‘ఒక సినిమాలో చూపించిన దృక్పథంతో ఏకీభవించకపోవడం మాత్రమే, దాని బహిరంగ ప్రదర్శనను అడ్డుకోవడానికి తగిన కారణం కాకూడదు.’
న్యూఢిల్లీ: ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ చిత్రంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) విధించిన మౌఖిక నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు(ఎంపీలు) లేఖ రాశారు.
ముంబైకి చెందిన జై విరాత్రా ఎంటర్టైన్మెంట్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ మనోజ్ నంద్వానా మాట్లాడుతూ, ఈ సినిమా “చాలా సున్నితమైనది” కావడమే సీబీఎఫ్సీ సెన్సార్ చేయడానికి కారణమని, సినిమాను విడుదల చేయడం వల్ల భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఒక సీబీఎఫ్సీ సభ్యుడు అనధికారికంగా ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
గాజాలో ఇజ్రాయెల్ బలగాల దాడికి గురైన కారులో చిక్కుకుని, ఆ తర్వాత శవమై కనిపించిన ఒక ఐదేళ్ల పాలస్తీనా బాలిక నిజజీవిత కథే ఈ చిత్రం.
ఈ సినిమా దర్శకుడితో పాటు పలువురు భారత్-ఇజ్రాయెల్ సంబంధాల దుర్బలత్వాన్ని ప్రశ్నించారు.
భావప్రకటనా స్వేచ్ఛను నిర్దేశించే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని పరిశీలించేలా సెన్సార్ బోర్డుకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ లేఖపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)కు చెందిన జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాంగోపాల్ యాదవ్, జావేద్ అలీ ఖాన్, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మనోజ్ కేఝా, ద్రవిడ మున్నేట్ర కజగంకు చెందిన సల్మా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నామినేటెడ్ సభ్యుడు హారిస్ బీరన్, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ సంతకాలు చేశారు.
లేఖ పూర్తి పాఠం..
కింద సంతకాలు చేసిన పార్లమెంటు సభ్యులమైన మేము, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) మౌఖికంగా ధృవీకరణను(సర్టిఫికేషన్‌ను) నిరాకరించిందని, దీంతో భారతదేశంలో దాని బహిరంగ ప్రదర్శనను అడ్డుకుందనే వార్తలపై మా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాము.
కళాత్మక స్వేచ్ఛ, సంస్థాగత విశ్వసనీయత, ప్రజాస్వామ్య విలువల పట్ల, సాంస్కృతిక బహిరంగత పట్ల నిబద్ధత ఉన్న సమాజంగా భారతదేశ ప్రతిష్ఠపై గణనీయమైన ప్రభావం చూపే ఈ విషయంలో మీరు తక్షణమే వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము.
కౌతర్ బెన్ హనియా దర్శకత్వంలో ట్యునీషియాలో నిర్మితమైన ఈ చిత్రం, 2024 గాజా ఘర్షణ సమయంలో ఒక చిన్నారి పాలస్తీనా బాలికను హతమార్చిన నిజజీవిత సంఘటన ఆధారంగా రూపొందించబడిన, అంతర్జాతీయ గుర్తింపు ఆస్కార్ నామినేషన్ పొందిన రచన.
సమకాలీన మానవతా సంబంధిత అంశాన్ని స్పృశించినందుకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అయితే, సర్టిఫికేషన్ మంజూరు చేయబడకపోవచ్చని భారతదేశంలోని డిస్ట్రిబ్యూటర్‌కు మౌఖికంగా తెలియజేయబడినట్టు వార్తలు సూచిస్తున్నాయి.
సినిమా ధృవీకరణను నియంత్రించే చట్టపరమైన చట్రానికి వెలుపల ఉన్న అంశాలు నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేశాయా అనే తీవ్రమైన ఆందోళనలను ఇటువంటి విధానం లేవనెత్తుతోంది.
ఒక సినిమా ప్రదర్శన అనేది రాజ్యాంగ చట్రంలో రక్షించబడిన కళాత్మక భావప్రకటనా స్వేచ్ఛ వినియోగం, దీనిని కేవలం ఊహాజనిత దౌత్య సంబంధాల మీద ఆధారపడేలా చేయలేము.
