ప్రాచీన సామ్రాజ్యాల మొదలు నేటి వరకు వ్యాపారం, ఏదో సాధించాలన్న తపన, అధికార దాహాలు- హింస, ప్రతీకారం, వ్యూహాత్మక రాజకీయాలకు కారణమవుతున్నాయి.
కొత్త సంవత్సరంలో కొత్త సిద్ధాంతం ముందుకు వచ్చింది. అదే డోన్రో సిద్ధాంతం.
ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే అన్ని రకాల వ్యూహాలను, అంచనాలను ఇద్దరు దేశాధినేతలు(మున్రో, ట్రంప్‌లు) తారుమారు చేశారు.
అంతర్జాతీయ ఆధిపత్య చదరంగంలో ఎవరు, ఏ ప్రయోజనాల కోసం, ఏ పావులు కదుపుతారన్నదే రాజకీయనుడికారంలో గేమ్ థియరీగా మారింది.
అంతర్జాతీయ సంబంధాలను పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి ఈ సిద్ధాంతాన్ని పరిశోధకులు, విశ్లేషకులు ప్రాతిపదికగా తీసుకుంటారు.
ఈ అంతర్జాతీయ ఆధిపత్య చదరంగం తరచూ హింసాత్మక మార్గాన్ని అనుసరించినా, స్థూలంగా నిర్ణీత అంగీకృత సూత్రాల ప్రాతిపదికనే నడుస్తూ ఉంటుంది.
గతంలో ముంబైలో జరగాల్సిన భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకోవటానికి వెర్రెత్తిన శివసైనికులు ఏకంగా క్రికెట్ పిచ్ పై ఆముదం నూనె పోసి, పిచ్ అంతా తవ్వేసినట్టుగానే యూరోపియన్ యూనియన్ దేశాలు లబోదిబోమని మొత్తుకుంటున్నా- అమెరికా మాత్రం వెనిజులా అధ్యక్షుడు నికలోస్ మదురోను అర్ధరాత్రి అపహరించుకుపోయింది.
గ్రీన్ ల్యాండ్‌ను ఆక్రమించుకుంటానని కాలు దువ్వుతోంది.
ఈ ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్ష భవనం జారీ చేసిన ప్రకటన అన్ని రకాల జాతీయ నిబంధనలు, అంతర్జాతీయ ఒప్పందాలు; సాంప్రదాయకంగా అమలు జరుగుతూ వచ్చిన నియమాలు, నిబంధనలకు చెల్లు చీటీ ఇచ్చింది.
ఈ ఘటన నాటో సైనిక కూటమి మనుగడకు మరణ శాసనంగా మారనున్నది.
ఈ పరిణామాలు అంతర్జాతీయ ఆధిపత్య చదరంగంలో నూతన వ్యూహాత్మక భావనలనూ, ప్రతిపాదనలనూ ముందుకు తెస్తున్నాయి.
ఈ తాజా భావనలు, ప్రతిపాదనల ప్రకారం- జాతీయ సార్వభౌమత్వం ఉల్లంఘన, విదేశీ శక్తులు జోక్యం వంటి పరిణామాలు జరిగితే గిరిగితే, అమెరికా ద్వారానే జరగాలి తప్ప మిగిలిన భూమండలంలో మరొక దేశం చేతిలో జరగటానికి అవకాశం లేదు.
ఈ రకమైన అహంకారపూరితమైన దుందుడుకుతనం ఎక్కడ మొదలైంది? దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ప్రాచీన సామ్రాజ్యాలకు ఎంత చరిత్ర ఉందో ఈ ప్రశ్నకు కూడా అంతే చరిత్ర ఉంది.
గ్రీక్ చరిత్రకారులందరికి పితామహుడు హెరోడోటస్.
యుద్ధంతో కకావికులైన పర్షియా, యూరప్, ఆసియా దేశాలలో పర్యటించి అక్కడున్న మేధావులతో చర్చలు జరిపిన తర్వాత చరిత్రకారునికి ఉండాల్సిన వాస్తవిక దృక్పథంతో కొన్ని అంశాలను ప్రస్తావిస్తారు.
ఈ ప్రాంతంలో శత్రుత్వాలు, సామ్రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వాలు పురాతన కాలం నాటి నుంచే ఉన్నాయని; అయితే ఎవరో ఒక మధ్యవర్తి నిప్పు రాజేస్తే అది కార్తిచ్చుగా మారి దేశాల హద్దులు దాటుకుంటూ ప్రయాణిస్తుందని పర్షియన్లు ప్రస్తావించారు.
