రాజకీయ నాయకత్వం తమ విధానాల వైఫల్యంలో ఓటు బ్యాంకులో కలుగుతోన్న అందోళనలను సర్దిచెప్పేందుకు ఇటువంటి పథకాలను సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయా? ప్రత్యేకించి మహిళలకు భద్రతతో కూడిన ఉపాధి కల్పించలేకపోవడాన్ని కప్పి పెట్టుకునేందుకు ఈ పథకాలు రచించబడుతున్నాయా? వేతనాలు పెంచలేని ప్రభుత్వ విధానాలకు విరుగుడుగా ఈ పథకాలు తెరకెక్కుతున్నాయా? విద్యా, వైద్యం లాంటి మౌలిక పౌర సేవల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను తెరమరుగు చేసేందుకు ఈ పథకాలు ప్రతిపాదించబడుతున్నాయా?
దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళలకు బేషరతుగా నగదు బదిలీ ప్రకటనలు చేయడం పరిపాటిగా మారిపోయింది.
ప్రస్తుతం దాదాపు 14 రాష్ట్రాలలో ఈ తరహా పథకాలున్నాయి. వీటిని అమలు జరిపే రాష్ట్రాల సంఖ్య కూడా పెరుగుతోంది.
గడచిన రెండు దశాబ్దాలుగా సార్వత్రిక కనీస ఆదాయం(యూబీఐ), నగదు బదిలీల ఆలోచన- చాలా సందర్భాల్లో ముందుకు వచ్చింది.
కానీ గత కొన్ని సంవత్సరాలుగా యూబీఐ పథకానికి దగ్గరగా ఉండేలా పెద్ద ఎత్తున జోక్యాన్ని చూశాము.
ఈ పథకాల ద్వారా ఇచ్చే నగదు సార్వత్రిక కనీస ఆదాయ పథకంలో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే, చాలా తక్కువ. వీటి అమలు కూడా సార్వత్రికం కాదు.
అంటే ప్రజలందరికీ లబ్ధి కలిగించే పథకాలు కావు. అమలు తీరు మాత్రం యూబీఐని పోలి ఉంటుంది.
ఇప్పటి వరకు అమలు జరుగుతోన్న షరతులతో కూడిన పథకాల కంటే, ఇవి భిన్నమైనవి.
ఉదాహరణకు జననీ సురక్ష యోజన పేరుతో అమలు జరుగుతోన్న పథకంలో మహిళలకు నగదు పంపిణీ జరుగుతోంది.
వృద్ధాప్య పింఛన్లు, బాలింతల ప్రయోజనాల కోసం రూపొందించిన పాత తరహా పథకాలలో కూడా నగదు బదిలీ రూపం కనిపిస్తోంది.
సాధారణ ఉపాధి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సామాజిక భద్రతను కల్పించడం ఇప్పటి వరకు అమలులో ఉన్న సంక్షేమ పథకాల లక్ష్యంగా ఉంది.
ఈ పథకాల సాధనంలో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నగదు బదిలీ పథకాలు అమలు చేస్తున్నాయి.
హక్కుల ఆధారిత పరిధిలో..
సాధారణ ఉపాధి ద్వారా ప్రజలకు కనీస భద్రత కల్పించలేనప్పుడు ప్రభుత్వాలు ఇటువంటి వినూత్న మార్గాలను అనుసరిస్తున్నాయి.
ఈ కోణంలో చూసినప్పుడు ఈ పథకాలు హక్కుల నేపథ్యంలో ముందుకు వచ్చినవిగానే భావించాలి.
ఈ పథకాలను “నిర్ధిష్ట, సామాజిక లేదా ఆర్థిక తరగతులకు అందజేసే భారీ సబ్సీడీలతో కూడిన పథకాలు”అని 16వ ఆర్థిక సంఘం వ్యాఖ్యానించింది. 2025-26లో సుమారు రూ 1.96లక్షల కోట్లను ఈ పథకాల కోసం కేటాయించినట్టు అంచనా.
స్పష్టమైన అవగాహన కోసం రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం కలుపుకొని ప్రతిపాదించిన బడ్జెట్ మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమి పథకాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఏ) పరిశీలించవచ్చు.
