గత ఆర్థిక సంవత్సరంలో సామాజిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన మొత్తాన్ని ఖర్చు చేయలేదని కేంద్ర బడ్జెట్ 2026-27 పత్రాలు వెల్లడిస్తున్నాయి.
గతంలో, కీలకమైన సంక్షేమ పథకాలకు తగిన నిధులు కేటాయించనందుకు విస్తృత విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంది.
న్యూఢిల్లీ: గత కేంద్ర బడ్జెట్ 2025-26లో, ప్రభుత్వం సామాజిక రంగ వ్యయాన్ని తగినంతగా హైలైట్ చేయకుండా, ప్రధాన సంక్షేమ పథకాలకు సరిపోని నిధులను కేటాయించింది.
దీనిపై అప్పట్లోనే విస్తృతంగా విమర్శలు వచ్చాయి.
అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా ఆ మొత్తాన్ని కూడా ఖర్చు చేయలేదని కేంద్ర బడ్జెట్ 2026-27 పత్రాలు వెల్లడించాయి.
ఈ విషయంలో, ప్రభుత్వం తన వాగ్దానాలను వాస్తవంగా నెరవేరుస్తుందో లేదో తెలుసుకోవడానికి 20 సామాజిక రంగ పథకాలకు సంబంధించిన డేటాను ‘ది వైర్’ విశ్లేషించింది.
కథనం ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలు కేవలం రెండు పథకాలైన ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’, ‘ఎంఎన్ఆర్ఈజీఏ’ల బడ్జెట్ అంచనాలను మించిపోయాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే వీటిలో ఒకటైన ఎంఎన్ఆర్ఈజీఏ వాస్తవానికి నిలిపివేయబడింది.
పలు అంశాలను ఎత్తి చూపుతున్న విశ్లేషకులు
ప్రభుత్వం ఎంఎన్ఆర్ఈజీఏ స్థానంలో తీసుకువచ్చిన వికాసిత్ భారత్ ‘జీ రామ్ జీ’ పథకానికి బడ్జెట్లో రూ 95,692 కోట్లు కేటాయించారు.
అయితే, సామాజిక కార్యకర్తలు ఈ కొత్త పథకాన్ని అనేక ముఖ్యమైన అంశాల్లో విభిన్నంగా అభివర్ణించారు.
ఉదాహరణకు, కొత్త పథకం సార్వత్రికంగా కాకుండా, ఈ పథకం అమలు చేయబడే ప్రాంతాలను “నోటిఫై” (తెలియజేయడానికి) చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలతో మోదీ ప్రభుత్వానికి ఉన్న బలహీనమైన సంబంధాల దృష్ట్యా ఇది తీవ్రమైన ఆందోళనలకు దారితీసింది.
సామాజిక రంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదని, ఈ కీలకమైన రంగంపై ఖర్చు స్తబ్దుగా ఉందని చాలా మంది నిపుణులు ఎత్తి చూపారు.
భారీ అంతరాయం..
ఆదివారం సమర్పించిన 2026-27 కేంద్ర బడ్జెట్ ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉందని, అంతేకాకుండా పరిస్థితి మరింత దిగజారవచ్చని స్పష్టం చేస్తోంది. ఎందుకంటే అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తానికి, వాస్తవానికి ఖర్చు చేసిన మొత్తానికి మధ్య భారీ అంతరాన్ని చూపిస్తున్నాయి.
విశ్లేషించబడిన మరొక పథకం, పీఎం- కిసాన్ విషయంలో బడ్జెట్ అంచనాలు సవరించిన అంచనాలతో సరిగ్గా సరిపోలాయి. అయితే, మిగిలిన 17 పథకాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినంత ఖర్చు చేయలేదు. కొన్ని సందర్భాల్లో, బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.
విఫలమైనదానికి నిదర్శనం..
దేశాన్ని వేధిస్తున్న వివిధ మౌలిక సదుపాయాల సంక్షోభాలను గమనించేవారికి, వీటిలో కొన్ని ముఖ్యంగా గమనించదగ్గవి; ఉదాహరణకు, జల్ జీవన్ మిషన్– ఇది మోదీ ప్రభుత్వం స్వయంగా సామాజిక పథకాలపై వాగ్దానం చేసిన ఖర్చును చేరుకోవడంలో విఫలమైనందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ల మొత్తం తగ్గినందున, గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో సామాజిక వ్యయం పెరుగుదల కేవలం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం వల్లనే సాధ్యమైందని ఆర్థికవేత్తలు జయతి ఘోష్, సీపీ చంద్రశేఖర్ ఇటీవల ఎత్తి చూపారు.
గ్రామీణ భారతీయులందరికీ స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించే లక్ష్యంతో 2019లో ప్రారంభించబడిన ఈ పథకం అంచనా వ్యయం రూ. 67,000 కోట్లు అని భావించారు.
అయితే, లక్షలాది మంది జీవితాలను మార్చడానికి ఉద్దేశించిన ఈ పథకానికి ప్రభుత్వం కేవలం రూ 17,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని సవరించిన అంచనాలు చెబుతున్నాయి.
ఇండోర్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు పరిశుభ్రమైన కుళాయి నీటిని పొందడం ఎంత ముఖ్యమో స్పష్టం చేశాయి, అయినప్పటికీ దానికి ప్రాధాన్యత ఇవ్వబడలేదు.
వాగ్దానాలను నెరవేర్చలేని వైనం..
అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలపై(గ్రామీణ, పట్టణ) ఖర్చు విషయంలోనూ వాగ్దానాలను నెరవేర్చలేకపోయారు. 2024లో మోదీ ప్రభుత్వం పీఎంఏవై-అర్బన్ 2.0 వెర్షన్‌ను ప్రారంభించినప్పటికీ ఇదే పరిస్థితి నెలకొంది.
బడ్జెట్ అంచనాలు సవరించిన అంచనాల కంటే పీఎంఏవై- అర్బన్‌కు రూ 19,794 కోట్లు, పీఎంఏవై- అర్బన్ 2.0కు రూ 3,200 కోట్లు; పీఎంఏవై-రూరల్‌కు రూ 22,332 కోట్లు ఎక్కువగా ఉన్నాయి(అంటే కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు చేశారు).
సంక్షేమ పథకాలను తాము అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నామని మోదీ ప్రభుత్వం గట్టిగా చెప్పుకుంటున్నప్పటికీ, తాజాగా విడుదలైన డేటా ఈ వాదనలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