అయితే ఈ మధ్యవర్తులు సాధారణంగా పర్షియా, గ్రీస్, ఈజిప్ట్ లేదా ఇతర తూర్పు ప్రాంత దేశాల నుంచి వచ్చిన అధికార దాహం కలిగిన వారు కాదు.
ఆయా దేశాలలో ఉన్న విలువైన వనరులు కొల్లగొట్టడానికి వచ్చిన వ్యాపారులు చేసే పనే ఇది.
తమ అభిప్రాయాలకు ఆధారంగా ఈ మేధావులు గ్రీస్, పర్షియా దేశాల మధ్య మొదలైన ఘర్షణలను ప్రస్తావిస్తూ పొనిషిన్ వ్యాపారస్తులు విలువైన రాళ్లపై(రంగు రాళ్ళు, వజ్రాలు) తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలతో పోల్చి వివరిస్తారు.
ఈ వ్యాపారస్తులు గ్రీస్‌లోని ఆర్గోస్ ఓడరేవు వద్ద ఒక మహిళను అపహరిస్తారు.
సహజంగానే పొనీసియన్ సామ్రాజ్యంలోని టైర్ నగరంపైకి గ్రీకులు దండెత్తుతారు.
కార్గోస్ ఓడరేవు వద్ద అపహరణకు గురైన మహిళకు బదులుగా టైర్ నగరానికి చెందిన రాజకుమారి యూరోపాను గ్రీకులు అపహరిస్తారు.
దీని కొనసాగింపుగా అనేక యుద్ధాలు జరుగుతాయి. అంతిమంగా యుద్ధాలు హోమర్ ఇతిహాసంగా మార్చిన యుద్ధంతో ముగుస్తాయి.
యుద్ధంలో ట్రాయ్ నగరాన్ని స్వాధీనం చేసుకొని రాజుగారి భార్య హెలెన్‌ను బంధించి తీసుకువెళ్తారు.
మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరిస్ను అర్ధరాత్రి అమెరికా అపహరించుకుపోవడం; వెంటనే ట్రంప్ అనుకూల చమురు పరిశ్రమాధిపతులు ఉత్సవాలు చేసుకోవడం గమనిస్తే, ప్రముఖ ఆంగ్ల కవి యీట్స్ చెప్పినట్టు ఉత్తర దిక్కున మసకబారుతున్న దెయ్యానికి పునర్జన్మ వచ్చినట్లు అయింది.
పర్షియన్లు చెప్పిన విషయాన్ని యథాతథంగా ప్రస్తావిస్తూ హెరోడొటస్ మహిళను అపహరించటం నేరపూరిత చర్యని పర్షియన్లు భావిస్తున్నప్పటికీ, ఆ సాకుతో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధపడటం చిలిపితనం అవుతుంది. అపహరణకు ఉద్దేశ్య పూర్వకంగానే సహకరించిన మహిళలను కాపాడటం కోసం ప్రతీకార చర్యలకు పాల్పడటం ఎందుకు? వారి మాటల్లోనే అపహరణకు గురైన గ్రీకు యువరాణి ఇయో పొనిషియాకు చెందిన ఒక ఓడ కెప్టెన్‌తో కలిసి జీవిస్తూ, తాను తల్లి కాబోతున్నానని తెలుసుకున్న తర్వాత తన తల్లిదండ్రులకు ముఖం చూపించలేక అపహరణకు సహకరించిందనే వాదన కూడా ఉంది.
“వినోద భరిత అంశం: వెనిజులలో తల్లులు కాబోతున్న వయసులో ఉన్న మహిళలు 60 లక్షల మంది. వాళ్లందరికీ డబ్బు కావాలి. గర్భదానం కార్యక్రమానికి వీరందరినీ ఒప్పిస్తే ఉన్న పళంగా 40 లక్షల మంది అమెరికన్లకు జన్మనివ్వవచ్చు. దక్షిణార్థ గోళంలోని దేశంలో పేదరికంతో పోరాడవచ్చు”అని వెనిజులా ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరురాలును అమెరికా అపహరించిన తర్వాత ఎక్స్‌లో ఒక ఖాతాదారు ట్వీట్ చేశాడు.
