2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలలో పెద్దగా చెప్పుకోదగ్గా ఆశ్చర్యమేమీ లేదు. అందరూ పందెంకాసిన గుర్రాలే గెలుపు గీతను దాటాయి. ఉన్న తేడాల్లా ఒకటే. ఈ గెలుపు గుర్రాలు పరిగెత్తిన వేగం. చూడడానికి ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికల ఫలితాలలాగా కనిపిస్తున్నప్పటికీ; ఈ ఫలితాలకు దారితీసిన పరిణామాలు, ఆ పరిణామాలకున్న చారిత్రక నేపథ్యాలు, దేశంలో సంకీర్ణ రాజకీయాల ద్వారా బీజేపీని దానికి వెన్నుదన్నుగా ఉన్న సంఘపరివారాన్ని ఓడించాలనుకునే వారు తప్పక పరిశీలించాల్సినవే.
గణాంకాలకు సంబంధించిన వివరాలు, విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ముందుముందు మరిన్ని విశ్లేషణలు ఈ కోణంలో రావొచ్చు. ఈ చర్చలలో మరుగునపడుతోన్న మరో ముఖ్యమైన అంశమున్నది. అది సంకీర్ణాల నిర్మాణం.
భారత రాజకీయాలకు సంకీర్ణాల నిర్మాణం కొత్తేమి కాదు. ప్రధాన శత్రువును ఓడించే లక్ష్యం రాజకీయాల పక్షం ముందున్నప్పుడు ఆ ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా సాధ్యమైనంత ఎక్కువమందిని కలుపుకోని పోరాడి గెలవడమే సంకీర్ణ నిర్మాణానికి పునాది.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం విశాలమైన ప్రజాతంత్ర సంకీర్ణానికి ఉదాహరణగా నిలిస్తే, 2011 నుంచి 2021 వరకు దేశ రాజకీయాలలో వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తుల పలుకుబడిని, ప్రభావాన్ని కుదించడానికి తెర మీదికి వచ్చిన సంకీర్ణాలు(వర్గ సంకీర్ణాలు) మితవాద, ప్రగతి నిరోధక సంకీర్ణాలకు ఉదాహరణగా నిలుస్తాయి.
ఎమర్జెన్సీ అనంతర రాజకీయాలు తెర మీదకు తెచ్చిన సంకీర్ణాలలో రెండు ధోరణులు ఉన్నాయి.
పెరుగుతోన్న రాజకీయ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నంలో, రాజకీయాలను విస్తృత ప్రాతినిధ్య రాజకీయాలుగా మల్చడం ఒక ధోరణి. 1980వ దశకంలో వివిధ రాష్ట్రాలలో తెర మీదకు వచ్చిన ప్రాంతీయ పార్టీల రూపంలో ఈ ధోరణి వ్యక్తమవుతోంది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలు తక్షణ రాజకీయ అవసరం- కాంగ్రెస్ నిరంకుశత్వ ధోరణులకు ఫుల్స్టాప్ పెట్టడం- నేపథ్యంలో సైద్ధాంతిక అంశాలకు పెద్దగా ప్రాధాన్యతివ్వలేదు. ఫలితంగా 1950 నుంచి ఎమర్జెన్సీ వరకు రాజకీయ అస్తిత్వం కోసం బిక్కుబిక్కుమంటూ ప్రయత్నాలు చేసిన మతోన్మాద శక్తులు అప్పటి వరకు తమపై ఉన్న మరకలను, మకిలిని తొలగించుకోవడానికి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం అవకాశం కల్పించింది. దాని ఫలితమే ఎమర్జెన్సీ అనంతరం ఏర్పాటైన తొలి కాంగ్రెసేతర కేంద్ర ప్రభుత్వంలో; నేటి భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ భాగస్వామ్యం.
మతోన్మాదరహిత రాజకీయాల దిశగా అడుగులు..
ఈ కాలంలోనే భారత రాజకీయాలలో మతోన్మాద ప్రమాదం గురించిన అవగాహన నిర్దిష్ట రూపం తీసుకోవడంతో, మతోన్మాదరహిత రాజకీయాల దిశగా భారతీయ పౌర సమాజం అడుగులు వేసింది. ఈ తరహా రాజకీయాలకు కావాల్సిన ప్రజాతంత్ర భూమికను సమకూర్చడంలో అప్పటికీ ప్రభావశీల శక్తిగా ఉన్న వామపక్షాలు కీలక పాత్ర పోషించాయి.
1989 లోక్‌సభ ఎన్నికల నాటికి భారతరాజకీయాలలో చర్చనీయాంశాల స్వభావం మారటం వెనుక రాజ్యాంగ విలువల ఆధారంగా; దేశాన్ని మతోన్మాదరహిత రాజకీయాల దిశగా నడిపించేందుకు ఆసక్తి చూపించిన ప్రగతిశీల పౌరసమాజం విశేష తోడ్పాటు అందించింది. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ అనంతరం ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి 1989లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి మధ్య మౌలికమైన తేడాను గమనించవచ్చు.
నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అర్థాంతరంగా పతనం కావడంతో దాదాపు రెండు దశాబ్దాలపాటు ఒకే వేదికగా ఉన్నా జనతాదళ్ క్రమంగా చీలికలుపేలికలయింది. ఉత్తరభారతదేశంలో అప్పటికీ కాంగ్రెస్ తర్వాత; అన్ని రాష్ట్రాలలోనూ ఎంతో కొంతమేరా రాజకీయ ఉనికిని కలిగి ఉన్న పార్టీ జనతాదళ్ మాత్రమే. బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న ఆర్ఎస్ఎస్ అన్ని రాష్ట్రాలలోనూ నిర్మాణ సామర్థ్యం కలిగిన సంస్థగా ఉన్నప్పటికీ; బీజేపీ రాజకీయంగా పలుకుబడి కలిగిన సంస్థగా లేదు.
