తీహార్ జైలులో ఉన్నప్పుడు ఒబైద్-ఉర్-రెహమాన్ “కట్టి”ని నేర్చుకున్నాడు- లేదా శిక్షను తగ్గించుకోవడానికి దోషిగా ‘నేరాన్ని అంగీకరించడం’ గురించి తెలుసుకున్నాడు.
బెంగళూరు/హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో పాటు ఇతర ఏజెన్సీలు ఆకస్మికంగా బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారాన్ని సందర్శించే నాటికే, ఒబైద్-ఉర్-రెహమాన్ జైలులో ఉండబట్టి ఆరు నెలలు గడిచిపోయాయి.
2012 ఆగస్టులో రెహమాన్‌ను అరెస్టు చేసేనాటికి తన వయసు 21 సంవత్సరాలు, ఒక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నాడు. బెంగళూరులో మితవాద కార్యకర్తలను హత్య చేయడానికి లష్కరే తోయిబా(ఎల్ఈటీ) అనే టెర్రర్ గ్రూపుతో కలిసి కుట్ర పన్నారని రెహమాన్‌తో సహా మరో 12 మందిపై అభియోగాలు మోపపడ్డాయి.
తను జైలులో ఉండగానే, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 18 మంది చనిపోగా, దాదాపు వంద మంది గాయపడ్డారు.
ఈ దాడి వెనుకున్న “ప్రధాన కుట్రదారుల్లో” రెహమాన్ ఒకడని ఎన్ఐఏ వాదనపైనే మీడియా పూర్తిగా ఆధారపడింది. తను అరెస్టు కాకముందు, ఆ తర్వాత జైలులో ఉంటూనే- ఈ దాడికి సంబంధించిన ప్రణాళిక రచనలో పాల్గొన్నాడని పలు కథనాలు ఆరోపించాయి.
దాడిలో రెహమాన్ కీలక పాత్ర పోషించాడని పేర్కొంటూ, పలుచోట్ల తన ముఖాన్ని చూపిస్తూ మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలను ప్రచురించింది.
కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఎఫ్ఐఆర్లో లేదా ఆ తర్వాత చార్జిషీట్లో రెహమాన్ పేరు ఎక్కడా ప్రస్తావించబడ లేదు. ఎలాయితే తన పేరు నాటకీయంగా ప్రచారం చేయబడిందో, అలానే మీడియాలో నుంచి కూడా మాయమైపోయింది.
ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా ప్రచురితమైన కథనాలు, వీడియో నివేదికలు ఆన్లైన్లో అందరికి అందుబాటులోనే ఉన్నాయి.
తక్కువ సమయంలోనే, 2013 మార్చిలో తను “పెద్ద కుట్రలో” పాల్గొన్నాడని ఏజెన్సీ మరో కేసులో తనను ఇరికించింది. ఈసారి ఎల్ఈటీలో భాగమని చెప్పలేదు కానీ, దేశీయంగా ఉగ్రవాద సంస్థ ‘ఇండియన్ ముజాహిదీన్‘తో సంబంధం ఉందన్నారు.
మహారాష్ట్ర, గుజరాత్‌లలో వరుస ఉగ్ర పేలుళ్లతో ‘ఇండియన్ ముజాహిదీన్’ 2008లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం నుంచి ఒక బృందం ఈ ‘పెద్ద కుట్ర’ కేసు దర్యాప్తును చేపట్టింది. కొద్ది రోజుల్లోనే రెహమాన్‌ను ఢిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారానికి తరలించారు. తిరిగి తనను బెంగళూరుకు పంపించినంత వరకు, మొదటిసారి రెహమాన్ 10 నెలలను తీహార్ జైలులో గడిపాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు రెహమాన్ ఢిల్లీ- బెంగళూరు మధ్య చక్కర్లు కొట్టేలా ఎన్ఐఏ చేసింది.
ఢిల్లీలోని తీహార్ జైలు నెం. 4లో రెహమాన్ ఖైదు చేయబడ్డాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అదుపులోకి తీసుకున్న నిందితులు; ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న కేసులు, ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్ ఖైదీలకు కేటాయించిన స్థలమిది.
