ఐక్యరాజ్య సమితి తన ఎనభైయవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో, ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలో వెనకపట్టు పడుతుండడం, ఆర్ధిక కుదింపుల నియంత్రణలో విఫలమవుతుండడం చూస్తున్నాము. మరోవైపు వ్యవస్థ నిర్వీర్యమవుతుండడం గమనిస్తున్నాము. అయినా వీటన్నిటిని తట్టుకుని నిలబడింది.
ఐక్యరాజ్య సమితి ఏర్పడి కిందటి వారానికి ఎనభై ఏళ్ళు నిండాయి. మారుతోన్న పరిస్థితులను, పెరుగుతోన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలంటే, సమకాలీన పరిస్థితులలో తన ప్రాసంగికత నిలుపుకోవాలంటే, వెనువెంటనే తగిన సంస్కరణలు చేపట్టవలసిన అవసరమెంతయినా ఉంది. కార్యదర్శి ఆంటోని గుటెరస్ ‘ప్రపంచదేశాలు గందరగోళంలో ఉండడం కంటే సహకరించుకోవడం, ఏ కట్టుబాట్లు లేకుండా ఉండడం కంటే చట్టబద్ధంగా ఉండడం, నిరంతరంగా ఘర్షణలు పడడం కంటే శాంతియుతంగా ఉండడం ఉత్తమమైన మార్గంగా ఎంచుకోవడం వలన ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి కారణం’గా వర్ణించారు. అయితే సభ్య దేశాలు ఈ ఆలోచనకు ఎటువంటి ప్రాధాన్యతా ఇచ్చినట్టు కనిపించలేదు.
నమ్మకమే సంక్షోభంలో..
గత నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశ్యిస్తూ చేసిన ప్రసంగంలో ఐక్యరాజ్య సమితిపై ఎదురుదాడి చేశారు. సమితి అనేక రంగాలలో తీవ్రంగా విఫలమైయిందని ఆరోపించారు. ఉదాహరణకు మధ్య ప్రాచ్యంలో, ఉక్రెయిన్లో అనేక ఇతర ప్రాంతాలలో ఘర్షణలు నివారించడంలో విఫలమయిందని చెప్పారు. నిర్లక్ష్యంగా కాకపోయినా, ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన నాటి నుంచి నిరంతరంగా, ఇరవైయ్యో శతాబ్దంలో ప్రపంచదేశాల మధ్య రక్షణ కోసం ఆర్ధిక, సామాజిక అంశాలలో, వివిధ దేశాల మధ్య సహకారం కోసం, అమెరికా ప్రేరణతోనే ఏర్పడిన బహుళార్ధక సంస్థలను, సూత్రీకరణలను, ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్టమైన, పరస్పర ఆధారిత సంబంధాలను అంతం చేస్తానని బెదిరిస్తూనే ఉన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిస్కో, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి నుంచి అమెరికా వైదొలగింది. పర్యావరణ కాలుష్య నివారణ ఒప్పందం- 2015 నుంచి కూడా బయటికి వచ్చేసింది. చట్టబద్ధంగా అమెరికా అందించాల్సిన ఆర్ధిక వనరులకు కూడా తన పరిపాలన విభాగం తీవ్రంగా కోతలు విధించింది. అందువలన ఐక్యరాజ్య సమితి మానవత్వంతో అందించాల్సిన సహకారం అందించడానికి కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ప్రపంచ శాంతి నెలకొల్పడానికి చెల్లించవలసిన మొత్తంలో కూడా సగమే చెల్లిస్తానని అమెరికా ప్రకటించింది. ఒక బిలియన్ డాలర్లు చెల్లించవలసి ఉండగా 680 మిలియన్ డాలర్లతో సరిపెట్టింది.
ఐక్యరాజ్య సమితి పనివిధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన దేశం ఒక్క అమెరికా మాత్రమే కాదు. ఇజ్రాయిల్ కూడా. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి మీదా, అందులో పనిచేస్తున్న ఉన్నత అధికారుల మీద విషం చిమ్మే ఏ అవకాశాన్ని ఈ రెండు దేశాలు వదులుకోలేదు. ప్రధానంగా 2023 అక్టోబర్లో హమాస్ తీవ్రవాద చర్యలకు ప్రతిచర్యగా; తను గాజాలో సైనిక చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన నాటి నుంచి ఐక్యరాజ్య సమితి తీసుకున్న చర్యలను ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నేతన్యాహూ తీవ్రంగా దుయ్యబట్టారు. శాంతి నెలకొల్పే విభాగాన్ని, సహాయం అందించే సిబ్బందిని సైనిక, దౌత్యోపరమైన ప్రచారాలలో నిర్లజ్జగా లక్ష్యం చేసుకుని నిందించారు. ఐక్యరాజ్య సమితిలో ప్రాథమిక సభ్యత్వం తమ దేశం కలిగి ఉన్నప్పటికీ, ఉక్రెయిన్లో మూడో వంతు ఆక్రమించుకోవలసిరావడానికి దారి తీసిన పరిస్థితులను, ఐక్యరాజ్యసమితి ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని రష్యన్ ఫెడరేషన్ ఆరోపించింది.
