రాఘవన్ శ్రీనివాసన్ రాసిన ‘రెబెలియన్ ఇన్ వర్స్: రెసిస్టెన్స్ అండ్ డివోషన్ ఇన్ ది తమిళ భక్తి మూవ్మెంట్’ పుస్తక సారాంశం.
తమిళ భక్తి ఉద్యమంలో గొప్ప త్రయంగా పేరొందిన వారి పద్యాలను పరిశీలిద్దాం. తీవ్రమైన ఆధ్యాత్మికత కలిగిన నమ్మాళ్వార్; గాఢమైన, స్థిరమైన భక్తి కలిగిన అప్పర్; ప్రకాశవంతమైన, యవ్వన తేజస్సుతో ఉన్న సంబంధర్ ఈ త్రయంలోని వారు.
పన్నెండు మంది ఆళ్వార్లలో నమ్మాళ్వార్ను అత్యంత గొప్పవారిగా భావిస్తారు. ఆయన కవితలను ఎవరైనా చదివితే దీనికి స్పష్టమైన కారణం తెలుస్తుంది.
అవి “తాత్వికంగా, కవితాత్మకంగా, సూటిగా ఉంటూనే కష్టమైన రూపకల్పనతో ఉంటాయి.
ఏకాగ్రతతో ఉంటూనే విభిన్న మనోభావాలను – ఆశ్చర్యం, కొంటెతనం, సున్నితత్వం, సంతోషం, సూక్ష్మమైన పరిశీలనతో పాటు అప్పుడప్పుడూ నిరాశను స్పృశిస్తూనే- అందులోనే ఉండిపోకుండా చేస్తాయి”.
ఆయన రచనలలో ఎక్కువ ముఖ్యమైనవి ‘తిరువాయ్మొళి'(దేవుని వాక్కు)లోని 1102 పద్యాలు. ఇది “వెయ్యి శాఖల ఉపనిషత్తులు కలిసి ప్రవహించే తమిళ వేద సముద్రం”అని కొనియాడబడింది.
నమ్మాళ్వార్ జననం, బాల్యం..
ఎనిమిదవ శతాబ్దపు ద్వితీయార్థంలో ఒక రైతు కులంలో(వెల్లాల) నమ్మాళ్వార్ జన్మించారు.
తిరునెల్వేలి సమీపంలోని ఆళ్వార్తిరునగరిలో ఒక రాచరిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన కేవలం 35 సంవత్సరాలు మాత్రమే జీవించారు.
పురాణాల ప్రకారం, ఆయన జననం తన తల్లిదండ్రుల ప్రార్థనల ఫలితం. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.
ఆ బిడ్డ పాలు తాగడానికి నిరాకరించడం, మౌనంగా ఉండటం, బాహ్య ఉద్దీపనలకు ఎలాంటి ప్రతిస్పందనా చూపకపోవడంలాంటి విచిత్రమైన ప్రవర్తనను కనబరిచాడు.
దీంతో మనస్తాపం చెందిన తల్లిదండ్రులు స్థానిక ఆలయంలోని విష్ణువు పాదాల వద్ద ఆ శిశువును వదిలిపెట్టారు.
ఆశ్చర్యకరంగా, ఆ బిడ్డ స్వయంగా సమీపంలోని ఒక చింతచెట్టు తొర్రలోకి వెళ్లి(తామర పువ్వు ఆకారంలో ఉన్న), పద్మాసనం వేసుకుని గాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.
ఆ స్థితిలో 16 సంవత్సరాల పాటు ఉండిపోయాడు.
మధురకవి రాక – దివ్య శ్లోకాల ఆవిర్భావం
మధురకవి అనే కవి దక్షిణ ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన కాంతిని గమనించారు, అది ధ్యానంలో ఉన్న బాలుడి వద్దకు ఆయనను నడిపించింది.
ఆ యోగిని మేల్కొల్పడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా, చివరికి ఒక తెలివైన చిక్కుప్రశ్నతో ఆయన విజయం సాధించారు.
మేల్కొన్న వెంటనే, యోగి వేగంగా ప్రతిస్పందించారు- అది ఆయన ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని సూచిస్తుంది.
తన సుదీర్ఘ తపస్సు నుంచి బయటకు వచ్చిన నమ్మాళ్వార్, విష్ణువుపై వెయ్యికి పైగా కీర్తనలను భక్తిశ్రద్ధలతో రచించారు.
నాథముని అన్వేషణ – పద్యాల సంకలనం
పదవ శతాబ్దంలో, పన్నెండు మంది ఆళ్వార్ల రచనలను సంకలనం చేయడానికి నాథముని ప్రయత్నించారు.