తీహారు జైలులో ఉన్నప్పుడు ఇతరులు మాట్లాడే భాష, యాసను; ఎలా బ్రతకాలనే ఎత్తులను రెహమాన్ త్వరగా నేర్చుకున్నాడు. మితవాద తీవ్రవాదులతో ఘర్షణకు దూరంగా ఉండటంతోపాటు– ఇతరులకు హాని చేయకుండా ఎలా ఉండాలి, సంప్రదింపు నైపుణ్యతను పెంచుకోవడం వంటి అనేక విషయాలను గమనించి నేర్చుకున్నాడు.
కానీ “కట్టి” అనే ఒకే ఒక పదం తన విచారణ స్వరూపాన్నే మార్చివేసింది. ఈ పదానికి ఖచ్చితమైన అర్ధం హిందీలో, మరే ఇతర భారతీయ భాషల్లో లేదు. తీహారు జైలు నెం. 4లో ఉనికిలోకి వచ్చిన ఈ పదం చివరికి అధికారిక న్యాయపత్రాల్లో కూడా కనిపించడం మొదలైంది.
‘కట్టి’ అంటే శిక్షను తగ్గించుకోవడమని తను వివరించాడు. “గునా కబూల్ కరో ఔర్ సజా కట్వా దో(నేరాన్ని అంగీకరించు, శిక్షను తగ్గించుకో)”.
ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్ చేపట్టిన కేసుల్లో పరిమితంగా ఆ సమయంలో నేరాంగీకార విజ్ఞప్తులను క్రమంగా అంగీకరించడం మొదలైంది.
1986లో ప్రారంభించిన ఈ సెల్– దేశ రాజధానిలో ఉగ్రవాదం, సంఘటిత నేరాలను కనుగొనడంతోపాటు వాటిని నిరోధించడం– వాటి మీద దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేయబడింది. 2009లో ఎన్ఐఏ స్థాపించబడే వరకు అన్ని ఉగ్రవాద కేసులను ఈ సెల్ చేపట్టేది. ఆ తర్వాత ఈ ప్రత్యేక సెల్ ఎన్ఐఏకు సమాంతరంగా లేదా అప్పుడప్పుడు కలిసి పని చేయడం ప్రారంభించింది.
తీహార్ జైలులో విషాదకర సందర్భాలను గడిపిన సమయంలో, ఈ “దుర్మార్గమైన జైలు విషవలయం” నుంచి బయటపడాలనే ఆలోచన ఎలా వచ్చిందో రెహమాన్ చెప్పాడు.
“ఏదో ఒక రోజు నేరాన్ని అంగీకరిస్తాను, ఇదొక్కటే సమాధానం”అని రెహమాన్ తెలియజేశాడు. ఢిల్లీలో తనకు వ్యతిరేకంగా నమోదైన కేసు ఇంకా తొలి దశలోనే ఉంది. కాబట్టి వేచి చూడాలనే విషయం తనకు తెలుసు.
బెంగళూరులో ఎన్ఐఏ బృందాన్ని, తన సహనిందితులను ఒప్పించడం ప్రస్తుతం అసలైన సవాలు. “బెంగళూరు కేసులో తన సహనిందితులు మొహమ్మద్ అక్రమ్, షోయబ్ అహ్మద్ మీర్జాలతో మాట్లాడినట్టు” తను తెలియజేశాడు.
అరెస్టుల సమయంలో అక్రమ్, మీర్జా వయసు 23 సంవత్సరాలు. అప్పటికే వారు బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో దాదాపు నాలుగు సంవత్సరాలు గడిపారు. తీహారు జైలులో రెహమాన్ ఉన్నాడు, తమ పెండింగ్ కేసులకు సంబంధించి ఢిల్లీ నుంచి బెంగళూరు మధ్య చక్కర్లు కొడుతున్న అనేక మంది నేరారోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తులను అక్రమ్, మీర్జా ఇప్పటికే కలుసుకున్నారు.
“మా అందరికీ అప్పటికే సరైన అవగాహనతో కట్టి గురించి తెలుసు” అని మీర్జా చెప్పాడు. అరెస్టు సమయంలో మీర్జా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ విద్యార్థి.
“కానీ రెహమాన్ సూచనలకు ముందు, మా విషయంలో అది ఓ అవకాశంగా భావించలేదు” అని అక్రమ్ చెప్పాడు.
