లిబరలైజేషన్, ప్రైవెటైజేషన్, గ్లోబలైజెషన్ విధానాల ఆధారంగా 1990 దశకం ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా నూతన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. వీటి దిశా, దశను నిర్దేశిస్తున్న పది ఆర్దిక సూత్రాలనే “టెన్ కమాండ్మెంట్స్”గా ఆనాడు ఆర్థికవేత్తలు పేరుపెట్టారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఈ టెన్ కమాండ్మెంట్స్ శాసిస్తున్నాయి. ఈ కమాండ్మెంట్స్ పైకి చూస్తే ప్రజానుకూలమైనవిగానే కనిపిస్తాయి. కానీ వీటిని ఆచరణలోకి తెచ్చినప్పుడు వీటి ప్రజావ్యతిరేక స్వభావం బట్టబయలవుతుంది.
గతంలో ప్రపంచం ఎన్నడూ చూడని ఆర్ధికపరమైన వ్యత్యాసాలకు పునాదులు వేసి, పర్యావరణానికి కూడా హాని చేస్తూ- చివరికి ఆర్ధికంగా, సామాజికంగా మానవాళి మనుగడకే ప్రమాదం తెచ్చిపెడుతున్న టెన్ కమాండ్మెంట్స్గా పిలవబడుతున్న ఈ పది ఆర్ధికసూత్రాలేమిటో తెలుసుకుందాం..
భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రభుత్వాలు ఈ సూత్రాల ఆధారంగానే తమ ఆర్ధిక విధానాలను రూపొందించుకొని అమలు చేస్తున్నాయి.
ఆ పది సూత్రాలు ఏంటంటే?
1 ఆర్ధిక క్రమశిక్షణ : ఆయా దేశాల ప్రభుత్వాలు అప్పుల అవసరాన్ని తగ్గించడానికి దేశీయ ఖర్చులను తగ్గించి, పన్ను వచ్చే ఆదాయ మార్గాన్ని పెంచాలి. ఈ పేరుతో పన్నులు కట్టగలిగిన సంపన్న వర్గాలకు రాయితీలివ్వడం(ప్రత్యక్ష పన్నుల తగ్గింపు), సాధారణ ప్రజల రోజువారి జీవితాన్ని పన్నుల వ్యవస్థపరిధిలో దిగ్బంధించడం(జీఎస్టీ ఈ నమూనాకు పరాకాష్ట) ఆచారణాత్మక విధానాలుగా మారాయి.
2 ప్రభుత్వ ఖర్చుకు ప్రాధాన్యత : సబ్సిడీలపై వ్యయాన్ని పునర్నిర్దేశించి, ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలను విద్యా, ఆరోగ్యం, మౌళిక వనరుల పెట్టుబడి వైపు మళ్లించాలని చెపుతూనే ఆచరణలో ప్రజా సామర్థ్యాల పెంపుదలకు అవసరమైన నిధుల కేటాయింపులో కోతలు విధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాలో తరుగుపడకుండా చూసుకోవడం జరుగుతోంది.
3 పన్ను సంస్కరణలు : పన్ను రాయితీలను పూర్తిగా రద్దు చేసి, పన్నుల పునాదులు విస్తరింపచేయడానికి కొంత పన్నులను తగ్గించాలనే పేరుతో సంపన్న వర్గాలకు పలురకాలైన పన్నురాయితీలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఉదాహరణకు భారతదేశంలోనే గతపదేళ్లలో సుమారు 25 లక్షల కోట్ల రూపాయల విలువైన రాయితీలను పారిశ్రామిక పెద్దలకు కట్టబెట్టారు.
4 వడ్డీ రేట్లపై నియంత్రణను పూర్తిగా తొలగించి, మార్కెట్ ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయించాలి. ఈ నిర్ణయం ద్వారా అప్పటి వరకు అమలులో ఉన్న చిన్న–సన్నకారు, మధ్యతరగతి కుటుంబాలకు వెసులుబాటు కల్పించే రక్షిత వడ్డీ రేట్ల విధానాలకు మంగళం పాడారు.
5 మారక ద్రవ్యం రేట్లలో పోటి: మార్కెట్ ఎగుమతులను తక్కువ చేసే దేశీయ కరెన్సీ విలువను తగ్గించి, మార్కెట్ ఆధారిత మారకద్రవ్యం రేట్లలో పోటీతత్వాన్ని పెంచాలనే లక్ష్యంతో దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి రంగంతో పాటు, అంతర్జాతీయ వాణిజ్యకుబేరులకు కూడా లక్షల కోట్ల విలువైన రాయితీలను కట్టబెడుతున్నారు.
6 వ్యాపార సరళీకృతం: వ్యాపార వాణిజ్యరంగాలలో అన్ని రకాల ఆంక్షలను రద్దు చేసి, దిగుమతులపై సుంకాలను తగ్గించాలి.
7 ఎఫ్‌డీఐ: విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులకు అన్ని రకాల అవరోధాలను రద్దు చేసి, విదేశీ సంస్థల ప్రవేశానికి అవకాశం కల్పించాలి.
8 ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లను ప్రైవేటీకరించాలి.
9 డీ- రెగ్యులరైజేషన్: మార్కెట్లో కొత్త సంస్థల ప్రవేశాన్ని నిరోధించే నిబంధనలను రద్దు చేసి పోటీతత్వానికి, సామర్ధ్యానికి ప్రచారం కల్పించాలి.
