జాతీయ గీతం, వందేమాతరం ఆలపించడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వును యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ మళ్లీ పంచుకుంటూ, అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు దాన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
ప్రత్యేక సందర్భాల్లో వందేమాతరంలోని ఆరు చరణాలను పూర్తిగా ఆలపించాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వు నిర్దేశిస్తోంది.
న్యూఢిల్లీ: ప్రత్యేక సందర్భాల్లో వందేమాతరాన్ని పూర్తిస్థాయిలో ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కచ్చితంగా పాటించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆదేశించింది.
‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం, ‘కచ్చితంగా పాటించాలని’ ఆదేశిస్తూ ఈ ఏడాది జనవరి 28న హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వును ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ పంచుకుంది.
యూజీసీ తాజా ఆదేశాలు..
ఏప్రిల్ 6 జారీ చేసిన ఒక లేఖలో, “భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన, 28 జనవరి 2026 నాటి ‘భారత జాతీయ గీతానికి సంబంధించిన ఉత్తర్వు’ నకలును జతచేశాం.
అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఆ ఉత్తర్వులను కచ్చితంగా పాటించేలా చూడాలని, ఈ విషయంలో తగిన సూచనలు జారీ చేయాలని కోరుతున్నాం”అని యూజీసీ పేర్కొంది
చారిత్రక నేపథ్యం..
1870లలో బెంగాలీ సాహిత్య దిగ్గజం బంకిం చంద్ర చటర్జీ సంస్కృత పదాల మేళవింపుతో బెంగాలీలో రచించిన ఈ గీతాన్ని స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో తొలిసారిగా స్వీకరించారు.
ఆ తర్వాత 1950లో, ఈ గీతంలోని మొదటి రెండు చరణాలను భారతదేశ జాతీయ గేయంగా స్వీకరించారు.
హోం మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుకు ముందు, వందేమాతరం విషయంలో ఎలాంటి అధికారిక నియమావళి లేదు.
కొత్త మార్గదర్శకాలు – నియమావళి..
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం జాతీయ గీతం, వందేమాతరానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, అనేక అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించడం తప్పనిసరి చేశారు.
అంతేకాకుండా, దీన్ని ఆలపించేటప్పుడు లేదా వాయించేటప్పుడు, జాతీయ గీతం సమయంలో మాదిరిగానే ప్రేక్షకులు అటెన్షన్లో(సావధాన స్థితిలో) నిలబడాలని ఆదేశించారు.
ఇంకా, అన్ని కార్యక్రమాల్లో ఆరు చరణాలతో కూడిన పూర్తి గీతాన్ని తప్పనిసరిగా వాయించాలి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన 10 పేజీల ప్రభుత్వ ఉత్తర్వులో, వందేమాతరం, జనగణమనలను ఒకేసారి పాడినా లేదా వాయించినా, ముందుగా వందేమాతరాన్ని వాయించాలని స్పష్టం చేశారు.
దానికి జాతీయ గీతానికి ఇచ్చినంత గౌరవం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మూడు వర్గాల సందర్భాలు..
హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ఈ గీతాలను ప్లే చేయాల్సిన లేదా ప్లే చేయగల మూడు వర్గాల సందర్భాలు, ఈవెంట్లను నిర్వచించింది.
పౌర పదవీ స్వీకార కార్యక్రమాలు, ప్రభుత్వం నిర్వహించే అధికారిక రాష్ట్ర కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్రపతి రాకపోకల సమయంలో దీన్ని వాయించాలి.
అలాగే అఖిల భారత రేడియో, టెలివిజన్లో రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు, ఆ తర్వాత కూడా తప్పనిసరి.
తమ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు గవర్నర్/లెఫ్టినెంట్ గవర్నర్ రాకపోకల సమయంలో, పరేడ్లో జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు, భారత ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన మరే ఇతర సందర్భంలోనైనా ‘గీతం అధికారిక రూపాన్ని వాయించాలి’ అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
రెండో వర్గంలో – పాటలు పాడటంతో పాటు సామూహిక గానం కూడా ఉంటుంది. ఇందులో జాతీయ జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు లేదా కవాతులు మినహా ఇతర వేడుకలు ఉంటాయి. ఇతర కార్యక్రమాల్లో రాష్ట్రపతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రజా కార్యక్రమానికి (అధికారిక రాష్ట్ర కార్యక్రమాలు మినహా) వచ్చేటప్పుడు, అటువంటి కార్యక్రమాల నుంచి ఆయన బయలుదేరడానికి ముందు సమయం కూడా ఉన్నాయి. “ఈ గీతం పాడినప్పుడల్లా, అధికారిక గీతాన్ని సామూహిక గానంతో ఆలపించాలి” అని ఉత్తర్వులో పేర్కొన్నారు.
గీతాన్ని ఆలపించగల మూడో వర్గం కార్యక్రమాల్లో పాఠశాల వేడుకలు కూడా ఉంటాయి.
పార్లమెంట్లో ప్రధాని మోదీ చర్చ..
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2025 డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో ఈ గీత మూలాలు, స్వాతంత్ర్య పోరాటంలో దాని పాత్ర గురించి దాదాపు 10 గంటల పాటు చర్చకు నాయకత్వం వహించారు.
ఈ చర్చలో కీలకమైన చరణాలను తొలగించి కాంగ్రెస్ పార్టీ ఆ గీతాన్ని వక్రీకరించి, మోసం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