సంక్లిష్టమైన చారిత్రక, రాజకీయ, మానవతా ప్రశ్నలతో సమాజాలు మమేకమయ్యేలా చేయడంలో చారిత్రకంగా సినిమా ఒక ముఖ్యమైన మాధ్యమంగా పనిచేసింది. అనధికారిక లేదా అపారదర్శక యంత్రాంగాల ద్వారా కళాత్మక స్వేచ్ఛను హరించకూడదనేది మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం పునాది సూత్రం.
సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 పారదర్శకమైన, హేతుబద్ధమైన ధృవీకరణ ప్రక్రియను నిర్దేశిస్తుంది, ఇక్కడ సినిమాల బహిరంగ ప్రదర్శనను ప్రభావితం చేసే నిర్ణయాలు ఖచ్చితంగా చట్టపరమైన కారణాల ఆధారంగానే తీసుకోబడతాయి.
ధృవీకరణ నిరాకరణకు దారితీసే మౌఖిక సూచనలు లేదా అనధికారిక సలహాలతో సహా ఈ నిర్దేశిత ప్రక్రియ నుంచి ఏమాత్రం పక్కకు జరిగినా, అది సంస్థాగత విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
అలాగే సృజనాత్మక స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యత అప్పగించబడిన నియంత్రణ సంస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుంది.
చిత్రం సమకాలీన ప్రపంచ సంబంధిత సమస్యలను చర్చిస్తుందని విస్తృతంగా అంగీకరించబడింది. ఒక సినిమాలో చూపించిన దృక్పథంతో ఏకీభవించకపోవడం మాత్రమే, దాని బహిరంగ ప్రదర్శనను నిరోధించడానికి సరైన కారణం కాకూడదు.
విభిన్న కథనాలను బహిరంగ రంగంలో పరిశీలించడానికి, చర్చించడానికి అనుమతించే విశ్వాసంలోనే భారతదేశ ప్రజాస్వామ్య బలం దాగి ఉంది. భౌగోళిక రాజకీయ సున్నితత్వాలతో సహా ధృవీకరణ కోసం చట్టపరమైన పారామితులకు మించిన అంశాలపై ఆధారపడటం, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమైన అవాంఛనీయ ఉదాహరణను సృష్టిస్తుంది.
భారతదేశ నాగరికతా తత్వం దీర్ఘకాలంగా బహుళ ఆలోచనలను, కళాత్మక వివరణలను స్వీకరించింది. సంక్లిష్టమైన లేదా అసౌకర్యమైన అంశాలతో మమేకం కావడం మన ప్రజాస్వామ్య బలాన్ని ఎన్నడూ తగ్గించలేదు; పైగా, ఇది ప్రజా చర్చలను సుసంపన్నం చేసింది.
ప్రజాస్వామ్య స్థైర్యాన్ని బలోపేతం చేసింది. అందువల్ల ప్రస్తుత సమస్య ఒక వ్యక్తిగత చిత్రానికి అతీతమైనది, భావప్రకటనా స్వేచ్ఛ పట్ల భారతదేశ రాజ్యాంగ నిబద్ధతతో పాటు ప్రపంచ సాంస్కృతిక రంగంలో దాని నియంత్రణ సంస్థల విశ్వసనీయతను సైతం ఇది స్పృశిస్తుంది.
ఈ క్రమంలో, ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ చిత్రాన్ని భావప్రకటనా స్వేచ్ఛను నిర్దేశించే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఖచ్చితంగా పరిశీలించేలా చూడాలని, వీలైనంత త్వరగా సర్టిఫికేషన్ మంజూరు చేయాలని మేము సీబీఎఫ్‌సీకి తక్షణ ఆదేశాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఆలోచనలు, కథనాలు, కళాత్మక వ్యక్తీకరణలు ముందస్తు నియంత్రణల ద్వారా అణచివేయబడకుండా, స్వేచ్ఛాయుతమైన ఆలోచనా వేదికలో(మార్కెట్‌ప్లేస్ ఆఫ్ ఐడియాస్) పరీక్షించబడాలనే చెక్కుచెదరని విశ్వాసంలోనే భారతదేశ ప్రజాస్వామ్య బలం నెలకొని ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
