
ట్రంప్ సర్కార్ పెంచిన దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ అంతర్జాతీయ వేదికలపై తెలియజేసే నిరసనలో హేతుబద్దత వుందా? వుంటే అమెరికా నుండి కాటన్ దిగుమతుల మీద సుంకాన్ని పెంచి వుండేది కాదా? పైగా ఇంతవరకూ అమలులో ఉన్న కనీస సుంకాన్ని సైతం ఎందుకు రద్దు చేసింది? దీనికి గుజరాత్, మహారాష్ట్ర బడా వస్త్ర పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిడి ప్రధాన కారణమా?
భారత దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే సరుకుల మీద సుంకాలను పెంచినపుడు ప్రధానంగా దేశంలో ఉత్పత్తి చేసే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు నష్టం జరుగుతుంది. అదే రంగాలకు చెందిన సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సందర్బంగా విధించే సుంకాలను తగ్గించినపుడు, దేశీయ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పత్తులకు నష్టం జరుగుతుంది.
ఒకవేళ ఒకే రంగం సరుకుల మీద ఏకకాలంలో పై రెండు రకాల పన్నులను విధిస్తే, ఆ రంగం లేదా రంగాలకు నష్టాలు తీవ్రస్థాయిలో జరుగుతాయి. అలాంటి ద్వంద్వ నష్టాలకు నిదర్శనంగా తాజాగా భారతదేశ టెక్స్టైల్ రంగం నిలుస్తుంది.
పత్తి ముడి సరుకు కాగా, దాని నుంచి ఉత్పత్తి అయ్యే వస్త్ర ఉత్పత్తులు పారిశ్రామిక సరుకు అవుతుంది. ఈ రెండు రకాల సరుకులను భారత దేశం భారీ స్థాయిలో ఎగుమతి చేస్తుంది. విదేశాల నుంచి మన దేశం దిగుమతి కూడా చేసుకుంటుంది. అయితే దిగుమతులు నామమాత్రమే.
పరస్పర ఆధారిత విషవలయ సంక్షోభ స్థితి..
మన దేశం ఎగుమతి చేసే దేశాలలో అమెరికా చాలా ముఖ్యమైనది. తాజాగా భారతదేశం నుంచి ఎగుమతయ్యే వస్త్రోత్పత్తులపై అమెరికా యాభై శాతం సుంకాలను విధించింది. ఫలితంగా మన దేశ వస్త్రోత్పత్తులకు అమెరికా వినిమయదార్ల నుంచి డిమాండ్ తగ్గుతుంది. దీంతో మన దేశం నుంచి అమెరికాకు వస్త్రోత్పత్తుల ఎగుమతులు గతంలోలా ఉండకపోవచ్చు. లేదా నామమాత్ర స్థాయికి పడిపోవచ్చు. ఫలితంగా భారతదేశ బట్టల మిల్లుల మనుగడను దెబ్బతీసి ఎంతో కొంత పారిశ్రామిక సంక్షోభ పరిస్థితికి దారి తీస్తుంది. మన బట్టల మిల్లులకు అవసరమైన ముడి సరుకు పత్తికి డిమాండ్ తగ్గుతుంది. పత్తి పంటకు ధర తగ్గించి రైతాంగానికి తీవ్రంగా నష్టానికి కారణమవుతుంది. ఓవైపు పత్తి రైతాంగం, మరోవైపు వస్త్ర పరిశ్రమ కార్మికవర్గం రోడ్డున పడుతుంది.
ఒకవైపు పారిశ్రామిక, మరోవైపు వ్యవసాయ రంగాలను ఏకకాలంలో సమాంతరంగా సంక్షోభం పాలుజేసే సందర్భాలు ఎదురైన నిర్దిష్ట దశలలో రెండు రంగాలను పరస్పర సమన్వయంతో నడిపేలా ప్రభుత్వం విధానాలను రూపొందించుకోవాల్సి వుంది. మోడీ సర్కార్ స్పందనలో ఈ సమన్వయం లోపించింది. నిజానికి అదో లోపం కూడా కాదు. అదొక విధానపరమైన తప్పిదం.
