♦ ట్రంప్ కాల్పుల విరమణ వాదనను ‘అబద్ధం, నిరాధారమైనది’గా పేర్కొన్న ఇరాన్
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల 34వ రోజున, దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ చెప్పారు.
అలాగే ఈ యుద్ధాన్ని ఒక ‘పెట్టుబడి’గా అభివర్ణించారు. ఆయన చేసిన కాల్పుల విరమణ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది.
మరోవైపు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇంకా స్తంభించే ఉంది, దీని వల్ల ప్రపంచ చమురు సరఫరా, ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల పరంపర 34వ రోజులోకి ప్రవేశించింది. అమెరికా సైన్యం ‘త్వరలోనే తన పనిని పూర్తి చేస్తుందని’, రాబోయే రెండు మూడు వారాల్లో దాడులను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
తన మొదటి జాతీయ ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా వ్యూహాత్మక లక్ష్యాలు ‘దాదాపుగా నెరవేరాయి’ అని వాదించారు.
సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో ట్రంప్ ఇలా అన్నారు, ‘మేము వారికి చాలా గట్టి దెబ్బ కొట్టబోతున్నాం.
మేము వారిని తిరిగి రాతియుగానికి పంపించేస్తాం, అదే వారి అసలు స్థానం.’ అయితే, ఆయన తన ప్రసంగంలో ఎలాంటి బలమైన కొత్త వ్యూహాన్ని లేదా ప్రణాళికను బహిర్గతం చేయలేదు, కేవలం పాత ప్రకటనలనే పునరావృతం చేశారు.
ట్రంప్ వాదనను తోసిపుచ్చిన ఇరాన్..
టెహ్రాన్ కాల్పుల విరమణ కోరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.
బీబీసీ కథనం ప్రకారం- ఇరాన్ ఈ ప్రకటనను ‘అబద్ధం, నిరాధారమైనది’గా పేర్కొంది.
ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రకారం, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి ఈ ప్రతిస్పందనను తెలియజేశారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
తన పోస్ట్‌లో, ‘ఇరాన్ కొత్త అధ్యక్షుడు, తన పూర్వ నాయకులతో పోలిస్తే తక్కువ ఛాందసవాది, ఎక్కువ వివేకవంతుడు, ఆయన ఇప్పుడే అమెరికాతో కాల్పుల విరమణను కోరారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ తెరుచుకుని, సురక్షితంగా ఉండి, పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మేము దీని గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు ఇరాన్‌పై మా తీవ్రమైన దాడులను కొనసాగిస్తాము. దానిని పూర్తిగా నాశనం చేస్తాము, లేదా అందరూ అంటున్నట్టుగా, వారిని తిరిగి రాతియుగానికి పంపించేస్తాము’అని ట్రంప్ పేర్కొన్నారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, యుద్ధాన్ని ముగించే విషయంపై ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ మొదటి నుంచి చెబుతూనే ఉంది.
ఇరాన్ కూడా కాల్పుల విరమణను ‘కోరుకుంటోందని’, అయితే భవిష్యత్తులో ఈ ఘర్షణలు మళ్లీ మొదలుకావని శత్రు దేశాలు గ్యారెంటీ ఇవ్వడం తప్పనిసరి అని ఇరాన్ అధ్యక్షుడు ఇదివరకే చెప్పారు.
ఇరాన్ ‘చమురును స్వాధీనం చేసుకుంటామనే’కోరికను మళ్లీ వ్యక్తపరిచిన ట్రంప్..
జాతీయ ప్రసంగానికి కొన్ని గంటల ముందు, వైట్ హౌస్‌లో ఈస్టర్ లంచ్ సందర్భంగా ఇరాన్ చమురు గురించి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అక్కడ ఉన్న వారితో ఇరాన్ గురించి ఆయన మాట్లాడుతూ, ‘మనం అనుకుంటే వారి చమురును మన ఆధీనంలోకి తీసుకోవచ్చు. కానీ మన దేశ ప్రజలకు అంత ఓపిక ఉందని నేను అనుకోవడం లేదు, అది నిజంగా దురదృష్టకరం’ అని అన్నారు.
ఆయన ఇంకా ఇలా అన్నారు, ‘ఇది ముగిసిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ మనం అక్కడే ఉంటే గనక, వారి చమురును తీసుకోవడానికే నేను మొగ్గుచూపుతాను. మనం ఈ పనిని చాలా సులభంగా చేయగలం. నేను అదే చేయడానికి ఇష్టపడతాను. కానీ దేశ ప్రజలు మాత్రం, కేవలం విజయం సాధించి తిరిగి వచ్చేయండి అని అంటున్నారు. అది కూడా మంచిదే, ఎందుకంటే మన దగ్గర వెనిజులాలో, మన సొంత దేశంలోనే సరిపడా చమురు ఉంది.’
