యునైటెడ్ స్టేట్స్ తో భారతదేశం కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్నిచూసి ఒకప్పటి ఈస్టిండియా కంపెనీ కూడా కుళ్లుకుంటుంది.
భారత్ – యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా విడుదల చేసిన ద్వైపాక్షిక వర్తకంపై తాత్కాలిక ఒప్పంద చట్రం దేశాల మధ్య స్వేచ్ఛా మరియు పారదర్శక వర్తకాల చరిత్రలో అనూహ్యంగా నిలిచిపోతుంది. సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల చొప్పున రానున్న ఐదు సంవత్సరాలలో గంపగుత్తగా 500 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను కొంటామని ఒక దేశం ఎలా భరోసా ఇవ్వగలుగుతుంది? స్వేచ్ఛా వాణిజ్యాన్ని ఇలా కూడా జరపవచ్చా?
యుఎస్ కు భారత్ చేసిన ఈ ఏకపక్ష హామీ అనేక విధాలుగా సమస్యాత్మకమవుతుంది. ప్రస్తుతం యుఎస్ తో భారతదేశం సుమారు 130 బిలయన్ డాలర్ల ద్వైపాక్షిక వర్తకాన్ని జరుపుతోంది. 45 బిలియన్ డాలర్ల వర్తక మిగులును కలిగి ఉంది.
భారతదేశం యుఎస్ కు దాదాపు 85 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతుండగా, దిగుమతులు 40 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అమెరికాతో భారతదేశం భారీగా వర్తక మిగులును కలిగి ఉండటం ట్రంప్ కు కంటగింపుగా మారింది. దీనిని యుఎస్ నుండి భారతదేశానికి తగినంత ఎగుమతులు జరగకుండా అడ్డుకుంటున్న భారతదేశం విధించిన అన్యాయమైన టారిఫ్, టారిఫేతర ఆంక్షలుగా ట్రంప్ ఆక్షేపిస్తున్నారు. ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ప్రత్యేకించి భారతదేశ బడా వ్యాపార సముదాయాలను రక్షించడానికి దోహదపడుతున్న నాన్ టారిఫ్ ఆంక్షల గురించి గుర్తు చేస్తున్నారు.
విత్తనాలు మరియు ఎండబెట్టిన డిస్టలర్స్ ధాన్యాల నుండి ఎర్రజొన్న మరియు తాజా, ప్రాసెస్డ్ పండ్లు వరకు, యుఎస్ – భారత్ ఒప్పందం అమెరికా ఉత్పత్తులకు కొత్త మార్కెట్ ను అందిస్తుంది. – యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ ప్రతినిధి ఫిబ్రవరి 6, 2026.
ఏ స్వేచ్ఛా లేదా బహిరంగ వర్తక ఒప్పందంలోనైనా, ఇరు పక్షాలు ఇటువంటి ఆంక్షలను తొలగించుకుంటాయి. ఆంక్షలను తొలగించిన తరువాత ఇరు పక్షాలు తమ పోటీతత్వం ఆధారంగా పోటీ పడాలని కోరుకుంటాయి. ఇలా జరగడం సర్వసాధారణం. కానీ, భారతదేశం సుంకాలు మరియు సుంకాలతో సంబంధంలేని ఆంక్షలను తగ్గించడమే కాకుండా, రానున్న ఐదు సంవత్సరాలలో ఇంధన శక్తి, ఆహారం మరియు వ్యవసాయం, విమానాలు, వాటి విడి భాగాలు, విలువైన లోహాలు, కోకింగ్ బొగ్గు మొదలగు వంటి రంగాలలో 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేస్తామని ట్రంప్ కు హామీ ఇచ్చి, అనూహ్య చర్యకు పాల్పడుతోంది.
ఇలా చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాస్తవానికి భారతదేశపు 45 బిలియన్ డాలర్ల వర్తకపు మిగులును తుడిచిపెట్టడమే కాకుండా, యుఎస్ తో వర్తకపు లోటును పెంచబోతోంది. ఇటువంటి ఒంటెత్తు ఒప్పందంపై ఒకప్పటి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ కూడా కుళ్లుపడుతుంది.
భారతదేశం తన వ్యవసాయ రంగాన్నియుఎస్ కు బార్లా తెరవడం వ్యవసాయ రంగంలో భారత్ తో ఉన్న 1.3 బిలియన్ల వర్తకపు లోటును భర్తీ చేయడానికి అమెరికాకు తోడ్పడుతుందని యుఎస్ వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ ఎక్స్ లో భరోసాగా పోస్ట్ చేయడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఈ ఫ్రేమ్ వర్క్ ఇలా జరగడానికి మరింత అవకాశం ఉందని తెలియజేస్తోంది.
ఒకసారి ఊహించండి: ప్రస్తుతం భారత్ మరియు యుఎస్ మధ్య వార్షిక వర్తకం సుమారు 130 బిలియన్ డాలర్లు ఉండగా, యుఎస్ ఎగుమతులు సుమారు 40 బిలియన్ డాలర్లు. ఫ్రేమ్ వర్క్ ఒప్పందం ప్రకారం, యుఎస్ తన ఎగుమతులను మొదటి సంవత్సరం నుండి 40 బిలియన్ డాలర్ల నుండి 100 బిలియన్ డాలర్లకు పెంచుకుంటుంది. ఐదు సంవత్సరాలలో 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి, భారతదేశం దేశీయంగా తక్షణ డిమాండ్ కలిగిన వాటిపై పెద్ద ఆర్డర్లు చేయవలసి ఉంటుంది. దీనికోసం సంవత్సరానికి 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ముడి చమురు దిగుమతులను రష్యా నుండి పూర్తిగా యుఎస్ కు మళ్లించవలసి వస్తుంది. ఇది ట్రంప్ నిరంతర డిమాండ్. యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ డిమాండ్ ను ఇటీవల పునరుద్ఘాటించారు.
