బీహార్‌లో నితీష్ కుమార్ రాజకీయ జీవితానికి తెర పడింది. 1970 దశకంలో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో తెరమీదకు వచ్చిన జనతా పరివార్ రాజకీయాలు, నితీష్ కుమార్ 50 ఏళ్ల రాజకీయ జీవితంతో పెనవేసుకుపోయాయి.
ఆవిర్భావమే రెండు భిన్న ధ్రువాల సమ్మేళనం. ఒకటి జనతా పరివార్, రెండోది సంఘ్ పరివార్.
రాష్ట్ర రాజకీయాలలో అప్పటివరకు అగ్రవర్ణ ఆధిపత్యం కలిగిన కాంగ్రెస్ రాజకీయాలను సవాలు చేస్తూ ముందుకు వచ్చిన ఓబీసీ రాజకీయాలు అంతిమంగా జనతా పరివార్‌గా చరిత్రకెక్కాయి.
నితీష్ ప్రస్థానం – సామాజిక సమీకరణలు
గత శతాబ్ది కాలంగా బీహార్ రాజకీయాలు ఎన్నో ఉత్థాన పతనాలను, మలుపులను చవిచూశాయి.
రాష్ట్రంలో అగ్రవర్ణాల రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని యాదవ, కుర్మీ, కోయిరీ కులాలు సవాలు చేశాయి.
దీర్ఘకాలం పాటు లాలు ప్రసాద్ యాదవ్‌కు కుడి భుజంగా నిలిచిన నితీష్ కుమార్ కుర్మి కులానికి చెందినవాడు. 1994లో ఆర్జేడీ నుంచి చీలిపోయిన నితీష్ కుమార్ సమతా పార్టీని ప్రారంభించారు. తర్వాత కాలంలో ఈ పార్టీ ప్రస్తుతం మనం చూస్తున్న జనతాదళ్ యునైటెడ్ అవతారమెత్తింది.
రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నితీష్ కుమార్- ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్‌ను దాఖలు చేశారు.
గత 50 సంవత్సరాలలో జనతా పరివార్- సంఘ్‌పరివార్ ఆలోచనలు, ఆచరణ రాష్ట్ర రాజకీయాల రూపు రేఖలను నిర్ణయించాయి.
ఈ విధాన సంకర రాజకీయాలకు పుట్టిన బిడ్డ నితీష్ కుమార్.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలలో విధాన సంకర, సంకీర్ణ రాజకీయ శకం ముగిసింది.
నితీష్ కుమార్ రాజీనామా మరోవైపున రాష్ట్ర రాజకీయాలలో జనతా పరివార్ శాశ్వతంగా కనుమరుగయ్యే రోజు ఎంతో దూరంలో లేదనే వాస్తవాన్ని కూడా ముందుకు తెస్తుంది.
సైద్ధాంతిక వివాదం
ఉత్తర భారతదేశంలో మండల్ వర్సెస్ కమండల్ నినాదం రాజకీయాలను రూపుదిద్దుతోంది. మండల్ రాజకీయాలు దేశంలోని ఓబీసీ సామాజిక తరగతి అస్తిత్వాన్ని ముందుకు తీసుకొస్తే; దీనికి వ్యతిరేకంగా సంఘ్‌పరివార్ హిందుత్వ రాజకీయాలను ముందుకు తీసుకు వచ్చింది.
హిందూ సమాజంలోని వివిధ కులాల మధ్య ఐక్యత సాధించి దాన్ని రాజకీయ లక్ష్యాలకు పునాదిగా ఉపయోగించుకోవటం హిందుత్వ రాజకీయాల సారాంశం.
అయితే ఈ వైరుధ్యం సమాజాన్ని నిట్టనిలువుగా చీల్చిన వైరుధ్యం కాదు.
నితీష్ కుమార్ ప్రతిపాదించిన ఓబీసీ రాజకీయాలు హిందుత్వ రాజకీయాల కంటే గుణాత్మకంగా భిన్నమైనవేమి కాదు.
అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి హిందుత్వ రాజకీయాలతో మమేకం కాగలిగిన రాజకీయాలే.
బీహార్‌లో ఆ మాటకొస్తే ఉత్తర భారత దేశంలో అగ్రకులాలకు ఎదుగుతున్న కులాలకు మధ్య ఉన్న రాజకీయ వివాదాలు, వైరాలు, వైరుధ్యాలు నరేంద్ర మోదీ నాయకత్వంలో కుటుంబ వ్యవహారాలుగా మారాయి.
గత దశాబ్ద కాలంగా ఈ రాజకీయాలు భిన్న పార్టీల మధ్య పోటీ పడుతున్న భిన్నమైన రాజకీయాలుగా తమ ప్రత్యేకతలను కోల్పోయాయి.
అయితే రాజకీయాలలో కుల వైరుధ్యాలు, విభేదాలు పూర్తిగా సమసి పోయాయని కాదు.
ఒకప్పుడు భిన్నమైన శిబిరాలుగా చీలిపోయి పరస్పరం రాజకీయ అస్తిత్వం కోసం ఘర్షణ పడే ఈ వైరుధ్యాలు, విభేదాలు ప్రస్తుతం ఒకే పరివారంలో అంతర్గత వివాదాలుగా పరిణామం చెందాయి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా జారీ చేసిన కుల వ్యవక్ష సంబంధిత ఆదేశాలు వాటిపై వచ్చిన స్పందన దీనికొక ఉదాహరణ.
వివిధ పార్టీలతో ఘర్షణ పడుతూ ఒప్పందాలు కుదుర్చుకునే కుల సమీకరణలుగా ఉన్న జనతా పరివార్ రాజకీయాలు, క్రియాశీల, క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి కనుమరుగవుతున్నాయి.
ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్ కూడా బీజేపీలో విలీనం కావాలన్న ఒత్తిళ్ళను ఎదుర్కొంటుంది.
మతపరమైన చీలికలు – ప్రత్యామ్నాయ రాజకీయాలు
జనతా పరివార్ ప్రయోగంలో భాగంగా అగ్ర కులాలకు వ్యతిరేకంగా మిగిలిన కులాలన్నీ ఏకమయ్యాయి. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్‌కు జీవం పోసింది దళిత, మైనారిటీ సామాజిక సంకీర్ణం. దీనికి వ్యతిరేకంగా బీజేపీ ప్రారంభించిన రామ జన్మభూమి ఉద్యమం అగ్రవర్ణాల నాయకత్వంలో ప్రత్యామ్నాయ సామాజిక కూటమి నిర్మాణానికి పునాదులు వేసింది.
ఇంకా సూటిగా చెప్పాలంటే, హిందువులందరూ ఒకటే అన్న నినాదం రాజకీయ నినాదంగా రూపాంతరం చెందింది. దాదాపు 1000 మంది మరణానికి కారణమైన భాగల్పూర్ మతోన్మాదకలహాలు రాష్ట్ర రాజకీయాలలో మతపరమైన చీలికను శాశ్వతం చేశాయి. భాగల్పూర్ మతకలహాలలో చనిపోయిన వెయ్యి మందిలో అత్యధికులు ముస్లింలే.
సంఘ పరివార్ రాజకీయాలకు సమానంగా లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ హిందూ సమాజంలోని నన్నే కులాలన్నింటిని ఏకం చేసి ముస్లింలతో జతకట్టి ప్రత్యామ్నాయ రాజకీయాలుకు పునాదులు వేసింది.
బాబ్రీ మసీదు విధ్వంసం, రాజకీయంగా కాంగ్రెస్ బలహీనపడటం వంటి పరిణామాలు- రాష్ట్రంలోని అగ్రకులాలను బీజేపీ చెంతకు నెట్టాయి. ముస్లింలు, దళితులు ఆర్జేడీ ఓటు బ్యాంకుగా మారారు.