చాలా మంది వారి సహ–నిందితులు ఇందుకు ఒప్పుకోలేదు, వారి కుటుంబీకులు కూడా ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. “ఈ వ్యూహం వల్ల మనం స్వేచ్ఛను పొందవచ్చు. కానీ మనం ఎదుర్కొంటున్న నేరారోపణలను అంగీకరించినట్టు అవుతుంది కదా” అని కర్ణాటకలోని హుబ్లీ నివాసి మీర్జా అభిప్రాయపడ్డాడు.
ఏ 1 నిందితుడి జాబితాలో మీర్జాను చేర్చారు– తన 25 ఏళ్ల సోదరుడు, ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రిసెర్చ్& డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ)లో జూనియర్ శాస్త్రవేత్తగా పని చేస్తున్న ఐజాజ్ అహ్మద్ మీర్జాను కూడా తనతో పాటు అరెస్టు చేశారు. ఆరు నెలల పాటు కస్టడీలో ఉన్న తర్వాత– తన పేరును చార్జిషీట్లో నమోదు చేయకూడదని ఎన్ఐఏ నిర్ణయించి విడుదల చేసింది.
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎదుగుతున్న ఒక యువ శాస్త్రవేత్తను ఎందుకు నిర్బంధించారన్న దానికి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముందుగానే భయపడినట్లుగా ఐజాజ్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.
ఐజాజ్తో పాటు మరో ఇద్దరు– బెంగళూరుకు చెందిన ఒక జర్నలిస్టు, ఉత్తర కర్ణాటక నుంచి ఒక ఎలక్ట్రీషియన్‌కు వ్యతిరేకంగా ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వారిని విడుదల చేశారు. వారి అరెస్టుకు గల కారణాలను వివరించలేదు.
మొత్తం 13 మందిపై చార్జిషీటు దాఖలు చేయగా – ఈ నేరంలో తమ పాత్ర ఏమీ లేదని అక్రమ్, మీర్జా, రెహమాన్‌తో సహా కనీసం ముగ్గురు బలంగా చెప్పారు.
తన నిర్ణయాన్ని తెలుసుకున్న తర్వాత భారతీయ రైల్వేలో పని చేస్తున్న తన తండ్రి ఒక్కసారిగా ఎలా కుంగిపోయారో మీర్జా గుర్తు చేసుకున్నాడు. “నా నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. కానీ నాకు మరో దారేముంది?”
ప్రస్తుతం, నేరాంగీకార విధానం ద్వారా మొత్తం కేసుల్లోంచి 40% కేసులను ఎన్ఐఏ పరిష్కరిస్తోంది. “కానీ ఆ సమయంలో మా ప్రతిపాదనను ఎన్ఐఏ వెంటనే తిరస్కరిస్తూ ‘నో’ చెప్పింది” అని రెహమాన్ తెలియజేశాడు.
నేరారోపణల నుంచి ‘నేరాంగీకర విధానం’మీద ఆ సమయంలో ఏజెన్సీ అంతగా దృష్టి పెట్టలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ దర్యాప్తు అధికారి ‘ది వైర్’కు తెలియజేశాడు.
అంతేకాకుండా, “ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుంచే ఈ ఆలోచన వచ్చింది” అని పేర్కొన్నాడు. “ఈ అంశాన్ని మా ప్రధాన కార్యాలయంతో పాటు హోంమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒప్పించడం అంత తేలిక కాదు” అని అన్నాడు.
ఎవరైతే తమ ప్రతిపాదనను తోసిపుచ్చారో– ఎన్ఐఏ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్జున్ అంబలపట్టతో జరిగిన సమావేశాన్ని అక్రమ్ గుర్తు చేసుకున్నాడు. “ఏజెన్సీ ఉదాసీనత చూపించినా, అందరికి జీవిత శిక్ష పడేలా ప్రయత్నించగలనని” అంబాలపట్ట వారికి చెప్పాడు. కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న వారిలో కొంతమందికైనా జీవితఖైదు కోసం ఎన్ఐఏ పాటుపడాలని అంబలపట్ట ప్రతిపాదించాడు.
అయితే రెహమాన్ ఆలోచనకు ఏజెన్సీ సానుకూల నిర్ణయం తీసుకుంది. “అది నెమ్మదిగా జరిగే ప్రక్రియ” అని మీర్జా అన్నాడు.