రష్యా నుండి చమురు కొనుగోళ్లను మళ్లించడం చాలా సులువైన పని. భారతదేశ చర్యను రష్యా ఏవిధంగా అర్థం చేసుకుంటుందో వేచిచూడాలి. ఉమ్మడి ఫ్రేమ్ వర్క్ ప్రకటనలో దీనిని ప్రస్తావించనప్పటికీ, మోడీ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఏకపక్ష ఒప్పందంలో అంతర్లీనంగా ఇదే ఉంది.
ఈ ఒప్పందంలో పరస్పర ప్రయోజనం ఇసుమంతైనా లేదు. ఎందుకంటే అమెరికా భారతదేశ ఎగుమతులపై 18% దిగుమతి సుంకాన్ని విధిస్తుంది, కానీ భారతదేశం అమెరికాపై ఒక అంకె స్థాయి సుంకాలను మాత్రమే విధిస్తుంది, ఇది భారతదేశం యూరోపియన్ యూనియన్ (EU)పై విధించే సుంకానికి దాదాపు సమానంగా ఉంటుంది. భారతదేశం సున్నా సుంకాలకు ఒప్పుకుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, ఫ్రేమ్‌వర్క్ ప్రకటనలో ‘సున్నా’ అనే పదం ప్రస్తావించబడలేదు. అయితే, ఈ సుంకాలు భారతదేశం యూరోపియన్ యూనియన్ కు విధిస్తున్న దానికంటే మెరుగ్గా కాకపోయినా, కనీసం అంతే స్థాయిలో అయినా ఉండాలి.
భారతదేశం చైనా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా మొదలగు వంటి ఇతర ఆసియా దేశాల కంటే మెరుగైన ఒప్పందం చేసుకుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారతదేశం యుఎస్ లో 1 లేదా 2 శాతం పాయింట్లు తక్కువ దిగుమతి సుంకం పొందడమనేది నిజం కావచ్చు. కానీ నిజం ఏమింటే, ఏ తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశం చేసినట్లు యుఎస్ తో తన వర్తక మిగులును నీరుగార్చుకోలేదు. వాస్తవానికి, చైనా, వియత్నాం, ఇతర దేశాలు 2025లోనే యుఎస్ తో తమ వర్తకపు మిగుళ్లను పటిష్టపరచుకున్నాయి. చైనా 1.2 ట్రిలియన్ల డాలర్ల గరిష్ట వర్తక మిగులును నమోదు చేసుకుంది. వియత్నాం, ఇతర దేశాలు కూడా బాగా నిలదొక్కుంటున్నాయి.
యుఎస్ తో భారతదేశ వర్తకపు మిగులును ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించడంలో మోడీ ప్రభుత్వపు భారీ వ్యూహం ఏమిటో నిజంగా అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న రహస్య భౌగోళిక రాజకీయ వ్యూహం ఏమిటో స్పష్టం కావడం లేదు.
అంతేకాకుండా, భారతదేశ వ్యవసాయ రంగం పూర్తిగా సురక్షితంగా ఉందని పీయూష్ గోయల్ ఇచ్చిన హామీ, భారతదేశంతో తన వ్యవసాయ వాణిజ్య లోటును పూర్తిగా తొలగిస్తామని అమెరికా చేసిన విశ్వసనీయ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రకటనలో అనేక ఆహార, వ్యవసాయ కేటగిరీల గురించి ప్రస్తావించారు, కానీ ఇది సంపూర్ణ జాబితా కాదని భావించవచ్చు. ఈ కొత్త ఒప్పందం వ్యవసాయ రంగంపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రభుత్వం వివరణాత్మక నివేదిక ఇవ్వాలి.
డిజిటల్ వర్తకంలో అనేక వివాదాల పరిష్కారంపై కూడా ప్రస్తావించడం జరిగింది.
భారతదేశ డిజిటల్ సార్వభౌమత్వంపై యుఎస్ వైపు నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. భారతదేశ డేటా లోకలైజేషన్ విధానంతో యుఎస్ కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. గూగుల్, అమెజాన్ వంటి పెద్ద టెక్ కంపెనీలు తమ అధికార పరిధిలో భారతీయ డేటాను స్వేచ్ఛగా నిల్వ చేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి అనుమతించాలని యుఎస్ కోరుకుంటోంది.
మేధో సంపత్తి హక్కుల విషయంలో, భారతదేశం-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో విదేశీ ఫార్మా కంపెనీలతో కలిసి స్వచ్ఛంద లైసెన్సింగ్‌కు అనుకూలంగా భారతదేశం ఇప్పటికే తన నిర్బంధ లైసెన్సింగ్ విధానాన్ని నీరుగార్చింది. గత మేలో యునైటెడ్ కింగ్డమ్కు ఖరారు చేసిన FTAలో కూడా ఇలానే జరిగింది. కాబట్టి యుఎస్ దాని కంటే తక్కువగా ఉన్న దేనినీ అంగీకరించదు. ఇంకా ఎక్కువే కోరుకుంటుంది. భారతదేశ ఆర్థిక మరియు వర్తక సార్వభౌమత్వానికి సంబంధించి ఇలాంటి అనేక ఆందోళనలపై పారదర్శకత పూర్తిగా లోపించింది. ప్రధానమంత్రి మోడీని లోక్‌సభ స్పీకర్ పార్లమెంటుకు తిరిగి ఆహ్వానించాలనుకుంటే ఈ అంశాలపై తీవ్రంగా చర్చించవలసిన అవసరం ఉంది.
ఎం.కె. వేణు
తెలుగులోకి అనువదించిన పి. నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
