“నువ్వు పని చేస్తున్నావంటే దానర్థం పుడమితల్లి ఎన్నడో కన్న కలలను నువ్వు నిజం చేస్తున్నావని, నువ్వు శ్రమలో నిమగ్నమై ఉన్నావంటే జీవితాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నట్టు”అని శ్రమ గురించి ‘ఖలీల్ జిబ్రాన్’ చెప్పారు.
ఈ మాటలతో వనజీవి దరిపల్లి రామయ్య జీవితం సరిగ్గా సరిపోలుతుంది. ఎందుకంటే వనజీవి జీవితం అంతా శ్రమతోనే నిండి ఉంది.
అతడు ముందు శ్రమజీవి. ఆ తరువాతే వనజీవి అయ్యాడు.
ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే రామయ్య శ్రమజీవి అవ్వడం ద్వారానే వనజీవి కాగలిగాడు. పద్మశ్రీ వనజీవి రామయ్యగా చరిత్రకెక్కగలిగాడు.
కష్ట జీవుల ఇంట పుట్టిన రామయ్యకి ఆటపాటల ప్రాయం నుంచే శ్రమతత్వం తెలిసింది. అయితే అది కౌమారంలో ఒంటబట్టింది.
ఇక యవ్వనంలోకి రాగానే కుటుంబ బాధ్యతని, సామాజిక సేవని చేరోపక్క కాడిలా భుజాలకు ఎత్తుకున్న రామయ్య, ఒక దశ తరువాత కుటుంబ బాధ్యతని కొంత పక్కకు జరిపాడు కానీ సామాజిక సేవని చివరికంటా మోశాడు. మోసి, మోసి లక్షల మొక్కలను పుడమి ఒడిలో చేర్చి, వేల హృదయాల్లో పచ్చదనాన్ని నింపిపోయాడు.
ఆచరణశీలి, పర్యావరణ పరిరక్షకుడు..
ఎవరో తీసి పెట్టిన గుంటలో మొక్క పెట్టి, ఫోటోకి ఫోజులిచ్చి, పర్యావరణ పరిరక్షణ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే, సెలెబ్రిటీలు ఎక్కువైనా ఈరోజుల్లో- వనజీవి రామయ్య లాంటి నిజమైన పర్యావరణ సేవకుల కృషిని, వారి జీవితాన్ని జెన్ జీ తరానికి గుర్తు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొక్కలు నాటడం, పంచడం మొదలు- నాటిన మొక్కల సంరక్షణ, విత్తన సేకరణ, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ- ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో పనులను ఒకదానివెంట ఒకటి ఒడుపుగా చేసుకుంటూ పోయేవాడు రామయ్య.
విశ్రాంతి సమయాన్ని ప్రచార సామాగ్రి తయారీకి వినియోగించేవాడు. విలాసాలని వదిలేసి, జ్ఞాన సముపార్జనకు పరితపించేవాడు.
నూతన విషయాలని తెలుసుకోవాలనే జిజ్ఞాస అతన్ని నిరంతరం శ్రమలో నిలిపి ఉంచేది.
చదవడం, వినడం, చూడడం ద్వారా నేర్చుకున్న విషయాలని ఆచరణలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించేవాడు.
ఈ క్రమంలో ఎంత శ్రమనైనా భరించేవాడు.
అదేవిధంగా తనకున్న సృజనాత్మకతకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ, తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఇట్టే ఆకర్షించేవాడు.
తాను అడుగు పెట్టిన ప్రతీ చోటా పర్యావరణ స్పృహను రగిలించేవాడు.
రామయ్య శ్రమని ప్రేమించాడు. ఎందుకంటే అతని దుఃఖాన్ని శ్రమే నయం చేసింది. రామయ్య శ్రమలో జీవించాడు. ఆ శ్రమ ద్వారానే వృక్షకోటిని లిఖించాడు.
వ్యక్తిత్వ నిర్మాణం, విలువల ప్రయాణం..
రామయ్య తన అవిరాళ కృషితో తెలుగు నేలపై చెరిగిపోని హరిత సంతకంగా నిలవడానికి అతని వ్యక్తిత్వం ఓ కారణం.
