♦ చర్చలు జరుపుతున్నామంటూనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
♦ ఇరాన్ చమురును సొంతం చేసుకోవడమే నా లక్ష్యం: ట్రంప్
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలై 31 రోజులు గడిచాయి. ఈ ఏకపక్ష దాడులతో ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రభావం గల్ఫ్ దేశాలకు సైతం విస్తరించడంతో కువైట్‌లో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇరాన్ చమురును ఆక్రమించుకోవాలన్న ట్రంప్ తాజా ప్రకటన అమెరికా అసలు ఉద్దేశాలను బయటపెడుతోంది.
ఈ యుద్ధ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తుతోంది. దేశీయ అవసరాల కోసం తాత్కాలికంగా కిరోసిన్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి భారతదేశంలో నెలకొంది.
న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం సోమవారం మార్చి 30 నాటికి 31వ రోజుకు చేరుకుంది.
ఈ ముప్పై ఒక్క రోజుల్లో సంఘర్షణ పరిధి వేగంగా విస్తరించింది. తమపై జరుగుతున్న దాడులకు ప్రతిస్పందనగా, గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన ఆత్మరక్షణ చర్యలను కొనసాగిస్తోంది.
మార్చి 29న ఓ డీశాలినేషన్ ప్లాంట్‌పై జరిగిన దాడిలో ఒక భారత జాతీయుడు మరణించినట్టు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కువైట్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, బాధిత కుటుంబానికి సాధ్యమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించింది.
“ఇరాన్ చమురును ఆక్రమించుకోవడమే నా లక్ష్యం”
బ్రిటిష్ వార్తాపత్రిక “ఫైనాన్షియల్ టైమ్స్”కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని బాహాటంగానే వెల్లడించారు.
ఇరాన్ చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలన్న కోరికను ఆయన దాచుకోలేదు.
“నిజాయితీగా చెప్పాలంటే, ఇరాన్ చమురును సొంతం చేసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం” అని ట్రంప్ స్పష్టం చేశారు. “అమెరికాలోని కొందరు మూర్ఖులు, ‘మీరెందుకు ఇలా చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తుంటారు. కానీ నిజానికి వాళ్లే మూర్ఖులు” అంటూ తన దుందుడుకు చర్యలను సమర్థించుకున్నారు.
ఇలా చెబుతూనే, ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని కూడా అమెరికా ప్రకటించడం గమనార్హం. తాము ఇరాన్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదింపులు జరుపుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, ఇరాన్ మాత్రం ఈ వాదనలను తీవ్రంగా ఖండించింది. ఇదంతా అమెరికా ఆడుతున్న నాటకమని, ఒకవైపు దొంగ చర్చలంటూనే మరోవైపు భూతల దాడికి సన్నాహాలు చేస్తోందని ఇరాన్ విమర్శించింది.
ట్రంప్ మాటల్లోని వైరుధ్యాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఒకవైపు చర్చల్లో పురోగతి సాధించామని చెబుతూనే, ‘మనం చర్చలు జరుపుతాం, ఆ తర్వాత వారిపై బాంబులు వేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఖార్గ్ ద్వీపంపై కన్నేసిన అగ్రరాజ్యం
ఇదే ఇంటర్వ్యూలో ఇరాన్ ప్రధాన చమురు టెర్మినల్ ఉన్న ‘ఖార్గ్ ద్వీపాన్ని’ ఆక్రమించుకునే ఆలోచనను కూడా ట్రంప్ బయటపెట్టారు.
“బహుశా మనం దాన్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు” అని చెబుతూనే, ఆక్రమణ జరిగితే అమెరికా బలగాలు అక్కడ సుదీర్ఘకాలం ఉండిపోవాల్సి వస్తుందని అంగీకరించారు.
కానీ ఖార్గ్ ద్వీపాన్ని ఆక్రమించడం అంత సులువు కాదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇది ఇరాన్ ప్రధాన భూభాగంలోని క్షిపణి, ఫిరంగి దళాల పటిష్టమైన రక్షణ పరిధిలో ఉన్నందున, అమెరికా దళాలు అక్కడ నిలదొక్కుకోవడం సాధ్యపడకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
నెత్తురోడుతున్న లెబనాన్.. తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు..
హిజ్బుల్లా ప్రతిఘటన కొనసాగుతోందన్న నెపంతో దక్షిణ లెబనాన్‌లో సైనిక దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. బఫర్ జోన్‌ను మరింత విస్తరిస్తామని ఆయన ప్రకటించారు.
ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది.
లెబనీస్ అధికారుల లెక్కల ప్రకారం- ఇప్పటికే 1,200 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ సుదీర్ఘ పోరులో ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు.
వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన ప్రాణనష్టం ఇలా ఉంది:
° ఇరాన్లో 1,900 మందికి పైగా అమాయకులు యుద్ధం వల్ల చంపబడ్డారు.
° ఇజ్రాయెల్‌లో 19 మంది చనిపోయారు
° ఇరాక్‌లో 80 మంది భద్రతా సిబ్బంది మృతి
° గల్ఫ్ దేశాల్లో 20 మంది మృతి
° వెస్ట్ బ్యాంక్‌లో నలుగురు మృతి
° 13 మంది అమెరికన్ సైనికులు కూడా మరణించారు.
అమెరికాకు బుద్ధి చెప్పేందుకు ఇరాన్ సన్నద్ధం
అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధమైంది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు వచ్చే అమెరికా భూతల దళాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు తమ సైన్యం ఎదురుచూస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖేర్ ఖాలిబాఫ్ స్పష్టం చేశారు.
అమెరికా దళాలు ఇరాన్ గడ్డపై అడుగుపెడితే, పర్షియన్ గల్ఫ్‌లో ల్యాండ్మైన్లు అమర్చడంతో పాటు, అమెరికాకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలపై దాడులు చేయడానికి వెనుకాడబోమని ఇరాన్ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇంధన సంక్షోభం..
ఈ అకారణ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఫిబ్రవరి 28న దాడులు మొదలైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు ఏకంగా 60 శాతం పెరిగి, దాదాపు 115 డాలర్లకు చేరుకుంది.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదవ వంతు పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది.
ఈ వ్యూహాత్మక జలమార్గంపై పూర్తి నియంత్రణ ఇరాన్ చేతిలోనే ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలపై తీవ్ర ఆందోళన నెలకొంది.
తెరపైకి దౌత్యం.. కొనసాగుతున్న ఆధిపత్య ధోరణి..
హోర్ముజ్ జలసంధిని తమ నౌకాయానానికి తెరవాలన్న డిమాండ్‌తో పాటు అమెరికా ఇరాన్ ముందు 15 సూత్రాల ప్రతిపాదనను ఉంచింది.
అయితే, తమ వ్యూహాత్మక జలమార్గంపై సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం సహా ఐదు న్యాయమైన షరతులను ఇరాన్ ప్రతిపాదించింది.
రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్‌ల మధ్య చర్చలకు తాము ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే ఈ చర్చలు ప్రత్యక్షంగానా లేక పరోక్షంగానా అనేది ఇంకా తేలలేదు.
పాకిస్తాన్ చొరవ వెనుక..
అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలకు వేదిక కానున్నట్లు పాకిస్తాన్ మార్చి 29న వెల్లడించింది. ఇరు దేశాలు తమపై విశ్వాసం ఉంచాయని, “రాబోయే రోజుల్లో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని” పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇస్లామాబాద్‌లో సమావేశమైన టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు కూడా యుద్ధం వల్ల సరఫరా గొలుసులు దెబ్బతినడం, ఆహార భద్రత, ఇంధన ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చల గురించి నేరుగా స్పందించకపోవడం గమనార్హం. దీన్నిబట్టి ఇదంతా అమెరికా ఆడుతున్న ‘నాటకం’గా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ కొట్టిపారేశారు. ఈ ప్రాంతంలో తమ సైనిక బలగాలను మోహరించుకునేందుకే అమెరికా ఈ దొంగ చర్చల పర్వాన్ని తెరపైకి తెచ్చిందని ఆయన విమర్శించారు.
మరోవైపు, ఈ పరిణామాల్లో పాకిస్తాన్ చురుకైన పాత్ర పోషించడం భారత వ్యూహాత్మక వర్గాల్లో ఆందోళన రేపుతోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో పాకిస్తాన్ తన ప్రభావాన్ని తిరిగి పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఇది పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలన్న భారత వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
భారత్‌పై పడిన యుద్ధ భారం: కిరోసిన్ వైపు మళ్లీ చూపు..
ఈ ఏకపక్ష యుద్ధ సెగ భారతదేశానికి కూడా గట్టిగానే తగులుతోంది. వంటగ్యాస్(ఎల్పీజీ) కొరత, పెరుగుతున్న ధరల ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గృహ అవసరాల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా కిరోసిన్‌ను తాత్కాలికంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇది 60 రోజుల అత్యవసర చర్యగా అమలు కానుంది.
వంటకు, దీపాలు వెలిగించడానికి ఈ కిరోసిన్‌ను ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో “కిరోసిన్ రహిత” ప్రాంతాలుగా ప్రకటించిన 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైతం పీడీఎస్ ద్వారా కిరోసిన్ పంపిణీ తిరిగి ప్రారంభం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలు దెబ్బతినడం వల్లే దేశీయంగా ఇలాంటి ప్రత్యామ్నాయ, అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
