“రాజులు వద్దు” ఉద్యమం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా విస్తృత నిరసనలకు దారితీసింది.
50 రాష్ట్రాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. పోలీసు చర్యలో మరణించిన పౌరులకు నివాళులర్పిస్తూ మిన్నెసోటాలో ప్రధాన కార్యక్రమం జరిగింది.
ప్రజాస్వామ్యాన్ని, హక్కుల పరిరక్షణను నిరసనకారులు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్య జరిగిన నెల రోజుల తర్వాత, అమెరికాలోని పలు నగరాల్లో ‘రాజులు వద్దు’ ఉద్యమం కింద భారీ నిరసనలు మరోసారి జరిగాయి.
అల్ జజీరా కథనం ప్రకారం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ పదవీకాలంలో ‘నో కింగ్స్’ ఉద్యమానికి మూడవ ప్రధాన దశగా శనివారం(మార్చి 28) నాటి ప్రదర్శనలు, ర్యాలీలు నిలిచాయి.
50 రాష్ట్రాల వ్యాప్తంగా 3,300 కంటే ఎక్కువ కార్యక్రమాలను ప్లాన్ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీ వంటి ప్రధాన నగరాల్లో భారీ జనసమూహాలు కనిపించగా; రోమ్, పారిస్, బెర్లిన్ లాంటి అంతర్జాతీయ నగరాల్లోనూ సమాంతర కార్యక్రమాలు జరిగాయి.
అయితే, ఈసారి ఉద్యమ వ్యూహం కేవలం ప్రధాన మహానగర ప్రాంతాలకే పరిమితం కాలేదు. సాధారణంగా సంప్రదాయవాద ప్రాంతాలుగా పరిగణించే వాటిపై నిర్వాహకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
పాల్గొన్నవారిలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ప్రధాన నగరాల వెలుపల జరిగిన కార్యక్రమాలకే హాజరయ్యారని వారు పేర్కొన్నారు.
ప్రగతిశీల సంస్థ ‘ఇండివిజిబుల్’ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్బర్గ్ మాట్లాడుతూ, “ఈసారి అతిపెద్ద వార్త ఎంత మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారన్నది కాదు, వారు ఎక్కడెక్కడ వీధుల్లోకి వచ్చారన్నదే ప్రధానం” అని వ్యాఖ్యానించారు.
మిన్నెసోటాలో ప్రధాన కార్యక్రమం
ఇటీవలి నెలల్లో ట్రంప్ పరిపాలనలోని కఠినమైన వలస విధానాలకు కేంద్ర బిందువుగా ఉన్న, ‘ట్విన్ సిటీస్’గా పిలిచే మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్-సెయింట్ పాల్ ప్రాంతంలో ప్రధాన కార్యక్రమం జరిగింది.
దేశ బహిష్కరణ ఆపరేషన్ సమయంలో మితిమీరిన బలప్రయోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ మెట్రో సర్జ్’లో భాగంగా- డిసెంబర్లో 3,000 మందికి పైగా ఫెడరల్ ఏజెంట్లను మోహరించారు.
జనవరిలో జరిగిన ఆపరేషన్ సమయంలో ఇద్దరు అమెరికన్ పౌరులు(అలెక్స్ ప్రిట్టీ, రెనీ నికోల్ గూడ్) కాల్చివేతకు గురయ్యారు.
ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని, సంస్కరణల డిమాండ్‌ను రేకెత్తించింది. ఆ ఆపరేషన్‌పై డజన్ల కొద్దీ వ్యాజ్యాలు దాఖలు కావడంతో, చివరకు ఫిబ్రవరిలో దానిని రద్దు చేశారు.
వారి జ్ఞాపకార్థం శనివారం జరిగిన నిరసనలో నివాళులర్పించారు. ఇందులో ప్రసంగాలు, సంగీత ప్రదర్శనలు జరిగాయి. సామాజిక కార్యకర్తలు, కార్మిక నాయకులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
ప్రముఖుల మద్దతు
ప్రగతిశీల నాయకుడు బెర్నీ సాండర్స్ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించగా, దిగ్గజ రాక్ కళాకారుడు బ్రూస్ స్ప్రింగ్స్టీన్, జానపద గాయని జోన్ బేజ్ ప్రదర్శనలిచ్చారు. నటుడు రాబర్ట్ డీ నిరో రికార్డ్ చేసిన సందేశంతో నిరసనకారులను ప్రోత్సహించారు.
“మీ ధైర్యం, నిబద్ధత మమ్మందరినీ ప్రేరేపించాయి. అహింసాత్మక నిరసన శక్తిని మీరు నిరూపించారు” అని ఆయన కొనియాడారు.
వాషింగ్టన్ డీసీలో కూడా నిరసనకారులు లింకన్ మెమోరియల్, వాషింగ్టన్ మాన్యుమెంట్ చుట్టూ గుమిగూడి- ట్రంప్ పరిపాలన చిహ్నాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని, దిష్టిబొమ్మలను ప్రదర్శించారు.
జూన్, అక్టోబర్ నెలల్లో జరిగిన గత “రాజులు వద్దు” నిరసనలకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు.
అక్టోబర్ ప్రదర్శన అనంతరం, నిరసనకారులను ఎగతాళి చేస్తున్నట్టు కనిపించే ఒక ఏఐ-సృష్టించిన వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మధ్యంతర ఎన్నికల సన్నాహాలు
ఇదిలా ఉండగా, అమెరికాలో నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల సన్నాహాలు ముమ్మరమయ్యాయి.
కాంగ్రెస్ ఉభయ సభలలో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ తన ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుండగా, తమ సీట్లను పెంచుకోవాలని డెమోక్రటిక్ పార్టీ ఆశిస్తోంది.
నిరసన సందర్భంగా బెర్నీ సాండర్స్ ప్రజలను ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని కోరుతూ, “ఈ దేశం నిరంకుశత్వంలోకి లేదా కొద్దిమంది పాలనలోకి జారిపోవడాన్ని మేము అనుమతించము. అమెరికాలో ప్రజలే సర్వోన్నతులు” అని స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