ప్రస్తుతం దీని స్థానంలో తీసుకు వచ్చిన కొత్త చట్టం వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజివిక మిషన్- గ్రామీణ్(వీబీ-జీఆర్‌ఏఎంజీ). ఈ పథకం కోసం తాజా కేంద్ర బడ్జెట్లో సుమారు రూ 1.6 లక్షల కోట్లు కేటాయించారు.
2018-19లో మొత్తం షరతులు లేని బదిలీల ద్వారా వివిధ సామాజిక పథకాలకు కేటాయించిన నిధులు మొత్తం బడ్జెట్ అంచనాలో భద్రత వాటా 60% ఉంటే, 2025-25(బీఈ) నాటికి 38% తగ్గినట్టు ఆర్ధిక సంఘం నివేదిక అంచనా వేసింది.
కాగా భారీ- సమూహ నగదు బదిలీలను ఈ కాలంలోనే 16% నుంచి 47% పెంచింది(మిగితాది వ్యవసాయం కోసం 24% నుంచి 15 శాతానికి కుదించింది).
ఎన్నికలతో ముడిపడిన సంక్షేమం..
ఇటీవల యూబీఐలాంటి పథకాలు ఎక్కువగా ఎన్నికలతో ముడిపడిన ప్రకటనలే కావడం గమనించాల్సిన విషయం. మహిళా లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని ఈ పథకాలు రూపొందించబడుతున్నాయి. వీటి ద్వారా ఏం సాధించాలనే విషయంలో ప్రభుత్వాలకు పూర్తి స్పష్టత ఉంది.
2026లో శాసన సభ ఎన్నికలు జరగనున్న నాలుగు ప్రధాన రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు ఇలాంటి పథకాలను ఎక్కువగా ప్రకటిస్తున్నాయి- ఇప్పుడున్న వాటిని విస్తరించడం లేదా కొత్తవి తేవడం చేస్తున్నాయి
తమిళనాడులో కలైంజర్ మగళిర్ ఉరుమై తిట్టం(కేఎంయూటీ)పథకం కింద నెలకు రూ 1000 చొప్పున అమలు జరుగుతోన్న పథకంలో భాగంగా- రానున్న మూడు నెలలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు విడుదల చేసే నిధులను ముందుగానే విడుదల చేస్తున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
దీంతో పాటు అదనంగా వేసవి ప్రత్యేక భత్యం రూ 2000 కలిపి రూ 5000 ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేయడం జరుగుతుంది. 1.3 కోట్ల మంది లబ్ధిదారులు(రాష్ట్రంలో 40% మహిళా ఓటర్లు) లబ్ధిపొందనున్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే, ఈ నెలవారి భత్త్యాన్ని రెండితలు రూ 2,000కి చేయడం జరుగుతుందని కూడా తను ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర ఖగజం(ఏఐఎడిఎంకే) ఈ చర్యను విమర్శించింది. ఇది ఓటర్లకు ఇస్తున్న- “లంచం” అని ఆరోపించింది. అంతేకాకుండా, రేషన్‌కార్డులు ఉన్న గృహాలన్నింటికీ ఇంట్లో పెద్దదిక్కుగా ఉన్న మహిళలకు నెలకు రూ 2,000 ఇవ్వనున్నట్టు మరోవైపు తమ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది.
దేశం నలుమూలలా పథకాల ప్రలోభాలు..!
ఇదే విధంగా ఈ ఏడాదిలో అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కూడా ఇలాంటి అడుగు వేశారు. “బిహు బహుమతి” పేరుతో రూ 3,000 మిగితా చెల్లింపులతో పాటు జనవరి నుంచి ఏప్రిల్ వరకు(నెలు రూ 1,250) చొప్పున ఒకేసారి మొత్తం రూ 8000లను రాష్ట్రంలోని 37 లక్షల మంది మహిళలకు బదిలీ చేశారు. ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో అస్సాం కూడా ఒకటి.
ఇటీవల కేరళలో స్త్రీ సురక్షా పథకాన్ని పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా, సుమారు 10 లక్షల మంది మహిళలకు నెలకు రూ 1,000 అందచేశారు.
