Reading Time: 4 minutes
దుర్మార్గమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలి!
స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి!
ఫిబ్రవరి 12 సమ్మెలో స్కీం వర్కర్లు పాల్గొనాలని విజ్ఞప్తి!
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జాతీయ సార్వత్రిక సమ్మె జరగనున్నది. బి ఎం ఎస్ మినహా మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా వంటి ప్రజా సంఘాలు ఈ సమ్మెను బలపరుస్తున్నాయి. స్క్రీన్ వర్కర్లందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
భారతదేశంలో పేదరిక నిర్మూలన, మాతృ, శిశు మరణాలు తగ్గించడానికి, హాస్పటల్ డెలివరీలు పెరగటానికి ఆహారము, ఆరోగ్యం, విద్య అందించడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి అనేకరకాలసేవలుఅందించటాని..వివిధ రకాల స్కీములను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ స్కీం లో దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ (80%) మహిళా కార్మికులు. ఈ స్కీములు అమలు చేయడం వల్ల సమాజంలో కొంతమేరకు పేదరికం తగ్గటంతో పాటు, మాతృ, శిశు మరణాల రేటు తగ్గింది. పిల్లల్ని బడికి అలవాటు చేయడంలో మెరుగుదల ఉంది. ఇలాంటి కీలక పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి.
కనీసం కార్మికులుగా గుర్తించండి
అంగన్వాడి, ఆశా మధ్యాహ్నం భోజనం, వివోఏ, ఆర్ పి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రంగాల్లో, వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ సెక్రటరీలు ,ఏఎన్ఎం, స్టాప్ నర్సులు ఎంఎల్‌హెచ్‌పి , మెంటల్ హెల్త్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్నారు. వీరికి అదనంగా రాష్ట్రంలో ఏపీ శాక్స్, ఆయుష్, 104, 108, తల్లి బిడ్డలు ఎక్స్‌ప్రెస్ ఆరోగ్య మిత్ర, సమగ్ర శిక్ష, కస్తూర్బా, పార్ట్ టైం ఇన్‌స్ట్రక్చర్లు, ఉపాధి పథకం, ఫీల్డ్ అసిస్టెంటు,వెలుగు ఆర్పీలు, ఆర్డబ్ల్యూఎస్, సత్యసాయి వాటర్ వర్క్స్, వెటర్నరీ 1962 తదితర ప్రభుత్వ పథకాల్లో అనేక సంవత్సరాలుగా ప్రజలకి సేవలందిస్తున్నారు. ఫలితంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ మానవ అభివృద్ధి సూచికలలో చాలా పురోగతి సాధించాం. ఇది మన స్కీం వర్కర్ల కష్టార్జితం తప్ప మరొకటి కాదు. కానీ ప్రభుత్వాలు తమ గొప్పగా చెప్పుకుంటూ అసలు అభివృద్ధి సాధించిన స్కీం వర్కర్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీముల్లో పనిచేసే వారిని కనీసం కార్మికులుగా గుర్తించలేదు. 2013లో ఐ ఎల్ సి సిఫారసులు ప్రకారం కనీస వేతనాలు, గ్రాట్యూటీ, పిఎఫ్ ఈఎసఐ తదితర సామాజిక భద్రత సౌకర్యాలు అమలు చేయాలని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ILC )చేసిన సిఫారసులు బుట్ట దాఖలు అయినాయి.
పుండు మీద కారం లా లేబర్ కోడ్స్
కార్మిక సంఘాలు ఏర్పడకుండా, ఉన్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి, బేరసారాల హక్కులను హరించి కార్మికులు ఉద్యోగులను బానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను చట్ట బద్ధం చేసింది. 2025 నవంబర్ 21 నుండి వాటినీ అమలులోకి తీసుకొస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దుర్మార్గమైన కార్మిక కోడ్లు అమలు అయితే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసే హక్కును కూడా కోల్పోతాం. కార్మిక చట్టాలను సరళతరం చేసే ముసుగులో కార్మికులు పోరాడి, త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి ఈ 4 లేబరు కోడ్లులను తెచ్చారు. అవి వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, హెల్త్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ కోడ్, సామాజిక భద్రతా కోడ్లు తీసుకువచ్చారు. ఈ లేబర్ కోడ్లు కరోనాకాలంలోనే (2020) లో పార్లమెంట్లో ఎటువంటి చర్చలేకుండా ఆమోదింపచేశారు. అయినా ఈ కాలంలో జరిగిన 5 సార్వత్రిక సమ్మెల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని నిరసనలు తెలియజేసిన ఫలితంగా నేటి వరకు వాటిని అమలు చేయలేదు.
