ప్రభుత్వ మొత్తం ఆదాయంలో ఆదాయపు పన్ను(వ్యక్తిగత పన్ను) 21% వాటా కలిగి ఉంది, ఇది కార్పొరేట్ పన్ను(18%) కంటే ఎక్కువ.
బడ్జెట్ పత్రం ప్రకారం, 2026-27 సంవత్సరానికి కార్పొరేట్ పన్ను బడ్జెట్ అంచనా రూ 12,31,000 కోట్లు కాగా, ఆదాయపు పన్ను ఆదాయం రూ 14,66,000 కోట్లుగా అంచనా వేయబడింది.
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(వ్యక్తిగత పన్ను) మరోసారి ప్రభుత్వ మొత్తం ఆదాయంలో 21% వాటాను కలిగి ఉంది, ఇది కార్పొరేట్ పన్ను(18%)ను అధిగమించింది.
గత దశాబ్దంలో భారతదేశ పన్ను వ్యవస్థ కార్పొరేషన్లు, పరోక్ష పన్నులకు అనుకూలంగా మారిన ధోరణిని ఇది ప్రతిబింబిస్తుంది.
2019లో, ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుతం ఉన్న దేశీయ కంపెనీలకు 22శాతానికి, కొత్త తయారీ కంపెనీలకు 15శాతానికి తగ్గించింది.
పెరిగిన ఆదాయపు పన్ను వాటా
‘బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్’ డాక్యుమెంట్ ప్రకారం, 2026-27 సంవత్సరానికి కార్పొరేట్ పన్ను బడ్జెట్ అంచనా రూ 12,31,000 కోట్లు కాగా, ఆదాయపు పన్ను వసూళ్లు రూ 14,66,000 కోట్లుగా అంచనా వేయబడింది.
పోల్చి చూస్తే, 2025-26లో కార్పొరేట్ పన్ను బడ్జెట్ అంచనా రూ 10.82 లక్షల కోట్లు (ట్రిలియన్లు) కాగా, ఆదాయపు పన్ను రూ 14.38 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.
అదే సంవత్సరంలో కార్పొరేట్ పన్ను కోసం సవరించిన అంచనా రూ 11.09 లక్షల కోట్లు, ఆదాయపు పన్ను రూ 13.12 లక్షల కోట్లు.
పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం, 2000-01 నుంచి 2023-24 మధ్య, కార్పొరేట్ పన్ను ఏటా సగటున 15%; వ్యక్తిగత ఆదాయపు పన్ను 16% పెరిగింది.
ఈ కాలంలో మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయపు పన్ను వాటా పెరిగింది. ఇది 2000-01లో 47% నుంచి 2023-24 నాటికి మొత్తం ప్రత్యక్ష పన్నులలో 53శాతానికి చేరింది.
ముఖ్యాంశాల ప్రకారం గణంకాలు
2026-27 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాల ప్రకారం, రుణాలతోపాటు ఇతర అప్పులు ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక వాటాను(24%) కలిగి ఉన్నాయి, ఆ తర్వాత స్థానంలో ఆదాయపు పన్ను(21%) ఉంది.
మిగిలిన ఆదాయంలో కార్పొరేట్ పన్ను 18%, జీఎస్టీ- ఇతర పన్నులు 15% , పన్నేతర ఆదాయం 10%, కేంద్ర ఎక్సైజ్ సుంకం 6%, కస్టమ్స్ సుంకం 4%; రుణేతర మూలధన రసీదులు 2% వాటాను అందిస్తున్నాయి.
ఇదే సమయంలో, ప్రభుత్వ వ్యయంలో రాష్ట్రాల పన్నుల వాటా అత్యధికంగా(22%) ఉంది.
ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు (20%), కేంద్ర రంగ పథకాలు (17%), రక్షణ (11%), ఇతర ఖర్చులు; ఆర్థిక కమిషన్ బదిలీలు(రెండూ 7%), ప్రధాన సబ్సిడీలు (6%) ఉన్నాయి.
అత్యంత అసమానతల భారతదేశం
గత దశాబ్దంలో భారతదేశ పన్ను వ్యవస్థ కార్పొరేషన్లకు, పరోక్ష పన్నులకు ప్రాధాన్యతనిచ్చింది. దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కి; కొత్త తయారీ కంపెనీలకు 15%కి తగ్గించారు. అయితే, ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పటికీ, ఈ కంపెనీల నుంచి వచ్చే పన్ను వసూళ్లు జీడీపీలో 3.5% నుంచి 2.8శాతానికి తగ్గాయి.
మరోవైపు, గత ఐదు సంవత్సరాలలో జీఎస్టీ ఆదాయం రూ 4.4 లక్షల కోట్ల నుంచి రూ 22.08 లక్షల కోట్లకు పెరిగింది.
ఇది సంవత్సరానికి 9.4% సగటు వృద్ధిని నమోదు చేసింది.
ఈ అసమతుల్య పన్ను విధానం ఆర్థిక అసమానతలను పెంచడానికి దారితీసింది. ప్రపంచ అసమానత నివేదిక 2026 ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అసమానతలు ఉన్న దేశాలలో ఒకటిగా నిలిచింది.
“దేశంలోని మొత్తం ఆదాయంలో దాదాపు 58% వాటా కేవలం 10% మంది సంపన్నులకే వెళుతుండగా, దిగువన ఉన్న 50% జనాభా కేవలం 15% ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారు” అని నివేదిక పేర్కొంది.
సంపద అసమానత ఇంకా ఎక్కువగా ఉంది; అగ్రశ్రేణి 10% మంది దేశ మొత్తం సంపదలో 65% కలిగి ఉండగా, అత్యంత ధనవంతులైన కేవలం 1% మంది దగ్గరే 40% సంపద కేంద్రీకృతమై ఉంది.
ఈ నివేదికను ఇంగ్లీషులో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి .
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
