తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. కానీ కథ ముగియదు.
ఎందుకంటే, ముగించే ఇష్టం ఎవరికీ లేదు. గవర్నర్ ఏమీ చెప్పరు. కేంద్రానికి తీరిక లేదు.
ఢిల్లీ పాదుషాలు, హైదరాబాద్ ముఖ్యమంత్రి ఏం చెబితే అదే చేసే బాధ, బాధ్యత ఉంది. కనుక స్పీకర్ ఏం చేస్తారు? రాజ్యాంగం, అందులో ఉన్న 10వ షెడ్యూల్, ఫిరాయింపు వ్యతిరేకత అని మనసులో బాధ పెట్టుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.
ఏదో రకంగా అనర్హత లేకుండా మళ్లీ ఎన్నికల్లో గెలవడం, లేదా ఫిరాయించడం అనేది మామూలే.
తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు, అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్ కాపీలను 24 గంటల్లోగా తమకు అందజేయాలని తెలంగాణ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
అంటే ఈ కేసు ఇప్పటికీ అనేక సార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి వస్తూ వస్తూ, ఇప్పుడు కనీసం ఆర్డర్ కాపీలు ఇవ్వండి మహానుభావా అని సర్వోన్నత ద్విసభ్య ధర్మాసనం చెప్పుకునే పరిస్థితి ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సహా మరికొందరు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారని మనందరికీ తెలుసు.
స్పీకర్ నిర్ణయమే ఫైనల్, కానీ పక్షపాతం లేకుండా సాధ్యమా?..
ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
రాజ్యాంగం స్పష్టంగానే ఉంది. కానీ ఎమ్మెల్యేలు నిజంగా ఫిరాయించారా లేదా అనే అంశం నిర్ణయించడానికి అధికారం స్పీకర్‌కే ఉంటుంది.
కానీ అది పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలో లేదు, ఉండదు. ఉండాలనే రాజ్యాంగ నీతి కన్నా రాజ్యాంగ అవినీతి నిర్ణయించే రోజుల్లో ఉన్నాం. కనుక వాదనలు ప్రతివాదనలు వినాలి.
దానికి సంవత్సరాల కాలహరణం తప్పదు. అందుకే స్పీకర్ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గీ, నిరంజన్ రెడ్డి అనేకానేక వాదనలన్నీ వినిపించారు. వారి బాధ్యత వారిది.
అనర్హత పిటిషన్ల అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలన్నింటినీ పాటించామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి స్పీకర్ సమగ్ర విచారణ నిర్వహించారని, అన్ని పిటిషన్లపైనా తుది తీర్పు వెలువరించారని తెలిపారు.
ఈ పిటిషన్లకు సంబంధించి ఇక విచారించడానికి ఏమీ లేదని వెల్లడించారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పత్రాలు ఇవ్వకుండా కాలయాపన..
స్పీకర్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ తీర్పు కాపీలు, విచారణ సమయంలో నమోదు చేసిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను తమకు ఇవ్వలేదని వివరించారు.
తాము మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సంబంధిత పత్రాలు ఇవ్వడం లేదని తెలిపారు. కనీస పత్రాలు కూడా లేకుండా తాము హైకోర్టుకు ఎలా వెళతామని, కావాలనే కాలయాపన చేస్తున్నారని విన్నవించారు. అసలు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ తీర్పులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, చట్టప్రకారం పిటిషనర్లకు ఇవ్వాల్సిన పత్రాలను ఎందుకు ఇవ్వడం లేదని స్పీకర్ కార్యాలయాన్ని ప్రశ్నించింది.
ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించింది. స్పీకర్ కార్యాలయం ఆయా పత్రాలను పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.
ఒక్కరోజులోగా ఆర్డర్ కాపీలను, నాలుగు రోజుల్లో వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లను తమకు అందజేయాలని స్పీకర్ కార్యాలయానికి స్పష్టం చేసింది.
దాంతోపాటు కోర్టు ధిక్కరణ, అనర్హత వేటు తదితర అంశాలకు సంబంధించిన నాలుగు పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
ఫిరాయించినా చర్యల్లేవు..!
ఇదివరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చిన స్పీకర్, మిగతా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఏ తప్పూ చేయలేదని అన్నారు.
అబద్ధమా కాదా, అబద్ధం చెప్పకూడదనే ప్రమాణం కూడా చేశామన్నా, రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తాం అనే బాధ్యత ప్రమాణం ఉందని తెలిసినా, అమాయకులైన ఓటర్లు, ప్రజలేమీ చేయలేరు. వారు ఇప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారంటూ, స్పీకర్ ఆ ఫిర్యాదులను కొట్టివేశారు.
పార్టీ ఫిరాయించిన పది మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా, లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం కూడా తీసుకున్నారు. అని స్పష్టంగా చెప్పినా పనికి రాకుండా పోయింది.
ఫ్యాక్ట్ అంటే నిజం అనుకుంటున్నారా?
ఫ్యాక్ట్ అంటే ఓ సంగతి మాత్రం, దాని అర్థం వాస్తవం అని కాదు. ఆ సంగతి అనే అంశాన్ని రుజువు చేయాలి.
చేయదలచుకుంటే సాధ్యమే కానీ వారి ఇష్టం వారికి ముఖ్యం. ఇప్పటికీ కేంద్ర ఎన్నికల వెబ్సైట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీచేసి, ఓడిపోయారని ఉన్నది.
కానీ, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మాత్రం సరైన ఆధారాలు దొరకలేదా? స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ వేదికలెక్కి ప్రసంగించారు.
ఏఐసీసీ, సీఎల్పీ సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. తన కూతురుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్‌సభ సీటు ఇప్పించుకొని, గెలిపించుకున్నారు.
ఇన్ని చేసినా ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు స్పీకర్‌కు నమ్మకం కుదరడం లేదా? అని ఆశ్చర్యపోతున్నారు. పోతారు.
ఏం చేద్దాం, సుప్రీంకోర్టుకే తప్పదు..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నిర్దోషులని స్పీకర్ ఆదేశాన్ని(తీర్పు అనాలో, ఆర్డర్ అనో అనుకోవచ్చు) న్యాయసమీక్ష కోరాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉన్నదని బీఆర్ఎస్ విమర్శలు కూడా మామూలే.
పదిమందిపై స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారణ జరిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడే ఉంటాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శిక్షపడాలని, వారి సభ్యత్వాలు రద్దయ్యేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. అంటే ఓటర్లకు ప్రతినిధులు ఏ పార్టీవారు ఎక్కడున్నారు అనే విషయాలు తేలలేదని అర్థమవుతుంది.
సర్టిఫైడ్ కాపీలు ఇవ్వని కార్యాలయం..
దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ పూర్తి చేశారు. అయితే, ఇప్పటికే విచారణ పూర్తయిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావుకు సంబంధించిన ఐదు కాపీలను మాత్రమే ఇప్పటివరకు స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి అందజేసింది.
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి విచారణ గత సంవత్సరం డిసెంబర్ 17న పూర్తయింది.
జనవరి 15న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనర్హత పిటిషన్లపై తన నిర్ణయాన్ని ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ వీరు సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు.
ఫిబ్రవరి నాలుగో తేదీన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను కొట్టివేస్తూ స్పీకర్ తీర్పు ఇచ్చారు.
అయితే, వీరికి సంబంధించిన స్పీకర్ జడ్జిమెంట్‌కు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను స్పీకర్ కార్యాలయం ఇంకా ఇవ్వలేదు.
జనవరిలో విచారణ ముగిసినవారికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీలను అధికారికంగా ఇచ్చేందుకు కూడా స్పీకర్ కార్యాలయం సిద్ధంగా లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
విచారణ పేరుతో కాలయాపన చేశారని, ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు నెలల తరబడి సమయం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించాల్సిందే. ఏది ఏమైనా పక్షపాతం అనే పక్షవాతం ఉంటే న్యాయం దొరకడం సాధ్యం కాదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