2026 ఫిబ్రవరి నెల మొదట్లో రాష్ట్ర బడ్జెట్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లక్ష్మీర్భండార్ పథకం కింద చెల్లిస్తున్న డబ్బులో రూ 500 పెంచి రాష్ట్రంలో దాదాపు 2.4 లక్షల మంది మహిళలకు వర్తింప జేస్తుంది(రాష్ట్ర ఆరోగ్య భీమా పథకం, స్వాస్థ్య సాథిలో నమోదు చేసుకున్న మహిళలందరికి నగదు బదిలీని నెలకు రూ 1,000 నుంచి రూ 1,200 పెంచారు).
2024 మహారాష్ట్ర ఎన్నికల నాటి నుంచి ప్రభుత్వం లడ్కీ బహిన్ పథకం కింద ఎన్నికలు జరగడానికి నెల రోజుల ముందుగానే మహిళల బ్యాంక్ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసింది.
ఓట్లు ఎటువైపు పడతాయనేదానికి పథకాలు ప్రభావితం చేస్తాయని రాజకీయ వ్యాఖ్యాతలతో పాటు రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.
ఇటీవల ఎన్నికల్లో బీహర్‌లో ప్రభుత్వం మరోసారి గెలవడానికి మహిళలకు నగదు బదిలీ పథకం ఉదాహరణగా తీసుకోవాలని, వ్యాపారం మొదలు పెట్టడానికి స్వయంసహాయక గ్రూపు(జీవిక) మహిళలకు రూ 10,000 చొప్పున నగదు బదిలీ చేశారు.
ఇంటిపనికి వేతనాలు, మహిళలు చేసే వేతనంలేని పనులు, శిశు సంరక్షణ బాధ్యతలు నేపథ్యంలో చూసినప్పుడు ఈ పథకాలను సానుకూల దృష్టితో చూడాలి.
మహిళల బేరాసారాల శక్తిని పెంచడానికి ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని నొక్కి చెప్పాలి. కుటుంబంలో కూడా మహిళల ఆర్థిక సామర్థ్యం మెరుగు పడడానికి ఈ పథకాలు దోహదం చేస్తున్నాయి.
ఇంటి పనికి వేతనాలు ఇవ్వాలా? లేక అది కుటుంబ బాధ్యతలో భాగంగా చూడాలా అన్నది దీర్ఘకాలికంగా స్త్రీవాద ఆర్థిక వేత్తల సాహిత్యంలో చర్చనీయాంశంగా ఉన్న అంశమే.
ఎలా అర్థం చేసుకోని విశ్లేషించాలి?
గుర్తింపు, గౌరవ వేతనం అనివార్యమైన అంశాలని ఈ పథకాల సమర్థకులు వాదిస్తుంటే, ఇలాంటి బదిలీలు కార్మికుల్లో లింగ విభజనను మరింత ఘనీభవింపచేయడానికి దారి తీస్తాయని ఇతరులు అప్రమత్తం చేస్తున్నారు.
ఏదిఏమైనా ఇటువంటి సామాజిక, సంక్షేమ, వ్యవస్థాగత ఏర్పాట్ల ద్వారా ఇంటిపని భారాన్ని తగ్గించడం, ఇంటా బయట పని విభజనలో మార్పులకు అవసరమైన చర్యలు తీసుకోవడం అనివార్యమన్న విషయంలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి.
దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో, కొన్నింటిని మినహయిస్తే ఇటువంటి నగదు బదిలీ పథకాలను ప్రవేశపెడుతున్న రాజకీయ నాయకులు పై సమస్యల గురించి మాట వరుసకైనా చర్చిండం లేదు.
ఈ పథకాలు లింగ వివక్షను అధిగమించాలంటే, పథకంతో పాటు లింగ వివక్షను నియంత్రించే విధంగా వ్యవహరించాలంటే; రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఈ పథకాలను, వాటి పర్యవసానాలను మరింత లోతుగా అధ్యనం చేయాలి.
ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడంలో ఈ పథకాల పాత్ర ఎంత అన్నంత వరకే చర్చ పరిమితమౌతోంది.
అయితే ఎన్నికల సందర్బంగా అధికార పార్టీలు ఇలాంటి ప్రకటనలు, బదిలీలు చేయడం ఎంతవరకు ఔచిత్యమనేదానిపై అర్థవంతమైన ప్రశ్నలే తలెత్తుతున్నాయి.