వస్త్ర ఎగుమతులు దెబ్బతింటే వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుంది. దాంతో పత్తి పంటకు కూడా దెబ్బ తగులుతుంది. ఇదొక పరస్పర ఆధారిత విషవలయ సంక్షోభ స్థితే. ఆ సంక్షోభ నియంత్రణకు ఆయా సర్కార్లు నిర్దిష్ట చర్యలను చేపట్టాలి. ఈ రెండు రంగాల పరిరక్షణ కోసం సర్కార్లు చేపట్టే పరిష్కారాలు ఈ పరస్పర ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించే విధంగా వుండాలి. ఈ సూత్రానికి విరుద్ధంగా విదేశాల నుంచి పత్తి దిగుమతుల మీద 11 శాతం సుంకాలను మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది.
అమెరికా సహా బ్రెజిల్, ఈజిప్ట్ వంటి దేశాల చౌక పత్తి మన భారత దేశ బట్టల మిల్లులు, ఇతర వస్త్ర పరిశ్రమకు చేరుతుంది. ఈ చర్య ఏకకాలంలో రెండు రంగాల సంక్షోభాల పరిష్కారంలో పరస్పర సమన్వయం లేకపోగా, పరస్పరం “విభజించి పాలించు” విధానాన్ని చేపట్టింది.
పై నిర్దిష్ట పరిస్థితి ఏర్పడ్డ దశలో నిజానికి సర్కార్లు చేపట్టాల్సిన విధానం పత్తి దిగుమతుల మీద సుంకాలను పెంచేదిగా వుండాలి. అందుకొక కారణం కూడా వుంది. వస్ర్త ఎగుమతుల మీద అసాధారణ స్థాయిలో అమెరికా సుంకాలను పెంచడంతో డిమాండ్ తగ్గుతుంది, అలానే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీనికి విరుగుడుగా ఓవైపు కొత్త విదేశీ మార్కెట్ల కోసం అన్వేషణ చేస్తూనే మరో వైపు మిగిలిన వినియోగ అవసరాలు తీర్చే వస్త్రోత్పత్తులకు కావాల్సిన పత్తిని బట్టల మిల్లుల యాజమాన్యాలతో కొనుగోళ్లు చేయించాలి. ఆ విధానాన్ని చేపట్టడం ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది.
దేశీయ వస్త్ర వినిమయంతో పాటు అమెరికాయేతర కొన్ని దేశాలకు ఎగుమతి చేసే మన వస్త్రోత్పత్తులకు అవసరమైన పత్తి కావాలి. ఆ పరిమాణం కూడా తక్కువేమీ కాదు. ఆ మేరకు దేశీయ పత్తిని మాత్రమే దేశీయ వస్త్ర పరిశ్రమ కొనుగోళ్లు చేసే పరిస్థితిని సృష్టించడం ప్రభుత్వ విధానంగా వుండాలి. అందుకోసం పత్తి దిగుమతులను నియంత్రణ చేయాల్సి వుంది.
డబ్ల్యూటీఓ యుగంలో వాటిని పూర్తిగా నిషేధం విధించడానికి ఒకవేళ ప్రభుత్వానికి ఇబ్బందులు వుంటే, కనీసం దిగుమతి సుంకాలను పెంచాలి. వాటిని వస్త్ర పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారీ వర్గాలు కొనుగోళ్లు చేయలేని పరిస్థితిని సృష్టించడం ప్రభుత్వ విధానంగా వుండాలి. ఆ పనిని మోడీ ప్రభుత్వం చేపట్టలేదు.