“ఎన్ఐఏ అధికారులు కొన్నిసార్లు కోర్టులో లేదా జైలును సందర్శించినప్పుడు మమ్మల్ని కలుసుకునేవారు. ఇవన్నీ మా కుటుంబాలకు, న్యాయవాదులకు కూడా తెలియకుండా నిశ్శబ్దంగా చేయాల్సి ఉంటుంది”అని మీర్జా పేర్కొన్నాడు.
బెంగళూరులో కొంత కాలం తర్వాత, కేరళలో ఎన్ఐఏ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వెళ్లిన అంబలపట్ట, అక్కడ కనీసం డజను ఐఎస్ఐఎస్ సంబంధిత కేసులను విచారిస్తూ ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు.
‘ది వైర్’ పంపించిన వివరణాత్మక ప్రశ్నాపత్రానికి అంబలపట్ట స్పందించడానికి నిరాకరించాడు. “ఎన్ఐఏకు కఠినమైన మీడియా విధానం ఉంది. కేవలం మా(ఎన్ఐఏ) నోడల్ అధికారి మాత్రమే మీడియాతో మాట్లాడగలరు”అని తను ప్రత్యుత్తరంలో పేర్కొంటూ, తదుపరి సంభాషణను తిరస్కరించాడు.
జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా కోర్టు ఆర్డర్లు లేకుండా నిందితులను కలవడానికి ఏజెన్సీకి అవకాశం ఉండదు. కానీ నిందితులను జైలులో కలవడానికి ఎన్ఐఏ అభ్యర్థించినట్టు లేదా కోర్టు అనుమతిచ్చినట్టు ఎటువంటి కోర్టు రికార్డులు లేవు.
నేరాన్ని అంగీకరించాలనే నిర్ణయం పూర్తిగా నిందితులకు సంబంధించినదని, ఇందులో తమ ఏజెన్సీ పాత్ర ఏమీ లేదని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ‘ది వైర్’కు చెప్పాడు. “ఒక నిందితుడు తన నేరాన్ని అంగీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ ప్రక్రియ మొత్తం అతనికి– న్యాయమూర్తికి మధ్య మాత్రమే జరుగుతుంది. ఈ ప్రక్రియలో ప్రాసిక్యూషన్‌కు ఎటువంటి పాత్ర ఉండదు” అని ఆ ప్రతినిధి స్పష్టం చేశాడు.
అలాగే, ఎన్ఐఏ అధికారులు జైలులో నిందితులను కలుస్తారన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించాడు. “అది (జైలులో కలవడం) కేవలం కోర్టు ఆదేశాలతో మాత్రమే సాధ్యమవుతుంది” అని తను అన్నాడు.
2016 సెప్టెంబరులో, జైలు గదిలో కూర్చొని తమ అంగీకార విజ్ఞప్తులను మొత్తం 13 మంది రాసుకున్నారని మీర్జా చెప్పాడు. “మాపై మోపిన నేరాలను మేమందరం అంగీకరిస్తున్నామని తెలియజేస్తూ కోర్టులో దాఖలు చేయాలి. ఈ క్రమంలో ఎవరెవరికి వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు ఉన్నాయని ఒకరొకరు తెలుసుకున్నాము” అని మీర్జా పంచుకున్నాడు. “పాఠశాల పరీక్షల్లో కాపీ కొట్టే నకలుకు సరి సమానంగా ముసాయిదా ఉన్నట్టు అపిచ్చింది” అని నవ్వాడు.
వీళ్లందరూ తన వెనకాల వారాల కొద్ది రచిస్తున్న ప్రణాళిక గురించి న్యాయవాది హష్మత్ పాషాకు అంతవరకు తెలియదు. పద్దెనిమిది మంది సాక్షులను అప్పటికే విచారించారు. నిర్దోషిగా విడుదల చేస్తారని పాషాతో పాటు మీర్జా, ఇతరులు భావించారు. “ఆయన(పాషా) ఎన్ఐఏ కేసును తురిమారు”అని మీర్జా చెప్పాడు. కానీ ఇంకా దాదాపు 250 మంది సాక్షులను పరీక్షించాల్సి ఉందని, దీనికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చని మీర్జా అన్నాడు.