కార్మికులపై దూకుడు
కాని బిజేపి ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా దూకుడు గా 2025 నవంబర్ 21 న లేబర్ కోడ్ల అమలుకు నోటిఫికేషన్లు జారీచేశారు. 2026 ఏప్రిల్ నుండి అమలుకు సిద్దపడుతున్నారు. మన రాష్ట్రంలో ముందుగానే పనిగంటలు 8`నుండి 10 గంటలకు పెంచాలని, మహిళల కు భత్రత కల్పించి రాత్రిపూట పనిచేయవచ్చని అసంబ్లీలో తీర్మానం చేశారు. లేబర్కోడ్లు అమలైతే సంఘం పెట్టుకునే హక్కు ,సమ్మెచేసే హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వలన పర్మినెంట్ అనే మాటను మర్చిపోవాల్సివస్తుంది.. మరియు వేతనాల కోడ్‌లో కనీసవేతనాలు ప్రతిపాదన చాలా ప్రమాదకరంగా ఉంది. ఫ్లోర్ వేజ్ విధానం మార్కెట్లో ఎంత తక్కువ వేతనానికి పనిచేయటానికి కార్మికుడు సిద్దపడతాడో దానిని ఫ్లోర్వేజ్ అంటారు. జాతీయ ఫ్లోర్ వేజ్ ని రోజుకి 178 రూపాయలుగా నిర్ణయించారు. ఇది కార్మికులనే అవమాన పరచడం తప్ప మరొకటి కాదు. అనేక రాష్ట్రాలలో ఈపాటికి కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 178 కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ విధానం గతంలో త్రైపాక్షిక కమిటి కనీస వేతన నిర్ణయానికి విరుద్దమైనది. ఐఎల్‌సి సిఫార్సు ప్రకారం కనీసం రూ.26,000 ఇవ్వాలి. గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ కార్మికులకు కనీసవేతనాన్ని వర్కర్‌కి రూ.24,800/`లు, హెల్పర్లకి రూ.20,300 ఇవ్వాలని తీర్పు నిచ్చింది. దీని గురించి వేతనాలు కోడు పట్టించుకోలేదు.
కోర్టు తీర్పునూ పట్టించుకోరు
ఐసిడిఎస్ ప్రారంభించి 50 సం॥లు, ఎండిఎం ప్రారంభించి 30 సం॥లు, ఎన్హెచఎం ప్రారంభించి 20 సం॥లు అయినా నేటికి ఈ స్కీంలో పనిచేసే అంగన్వాడీ, ఆశా, ఎండిఎం తదితర వారిని కనీసం కార్మికులుగా గుర్తించలేదు. ఎటువంటి చట్టబద్ధత సౌకర్యాలు అమలుచేయటంలేదు. 2022 లో సుప్రింకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది అంగన్వాడీలకు గ్రాట్యూటీ చట్టాన్ని అమలుచేయాలని తీర్పు ఇచ్చినా నేటికి అమలుకావడంలేదు. మన రాష్ట్రంలో 42 రోజుల చారిత్రాత్మక సమ్మె తరువాత కొన్ని జీఓలు సాధించుకున్నాం. 2024 మార్చిలో అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలుచేస్తామని జీఓ.నం.8 ఇచ్చినా గైడ్‌లైన్స్ నేటికి రూపొందించలేదు. 2025 డిసెబరునుండి చాలా మంది రిటైరు అవుతున్నారు. ఎంత ఇస్తారనేది స్పష్టత లేదు. సర్వీసులోఉండి చని పోయినా ఎటువంటి బెనిఫిట్స్ లేవు. వివిధ రకాల స్కీంల్లో పనిచేసే వారికి వేతనాలు 3 వేల నుండి 15 వేల లోపు మాత్రమే ఇస్తున్నారు. కాని స్కీమ్ వర్కర్స్ అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అనే తప్పుడు నెపంతో సంక్షేమ పథకాలను అమలుచేయడంలేదు. ఆరోగ్యరంగంలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్‌కి ఆరోగ్యం బాగులోకపోయినా కనీసం సెలవులు ఇచ్చే పరిస్థితిలేదు. ఆశావర్కర్లు మిలిటెంట్ పోరాటాల చేసి కొన్ని సాధించుకున్నా కనీస వేతనాలు అమలు కావటంలేదు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యడం వలన పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకి కేవలం నెలకు 3 వేల రూపాయలు మాత్రమే వస్తున్నారు. ఆ ఇచ్చే వేతనం కూడా సంవత్సరంలో10 నెలలు మాత్రమే ఇస్తున్నారు. 11 సం॥ల నుండి వేతనాలు పెరగలేదు. ఈ పథకాన్ని అక్షయపాత్ర, ఇస్కాన్ తదితర ప్రైవేటు స్వచ్చంధ సంస్థలకు అప్పగిస్తున్నారు. నెలలు తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉంటున్నాయి.