ఇలాంటి పథకాలకు సంబంధించి ఆర్ధిక భారం పట్ల ఆందోళలనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలు, సందేహాలు అర్థవంతమైనవే అయినప్పటికీ- ఈ పథకాల వ్యాప్తి రీత్యా ఈ పథకాల స్వభావం, పరిధి, ప్రభావం, దీర్ఘకాలిక పర్యవసానాలు గురించిన అధ్యయనం అవసరం ఉంది.
ఈ నగదును ఎక్కుగా ఆహారం ఆరోగ్యం, పౌష్టిక ఆహారం తీసుకోవడం వంటి అత్యవసర ఖర్చులకు వాడుతున్నట్టు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
కుటుంబ నిర్ణయాల్లో మహిళల మాటకు విలువ, అలాగే ఆర్ధిక లావాదేవీలలో మహిళలు భాగస్వాములు కావడం మెరుగుపడినట్టు కూడా కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
కార్మిక మార్కెట్ ఫలితాల్లో ఎలాంటి మార్పురాలేదు, లేదా మహిళలు వేతనాలను పొందని పనికి గుర్తింపు లేదా కుటుంబ, శిశు సంరక్షణ భారాన్ని స్త్రీ- పురుషులు సమానంగా పంచుకోవడం మీద విస్తృత చర్చకు దారి తియ్యలేదు. కానీ లబ్ధిదారులకు కొన్ని విలువైన లాభాలు చేకూరాయి. అయినప్పటికీ మొత్తం సామాజిక, ఆర్థిక సంక్షేమ వ్యవస్థలను ఈ పథకాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి? పౌర సేవలు అందించడంపై వీటి ప్రభావం ఏంటి? వంటి కోణాలలో విస్త్రృతమైన అధ్యయనాలు జరగలేదు.
ఆర్ధిక కోణాన్ని పక్కన పెడితే రాజకీయ పార్టీలు తమ విస్తారమైన ఓటు బ్యాంకును పదిల పరుచుకోవడానికి ఏదో ఒక రూపంలో వారిని సంతృప్తి పరచాల్సిన అవసరం రాజకీయ వర్గాలకు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది.
చర్చించాల్సిందేంటంటే..
రాజకీయ నాయకత్వం తమ విధానాల వైఫల్యంలో ఓటు బ్యాంకులో కలుగుతోన్న అందోళనలను సర్దిచెప్పేందుకు ఇటువంటి పథకాలను సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయా?
ప్రత్యేకించి మహిళలకు భద్రతతో కూడిన ఉపాధి కల్పించలేకపోవడాన్ని కప్పి పెట్టుకునేందుకు ఈ పథకాలు రచించబడుతున్నాయా? వేతనాలు పెంచలేని ప్రభుత్వ విధానాలకు విరుగుడుగా ఈ పథకాలు తెరకెక్కుతున్నాయా?
విద్యా, వైద్యం లాంటి మౌలిక పౌర సేవల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను తెరమరుగు చేసేందుకు ఈ పథకాలు ప్రతిపాదించబడుతున్నాయా?
ఈ నగదు బదిలీలు ఇలాంటి ఫలితాలపై ఏమైనా ప్రభావం చూపగలవా లేదా? అవి ఎంత వరకు భ్రమలో ఉంచగలవు అనేది చర్చించాల్సిన ప్రశ్న.
స్థూల ఆర్ధిక నమూనా వృద్ధి, అభివృద్ధికి సంపద ఉద్యోగాలు, డిమాండ్‌ను సృష్టించేందుకు మనం ధనికులపై జూదం ఆడుతున్నప్పటికీ ఉపాధి అవకాశాల కల్పన వేతనాల పెంపుదల పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతాయి.
అదే సమయంలో, ఇలాంటి పథకాలను విస్తరించడంతో బడ్జెట్ బారం వల్ల మౌలిక ప్రజాసేవలకు అవసరమైన నిధులను దారి మళ్లించే ప్రమాదం ఉంది. ఇప్పటికే వనరుల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పథకాల అమలు భారంగా మారనున్నాయి.
ఇలాంటి పథకాలు మానవ అభివృద్ధి సూచికలను ఎలా ప్రభావితం చేస్తాయి? దీంతో పాటు సంక్షేమ రాజకీయాలలో రానున్న మార్పులేమిటి? ఈ మార్పులు భారత ప్రజాస్వామ్యాన్ని ఎలా ప్రభావితం చేయనున్నాయన్నవి మరింత విస్తృత స్వభావం కలిగిన ప్రశ్నలు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