ఎప్పుడైతే దరఖాస్తు ముందుకు కదిలిందో అప్పుడు, నేరాంగీకర విజ్ఞప్తిని ఉపసంహరించుకోవాలని వారి న్యాయవాది చాలాసార్లు ఒప్పించడానికి ప్రయత్నించాడు. “పాషా సర్ కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. మేమందరం విడుదలవుతామని చాలా నమ్మంతో ఉన్నాము. తనను మోసం చేస్తున్నట్టు అనిపించింది. కానీ మాకు మరో మార్గం లేదు”అని మీర్జా గుర్తు చేసుకున్నాడు.
వారు తమ నిర్ణయాన్ని మార్చుకోరని న్యాయవాది పాషాకు తెలిసిన తర్వాత, తను వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. శిక్షను తక్కువ కాలానికి తగ్గించేందుకు బేరసారాలు జరిపాడు. చివరికి వారందరికీ ఐదు సంవత్సరాల పాటు శిక్ష పడిన తర్వాత, 2017 సెప్టెంబర్‌లో విడుదల అయ్యారు.
బెంగళూరు కేసులో నేరాంగీకరణ విజ్ఞప్తితో విడుదల కావడం ఇది రెండవ ఎన్ఐఏ కేసుగా పరిగణించబడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ముస్లింలున్న కేసుల్లో ఈ మోడల్‌ను విస్తారంగా ఉపయోగించడాన్ని వెంటనే ఎన్ఐఏ మొదలుపెట్టింది. ఒక శ్రీలంక జాతీయుడికి ఐదు ఏళ్ల శిక్ష విధించిన తర్వాత చివరికి స్వదేశానికి తిరిగి పంపించడం మొదటి కేసు. ఇటువంటి విజ్ఞప్తులకు “దౌత్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం, కీలకాంశంగా చూడాల్సి వస్తుంది”అని దర్యాప్తులో భాగమైన ఎన్ఐఏ అధికారి ‘ది వైర్’కు తెలియజేశాడు.
రెహమాన్ ఇంకా తన ఢిల్లీ కేసు పెండింగ్‌లో ఉండగానే తిరిగి తీహార్ జైలుకు వెళ్లాడు. “నా నేరాంగీకరణ ఆలోచనను ఢిల్లీ ఎన్ఐఏ బృందం ముందు కూడా పెట్టడం జరిగింది” అని తెలిపాడు. దాన్ని అధికారులు మూడుసార్లు తిరస్కరించారు. “ఇతరులను ఇరికించండని ప్రతిసారి వారు డిమాండ్ చేసేవారు. నేను తిరస్కరించినప్పుడల్లా, నా దరఖాస్తును కోర్టులో వాదించారు”అని అన్నాడు. సాధారణంగా విచారణలో ఉన్నవారితో ఇలాంటి చర్చల్లో పాలుపంచుకోవద్దని ‘ది వైర్’కు ఎన్ఐఏ స్పష్టం చేసింది.
ఎన్ఐఏ కొంత మెతకబడి నాల్గవ ప్రయత్నంలో ప్రత్యేక కోర్టు తన నేరాంగీకార విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది. దీంతో 11 సంవత్సరాల తర్వాత కటకటాల నుంచి 2023లో బయటకు వచ్చి రెహమాన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
రెండు సంవత్సరాల తర్వాత, తీవ్రంగా ఆలోచించి తనను తాను రెహమాన్ ప్రశ్నించుకున్నాడు: పోలీసులు ఎందుకు తన వెంటపడ్డారు? తన వెంటే కాదు, ఆ సంవత్సరాలలో తన నలుగురు అన్నదమ్ముళ్లు, అక్క చెల్లెళ్లను వేరువేరు కేసుల్లో ఇరికించగా, అన్ని రకాల అభియోగాల నుంచి వారందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు.
తన మొత్తం కుటుంబంతో రాష్ట్ర ఏజెన్సీలకు కఠిన చరిత్ర ఉంది. ‘సిమి'(ఎస్ఐఎంఐ) విషయంలో పోలీసుల దర్యాప్తు సందర్భంగా తన పెద్ద మామయ్య మౌలానా నసీరుద్దీన్‌ను తరచుగా తీసుకెళ్లేవారు. 2001లో నిషేధించబడిన విద్యార్థి సంఘం ‘సిమి’తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అనేక మంది తమ మామయ్యలు, ఇతరులు జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది.