జనవరి 9 నాటికి ఈ పోస్టును దాదాపుగా కోటి మంది చూశారు; 36,000 మంది మెచ్చుకున్నారు.
ఈ పోస్టు పెట్టిన వ్యక్తి మరొక పోస్ట్ పెడుతూ, “ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు నా పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఎక్కువ వ్యాఖ్యలు స్పానిష్ భాషలో ఉన్నాయి. అవి నాకు అర్థం కాకపోయినా సానుకూలంగానే ఉన్నాయని అనుకుంటున్నాను”అంటూ జనరల్ పోస్ట్ పెట్టాడు.
“కంటికి కన్ను పంటికి పన్ను”లాంటి ప్రతీకార వాంఛలు చారిత్రకంగా ఎప్పటికప్పుడు తమ చర్యలు సరైనవేనని, తమను తాము ఎలా సమర్థించుకుంటాయో హెరోడొటస్ ముందుగానే హెచ్చరించి ఉన్నాడు.
ఫ్లూ వైరస్లాగా హింస కూడా నిరంతరం సజీవంగానే ఉండాలి. శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉండాలి.
చరిత్రలో ఒకానొక సందర్భంలో ఈ హింసలు చెలరేగుతాయి.
యువరాణి అపహరణ తర్వాతనో లేక నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత నో సామ్రాజ్యవాద శిఖరాలు కుప్ప కూలుతాయి.
ఈ కాలంలో అన్ని దేశాలలోనూ ఉత్పాదక సామర్థ్యం ఎగుమతులు పడిపోతున్నాయి. ఎన్నికలు తరుముతున్నాయి.
దీంతో చరిత్ర చీకటి గదిలో బంధించిన “కంటికి కన్ను పంటికి పన్ను” సిద్ధాంతానికి సంకెళ్లు విప్పారు.
ఊహాజనిత ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకోవడమనే ఓ జాతీయ కర్తవ్య ముసుగును వేశారు.
ఈ మధ్యనే బంగ్లాదేశ్‌లో ఒక హిందువును చంపేశారు.
ఈ నేపథ్యంలో ఏఎన్ఐ వార్తా సంస్థతో విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ, “ఇది ప్రపంచానికే విసిరిన సవాలు. మన ప్రజాస్వామ్యం, మన విలువలు, మత విశ్వాసాల స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ..” అంటూ చెప్పుకొచ్చారు.
అపహరణకు గురైన ఎవరైనా తిరిగి వచ్చినా పరిషియన్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
అదేవిధంగా, 19 ఏళ్ల యువతి అంకిత బండారిపై జరిగిన అమానుష హత్యాచారం గురించి ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ అధ్యక్షుడు తన కన్నీరు వృధా చేయదలచుకోలేదు.
ఈ అకృత్యానికి పాల్పడింది సొంత పార్టీకి చెందిన నేతనే వాదన కూడా ఉన్నది.
ఈ దేశపు దేవ భూమిలో మహిళలకు కరువైన రక్షణ గురించి ఆయన పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు.
కానీ బంగ్లాదేశ్‌లో ఒక హిందువు చనిపోవడంతో ఏకంగా అంతర్జాతీయ విలువలైన ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారు.
“జాతి గౌరవాన్ని నిలబెట్టాలంటే ఇంతకంటే ఏం చేయాలి?”అనే ప్రశ్న వేయటం ద్వారా కక్ష సాధింపు రాజకీయాలను సమర్థించుకోవచ్చు. శత్రు స్వభావంతో ఉన్న పొరుగువారని ఆ పార్టీ చేస్తున్న భావన ఎల్లెడల మతోన్మాద బీజాలను విస్తరింపజేయడం లేదా? మహిళలకు భద్రమైన, మంచి ఆదాయం కలిగిన ఉపాధి చూపించడానికి బదులుగా వారిని పథకాలు, ప్రలోభాలతో లోబరుచుకోవచ్చా? బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి దేశంలోకి చొరబడిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ముసుగులో ఉత్తరప్రదేశ్‌లో కోట్ల మంది ఓటర్లను తొలగిస్తున్నారు. అందులో అత్యధికులు మహిళలు కాదా?
