కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్ లు మార్కెట్ సంస్కరణలకు హామీ ఇచ్చాయి. అదే సందర్భంలో ఉమ్మడి బేరసారాల హక్కు, అస్తవ్యస్తంగా ఉన్న కనీస వేతనాలు, లింగ వివక్షత, సామాజిక భద్రత వంటి విషయాల్లో తీవ్రమైన లోపాలు నష్టాలు ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ లపై తక్షణం తీవ్రంగా పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది.
పరిచయం:
భారతదేశంలో సరళీ కృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన నాటి నుంచి తదనుగుణంగా కార్మికుల ప్రయోజనాలను కాపాడే విధంగా కార్మిక చట్టాలలో మార్పులు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొంతమేరకు చర్చలు జరిగిన తగిన నిర్ణయాలు జరగలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో లేబర్ కోడ్ లను తీసుకొచ్చింది. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పార్లమెంటు ద్వారా ఈ నాలుగు కోడ్ లను చట్టబద్ధం చేసింది. వీటిని 21 నవంబర్ 2025 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
నూతన లేబర్ కోడ్ లు:
- వేతనాలు
- పారిశ్రామిక సంబంధాలు.
- సామాజిక భద్రత.
- విధి నిర్వహణ లో భద్రత మరియు ఆరోగ్యకరమైన పని పరిస్థితులు.
పారిశ్రామిక సంబంధాల కోడ్:
ఉద్యోగ నియామకంలో వెసులుబాటు:
పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం 100 మంది కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న ఒక పరిశ్రమలో లాకౌట్ లేదా లే ఆఫ్ చేయాలంటే యజమాని ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి పొందాలి. నూతన కోడ్ లో ఆ పరిమితిని 300 అంతకుమించి ఉన్న కార్మికులు ఉన్న పరిశ్రమలకు గా పెంచారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. చారిత్రాత్మకంగా చూస్తే భారతదేశంలో వందలోపు కార్మికులు పనిచేస్తున్న సంస్థలు అత్యధికంగా ఉన్నట్లు మా పరిశీలన లో తేలింది. ప్రస్తుత లేబర్ కోడ్ లో యజమానులు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేయడానికి బదులుగా ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేని ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులుగా శాశ్విత కార్మికులకు అమలులో ఉండే పని పద్ధతులు,నియమావళి అమలు అయ్యే విధంగా నియమించుకునేందుకు అవకాశం కల్పించబడింది.
ఏకపక్ష కార్మిక సంఘ పద్ధతులను ప్రోత్సహించడం:
కార్మికుల హక్కులు, వేతనాలు, సదుపాయాలు తదితర అంశాలపై యాజమాన్యంతో ఒప్పందం చేసుకునే సోల్ బార్గైనింగ్ ఏజెంట్ గా సంఘాన్ని నియమించుకునే స్వేచ్ఛ ఇవ్వబడింది. ఒక పరిశ్రమలో ఒకే ఒక్క కార్మిక సంఘం ఉంటే ఆ సంఘాన్ని గుర్తింపు సంఘంగా యాజమాన్యం అనుమతించాలి. అయితే ఒక పరిశ్రమలో ఒకటికంటే ఎక్కువ కార్మిక సంఘాలు ఉంటే ఏ కార్మిక సంఘానికి 51% కంటే ఎక్కువ మంది కార్మికుల సభ్యత్వం ఉంటుందో ఆ సంఘాన్ని మాత్రమే రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు సంఘంగా ప్రకటించడానికి అవకాశం ఉంది.