మితవాద సంకీర్ణ రాజకీయాలలో కొత్త దశ..
ఈ పరిస్థితిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటకలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒక కర్ణాటకలో మాత్రమే హెగ్డే నాయకత్వంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ క్షీణించడం జనతాపరివారం ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఉత్తరాది రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ స్థిరపడిపోయింది.
కానీ, బీహార్‌లో మాత్రం బీజేపీ ప్రధాన శక్తిగా ఎదగడానికి కావాల్సిన బలాన్ని సమకూర్చుకోవడంలో వెనకబడింది. అప్పటికే, కళ్యాణ్ సింగ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఆయోధ్యలో చారిత్రక కట్టడం బాబ్రీ మస్జీద్ను కూల్చివేయడానికి కావాల్సిన సన్నాహాలు చేయడంలో మునిగిపోయింది. దీనికి భిన్నంగా బీహార్ మాత్రం కర్పూరి ఠాకూర్ ప్రారంభించిన సామాజిక న్యాయం నినాదాన్ని లౌకిక రాజకీయాలతో మేళవించి ఓ స్థిరమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ జనతాదళ్ ముందుకు వచ్చింది. అప్పటి వరకు జనతా పరివారంలో ప్రధాన నాయకులుగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్, నితీష్ కుమార్‌లు లాలూ ప్రసాద్‌ను వీడి సొంత కుంపట్లు పెట్టుకున్నారు.
రాష్ట్రంలో సొంత బలాన్ని పెంచుకోవడానికి ఇదే అదనుగా భావించిన బీజేపీ, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ వివిధ సందర్భాలలో జతకట్టింది. ప్రత్యేకించి 1998 లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో సహా లౌకిక పార్టీలు; సొంతంగా కానీ కలిసి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయడం.
ఈ క్రమంలో అస్తిత్వం, అధికారం కోసం ఆరాటపడుతోన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకోవడానికి వెనుకాడలేదు. ప్రత్యేకించి సామాజిక న్యాయం, లోహియా వారసత్వం, కాంగ్రెస్ వ్యతిరేకత పునాదిగా ఉన్న జనతా పరివారం భాగస్వాములు తమ మౌళిక రాజకీయ అవగాహనలకు భిన్నంగా మతోన్మాద రాజకీయాలే పునాదిగా ఉన్న బీజేపీతో చేతులు కలపడం మితవాద సంకీర్ణ రాజకీయాలలో కొత్త దశ. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో భాగస్వాములుగా ఉండడంతో కలిసివచ్చే అదనపు వెసులుబాట్లు, అవకాశాలు రాజకీయ పలుకుబడులు ఉపయోగించుకొని; ఆర్జేడీ ఆధిపత్యం కలిగిన రాష్ట్రంలో లాలూ ప్రసాద్ రాజకీయ పునాదిని, రాజకీయ ఎజెండాను బద్దలుగొట్టడానికి కావాల్సిన వ్యూహాన్ని రూపొందించుకోవడం సాధ్యమైంది.
ఈ పరిణామాల ఉమ్మడి ప్రభావం 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఆర్జేడీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి నూతన సామాజిక సమీకరణాలకు తెరతీసింది. అందులో భాగంగానే అత్యంత వెనుకబడిన సామాజిక తరగతులు, కులాలు, ఉపకులాలను ఒక తాటి మీదకు తెచ్చి వారికి రాజకీయ ప్రాధాన్యం, అధికారంలో భాగస్వామ్యం కలిగించడం ద్వారా ఈ సమీకరణలను దీర్ఘకాలం మనుగడ కొనసాగించే రాజకీయ కూటములుగా రూపొందించడానికి నిర్దిష్ట వ్యూహ రచనతో పని జరిగింది.
దీనికి విరుగుడు వ్యూహం రూపొందించాల్సిన కాంగ్రెస్, వామపక్షాలు దీర్ఘకాలం ఆర్జేడీని రాజకీయ శత్రువుగానే చూస్తూ వచ్చాయి. బీహార్ సమాజం రాజకీయ స్వభావంలో జరుగుతోన్న వ్యవస్థాగత మార్పులను పరిశీలించి తగిన ప్రతివ్యూహాలు రూపొందించి రాష్ట్రంలో మతోన్మాదానికి పెద్దపీట వేసే రాజకీయ కూటమి ప్రభావాన్ని కట్టడి చేయడంలో లౌకిక ప్రతిపక్షాలు విఫలమైయ్యాయి.
స్థూలంగా చూసుకున్నప్పుడు 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో సంక్షేమం, నితీష్ కుమార్‌కు చివరి అవకాశం; ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రూపంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ తొత్తడంవంటి ముఖ్యమైన కారణాలలాంటి వాటికే పరిమితమై; దాదాపు నాలుగు దశాబ్దాలుగా రంగులు మార్చుకుంటూ సాగుతోన్న మితవాద సంకీర్ణ రాజకీయాలను- వాటి సామాజిక, అర్థిక పునాదులను విశ్లేషించడం విస్మరిస్తే; దేశం ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభానికి హేతుబద్ధమైన లౌకిక రాజకీయ పరిష్కారాన్ని చూపించడంలో విఫలం కాక తప్పదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
