వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతోంది. మరికొన్ని ప్రాంతాలలో తుఫానులు వస్తున్నాయి. వివిధ దేశాలలో సంభవిస్తున్న భూకంపాలకు వాతావరణ మార్పులు కూడా ఒక కారణమని తెలుస్తోంది. వాతావరణ మార్పు వల్ల ఏర్పడుతోన్న ఈ ప్రకృతి వైపరిత్యాల వల్ల తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లోని అమెజాన్ నగరం బెల్లెం వేదికగా వాతావరణ మార్పుపై అంతర్జాతీయ(కాప్-30) శిఖరాగ్ర సమావేశాన్ని(నవంబర్ 10- 21 వరకు) నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి.
ఈ సందర్భంలో వాతావరణ మార్పు మీద ది వైర్ పాఠకులకు అవగాహన కల్పించడానికి పీఈడబ్ల్యూ సంస్థ నిర్వహించిన సర్వే నివేదికను అందిస్తున్నాము.
ప్రపంచవ్యాప్తంగా వాతావారణ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? వాతావరణ మార్పు ప్రభావం మీద ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉందనే అంశం మీద పీఈడబ్ల్యూ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వివిధ దేశాల పౌరులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని తొమ్మిది మధ్య ఆదాయ దేశాలలో ఈ ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 21 వరకు పీఈడబ్ల్యూ సంస్థ సర్వే నిర్వహించింది. భారత్, అర్జెంటీనా, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, మెక్సికో, కెన్యా, నైజీరియాలో సర్వే చేశారు. ఈ సర్వేలో ఆయా దేశాల పౌరులు మొత్తం 12,375 మంది పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.
భారతీయుల అభిప్రాయం..
సర్వేలో పాల్గొన్న 18 నుంచి 50+ వయసున్న 75% మంది భారతీయులు వాతావరణ మార్పుల నేపథ్యంలో తమ జీవనశైలి మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. అయితే తమ నివాసిత ప్రాంతాలో, పని ప్రదేశాలలో వాతావరణం మార్పు ప్రభావం అంతగా లేదని; అయినప్పటికీ తమ జీవనశైలిని మార్చుకుంటామని 35% మంది పేర్కొన్నారు.
మరోవైపు తమపైనే కాకుండా– తాము నివసిస్తున్న, పని చేస్తున్న ప్రాంతంపై కూడా వాతావరణ మార్పు ప్రభావం తీవ్రంగా ఉందని ప్రతి నలుగురు భారతీయులలో ముగ్గురు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించడానికి తమ వంతుగా తమ జీవనశైలిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పేర్కొన్నారు. జీవనశైలిలో మార్పులు చేర్పులు చేస్తే, వాతావరణ మార్పు ప్రభావం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించడానికి, అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోగలదని 70% మంది భరోసాను వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులు తగ్గు ముఖం పడుతున్నప్పటికీ, అసాధారణంగా ఎక్కువ రోజుల పాటు వేడి వాతావరణం ఏర్పడటం పట్ల 26% భారతీయులు ఆందోళనను వ్యక్తం చేశారు.
వివిధ దేశాల పరిస్థితి..
తాము నివసిస్తున్న ప్రాంతం, పని చేస్తున్న ప్రదేశంపై వాతావరణం మార్పు ప్రభావితం చేస్తుందని చెపుతున్న వారిలో; అర్జెంటీనాలో 81%, మెక్సికో 83%, బ్రెజిల్ 74%, తుర్కియే 79%, భారత్ 76%, దక్షిణాఫ్రికా 69%, కెన్యా 71%, ఇండోనేషియా 68%, నైజీరియాలో 61% మంది ఉన్నట్టుగా సర్వే వివరించింది.
తాము నివసిస్తున్న ప్రాంతంపై వాతావరణం మార్పు ప్రభావముందని చెపుతున్న వారిలో; అర్జెంటీనాలో 57%, ఇండోనేషియా 55%, బ్రెజిల్ 53%, మెక్సికో 46%, కెన్యా 58%, భారత్ 45%, దక్షిణాఫ్రికా 42%, నైజీరియా 32%, తుర్కియేలో19% ప్రజలున్నారు.
వాతావరణం మార్పు ప్రభావం లేదని చెపుతున్న వారు; అర్జెంటీనాలో 28%, ఇండోనేషియా 30%, బ్రెజిల్ 28%, మెక్సికో 22%, కెన్యా 42%, భారత్ 35%, దక్షిణాఫ్రికా 33%, నైజీరియా 23%, తుర్కియేలో12% మంది అన్నారు.
వాతావరణ మార్పులో భాగంగా తమ జీవనశైలిలో, పని విధానంలో మార్పులు తెచ్చుకుంటామని చెపుతున్న ప్రజలను వయసుల వారిగా చూస్తే; యువకులు, పెద్దల మధ్య తేడా కనబడుతోంది.
ఈ వ్యత్యాసాన్ని గమనిస్తే ఇండోనేషియాలో 50+ వయసులో ఉన్నవారు 69%, 35- 49లో 83%, 18- 34లో ఉన్న వారు 89% ఉన్నారు. అలాగే తుర్కియే 45%, 63%, 64%; బ్రెజిల్ 72%, 84%, 86%; అర్జెంటీనా 77%, 86%, 90%; మెక్సికో 80%, 88%, 89%; భారత్ 76%, 81%, 82%; దక్షిణాఫ్రికా 68%, 73%, 75%; కెన్యా 75%, 73%, 82%; నైజీరియాలో 67%, 69%, 72% ఉన్నారు.
అంతర్జాతీయ సమాజం తీసుకునే చర్యల కారణంగా వాతావరణం మార్పు ప్రభావం తగ్గుతుందని అర్జెంటీనాలో 79%, కెన్యా 72%, భారత్ 71%, నైజీరియా 63%, బ్రెజిల్ 62%, దక్షిణాఫ్రికా 62%, మెక్సికో 48%, తుర్కియే 42%, ఇండోనేషియా 40% ప్రజలు విశ్వసిస్తున్నట్లు సర్వే వెల్లడించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
