ఈ ప్రపంచంలో దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేకంగా పాత్రికేయవృత్తి గురించి చెప్పుకుంటే, పేపర్‌బాయ్‌గా పత్రికలను పంచడం కంటే పత్రికలో రాయడం గొప్ప. పత్రికలో ఒక రిపోర్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఎడిటర్ కావడం చాలా అరుదు. ఇటువంటి పాత్రికేయవృత్తిలో ఒక్కోమెట్టు ఎదిగి; పాత్రికేయ ప్రపంచంలో తనదైన ముద్రను వేసిన కష్టజీవి, కృషీవలుడు సీనియర్ జర్నలిస్టు ఎస్ వినయ్ కుమార్.
రాజుల కొడుకులు రాజులైనట్టు, నాయకుల కొడుకులు నాయకులైనట్టు, తాతల- తండ్రుల పేర్లు చెప్పుకొని వంశానికి వంశం మొత్తం సెలబ్రటరీలవుతూ ఉండడం ఏ దేశంలో మొదలైందో తెలియదు కానీ, మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యయుత స్వాతంత్య్రదేశంలో ఇటువంటి వాటికి చోటులేదు, ఉండకూడదు. కానీ బాధకారమైన విషయమేంటంటే ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, చాలా మంది తమ స్వయంకృషితో ప్రముఖులుగా ఎదిగినవారూ ఉన్నారు. వారిలో రచయిత, జర్నలిస్టు సదుర్ల వినయ్ కుమార్ కూడా ఒకరని చెప్పుకోవాలి.
తన జీవనపోరాట పుస్తకప్రతికి “పేపర్ బాయ్ టు ఎడిటర్” అని ఎస్ వినయ్ కుమార్ పేరు పెట్టారు. వంశానుగతమైన వారసత్వానికి సంబంధించిన వారు కాదు ఎస్ వినయ్ కుమార్; సామాన్యుడు. ఇప్పుడు మాన్యుడు. అసామాన్యుడు. తన బతుకు తను బతుకుతూ, ఒక చేయి తిరిగిన, పేరున్న రచయిత. పత్రికా రచయిత కావాలంటే స్వయంకృషి, నిరంతరకృషి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా నిరంతరకృషితో వినయ్ పాత్రికేయరంగంలో ఎదిగారు.
ఎడిటర్ వరకు ప్రయాణం..
ఎస్ వినయ్ కుమార్ తన ఆత్మకథకు “పేపర్ బాయ్ టు ఎడిటర్” అనే పేరు పెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే, యాదృచ్ఛికంగా మా నాన్న ఎంఎస్ ఆచార్య జీవితం గురించి నేను రాసిన పుస్తకానికి ‘న్యూస్ పేపర్ బాయ్ నుంచి దినపత్రిక ఎడిటర్ దాకా ఎంఎస్ ఆచార్య’ అని పేరు పెట్టాను. ఈ పుస్తకాన్ని ఏడు నెలల క్రితం ప్రముఖ ప్రచురణకర్త ఎమెస్కో 2025 మార్చిలో ప్రచురించింది. ఆచార్య శత జయంతి సందర్భంగా దీనిని విడుదల చేసి, ఆవిష్కరించాలని ఎదురుచూస్తున్నాను.
1980లో వరంగల్ వాణి పత్రిక ఎడిటర్‌గా ఎంఎస్ ఆచార్య తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పత్రికకు నన్ను ఎడిటర్‌గా ప్రకటిస్తానన్నారు. “మీరు ఎడిటర్‌గా ఉన్నపుడు నేను ఎడిటర్‌గా ఉండన”ని చెప్పాను. నేను, జర్నలిస్టు మహానుభావుడైన ఆచార్య కొడుకుని మాత్రమే. ఇప్పడికీ నేను ఎడిటర్ని కాదు, కాలేను.
సాదా సీదా జీవనం..