ఈ క్రమంలో, నమ్మాళ్వార్ జన్మస్థలానికి వచ్చిన సందర్శకులు పది పద్యాలను పఠించారు. ఇవి నమ్మాళ్వార్ రచించిన వేయి పద్యాలలో ఒక చిన్న భాగం మాత్రమేనని నాథముని గ్రహించారు.
ఆ తర్వాత ఆయన ఆ సాధువు జన్మస్థలంలో ధ్యానం చేశారు, కానీ ఫలితం లేకపోయింది.
గౌరవనీయమైన ఈ సాధువు గురించి మధురకవి రాసిన స్తోత్రాలను పఠించిన తర్వాత మాత్రమే, నమ్మాళ్వార్- మధురకవి ఇద్దరూ ఒక దర్శనంలో కనిపించి, మిగిలిన పద్యాలన్నింటినీ కనుగొనడానికి నాథమునికి అవసరమైన మార్గనిర్దేశం చేశారు.
ఈ అసాధారణ ప్రయాణం పవిత్రమైన వైష్ణవ గ్రంథాల సృష్టిలో రైతు కులానికి చెందిన ఒక సాధువు కీలక పాత్రను సుస్థిరం చేసింది.
ఈ కీర్తనల లోతైన ప్రభావం ఆ కాలానికి మించి విస్తరించింది, తరువాతి వైష్ణవ కవితా సంప్రదాయాలకు పునాది వేసింది. శతాబ్దాలుగా చైతన్య, ఠాగూర్ వంటి గౌరవనీయ వ్యక్తులను ప్రభావితం చేసింది.
తన గురించి, తన అశాశ్వత సంపద గురించి గొప్పగా ఊహించుకునే
ఈ బలహీనమైన మానవులను కీర్తిస్తూ పద్యాలు రాయడంలో ఉపయోగం ఏమిటి?
అనేక చెరువులు, సారవంతమైన పొలాలతో ఉన్న కురుంగుడిలో నిజంగా నివసించే,
శాశ్వతమైన దేవుడిని, నా గొప్ప ఆశ్రయదాతను కొనియాడకుండా?
తిరువాయ్మొళి: భక్తి, తత్వశాస్త్రాల మేళవింపు
నమ్మాళ్వార్ రాసిన ఈ పద్యం ఆయన ఉత్కృష్ట రచన తిరువాయ్మొళికి చెందినది.
ఈ పద్యాలు పదకొండు చొప్పున భాగాలుగా చేయబడ్డాయి(పదమూడు పద్యాలున్న ఒక మినహాయింపుతో). ఈ ప్రతి భాగాన్ని ఒక ‘తిరువాయ్మొళి’ అని పిలుస్తారు.
అంతేకాకుండా, ఇటువంటి పది సమూహాలు కలిసి ఒక ‘పత్తు'(తమిళంలో పది అని అర్థం)అవుతాయి.
మొత్తంగా, తిరువాయ్మొళి 10 పత్తులతో కూడి ఉంది. అంటే 100 తిరువాయ్మొళిలు, 1102 పాశురాలు కలిసి భక్తి, తత్వశాస్త్ర స్మారక నిర్మాణంగా ఇది నిలుస్తుంది.
ఈ పద్యం మూడవ పత్తులోని తొమ్మిదవ తిరువాయ్మొళిలోని రెండవ పాశురం నుంచి తీసుకోబడింది.
నమ్మాళ్వార్ తన పద్యాలను ఇంత క్రమబద్ధంగా సమూహాలుగా చేయడం ఆయన భక్తి లోతును మాత్రమే కాకుండా ఆయన సాహిత్య ప్రావీణ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
ప్రతి పాశురమూ వ్యక్తిగత భావోద్వేగం, సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాల సమ్మేళనంతో రూపొందించబడి. ఒక విశాలమైన, సూక్ష్మంగా నిర్మించిన కవితా దృశ్యాన్ని సృష్టిస్తుంది.
ప్రాపంచిక వ్యామోహాలపై విమర్శ
ఈ పద్యంలో, నమ్మాళ్వార్ తమ తాత్కాలిక సంపద, స్వయం-ప్రాముఖ్యత గురించి గర్వపడే “బలహీన మానవుల” కోసం కీర్తనలు రచించడంలోని వ్యర్థతను విమర్శిస్తున్నారు.
అశాశ్వతమైన మానవ కీర్తిని ప్రశంసించడాన్ని ఆయన చాలా స్పష్టంగా తిరస్కరిస్తారు. బదులుగా, ఆయన మన దృష్టిని శాశ్వతమైన వాటి వైపు మళ్లించాలని కోరుకుంటారు.