వనజీవి జీవితాన్ని అతను అందుకున్న అవార్డులు, ప్రశంసలతో కాకుండా అతని వ్యక్తిత్వ నిర్మాణ క్రమం ఆధారంగా చూడాలి.
అప్పుడే అతని జీవితం ఇచ్చే సందేశం ఏంటో అర్థం అవుతుంది.
విత్తనాలు ఎలా నాటాలో నేర్పిన తల్లి నుంచి, రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న తండ్రి నుంచి, తమకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం తెలిపిన అమ్మమ్మ నుంచి, స్వీయరక్షణ, ముందు చూపు కలిగుండాలనే తాత నుంచి, సత్ప్రవర్తన బోధించిన ఉపాధ్యాయుడి నుంచి, దేశమును ప్రేమించుమన్న గురజాడ నుంచి, మంచిని కాంక్షించే ధూర్జటి పద్యం నుంచి, విచక్షణను వివరించిన వేమన పద్యం నుంచి- ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో పాఠాన్ని నేర్చుకున్నాడు.
ఉన్నత ఆశయాన్ని ఏర్పరచుకోవడానికి ముందు, ఉన్నత విలువలను అలవర్చుకున్నాడు. ఆ విలువల్ని రామయ్య ఏనాడూ విడువలేదు.
తన ముత్తాత కుమ్మరి ఈరయ్య స్ఫూర్తితో సుమారు ఆరు దశాబ్దాల కాలం వనజీవి రామయ్య చేసిన పర్యావరణ కృషితో పాటు, అతని హేతుబద్ధమైన జీవన విధానాన్ని కూడా నేటి భావితరాలకు తెలియజేయాలి. లేకుంటే అది అసంపూర్ణ సందేశంగానే మిగిలిపోతుంది.
రామయ్య మూఢనమ్మకాలకు దూరంగా జీవించాడు. మూఢ విశ్వాసాలపై ప్రశ్నలు సంధించాడు.
కోర్కెలు తీర్చమని ఎప్పుడూ- ఏ దేవుడికీ మొక్కలేదు. అత్యాశతో లాటరీ టిక్కెట్లు కొనలేదు.
కష్టే ఫలి అని నమ్మి, కఠోర శ్రమ ద్వారా తాను ఎంచుకున్న దారిలో అలుపెరుగని యోధుడిలా సాగిపోయాడు.
తుదిశ్వాస వరకు ఆశయ సాధన..
రామయ్య జీవితంలోని చివరి దశ గురించి ఎన్నిమార్లు స్మరించుకున్నా తక్కువే అనాలి.
ఎనిమిది పదుల వయసులో, కూర్చున్న చోట నుంచి లేవడానికి కూడా శరీరం సహకరించని స్థితిలోనూ, గడ్డపార పట్టి గుంటలు తీసి, వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
పుడమిపై అతను పెంచుకున్న పుట్టెడంత ప్రేమతో, ఆయన నరనరాల్లో పారుతున్న పచ్చని నెత్తుటి ప్రోద్బలంతో, అసాధారణ లక్ష్యాలను ఏర్పరచుకొని శక్తినంతా కూడగట్టుకుని ఆయన శ్రమించిన తీరుకి ఆశ్చర్యపోవడం ఒక్కటే కాదు, చేతులెత్తి మొక్కాలి అనిపిస్తుంది.
ఆయన ఓర్పుకి, నిబద్ధతకి. వనజీవి రామయ్య తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాడు.
సర్వసంగ పరిత్యాగులమనుకునే ఎందరికో సాధ్యంకాని పరిపూర్ణ జీవితం రామయ్యది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇప్పుడాయన ఆశయంలో ఉడుతాభక్తిగానైనా భాగం అవ్వడం ఆ మహనీయుడికి అర్పించే సరైన నివాళి మాత్రమే కాదు, మనం మానవ జన్మ ఎత్తినందుకు ఈ నేల రుణం తీర్చుకునే ఏకైక మార్గం కూడా అదే.
వ్యాసకర్త వనజీవి జీవితచరిత్ర పుస్తక రచయిత, ఏప్రిల్ 12న వనజీవి రామయ్య ప్రథమ వర్ధంతి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