మరోవైపు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్, 1945నాటి కాలం చెల్లిన భౌగోలిక రాజకీయ చిత్రాలనే పట్టుకుని ఐక్యరాజ్య సమితి వెళాడుతున్నదని, సెక్యూరిటీ కౌన్సిల్లోని 21వ శతాబ్దపు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని నొక్కి వక్కాణించారు. ఆయన మాట్లాడిన దానిలో తప్పు కూడా ఏమీ లేదు. ప్రపంచంలో శాంతి నెలకొల్పే ప్రధానమైన బాధ్యత గల సమితి వీటో శక్తి ఉండి, శాశ్వత సభ్యత్వంగల, తమ మధ్య ఏ మాత్రం అంగీకారంలేని రెండు విరుద్ధ ధ్రువాల మధ్య నలిగిపోతున్నది- ఒకవైపు రష్యన్ ఫెడరేషన్, రెండో వైపు అమెరికా. దీని ఫలితంగా సమితి సత్వర చర్యలేవీ తీసుకోలేకపోతున్నది. 2011లో 5%గా ఉన్న వైరుధ్యం 2022కి 33%నికి ఎగబాకింది. సర్వ సభ్య సమావేశంలో వీటో అధికారం లేకపోవడం వలన ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ సూత్రాల ప్రకారం నిర్ణయాలయితే తీసుకోవడం సాధ్యపడుతున్నది. కానీ వాస్తవంలో వాటి అమలు సాధ్య పడడం లేదు.
నీరుగారిపోతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రపంచ శాంతి స్థాపన..
శాంతి స్థాపనకు ఐక్యరాజ్య సమితి పెట్టింది పేరు. ప్రపంచదేశాల రక్షణ ఐక్యరాజ్యసమితి ప్రధాన కర్తవ్యం. కానీ దాని నిర్వహణ నానాటికీ దిగజారడం ఆందోళకలిగించే అంశం. ఈ మధ్యకాలంలో ఆఫ్రికాలో చేపట్టిన రెండు కార్యక్రమాలు విఫలమవడం అవమానకరం. మాలిలో తీవ్రవాదుల ఆధీనం నుంచి విడిపించే అంతర్యుద్ధం 2023లో విరమించాల్సి వచ్చింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అక్కడి ప్రభుత్వం కార్యాచరణని విరమించమని కోరింది. ఫలితంగా దశలవారీ విరమించుకుంది.
ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపనలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడంతో ప్రపంచదేశాలు అసంతృప్తితో ఉన్నాయి. నిజానికి శాంతి స్థాపక సిబ్బంది సంఖ్య 40% దిగజారింది; 2016లో 107000మంది ఉండగా; 2025లో కేవలం 61000మంది మాత్రమే ఉన్నారు. వ్యవస్థ నిర్మాణ సామర్థ్యం పేరుమీద అదనుకాని సమయంలో సిబ్బందిని కుదించారు.
2026కి మరో 35% సిబ్బందికి కోత పడుతుందనే విషయం మరింత ఆందోళన కలిగిస్తున్నది. దీనికి ప్రధానమైన కారణం ఆర్ధిక చెల్లింపులు కట్టడి చేయడం, సైనిక సరఫరాను సుదీర్ఘకాలం జాప్యం చేయడం.
దీనర్ధం ఐక్యరాజ్య సమితి పని విధానంలో, పనిలో లోపాలు లేవని కాదు. పనిలో క్రమబద్ధత లేకపోవడం, విపరీతమైన వనరుల వృధా అవుతున్న మాట వాస్తవం. దానికి తోడు అవినీతి, లంచగొండితనం ఉండనే ఉన్నాయి . ఈ మద్యే వెలువడిన నివేదికలో కేవలం 2024లో ఐక్యరాజ్య సమితి 27000 సమావేశాలు నిర్వహించిందని, వాటిలో 11000 నివేదికలు తయారు చేసిందని వెల్లడించింది- అందులో ప్రతి ఐదు సమావేశాలలో మూడింట చర్చించిన విషయాలే తిరిగి చర్చించింది.
తప్పని పరిస్థితుల్లో ఊహించగల సంస్కరణలు..