సారవంతమైన పొలాలు, సమృద్ధిగా ఉన్న చెరువులకు ప్రసిద్ధి చెందిన కురుంగుడిలో నివసించే గొప్ప దేవుడైన తన ఆశ్రయదాత వైపు.
సారవంతమైన ప్రకృతి దృశ్యాల చిత్రణ దైవిక పోషణకు రూపకంగా పనిచేస్తుంది, ఆధ్యాత్మిక భక్తి గొప్పతనంతో మానవ అహంకార శూన్యతను విభేదిస్తుంది.
శాశ్వత విలువల అన్వేషణ
ఈ పద్యం తిరువాయ్మొళిలోని ప్రధాన ఇతివృత్తాలలో ఒకదాన్ని ప్రతిబింబిస్తుంది, ఇక్కడ నమ్మాళ్వార్ మానవ కోరికల నశ్వరమైన స్వభావాన్ని మరింత శాశ్వతమైన దానితో పోలుస్తారు.
దైనందిన తమిళ భాషను, సులభంగా అర్థమయ్యే చిత్రణను ఉపయోగించి, ఆయన సంపద, అహంకారం వంటి ప్రాపంచిక విజయాలలోని నిస్సార స్వభావాన్ని ఎత్తిచూపుతూనే, మరింత శాశ్వతమైన విలువలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని సూచిస్తారు.
ఆయన “మానవ అహంకారం డొల్ల విజయాల”ను విమర్శిస్తూ, మరింత అర్థం- పరమార్థం ఉన్న, తరచుగా విస్మరించబడే జీవితంలోని లోతైన అంశాలను పాఠకులకు గుర్తు చేస్తారు.
కాబట్టి ఆయన సందేశం వారి దార్శనిక జ్ఞానంతో సంబంధం లేకుండా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
కవితా నైపుణ్యం- సందేశం
అశాశ్వతమైన వాటి నుంచి మన దృష్టిని మరల్చి, జీవిత పరమార్థం, సమాజం లేదా వినయంవంటి నిజంగా ముఖ్యమైన వాటి వైపు మళ్లించడం ద్వారా, మనం చేసే ఎంపికలను పునరాలోచించుకోమని నమ్మాళ్వార్ పద్యం మనల్ని ఆహ్వానిస్తుంది.
సారవంతమైన భూములు, ప్రవహించే చెరువులవంటి సరళమైన భాష; దృశ్యాలు, నిజమైన సంపద అనేది శాశ్వతమైన దానిని పోషించడం ద్వారా వస్తుంది తప్ప, అశాశ్వతమైన కీర్తిని వెంబడించడం వల్ల రాదని మనకు గుర్తు చేస్తాయి.
ఈ విస్తృత ఇతివృత్తాలను తీసుకుని వాటిని వ్యక్తిగతంగా; అందరికీ అర్థమయ్యేలా చేయడంలో కవి నైపుణ్యం దాగి ఉంది. ఆయన లోతైన అంతర్దృష్టులను దైనందిన జీవితంలో అద్భుతంగా మిళితం చేస్తారు.
సామాజిక, ఆధ్యాత్మిక సంస్కరణ
ఇటువంటి పద్యాల ద్వారా, నమ్మాళ్వార్ తమిళ సమాజంలో కవిత్వం పాత్రను పునర్నిర్వచించారు.
ఆయన రచన కేవలం ఒక భక్తి చర్య మాత్రమే కాదు, సామాజిక ఆచారాలపై విమర్శ కూడా.
పాఠకులు తమ ప్రాధాన్యతలను, అనుబంధాలను పునరాలోచించుకునేలా ఆయన ప్రేరేపించారు. క్రమబద్ధీకరించబడిన ఈ పాశురాలలో, సామాజిక, ఆధ్యాత్మిక సంస్కరణలకు ఒక లోతైన పిలుపు ఉంది.
సంపద, హోదా మోసపూరితమైన మెరుపులకంటే దైవత్వాన్ని వెతకమని ఆయన ప్రజలను కోరతారు.
నమ్మాళ్వార్ తిరువాయ్మొళి ఆయన భక్తికి నిదర్శనం మాత్రమే కాదు- ప్రేమ, సమానత్వం, ఆధ్యాత్మిక నెరవేర్పు శక్తిని మనకు గుర్తు చేస్తూ నిరంతరం ప్రతిధ్వనించే ఒక విప్లవాత్మక గ్రంథం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