ఇరాన్ చమురును స్వాధీనం చేసుకోవాలనే కోరికను ట్రంప్ గతంలో కూడా వ్యక్తపరిచారు. రెండు రోజుల క్రితం బ్రిటీష్ వార్తాపత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తాను ఇరాన్ చమురును స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ‘నిజాయితీగా చెప్పాలంటే, ఇరాన్ చమురును స్వాధీనం చేసుకోవడమే నాకిష్టమైన పని. కానీ అమెరికాలో కొంతమంది మూర్ఖులు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? అని అడుగుతున్నారు. వాళ్లు నిజంగానే మూర్ఖులు’ అని అన్నారు.
ఈ యుద్ధం ఒక పెట్టుబడి లాంటిది- ట్రంప్..
ఈ యుద్ధాన్ని తమ భవిష్యత్తు కోసం పెట్టిన ఒక ‘పెట్టుబడి’గా చూడాలని ట్రంప్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు.
గత ఒక శతాబ్ద కాలంలో అమెరికా పాల్గొన్న యుద్ధాలతో పోలిస్తే ఈ ఘర్షణ ఏమీ కాదని ఆయన అన్నారు, ఎందుకంటే ఆ యుద్ధాలు చాలా ఎక్కువ కాలం పాటు కొనసాగాయి.
తన ప్రసంగంలో ట్రంప్ గత యుద్ధాలను – మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం, ఇరాక్లను ఉదహరిస్తూ, ‘కేవలం నాలుగు వారాల్లోనే అమెరికా సైన్యం నిర్ణయాత్మక విజయాన్ని సాధించిందని’ చెప్పారు.
అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే, ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌పై సంక్షోభం, 30కి పైగా దేశాల సమావేశం..
ఈలోగా, ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద ఆందోళన పర్షియన్ గల్ఫ్‌తో అనుసంధానించబడిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి నెలకొంది, ఇక్కడ జరుగుతున్న ఘర్షణల కారణంగా సముద్ర మార్గంలో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచంలోనే చమురు సరఫరా చేసే అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
బ్రిటన్ చొరవతో 30కి పైగా దేశాలతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఇందులో ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు.
‘నౌకలతోపాటు నావికుల భద్రతను నిర్ధారించడానికి, అలాగే నిత్యావసర వస్తువుల సరఫరాను పునరుద్ధరించడానికి’ గల ప్రత్యామ్నాయాల గురించి ఈ సమావేశంలో ఆలోచిస్తామని బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు.
నిజానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో అంతరాయం, పెరుగుతున్న సైనిక ఘర్షణల ప్రభావం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపించడం ప్రారంభమైంది.
చమురు ధరలు అమాంతం పెరగడం, సరఫరాలో ఏర్పడిన ఆటంకం చాలా దేశాల ఆందోళనను పెంచాయి.
వైరుధ్యం, అనిశ్చితి..
ట్రంప్ చేస్తున్న వాదనలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల మధ్య పూర్తి వైరుధ్యం కూడా కనిపిస్తోంది.
ఒకవైపు ఇరాన్ వల్ల ‘ఇకపై ఎలాంటి ముప్పు లేదని’ ఆయన చెబుతున్నారు, మరోవైపు ఆ ప్రాంతంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తత తగ్గడానికి బదులుగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.
అంతేకాకుండా, అమెరికా యంత్రాంగం వైపు నుంచి ఎలాంటి స్పష్టమైన వ్యూహం బయటకు రాకపోవడం, అలాగే వేర్వేరు సందర్భాల్లో భిన్నమైన సంకేతాలు ఇస్తుండటంతో కూడా ప్రస్తుత పరిస్థితిపై అనిశ్చితి నెలకొని ఉంది.
ఒక వేరే ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా త్వరలోనే ఇరాన్లో తన సైనిక చర్యను ముగించాలని ఆశిస్తోందని చెప్పారు. కానీ ఆయన ఎలాంటి నిర్దిష్ట గడువును పేర్కొనలేదు.
‘నేను మీకు కచ్చితంగా చెప్పలేను. కానీ మేము చాలా త్వరగా బయటకు వస్తాము’ అని ఆయన అన్నారు.
అంతేకాకుండా, అవసరమైతే భవిష్యత్తులో అమెరికా పరిమిత స్థాయి దాడులు చేయవచ్చని కూడా ఆయన ఇందులో జతచేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