విమర్శకులను, నిరాశావాదులను సంతృప్తిపరచడానికి ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారులు ఏవో కొన్ని తాత్కాలిక చర్యలు చేపడుతూ ఉంటారు. అవికూడా కోత పడిన బడ్జెట్లో ఒదిగేవి, పరిపాలనా విధానాల్లో ఇమిడేవి. ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి 2026కి గాను 15.1% బడ్జెట్లో కోత పెట్టక తప్పలేదు. అంటే 2025 కంటే దాదాపు 3.2 బిలియన్ల అమెరికా డాలర్లు. శాంతి సైనిక నిర్వహణలో 25%కోత పడింది. దీనికి కొనసాగింపుగా ట్రంప్ పాలన 2025లో ఆశించిన దానిలో సగం మాత్రమే శాంతి నిర్వహణకు తమవంతుగా చెల్లిస్తామని ప్రకటించింది.
ఈ కోతల ఫలితంగా 2681మంది సిబ్బందిని తొలగించవలసి వస్తుంది. అంటే 18.8%. దురదృష్టవశాత్తు ఈ కోతల వలన అనేక కార్యక్రమాలు గతి తప్పుతాయి. ప్రధానంగా మానవత్వంతో కూడిన బహుళార్ధక సంస్థల నిర్వహణలో. ఉదాహరణకి ప్రపంచ ఆహార కార్యక్రమంలో 40% నిధుల కొరత ఏర్పడుతుంది.(2024లో 10 బిలియన్ అమెరికా డాలర్ల నుంచి 2025లో 6.4 బిలియన్ డాలర్లకు కుదించబడుతుంది) సహజంగానే 2015లో ప్రతిపాదించిన సమగ్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆందోళన చెందుతున్నాయి. నిజానికి ఐక్యరాజ్య సమితి వనరులలో మూడొంతులు ఆఫ్రికా దేశాల వంటి బాధిత దేశాలకు తాత్కాలిక, దీర్ఘకాల సహాయాన్ని అందించడానికి వినియోగిస్తుంది.
ఐక్యరాజ్య సమితి తన యాజమాన్య నిర్వహణ మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని, కొన్ని విభాగాలను, కమిటీలను విలీనం చేయాలని, మెరుగుపరుచాలని, చర్చించవలసిన అంశాలను హేతుబద్దీకరించాలని లేదా ప్రసంగాల సమయానికి పరిమితులు విధించాలని, నివేదికల నిడివి తగ్గించాలని చేసే విమర్శలకు ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు స్పందించారు. అంతేకాదు, ప్రధానమైన సంస్థలను పునర్వ్యవస్తీకరించాలనే ప్రతిపాదన కూడా విమర్శకులు చేశారు. అయితే ఏ ప్రతిపాదనా అమలుకు నోచుకోలేదు.
1965 తరువాత చేసిన మార్పు సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వతసభ్యుల సంఖ్యను 6 నుంచి 10కి పెంచడం; సమితి విభాగాల్లో 2006లో మానవ హక్కుల విభాగాన్ని అదనంగా చేర్చడం. అందులో సరికొత్త అంశం, ఆటోమాటిక్ శాశ్వత సభ్యత్వం అంటూ లేకుండా చేయడం. సంస్థలో ఎన్నిక కాబడాలంటే మానవ హక్కులకు అనుగుణంగా శపథం తీసుకోవలసి రావడం; వరుసగా రెండుసార్లు మాత్రమే సభ్యులు ఎన్నిక కాగల అవకాశం ఉండటం; ఎన్నిక అయినప్పటికీ మానవ హక్కులు ఉల్లంఘించిన దేశాల సభ్యత్వం రద్దు చేయగలగడం. ఈ విధానాలు ఇతర విభాగాలలో కూడా అమలవుతాయని ఆశించినప్పటికీ, అసలు మానవ హక్కుల సంఘం మనుగడే ప్రశ్నర్ధకంగా మారడం నిరాశ కలిగించింది.
తాజా ఆలోచనలు, చొరవ నేటి ఆవశ్యకత..
వాషింగ్టన్లో నియమాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగడం వేగవంతమవడం ఐక్యరాజ్య సమితి భవిష్యత్తుకు మంచిది కాదు. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన ఆశయాలకు విరుద్ధంగా, దాని ప్రత్యేకత నిలుపుకునే పరిస్థితి లేక, ఏనాడూ ఏ నిర్ణయం తీసుకోవలసి వస్తుందో తెలియని అగమ్యగోచర పరిస్థితులలో కొనసాగవలసి వస్తే, ఐక్యరాజ్య సమితి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. ప్రత్యేకంగా కొన్ని దేశాలకే పరిమితమైన ఐక్యరాజ్యసమితి సభ్యత్వం 1960 సభ్యత్వాన్ని సార్వజనీనం చేయడం ద్వారా, తన స్వరూపాన్ని మార్చుకున్న మాట వాస్తవమే. అది జరిగింది వలసదేశాలు అంతరిస్తున్న నేపథ్యంలో. ఇది యుద్ధానంతర కాలంలో రాజ్యాల బదలాయింపు శాంతియుతంగా జరగడానికి వీలు కల్పించింది.
