హోర్ముజ్ జలసంధి పరిణామాలపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు తాజాగా విడుదల చేసిన సంయుక్త ప్రకటన అంతర్జాతీయ వేదికపై పలు ప్రశ్నలకు తావిస్తోంది.
ఒక పక్క ఇరాన్‌పై అకారణంగా జరుగుతున్న దాడులను చూసీచూడనట్టు వదిలేసిన ఈ దేశాలు, ఇప్పుడు కేవలం తమ వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్న నెపంతో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేయడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.
గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల రాకపోకలు, ఇంధన సరఫరా గొలుసుల గురించి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, కెనడా దేశాలు ఒక సుదీర్ఘ ప్రకటన చేశాయి.
ఇరాన్ దళాలు హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ప్రస్తావిస్తూ, సముద్రయాన స్వేచ్ఛకు విఘాతం కలగకూడదని నొక్కిచెప్పాయి.
ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) తీసుకునే చర్యలను, చమురు నిల్వల విడుదలను ఈ దేశాలు స్వాగతించాయి.
కనబడని ప్రాణనష్టం.. వినిపించని హాహాకారాలు..
ఈ ఏడు దేశాల ప్రకటనను నిశితంగా పరిశీలిస్తే, వారి అసలు ప్రాధాన్యతలు స్పష్టమవుతాయి.
అంతర్జాతీయ చట్టాలు, శాంతి భద్రతల గురించి గొప్పగా మాట్లాడిన ఈ దేశాలు- అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సాగిస్తున్న విధ్వంసకర దాడుల గురించి కనీస ప్రస్తావన తేలేదు.
ఇరాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిని ఖండించకపోగా, ఆ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వేలాది మంది అమాయకుల పట్ల కనీస సానుభూతిని కూడా ఈ ప్రకటనలో ఎక్కడా పొందుపరచలేదు.
ద్వంద్వ ప్రమాణాలు- వ్యూహాత్మక మౌనం..
తమ ఉనికిని, దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలను “అంతర్జాతీయ శాంతికి ముప్పు”గా చిత్రీకరిస్తున్న ఈ దేశాలు, అసలు ఈ ఘర్షణకు మూలకారణమైన ఏకపక్ష దాడుల విషయంలో ఎందుకు మౌనం వహించాయన్నది అతిపెద్ద ప్రశ్న.
ఒక దేశంపై బాంబుల వర్షం కురుస్తున్నప్పుడు వర్తించని అంతర్జాతీయ చట్టాలు, కేవలం తమ చమురు రవాణాకు ఆటంకం ఏర్పడగానే గుర్తుకురావడం ఈ కూటమి ఆత్మవంచనకు నిదర్శనం.
ఆర్థిక ప్రయోజనాలే పరమావధి..
పౌరుల ప్రాణాల కంటే గ్యాస్ ప్లాంట్లు, వాణిజ్య నౌకల భద్రతే వీరికి ముఖ్యమన్న విషయం ఈ సంయుక్త ప్రకటన ద్వారా తేటతెల్లమైంది.
సామ్రాజ్యవాద ప్రయోజనాలే అజెండాగా సాగుతున్న ఈ దౌత్యంలో, ఇరాన్ ఆత్మరక్షణ చర్యలను సైతం నేరంగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇరాన్‌పై జరిగిన దాడులకు బాధ్యత వహించాల్సిన వారిని ప్రశ్నించకుండా, కేవలం బాధితులనే నిలదీయడం అంతర్జాతీయ న్యాయానికి గొడ్డలిపెట్టు లాంటిది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