వివిధ స్కీంల్లో సంవత్సరాల తరబడి పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఖాళీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చెయ్యకుండా వివక్షత చూపుతున్నారు. కేంద్ర, ప్రభుత్వ పథకాల్లో ఉద్యోగులకు హ్యూమన్ రీసోర్స్ పాలసీ అమలు చెయ్యాలన్న నిబంధనలను రూపొందించారు. కానీ మన రాష్ట్రంలో ఉపాధి, వెలుగు పథకాల్లో తప్ప ఏ ఇతర పథకాల్లోనూ హ్యూమన్ రీసోర్స్ పాలసీని రూపొందించలేదు. నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న వారికి మినహా పిఎఫ్, ఇఎస్ఐ అమలు కావడంలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ సౌకర్యాలు లేవు. చనిపోతే కారుణ్య నియామకాలు లేవు. ఆరోగ్య బీమా లేదు.సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంలేదు. కొన్ని డిపార్ట్మెంట్లోనే రిటైర్మెంట్ వయస్సు 62 సం॥లకు పెంచారు. ఇంకా చాలా డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ వయస్సు పెంచలేదు. ఈ లేబర కోడ్లు అమలైతే ఈ సౌకర్యాలు అన్నిఅమలుచేయాలని అడిగే హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
మోడీ పాలనలో దిగజారిన దేశం
ప్రపంచవ్యాపితంగా ఆకలి మరణాల సూచిలో భారతదేశం 102 వ స్థానంకు దిగజారింది. దేశంలో నేటికి 28 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని ఇటీవల ఒక నివేదిక తెలియజేసింది. 2026-2027 కేంద్ర బడ్జెట్, సంక్షేమానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి పెద్ద పీట వేసామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా, ఆచరణలో కార్పోరేట్ లకు భారీ రాయితీ లు ప్రకటించారు..పేదప్రజల లకు ఉపయోగపడుతున్న వివిద రకాల ప్రభుత్వ స్కీం లకు మాత్రం సరిపొను బడ్జెట్ కేటాయించలేదు.ఐసిడిఎస్‌కు 23,100 కోట్లు ఉపాధిహామీ పథకానికి 95 వేల కోట్లు కేటాయించారు.ఇది ఏ మాత్రం సరిపోదు. ప్రభుత్వ ప్రకటించిన విధంగా 100 రోజులు పని 125 రోజులకు పెంచాలంటే కనీసం 3 లక్షల కోట్ల కేటాయించాలి.2026 మార్చిలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని ప్రకటించినా బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఐసిడిఎస్‌లో దాదాపు 8 కోట్ల మంది పిల్లలు, 2 కోట్ల మంది గర్బిణీలు, బాలింతలకు అందిస్తున్న అనుబంధ పోషకాహారానికి నయాపైసా పెంచలేదు. ఈ బడ్జెట్లో 1140 కోట్లు పెరిగినట్లు చూపించినా అది పిల్లలకు 38 పైసలు అవుతుంది.ఇవి ఏమాత్రం సరిపోవు.ఈ కాలంలో డిజిటలైజేషన్, ఫేస్ రికగ్నైజేషన్ అమలు చెయ్యటానికి మొబైల్ ఫోన్లకు ఎటువంటి కేటాయింపులు లేవు. కావున ఈ బడ్జెట్లో స్కీం వర్కర్లకు అన్యాయం జరిగింది. కావున స్కీంలకు బడ్జెట్ పెంచాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లేబర్కోడ్లు రద్దుచేయాలని, ఉపాధిహామి పధాకానికి పేరు మార్చకుండా చట్టాన్ని యధావిధిగా కొనసాగించి నిధులు పెంచాలని, విద్యుత్సవరణచట్టం, విత్తనసవరణ చట్టాన్ని రద్దు చేయాలని , ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో స్కీం వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదంచేయాలని కోరుతున్నాము.
కె.సుబ్బరావమ్మ,
ప్రధాన కార్యదర్శి,
అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్,
ఆంధ్రప్రదేశ్ కమిటీ.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