తన తండ్రి ఎడిటర్ కానప్పటికీ ఎస్ వినయ్ కుమార్ స్వయంగా స్వయంకృషితో ఎడిటర్‌గా ఎదిగారు. ఆత్మకథలో తన జీవితం గురించి సాదాసీదాగా రాసుకున్నారు. ఇందులో ఎక్కడా అతిశయోక్తులు కనపడవు. లోతుగా చదివితే పూర్తిగా వినయ్ ఎవరో తెలుస్తుంది. తన నాన్న(సదుర్ల గోపాల్) వారంవారం ఇచ్చే అయిదురూపాయలతో హాస్టల్ లైఫ్‌లో ఖర్చులకు, పుస్తకాల కోసం వినయ్ ఏ విధంగా వాడారో పిల్లలు తెలుసుకుంటే పొదుపు గురించి తెలుస్తుంది. ఎలా చదువుకోవాలి, పనులు ఎలా చేసుకోవాలి, ఏ విధంగా జీవించాలో బోధపడుతుంది.
పుస్తకంలో పొందుపరచబడ్డ జ్ఞాపకాలు..
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఇళ్లలో పెద్దలు తాతలు మార్గదర్శిగా ఉండేవారు. ఈ పుస్తకంలో వినయ్ ‘మా తాత’ అన్న సంబోధనలోనే ఆయనపై ఉన్న ప్రేమ స్పష్టమవుతుంది. తనకు మార్గదర్శిగా నిలబడిన తమ తాతతో ముడిపడిన జీవితంలోని అనేక అంశాలను వినయ్ తన పుస్తకంలో వివరించారు.
ఫ్యాను తాడును లాగుతూ గాలికోసం ఆయన ప్రయత్నించడం, చేపల వేట, అప్పటి కుల పట్టింపులు. క్షురక పనితో పాటు, వైద్యం, సంగీతం ఆయనకు తెలుసని, మంచి హస్తవాసిఅనీ, సన్నాయి మేళాల గౌరవాన్ని పొందేవారనీ చాలా విషయాలను తెలియజేశారు. అంతేకాక, తమ నాన్నకు ముస్లిం మిత్రులు ఉండేవారని, వారితో విందులు- వినోద జ్ఞాపకాలు మరవలేనివిగా చెప్పుకొచ్చారు. రంజాన్ నాడు ఉస్మాన్ బాబాయితో జరిగిన సంఘటనల ద్వారా వారి కుటుంబాలు ఒకే కుటుంబంలా ఎలా ఉండేవో చెప్పారు.
తన పుస్తకంలో కుల వివక్ష గురించి కూడా వినయ్ ప్రస్తావించారు. గోపాల్ గారు బ్రహ్మసమాజం సిద్ధాంతాలు చదివి విగ్రహారాధనను వ్యతిరేకించారు. అయితే, ఆ తరువాత వారు మళ్లీ విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు.
వారి ఆదర్శ జీవనం, అలాగే సంగీత దర్శకుడు నౌషాద్, గాయకుడు రఫీ గురించి వారి మధ్య జరిగిన ముచ్చట్లు పుస్తకంలో ప్రస్థావనకు వచ్చాయి. వినయ్ అమ్మ పేరు దానమ్మ, ఆ పేరుకు తగ్గట్టే ఆమె త్యాగశీలి. అంబలితో ఆమె ఆకలి తీర్చడం, అలాగే నగలు అమ్ముకుంటూ కుటుంబాన్ని, భవిష్యత్తును నమ్ముకుంటూ జీవితాన్ని సాగించిన చరిత్రను వినయ్ అక్షరబద్ధం చేశారు.
తాతల ముత్తాతల నుంచి మనవల దాకా జీవితంలోని ప్రతీ అంశాన్ని ప్రతీవ్యక్తి రికార్డ్ చేయడం అవసరం. వినయ్ కూడా తన కథను రాయడం చాలా ముఖ్యం- ఈ చర్య అభినందనీయం. ఎందుకంటే అన్ని జ్ఞాపకాలు గుర్తుండవు, ఏ క్షణంలోనైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది.
ఎందుకో నా జీవితమే ఉదాహరణగా తీసుకొని వివరిస్తాను: అన్నీ మరిచిపోయి, ఇప్పుడిప్పడే మళ్లీ రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాను. ఒకప్పుడు, నా జీవితం గురించి రాయడం ఎందుకనుకునే వాడిని కానీ, వినయ్ ఆత్మకథ చదివిన తర్వాత ఎంతో అవసరమని అర్థమైంది.