భారతదేశంలో కార్మిక సంఘాల సంఖ్య, సంఘ సభ్యత్వాలు రీత్యా చూసినప్పుడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. 2010 సం.లెక్కల ప్రకారం దేశంలోని కార్మికులలో నూటికి 98% మంది కార్మికులు ఏ యూనియన్ లోను సభ్యులు కాని వారుగా ఉన్నారు. అలాంటి సంస్థలలో సోల్ బార్గైనింగ్ సంఘ గుర్తింపు కానీ, ఏ రకమైన సదుపాయాలకు కానీ అవకాశం లేదు. భారతదేశంలో అత్యధిక పరిశ్రమలలో ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో కార్మిక సంఘాలే ఉనికిలో లేవు. కనీసం ఒకే ఒక కార్మిక సంఘం ఉన్న సంస్థలు కూడా చాలా నామమాత్రం.
51% కార్మిక సభ్యత్వం కలిగిన సోల్ భార్గైనింగ్ ఏజెంట్ గా సంఘం ఉన్న పరిశ్రమలలో మిగిలిన చిన్న కార్మిక సంఘాల ఉనికి చాలా కష్టంగా మారుతుంది. యాజమాన్యాలు ఆ సంఘాలను గుర్తించవు, చర్చలు జరపవు. ఇలాంటి చిన్న సంఘాల ఎదుగుదల దుర్భరంగా మారుతుంది. వాస్తవానికి ఒక కార్మిక సంఘం ఏర్పడి నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. సోల్ భార్గైనింగ్ ఏజెంట్ ఏజెంట్ గా ఉన్న పెద్ద సంఘం కార్మిక సమస్యలను పరిష్కరించకపోయినప్పటికీ అది తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.
సమ్మెలు లాకౌట్ లపై నిషేధం:
సమ్మె లేదా లాకౌట్ కు వెళ్లాలంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. నోటీసి ఇచ్చిన 60 రోజుల లోగా నే సమ్మె లేదా లాకౌట్ కు వెళ్లాలి. (గత పారిశ్రామిక వివాదాల చట్టంలో అత్యవసర సర్వీసుల సంస్థలకు మాత్రమే ఈ నిబంధన ఉండేది నూతన కోడ్ ప్రకారం అన్ని సంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుంది).
కార్మిక శాఖ అధికారి సమక్షంలో కన్సీలిఏషన్ జరుగుతున్న సమయంలో లేదా ట్రిబ్యునల్ లో ఉన్న కాలంలో సమ్మె/ లాకౌట్ చేయడానికి వీలు లేదు. ఒప్పందం లేదా కోర్టు తీర్పు అమలులో ఉన్నంతకాలం సమ్మె /లాకౌట్ చేయడానికి వీలులేదు. ఈ నిబంధనకు విరుద్ధంగా సమ్మె లాకౌట్ జరిగితే పదివేల రూపాయలు జరిమానా మరియు ఒక నెల వరకు జైలు శిక్షతో సహా జరిమానాలు విధించే అవకాశం ఈ నూతన కోడ్ లో ఉంది. ఈ నిబంధన ప్రకారం చట్టబద్ధమైన సమ్మెలు లాకౌట్ లు కూడా అసాధ్యంగా మారుతాయి. ఈ నిబంధన కార్మిక సంఘాల యజమానుల స్తైర్యాన్ని దెబ్బతీస్తుంది.
ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగ నియామకాలకు చట్టబద్ధత:
ఈ నిబంధన శాశ్వత ఉద్యోగ నియామకాలు భవిష్యత్తులో లేకుండా చేస్తుంది. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగ నియామకం కింద కార్మికులు శాశ్వత పద్ధతి కార్మికులకు వర్తించే నియమ నిబంధనలు, క్రమశిక్షణ చర్యలకు లోబడి పనిచేసే విధంగా నిర్దిష్ట కాల పరిమితికి నియమించబడతారు. గత చట్టాలలో నిబంధన టెక్స్టైల్ మరియు గార్మెంట్ పరిశ్రమలకు మాత్రమే వర్తించేది.
గమనిక: ఇది మొదటి భాగం. దీని రచయిత అతుల్ సూద్. స్వేచ్ఛనువాదం:
పి.నరసింహారావు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
