అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో పంపుడ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుల(పీఎస్పీ) నిర్మాణానికి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జిల్లాలలోని సహజ వనరులతో పాటు నీటి వనరులను కొల్లగొట్టడానికి, వాటిని బడా కార్పోరేట్లకు ధారాదత్తం చేయడానికి కంకణాబద్ధమైంది.
ఆదివాసీల బతుకులను జలసమాధి చేసే, పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు అడ్డగోలుగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ద్వారా బడా కార్పొరేట్ శక్తులు అదానీ, షిర్డీ సాయి, నవయుగ కంపెనీలకు కారుచౌకగా అనుమతులను కట్టబెడుతున్నది.
2025 జూన్ 30న కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 51 విడుదల చేసింది. అంతకుముందు జగన్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట వద్ద 1000 మెగావాట్లకు ఇచ్చిన అనుమతిని 1800ల మెగావాట్లకు, విజయనగరం జిల్లా రైవాడ వద్ద 600 మెగావాట్లను 900కు సామర్థ్యం పెంచుతూ అనుమతి ఇచ్చింది.
గిరిజనుల జీవన్మరణ పోరాటం..
కూటమి ప్రభుత్వ అనుమతుల వల్ల ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగ హక్కులను, షెడ్యూల్ ఏరియా పంచాయతీ విస్తరణ- పిసా చట్టం, అటవీ హక్కుల చట్టం, గిరిజనులు పోరాడి సాధించుకున్న 1/70 చట్టాన్ని ఉల్లంఘించిందని నిరసన తెలియజేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి వేల ఎకరాల అటవీ, జిరాయితీ భూములను కేటాయించడాన్ని తక్షణం రద్దు చేయాలని స్థానిక గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
“ఈ ప్రాజెక్టుల వల్ల 8 మండలాలలోని 250 గ్రామాల్లో 50 వేల మంది ఆదివాసీలతో పాటు 20వేల ఎకరాల అటవీ వ్యవసాయ సొంత భూములు జల సమాధి కానున్నాయి. గిరిజన ప్రజల జీవనోపాధి, జీవన సంస్కృతి, పచ్చని అడవులు, సాగు భూములను, సహజ నీటి వనరులను నాశనం చేసే ఈ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమ”ని ముక్తకంఠంతో ఈ ప్రాంత గిరిజనులు పోరాటం సాగిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుల స్థాపనపై స్థానిక ఆదివాసీల అభిప్రాయాన్ని అడగకపోవడం, సమ్మతి లేకుండా కంపెనీ ప్రతినిధులు సర్వేలు జరపడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేగాక రాజ్యాంగ ప్రసాదితమైన ఐదవ షెడ్యూల్ హక్కులను భంగపర్చడమే అవుతుంది. గ్రామసభలే నిర్వహించకుండా ప్రాజెక్టుల కోసం సర్వే చేయడం వంటి చర్యలకు పూనుకోవడం పీసా చట్ట ఉల్లంఘన క్రిందికే వస్తుంది. చట్టాలను కాపాడి, ఆదివాసీలను రక్షించవలసిన ప్రభుత్వమే బడా కార్పొరేట్ల ప్రయోజనం కోసం వాటిని కాలరాయడం దుర్మార్గమైన చర్య. ఆదివాసీలను అడవి నుంచి గెంటివేసే ప్రయత్నాలను రాష్ట్రంలోని చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కార్ సాగిస్తున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలను రెట్టింపు ఉత్సాహంతో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న దుష్ఫలితమే ఇది.
ఏజెన్సీ ప్రాంతాల్లో, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసీలను, ఇతర పేదలను హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో వారి ఆవాసాల నుంచి వెళ్లగొట్టేందుకు, పెదకోట ప్రాంతంలో అత్యధిక గ్రామాలను ఖాళీ చేయించేందుకు అదాని కంపెనీ యంత్రాంగం చేసే ప్రయత్నాలను గిరిజనులు ప్రతిఘటించడం ప్రారంభించారు. అలానే చిట్టెంపాడు, గుజ్జలి గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సర్వేలను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా, రైవాడ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో ఎగువ ఆనకట్ట, దిగువనకట్టలు నిర్మించడానికి చింతలపూడి పంచాయతీలో సుమారు 550 ఎకరాలు, మారికా గ్రామంలో 214 ఎకరాలను సేకరించాలని చూస్తున్నారు. రైవాడా జలాశయానికి నీటిని సమకూర్చే శారదా నది పరివాహ ప్రాంతము నుంచి ఈ ప్రాజెక్టుకు నేరుగా నీటిని మళ్ళించనున్నారు.