ఈ పరిస్థితి అమెరికాకు రెండు రకాల లాభాలని కలిగిస్తుంది. మనదేశం నుండి ఇంతవరకూ దిగుమతి చేసుకునే వస్త్రోత్పత్తులకు బదులు బంగ్లాదేశ్, వియత్నం వంటి దేశాల నుంచి కొత్త వాణిజ్య పొత్తుల వల్ల ఎంతో కొంత తక్కువ ధరకు వస్త్రోత్పత్తులను దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. ఫలితంగా అమెరికా వాణిజ్య లోటు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. దాని అమెరికా పత్తి ఎగుమతి కార్పొరేట్ కంపెనీలకు లాభిస్తుంది. దిగుమతి సుంకం మిగులుతుంది. ఒకవైపు అమెరికా బడా కాటన్ కార్పొరేట్ కంపెనీలకూ, మరోవైపు భారత వస్త్ర పరిశ్రమ యాజమాన్య వర్గాలకు లాభాన్ని చేకూరుస్తుంది. కానీ మన దేశ పత్తి పంట పండించే రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోతుంది.
ప్రపంచ వస్త్రోత్పత్తుల ఎగుమతి కేంద్రం భారత్..
మన దేశం పత్తి పంటకు ప్రసిద్ధి చెందింది. బట్టల పరిశ్రమకు కూడా ప్రసిద్ధి చెందింది. ఒకవైపు వ్యవసాయ, మరోవైపు పారిశ్రామిక రంగాలలో సమాంతరంగా ప్రసిద్ధి చెందిన నేపథ్య చరిత్ర వుంది. ఇవి ఒకవైపు కోట్ల సంఖ్యలో రైతు కుటుంబాలకూ, మరోవైపు లక్షల కార్మిక కుటుంబాలకూ ఉపాధి కల్పించే రంగాలుగా పేరొందాయి. ఈ రెండు రంగాలపై ఆధారపడి జీవించే శ్రమజీవులను దోచుకునే రెండు దోపిడీ వర్గాలు సంఘటితంగా వున్నాయి.
రైతు పండించే పత్తి మీద రైతుకు అధికారం లేదు. బడా కాటన్ కార్పొరేట్ వాణిజ్య వర్గాలదే సమస్త అధికారంగా వుంది. వస్త్రోత్పత్తులను సృష్టించే కార్మికవర్గం చాలీచాలని జీతాలతో కడు దుర్భర బ్రతుకు గడుపుతుంది. వారికి కూడా ఏ అధికారం లేదు. ఈ రెండు రంగాలను రెండు బడా కార్పొరేట్ వర్గాలు శాసిస్తున్నాయి. ఈ రెండింటిలో బడా కాటన్ కార్పొరేట్ వాణిజ్య వర్గం కంటే, వస్త్ర పారిశ్రామిక వర్గానికి మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా ముడి పత్తి దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది.
గుజరాత్, మహారాష్ట్ర వస్త్ర పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారీ వర్గాల లాబీ మోడీ సర్కార్‌ను ప్రభావితం చేసింది. అదే గుజరాత్, మహారాష్ట్ర రైతాంగం, విత్తన పరిశ్రమలు కూడా బలంగా వున్నా, వాటి కంటే బలమైన పాత్రను పోషించాయి. పైగా పత్తి పంట దిగుబడికి కూడా దేశంలో అదే గుజరాత్, మహారాష్ట్ర తొలి, మలి స్థానాల్లో ఉండడం ఒక విశేషం.
పారిశ్రామిక వర్గాల ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే, కోట్లాది పత్తి రైతుల పరిస్థితి ఏం కావాలి? ఇది మున్ముందు మోడీ ప్రభుత్వ తప్పుడు విధానానికి గుణపాఠం చెప్పకుండా ఉంటుందా?
ట్రంప్ సర్కార్ పెంచిన దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ అంతర్జాతీయ వేదికలపై తెలియజేసే నిరసనలో హేతుబద్దత వుందా? వుంటే అమెరికా నుంచి కాటన్ దిగుమతుల మీద సుంకాన్ని పెంచి వుండేది కాదా? పైగా ఇంతవరకూ అమలులో ఉన్న కనీస సుంకాన్ని సైతం ఎందుకు రద్దు చేసింది? దీనికి గుజరాత్, మహారాష్ట్ర బడా వస్త్ర పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిడి ప్రధాన కారణమా? లేదంటే ట్రంప్ సర్కార్‌తో ఇంకా తెర వెనక దౌత్యానికి అవకాశం ఉంచుకునే వైఖరి కారణమా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కాలమే చెప్పాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.