10 ఈ విధానాల సారంశమేంటంటే ఆస్తి హక్కుల సంరక్షణ, పెట్టుబడి ప్రయోజనాల పరిరక్షణ
గతంలో ప్రవేశపెట్టిన ఈ ఆర్ధిక సంస్కరణలను, వాటిలో పొందుపర్చిన పది సూత్రాలను ప్రస్తుతం ” కాలం చెల్లినవి” గా ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో వీటికి ప్రత్యామ్నాయంగా ఐదు సూత్రాలకు రూపకల్పన చేసి విడుదల చేశారు.
ప్రత్యామ్నాయ సూత్రాలు..
1 ప్రజాక్షేమంపై దృష్టి: ప్రత్యేకించి మానవాళి క్షేమంపై దృష్టి పెట్టాలి. అందుకు భౌతికవాదం కానిది, లేదా జీడీపీ(స్థూల జాతియోత్పత్తి) ఆలోచనకు మించి, అతని ఆదాయాన్ని పరిగణంలోకి తీసుకొని స్వీయ పెరుగుదల, సామాజిక హోదా దక్కుతుందన్న భావనను కల్పించాలి. దాని కోసం మార్కెట్ మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు ప్రభుత్వం పాటుపడాలి. వ్యవస్థలో జరిగే పోటీలో అందరికి సమాన భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యంలో విఫలమైతే అలాంటి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోగలవు.
2 వృద్ధి ప్రధానాంశం: వృద్ధి చెందుతున్న ఆర్ధిక ఫలాలు లభించినప్పుడే, పౌరులు తమ ప్రభుత్వాలను నమ్ముతారు. అయితే ఈ వృద్ధి ఎక్కడి నుంచి ఎలా వస్తుందనే విషయంపై బలంగా దృష్టి పెట్టి, కావల్సినంత ఉపాధి సృష్టించబడుతుందా లేక ఎంపిక చేసిన కొంతమందికే లబ్ది చేకూరుతుందానేది కూడా చూడాలి.
3 వ్యవస్థల నిర్మాణం: అస్థిరతను తిప్పికొట్టడానికి ప్రభుత్వాలు బీమాదారుని మాదిరిగా పని చేస్తూ చివరి వరకు పోరాడాలి. అప్పుడు కేవలం స్థూల ఆర్ధిక పెరుగుదల ఒక్కటే కాకుండా , వ్యక్తి గృహవసరాల స్థాయిని పెంచే విధంగా చూసుకోవాలి. కోవిడ్-19 మహమ్మారి- ట్రంప్ సుంకాలు వంటి అసాధారణ, అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు- బీమాదారునిగా బాధ్యతలు తీసుకోవాలి. లేకుంటే ప్రజలు ఉపాధిని కోల్పోయి, అనారోగ్యం బారినపడి ఉన్న పొదుపును కోల్పోతూ తీవ్ర అవస్థలుపడే అవకాశాలున్నాయి.
4 లండన్ అవగాహన: వాషింగ్టన్ ఏకాభిప్రాయం ఎవరి గురించో ఊహాజనితమైన మనుగడ కోసం వాదించింది. సరిగా ఆర్థిక విధానాలను అమలు చేసే హృదయం, దయగల సాంకేతిక నిపుణులను నిరోధించింది. “దానికి భిన్నంగా లండన్ అవగాహన” ఆలోచిస్తుంది.
గ్లోబలైజేషన్ నుంచి బయటకు వచ్చే సమాజాలు, వర్థమాన సాంకేతికత, వాతావరణ మార్పులు, సాధారణ ప్రజల ప్రమోజనాల పక్షాన నిలబడే అంశం విషయంలో రెండు వ్యతిరేక శక్తులను భరించవలసి ఉంటుంది.
ఆర్థిక షాక్‌లకు వనరులుగా పెరుగుతున్న రాజకీయాలే ప్రమాదం కావచ్చు. సరైన రాజకీయాల కోసం ఎదురుచూస్తూ, అవి దేనికి కూడా అవరోధాలుగా ఉండకూడదు. ఆర్థిక పరిస్థితిని స్థిరపర్చడమే కాకుండా ఏదైన సాధ్యం చేసే విధంగా ఉండే క్రమబద్దీకరించే రాజకీయాలను ఆశిస్తున్నాం.
5 ప్రభుత్వ సామర్ధ్యాలు పెంచే వ్యయవిధానం: పని చేస్తున్న మార్కెట్ ఆర్ధికవ్వవస్థకు సామర్ధ్యం గల రాజ్య నిర్మాణం అవసరం , అందుకు ఒకే రకమైన క్రమబద్ధీకరణ, న్యాయబద్ధమైన నియంత్రణ మద్దతు లభించాలి. అప్పుడే ప్రైవేటు ఏజెంట్లు న్యాయపరమైన కాంట్రాక్టులలో ప్రవేశించి విశ్వాసంతో వ్యాపారాన్ని కొనసాగించగలరు.
అంతేకాకుండా తమ సొంత డబ్బు లేదా అప్పుగా తీసుకొచ్చిన నిధులకు నష్టం జరగకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని ఏర్పర్చాల్సిన అవసరం కూడా ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