దురదృష్ట వశాత్తు, ఇదివరకటి శత్రుదేశాలయిన జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు ఐక్యరాజ్యసమితిలో భాగస్వాములవడమే కాక అందులో మరింత బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నాయి. ఒకప్పుడు, అంటే ఐక్యరాజ్యసమితిలో తనకు తగిన స్థానం దక్కక ముందు, కమ్యూనిస్టు చైనా ఐక్యరాజ్యసమితి తీవ్ర విమర్శకురాలు; కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నాయకత్వంలోని బహుళార్ధ విధానాలకు గట్టి మద్దతుదారు. ఐక్యరాజ్యసమితికి ఎప్పుడూ “స్పష్టమైన గట్టి మద్దతుదారుగా “ఉన్నట్టు భారతదేశం మాత్రం పేరుతెచ్చుకుంది. అయినప్పటికీ ఇప్పుడు మన ముందున్న సవాలు- అందరి సహకారంతో, నవీన సంస్థగా లేదా కొత్త రూపంలోకి మార్చిన సంస్థగా దీనిని తీర్చిదిద్దడం ఎలా అన్నదే- రాజ్యాలకు తమ పరిధిలో పూర్తి స్వేచ్ఛ ఉండడం, ఇతర రాజ్యాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం.
పారదర్శకతలేని, జవాబుదారీతనంలేని 19వ శతాబ్దపు ఆధిపత్యయుగం మళ్ళి తిరిగిరాకూడదు. అమెరికా- రష్యా, లేదా అమెరికా- చైనాల ద్వంద రాజ్యం ఏర్పడడం అంటే మళ్ళి మంచి దేశాలను వలస రాజ్యాలుగా పంచుకోవడమే. అది ఐక్యరాజ్యసమితిని ఒక కాంతివిహీన నీడగా మార్చివేస్తుంది. అటువంటి ఒక పసలేని సంస్థలో ఎవరుమాత్రం సభ్యులుగా ఎందుకు ఉంటారు? ఇందుకు భిన్నమైన మార్గం, మంచి ఊహతో, ప్రత్యామ్న్యాయ రూపంలో సంస్థను తీర్చిదిద్దగల నాయకత్వం రావాలి. దీనికి సంబంధించినదే మరో ప్రశ్నేంటంటే చైనా, యూరప్ లేదా భారత దేశం వంటి దేశాలు రాజకీయ, మేధోపర సవాలుతో కూడుకున్న కార్యక్రమాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయా?
ప్రస్తుతం అమెరికా, రష్యా , చైనా, భారతదేశమైనా అటువంటి రాజకీయ ప్రధాన్యత గల, నాయకత్వ పాత్ర పోషించగల గౌరవప్రద స్థితిలో లేవు. అంతర్జాతీయ జవాబుదారీతనం, చట్టబద్ధత వంటి అభ్యుదయ సూత్రాలపై ఆధారపడినప్పుడు మాత్రమే ఒక మెరుగైన ప్రపంచ సంస్థను నిర్మించగలము. అంటే దానర్ధం భారతదేశం ఆలోచించడం మానేసి అటువంటి వ్యవస్థ నిర్మించడానికి పూనుకోనవసరం లేదని, దేశ విదేశీ భాగస్వాములతో, ప్రధానంగా ప్రపంచ దక్షిణ దేశాలతో చర్చలు నడపకూడదని కాదు.
అయితే, ఎన్ని లోపాలున్నా, ఎంత అసమర్ధత కలిగి ఉన్నా, సుదీర్ఘమైన అనుభవం గల, సాధారణ ప్రయోజనాలు చేకూర్చగల ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల సభ్యత్వాలను రద్దు చేయడం అంత సులభమైన విషయం కాదనే అభిప్రాయం కూడా విమర్శకులలో ఉంది. 70% అంతర్జాతీయ సంస్థలు తమ అస్తిత్వం కోల్పోవని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అగ్రరాజ్యాల నుంచి, ప్రధానంగా అమెరికా నుంచి ఎదురయ్యే ఆటుపోట్లను ఓర్పుతో ఎదుర్కోనే అనుభవం ఐక్యరాజ్యసమితికి కూడా ఉంది.
అనువాదం: ఉషా రాణి
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
