అమెరికాలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అగేన్(మాగా) నినాదంతో రెచ్చిపోతూ ప్రజల మధ్యన విద్వేషాన్ని పెంచి పోషిస్తున్న ట్రంప్ ఆలోచనలకు, అనుసరిస్తున్న విధానాలను స్వయంగా అమెరికన్లు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా తాజా ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.
న్యూయార్క్ మేయర్ పదవికి, దానితో పాటు వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్, సిన్సినాటి, న్యూజెర్సీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావించి తన రిపబ్లికన్ అభ్యర్ధులకు పరోక్షంగా మద్దుతు తెలుపుతూ తన పలుకుబడిని ఉపయోగించారు. అయినప్పటికీ రిపబ్లికన్లను చిత్తుచిత్తుగా ఓడంచి డెమోక్రాట్లను ఓటర్లు గెలిపించారు.
నలుగురు కూడా డెమోక్రటిక్లే..
గెలిచిన ఈ నలుగురిలో భారతీయ మూలాలున్న ముగ్గురు ముస్లిం అభ్యర్ధులుండటం విశేషం. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రన్ మమ్దానీ, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా ఫిర్దౌస్ హష్మి, సిన్సినాటి మేయర్‌గా అఫ్తాబ్ పూరేవాల్ భారతీయ మూలాలకు చెందిన వారు కాగా, న్యూజెర్సీ గవర్నర్‌గా ఎన్నికైన మిక్కి షెర్రిల్ అమెరికాకు చెందిన వారే.
అయితే అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రధానంగా న్యూయార్క్ మేయర్ ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో న్యూయార్క్ గవర్నర్‌గా పని చేసి ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన అండ్రూ క్యుమోను బాహాటంగా బలపర్చడమే కాకుండా, ఈ ఎన్నికల్లో మమ్దానీని గెలిపిస్తే న్యూయార్క్‌కు ప్రభుత్వ నిధులను నిలిపివేస్తానని కూడా ట్రంప్ హెచ్చరించారు.
ఈ గెలుపుపై అధ్యక్షులు ట్రంప్ స్పందిస్తూ, “ఒకటి తన పేరు బ్యాలెట్ పేపర్లో లేకపోవడం, రెండవది ఉద్యోగుల తొలగింపు. ఇవే రెండు రిపబ్లికన్ల ఓటమికి కారణాలని”తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
అన్ని రంగాలలో, అన్ని కీలక పదవుల్లో నిర్ణయాత్మక స్థాయిలో జన్మతః అమెరికన్లె ఉండాలని కోరుకుంటూ; ఇతర దేశాలకు చెందిన ప్రజలకు వ్యతిరేకంగా అమెరకన్లను మాగా నినాదంతో ట్రంప్ రెచ్చగొడుతున్నారు. దీనివల్ల కూడా ఈ రోజు ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటులో దాదాపు అన్ని రంగాలు కుంటుబడిపోతున్నట్టుగా ఆ దేశ కార్మిక శాఖ లెక్కలే తెలియజేస్తున్నాయి.
మాగా జపం చేస్తూ ఒక వైపు ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తూ, మరో వైపు ట్రంప్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల కారణంగా- అనేక కంపెనీలు, సంస్థలు, ఏజెన్సీలు మూతపడుతున్నాయని; దీని ప్రభావంతో నిరుద్యోగం బాగా పెరిగిపోతున్నట్లు, అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో రోజుకు 1,640 చొప్పున ఏటా 600,000 అనేక సంస్థలు శాశ్వతంగా మూతపడుతున్నాయి. దీంతో నిరుద్యోగుల సంఖ్య కుడా పెరుగుతుంది.
అమెరికాలో ఈ ఏడాది ఆగస్టు వరకు నిరుద్యోగం 4.3% ఉంది. అంటే 7.4 మిలియన్ నిరుద్యోగులున్నారు. ట్రంప్ రెండవ సారి అధికారాన్ని చేపట్టిన వెంటనే, అన్ని ఏజెన్సీలను రద్ధు చేయడంతో 200,000 మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో పాటు మిగితా రంగాలలో ఇప్పటికే 950,000 ఉద్యోగాల్లో కోత విధించగా; ఈ ఏడాదిలో ఈ సంఖ్య ఒక్క మిలియన్‌కు చేరవచ్చునని అంచనా వేయబడింది.
అమెరికలో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న జనాభ నిష్పత్తి 59.6% ఉంది, పని చేస్తున్న కార్మికులు 62.3%, ఉపాధి కోసం ఎదురుచూస్తున్న కార్మికులు 722,000, దీర్ఘకాలిక నిరుద్యోగులు(27 వారాలు)25.7% ఉన్నారు.
మాగా నినాదంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆదేశ ప్రజల తరఫున, కొంత మంది ఈ ఎన్నికల ద్వారా నినాదం సృష్టికర్త చెంప చెల్లుమనే విధంగా ఇచ్చిన తీర్పు తీరు తెన్నులను అర్ధం చేసుకోవాల్సి ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