మతం పట్ల నమ్మకం లేని వారి నాయకత్వంలో ఒక దేశంలోని మెజారిటీ మతస్తులు ఎలా ఆత్మన్యూనతకు లోనవుతారో తెలుసుకోవాలంటే భారత ఉపఖండం సరైన ఉదాహరణగా ఉంటుంది. ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడే అన్ని రకాల గుంపులు మూకదాడలకు పాల్పడటాన్ని సమర్ధించుకుంటూ ఉంటాయి. ఈ క్రమం కొనసాగే కొద్ది అధికార వ్యవస్థ నేరగ్రస్తమవుతుంది. అవినీతి ఆకాశాన్ని అంటుతుంది. వీటన్నిటిని మీడియా ప్రజల దృష్టికి తేవాలంటే కొన్ని సాహసోపేత చర్యలకు సిద్ధపడాలి. కొంత వ్యాపారాన్ని వదులుకునేందుకు కూడా సిద్ధపడాలి.
జీడీపీ వృద్ధిరేట్లు చూపిస్తూ భవిష్యత్తు కూడా ఫలప్రదంగా ఉంటుందని చెప్పటం ప్రజలకు పెద్దగా నమ్మకాన్ని కలిగించడం లేదు. సత్యాన్ని చెప్పాలి. అధిక అభివృద్ధి గురించిన ఇటువంటి భవిష్యవాదనలు అమెరికాలోనే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ లేదా పునరుద్ధరణ పేరుతో అమెరికా ఏ దేశంలో కావాలనుకుంటే ఆ దేశంలో ప్రభుత్వాలను మార్చేస్తోంది. ఆట తమకు అనుకూలంగా లేనప్పుడు చెస్ బోర్డును తిప్పేసి పావులను విసిరేయడానికి సిద్ధపడుతుంది.
వెనిజులా తర్వాత తన దృష్టిని క్యూబా, గ్రీన్లాండ్లపై అమెరికా కేంద్రీకరిస్తుంది. దాదాపుగా వందేళ్ళ నుంచి కళ్ళ ముందు కదులుతున్న పావుల ఆధారంగా అర్థం చేసుకుంటున్న ఈ క్రీడలో తదుపరి ఏమి జరగబోతోందన్నది అర్థం చేసుకోవడం ఎవరి తరం కావడం లేదు.
కృత్రిమ మేధ అన్ని రంగాలను కమ్ముకోవడంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు, అభివృద్ధికి ఉన్న మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. సహజమేధకు అవకాశం లేకపోతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యంత కిరాతకంగా, దూకుడుగా తన ఆటవిక స్వభావాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఒక సరుకు నగిషీలు దిద్ది జనం ముందుకు తేవటంలో దిట్టలయిన అడ్వర్టైజ్మెంట్ వృత్తి నిపుణులకు కూడా ఆటవిక కర్కశత్వంతో నగ్నంగా నిలబడున్న పెట్టుబడిదారి విధానానికి ప్రజలు మెచ్చేలా నగిషీలు గిద్దటం పెద్ద సవాల్.
ఏమి చేయాలి? ప్రాచీన భారతీయ సంస్కృతికి తిరిగి వెళ్లాలా? అది కూడా కులీనవర్గపు సంస్కృతి. మహా అయితే రైతాంగ సంస్కృతి మాత్రమే. కానీ ఇప్పుడు అటువంటి రైతాంగం, కులీన వర్గం దేశంలో మిగలలేదు. మధ్యతరగతి గణనీయంగా ఉంది. ఇప్పుడు అది కూడా క్షీణిస్తోంది. వీసా దొరికితే పరాయి దేశం పారిపోదామని ఎదురుచూస్తోంది.
ప్రామాణికంగా చలామణి అవుతున్న ఫేక్ చారిత్రక సంవాదానికి, పవిత్రత గురించి జరుగుతున్న ప్రచారాలకు, పర్యాటకరంగాన్నే పొట్ట నింపుకునే మార్గంగా, అదే అభివృద్ధికి సోపానంగా జరుగుతున్న ప్రచారాలకు విరుగుడు ఒక్కటే- విద్యను విస్తృత ప్రాతిపదికన సకలజనులకు అందుబాటులోకి తేవటం. ఆ విద్య కూడా స్త్రీలు, పురుషులు, రాజ్యం, న్యాయం, నమ్మకం గురించి సమర్థవంతంగా పునరాలోచన చేసేందుకు సహాయపడేదిగా ఉండాలి.
వ్యాస రచయిత మృణాల్ పాండే సంపాదకులు, రచయిత, సీనియర్ జర్నలిస్టు. ప్రసార భారతి చైర్మన్‌గా పనిచేశారు.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