పురోగమిస్తున్న సంఘ్ పరివార్
రాష్ట్రంలో మండల్, కమండల్ రాజకీయాలు వివిధ చీలికలు పేలికలుగా, సామాజిక రాజకీయ సంకీర్ణాలుగా, కూటములుగా మారిన ప్రతి సందర్భంలోనూ- సంఘ్ పరివార్ గతం కంటే బలమైన శక్తిగా ఆవిర్భవించింది.
బహుళ సామాజిక సంకీర్ణ ప్రతినిధిగా ముందుకొచ్చిన ఆర్జేడీ 2005 అసెంబ్లీ ఎన్నికల్లో నాటికి కేవలం యాదవులు, ముస్లింల రాజకీయ ప్రతినిధిగా మిగిలిపోయింది.
నితీష్ కుమార్ కూడా యాదవ ఇతర బీసీలను, దళితులలో కొన్ని ఉపకులాలను ఆర్జేడీ పునాది నుంచి తొలగించి తన వెంట తీసుకువెళ్లాడు.
2005 నాటికి రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన శక్తిగా ఉన్న ఆర్జేడీ స్థానంలో బీజేపీ, జేడీయూ సంఖ్యను ప్రధానశక్తిగా అవతరించింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగానే కాక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా తెర మీదకు వచ్చాడు.
నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ నేతగా ముందుకు రావడానికి మొదట్లో వ్యతిరేకించిన నితీష్ కుమార్, తర్వాత కాలంలో తలొగ్గాడు. అప్పటి వరకు జనతా పరివార్ ప్రధాన రాజకీయ పునాదిగా ఉన్న ఓబీసీలకు ప్రతినిధిగా మోదీ 2018లో బీహార్ రాజకీయాలలో అడుగుపెట్టాడు.
ఇదే సామాజిక, రాజకీయ పునాదిపై నిలబడిన నితీష్ కుమార్‌ను ఆయన నాయకత్వం ఇస్తున్న జేడీయూను- బీజేపీ, సంఘ్‌పరివార్ రాజకీయాలు కబళించనున్నాయని ఆనాడే స్పష్టమైనది.
మండల్ వర్సెస్ కమండల్ రాజకీయాలకు తెర..!
ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామాతో ఈ కబళింపు రాజకీయాలలో ఒక అంకం ముగిసింది. నితీష్ స్థానంలో బీజేపీకి ప్రతినిధిగా ఉన్న ఓబీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పరిణామాలను సునిశితంగా గమనిస్తున్న బీజేపీలోని అగ్రకులాలకు చెందిన ఒక నాయకుడు రానురాను బీజేపీ- బ్యాక్ వర్డ్ జనతా పార్టీగా మారుతుందని వ్యాఖ్యానించాడు.
అంటే అప్పటివరకు అగ్రకులాల నాయకత్వానికి పెద్దపీట వేసిన బీజేపీ ప్రస్తుత దశలో వెనుకబడిన కులాలకు చెందిన నాయకులకు పెద్దపీట వేస్తోంది. ఇప్పుడు బీజేపీ గొడుగు కిందకు చేరిన అగ్రకుల రాజకీయ ఆశావహులకు ఉన్న ప్రత్యామ్నయాలు కూడా పరిమితమే.
ఓబీసీ బలాబలాలకు అనుగుణంగా సంఘ్ పరివార్ తన వ్యూహాలను మార్చుకోవటానికి సిద్ధపడుతుంది. సామాజిక రాజకీయ క్షేత్రాలలో కుల సమస్యలు, లేదంటే కులాధిపత్య వివాదాలు ఇకమీదట హిందుత్వ రాజకీయాల పరిధిలో కుటుంబపరమైన వివాదాలుగా పరిమితం కానున్నాయి.
సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా హిందుత్వ రాజకీయాలు లేదా మండల్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కమండల్ రాజకీయాలు అన్న చీలిక ఇకపై బీహార్‌లో కనుమరుగు కానున్నది.
హిందుత్వ పరిధిలోని సామాజిక న్యాయం, కమండల్ పరిధిలోని మండల్ రాజకీయ అస్తిత్వాలు అన్న శకానికి తాజా పరిణామాలు తెర తీస్తున్నాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