బాల్యం నుంచి మొదలుపెట్టి, తనకు పాఠాలుచెప్పిన ఉపాధ్యాయుల గురించి, తరువాత జర్నలిజానికి సంబంధించిన- ప్రజాశక్తి పత్రికలో తన ప్రయాణ సంఘటనలు, విదేశీ యాత్రల అనుభవాలను ఈ పుస్తకంలో వినయ్ క్రోడీకరించారు. అంతేకాకుండా, ఈ తరం జర్నలిస్టులకు పలు సూచనలు- సలహాలను కూడా అందించారు.
తన తండ్రి నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని, ధైర్యాన్ని, మనోశక్తిని వినయ్ పునికిపుచ్చుకున్నారు. ఒక కవిగా, నాయకుడిగా చాలీచాలని ఆదాయంతో కాలం వెళ్లదీశారు. జీవితంలో ఎదురయ్యే ఎగుడుదిగుళ్లను అధిగమించి; హైదరాబాద్‌లోని ఈనాడులో జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, న్యూయార్క్ నుంచి రిపోర్టింగ్ చేయడం విశేషమైన అంశం.
దేశ రాజకీయ నాయకుల ప్రసంగాలను సభలలో వినడం, వాళ్లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా తన విజ్ఞానాన్ని వినయ్ పెంచుకున్నారు. ఇదొక గొప్ప అవకాశం. ప్రస్తుత జర్నలిస్టులకు అంతటి మంచి అవకాశాలు తక్కువే అనవచ్చు. ఎందుకంటే కొందరు మంత్రులు, ముఖ్యమంత్రులు; కేంద్రంలో ప్రధాని పత్రికాసమావేశాలకు హాజరు కావడం లేదు. కాబట్టి, సీనియర్ జర్నలిస్టు వినయ్‌కు దక్కిన అవకాశం మిగితా వారికి దక్కడం అరుదనే చెప్పుకోవాలి.
పాత్రికేయవృత్తిలో నిబద్ధత..
హైదరాబాద్‌లో ఉంటే రాష్ట్రస్థాయి జర్నలిస్టనీ, ఢిల్లీలో ఉంటే జాతీయ జర్నలిస్టని అంటారు. ఏమన్నా అనకపోయినా, ఏమనుకున్నా సరే; పాత్రికేయవృత్తికి చిత్తశుద్ధితో కట్టుబడిన వ్యక్తి వినయ్. ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్లో వినయ్ పనిచేశారు. కష్టనష్టాల్నీ ఎదుర్కొని నిలబడి, నమ్మిన సిద్ధాంతానికి, పార్టీ ఇచ్చిన బాధ్యతలను ఇప్పటికీ నిర్వర్తిస్తున్నారు.
ఉదయం పత్రికలో నేను రిపోర్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, పాశం యాదగిరితో నాకు సాన్నిహిత్యముండేది. అప్పుడప్పుడు రాజకీయ, సమకాలీన అంశాల మీద పాశం యాదగిరి, వినయ్, నేను కలిసి మాట్లాడుకునేవారము. ఏదైనా నాకు తెలవకపోతే పాశం యాదగిరిని అడిగేవాడిని అప్పుడు ఆయన “వినయ్‌ను అడగండి” అని చెప్పేవారు.
నిజానికి యాదగిరికి తెలియని అంశం ఉండదు. మొత్తం లోతుపాతుల్ని వివరంగా వివరించే జర్నలిస్టు యాదగిరి. ఆయనే “వినయ్‌ని అడగండి మీ సమస్య తీరిపోతుంది” అనేవారు. నేను, వినయ్, జీ రాజకుమారి, యాదగిరి అప్పుడప్పుడూ చర్చిస్తూ రాసుకుంటూ నడిచిపోయింది మా జర్నలిజం.
ఎస్ వినయ్ వంటి వ్యక్తులు ఉంటే సమాజం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిలబడుతుంది. స్వేచ్ఛ- బాధ్యత ఉంటుంది. లంచం ఉండదు, లక్ష్యం ఉంటుంది. తమ లక్ష్యాలను సాధిస్తారు కూడా. తన జీవితంలోని ప్రతీకోణాన్ని తెలియజేసిన ఎస్ వినయ్ కుమార్ ‘‘పేపర్ బాయ్ టు ఎడిటర్’’ పుస్తకం, పాఠకులకు ఆదర్శంగా నిలిస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