“మేము నేరం చేశామా లేక అమాయకులమా అన్నది పక్కన పెడితే, మా మొత్తం రక్త సంబంధీకులను నేరస్థులుగా రాజ్యం ముద్ర వేసింది” అని తీవ్ర ఆవేదనను రెహమాన్ వ్యక్తం చేశాడు.
తన సొంత నగరం నాందేడ్‌లో మరో కేసు అక్రమ్‌పై నమోదయ్యింది. ముంబై ఎన్ఐఏ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నాడు. బెంగళూరు వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకొని అలానే నేరాంగీకరణ దరఖాస్తును ముంబై కోర్టు ముందు పెట్టగా – ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి దాన్ని తిరస్కరించారు.
“నేరాంగీకరణ దరఖాస్తులోని కారణాల విషయంలో స్పష్టత లేదు. పైగా(నేరాన్ని) బహిర్గతపరచలేదు”అని కోర్టు అభిప్రాయపడింది.
10 సంవత్సరాల కారాగార శిక్షను అక్రమ్‌కు విధించారు– చివరికి 2022 జూన్ 15న విడుదల చేశారు. అప్పటి నుంచి తను తిరిగి తన పండ్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు.
నేరాంగీకరణ దరఖాస్తు చేయడంతో ఎన్ఐఏ, ఇతర ఏజెన్సీల సదాభిప్రాయాన్ని సంపాదించుకున్నామన్న ఆశాభావంతో అక్రమ్, మీర్జా ఉన్నారు.
“వారు మాకు పునరావాసాన్ని కల్పిస్తామ”ని హామీ ఇచ్చినట్టు మీర్జా తెలిపాడు. కానీ వీరిద్దరితో పాటు ఇతరులు కూడా ఎన్‌ఐఏతోనే కాకుండా రాష్ట్ర పోలీసుల ద్వారా కూడా నిరంతరంగా వేధింపులకు గురవుతున్నట్టు ఆరోపించాడు.
బెంగళూరు రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా 2024 మేలో ప్రశ్నించే నిమిత్తం అక్రమ్, మీర్జాలను తీసుకెళ్లారు. మీర్జా సోదరుడు ఐజాజ్‌ను కూడా ప్రశ్నించడానికి రప్పించారు. కాగా అక్రమ్, ఐజాజ్లను కొద్ది రోజుల్లో వదిలిపెట్టగా, ఈ కేసులో ఐదవ నేరస్తుడిగా మీర్జాను అరెస్టు చేశారు.
కొన్ని నెలల తర్వాత ఎన్ఐఏ నమోదు చేసిన చార్జిషీట్లో ఆరోపించబడిన మరో నలుగురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. కానీ మీర్జా పేరు లేదు. చివరకు గత ఏడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టు తనను విడుదల చేసింది.
చార్జిషీట్ దాఖలు చేయకుండా ఎన్ఐఏ ఎలా వదిలేసింది? తనకు ఎన్ఐఏకు మధ్య ఏం జరిగిందని విలేకరి మీర్జాను ప్రశ్నించగా– ఈ అంశంపై మాట్లాడడానికి తను తిరస్కరించాడు.
‘ది వైర్’ ప్రచురించిన ఐదు భాగాల పరిశోధనాత్మక కథనాల ప్రకారం, శిక్షలు ఖరారు చేయడానికి “నేరాన్ని అంగీకరించడం” అనే పద్ధతిని ఎన్ఐఏ ఒక సులువైన మార్గంగా భావిస్తోందని తేలింది.
అయితే, దీని కారణంగా వందలాది మంది యువకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. చివరకు జైలు నుంచి బయటపడటానికి, వేరే మార్గం లేక “నేను దోషిని” అని ఒప్పుకోవాల్సిన దుస్థితి వారికి ఏర్పడింది.
ఎన్ఐఏ తన విజయాల రికార్డును చూసి గొప్పగా చెప్పుకుంటోంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది: చీకటి గదుల్లో ఒత్తిడి చేసి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి నేరాంగీకారాన్ని రాబట్టినప్పుడు, అసలు న్యాయం అంటే ఏంటో నిర్ణయించేది ఎవరు?
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.



