి. ఆచరణలోనే అసలు చిక్కుముడి. గత, ప్రస్తుత పాలకుల కృషి వల్ల ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతున్నది. ప్రతీ భారతీయుడు గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం. అన్యాపదేశంగా ఎక్కువగా కుల సంకేతాలు పైస్థాయిలో ఉన్నవారి నుంచి వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో, ఎట్లా ఆలోచించాలో విజ్ఞులైన ఆధునిక పౌరులే తేల్చుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