దేవరాపల్లి కే కోటపాడు, చోడవరం మండలాల్లో 44 గ్రామాల్లో 15,344 ఎకరాల పంట భూములకు రైవాడా జలాశయం సాగునీరు అందిస్తున్నది. అలాగే విశాఖపట్నం నగరానికి త్రాగునీటికి ప్రధాన వనరుగా ఉంది. ముఖ్యమైన నీటి వనరుగా ఉన్న రైవాడ జలాశయం నీటిని పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పీఎస్పీ)కు మళ్లించటం ద్వారా ఈ ప్రాంతవాసుల జీవనోపాధికి, వ్యవసాయానికి, త్రాగునీటి భద్రతకు ముప్పు కలిగించటమే అవుతుంది.
దిగువ ఆనకట్ట కోసం అత్యంత సారవంతమైన గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుంటారు. ఎగువ ఆనకట్ట కోసం మొత్తం మారిక గ్రామాన్నే ఖాళీ చేయిస్తారు. ఆ విధంగా మొత్తంగా గిరిజనుల జీవితాలనే పూర్తిగా కబళిస్తారు. ఈ ప్రాజెక్టు వస్తే మారిక ప్రాంత ఆదివాసులతోపాటు మైదాన ప్రాంతాల రైతులు కూడా నీటి భద్రతను కోల్పోతారు. హరిత ప్రాజెక్టులుగా ప్రచారం గావిస్తున్న ఈ పీఎస్పీలు ఆదివాసీల పుట్టినిల్లు అడవిని, జీవవైవిధ్యాన్ని నాశనం చేయటమే కాక సహజ నీటి ప్రవాహాలను నాశనం చేస్తాయి.
గ్రామాలు పొలాలు ఆక్రమణ లేకుండా జనావాసాలు లేని నదీ పరివాహక ప్రాంతాలలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు పెట్టాలన్న అంతర్జాతీయ నిబంధనలను గౌరవించి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
గిరిజనుల జీవితాల పట్ల ఉరితాడుగా మారబోతున్న, రాష్ట్రంలోని చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కార్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం విడుదల చేసిన జీవోలు 51,13,2లను రద్దు చేయించుకోవటానికి ఈ ప్రాంతంలోని గిరిజన, రైతు సంఘాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీల నాయకత్వాన గిరిజన ప్రజానీకం రాజీలేని పోరాటాన్ని వివిధ రూపాలలో కొనసాగిస్తున్నారు. గిరిజనులు తమ జీవన్మరణ సమస్యపై అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ సాగిస్తున్న పోరాటానికి వివిధ రంగాల ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాలు తమ పూర్తి సహాయ సహకారాలను అందించటం ఎంతో అవసరమైన సందర్భం ఇది.
హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, గిరిజన ప్రజానీకం సాగిస్తున్న పోరాటానికి కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి ప్రాంత రైతాంగం హైటెక్ ఎయిరో స్పేస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ పచ్చని పంట పొలాలను కాపాడుకోవడానికి మూడు సంవత్సరాలు రాజీ లేని పోరాటం సాగించి, సాధించిన విజయం స్ఫూర్తిగా ముందుకు సాగాలి.
పార్వతీపురం మన్యం జిల్లాలో అదానీ సంస్థకు సంబంధించిన రెండు పంపుడ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులను ఆ ప్రాంత ఆదివాసీల ఆందోళనతో ఈ సంవత్సరం జూలై 29న కూటమి ప్రభుత్వం రద్దు చేసుకున్న ఘటనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి. అదానీలాంటి బడా కార్పొరేట్ల ప్రయోజనం కోసం గిరిజన ప్రజానీకాన్ని నిర్ధాక్షిణ్యంగా జలసమాధి చేసే పాలకుల నిరంకుశ విధానాలను సంఘటితంగా తిప్పికొట్టడమే గిరిజనులకు మిగిలిన ఒకే ఒక్క ఆయుధం!
ముప్పాళ్ళ భార్గవశ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు,
సెల్ నెం 9848120105
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
