1950 మార్చి 1న ‘క్రాస్‌రోడ్స్’ అనే ఒక వామపక్ష అనుకూల పత్రికను మద్రాస్ ప్రభుత్వం నిషేధించింది.
నెల రోజుల తర్వాత, 5:1 మెజారిటీతో సుప్రీంకోర్టు పూర్తి స్థాయి ధర్మాసనం ఆ ఉత్తర్వును రద్దు చేసింది.
ఈ చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది. అనుకూలంగా 246 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లతో సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.
రాజ్యాంగానికి జరిగిన మొట్టమొదటి సవరణతో తమిళనాడుకు గల సంబంధం గురించి దేశంలోని ఈ ప్రాంతానికి బాగా తెలుసు.
వెనుకబడిన తరగతులకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ పద్ధతిని కల్పించడానికి ఈ సవరణ ఎంతో సహాయపడింది.
అయితే సాధారణంగా భావప్రకటన స్వేచ్ఛ, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ దృక్పథంతో ముడిపడిన సవరణతో ఈ రాష్ట్రానికి గల మరో సంబంధం మీద ప్రజల దృష్టి అంతగా పడలేదు.
ఆర్టికల్ 19(1)ను ఉల్లంఘించిన మొదటి కేసు
రోమేశ్ థాపర్ వర్సెస్ మద్రాస్ రాష్ట్ర కేసునే ‘క్రాస్‌రోడ్స్’ కేసు అని కూడా అంటారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలోనే రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది.
ఈ తీర్పును వార్తా కథనంగా 1950 మే 27న ‘ది హిందూ’ పత్రిక ప్రచురించింది. “భావప్రకటన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛా హక్కును కల్పించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ను ఉల్లంఘించిన మొదటి కేసు ఇది” అని పేర్కొంది.
పత్రికపై నిషేధం
రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుతో నేరుగా సంబంధం ఉంది. ముంబై నుంచి ప్రచురించబడే ఆంగ్ల పత్రిక ‘క్రాస్‌రోడ్స్’ప్రవేశం, చలామణిపై మద్రాస్ ప్రభుత్వం నిషేధం విధించింది.
అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం(ఆనాడు బొంబాయి అని పిలిచేవారు), 1949 జూలైలో ప్రజా భద్రతా చర్యల చట్టంలోని 9వ నిబంధన కింద ఈ పత్రికను మూడు నెలల పాటు ప్రచురించరాదని నిర్ణయం తీసుకుంది. సంపాదకులు రోమేశ్ థాపర్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వు జారీ చేయడంతో ఈ పత్రికకు సమస్యలు మొదలయ్యాయి.
“ప్రజల భద్రత, ప్రజా శాంతి నిర్వహణ లేదా ఈ ప్రాంతంలో ప్రశాంతత పట్ల తన కార్యకలాపాల ద్వారా పక్షపాతం చూపిస్తుందని భావించి సంతృప్తి చెందినట్లయితే, అలాంటి వార్తా పత్రికను లేదా పత్రికను నిషేధించే అధికారం ప్రభుత్వానికి కల్పించబడింది” అని 1949 ఆగస్టు 19న ది హిందూ పత్రిక ఒక వార్తను ప్రచురించింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
ది హిందూ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
