నేల మళ్ళీ పిల్లల్ని పెడుతుంది
కోట్ల ఆకాశాలని
తుపాకులు కడుపుతో
ఉండి కనే బుల్లెట్లు
శవాలను ముద్దాడే యుద్ధాలు
గాయాలను దాచుకోవడానికి
సరి పోని చేతులు
చేతులు కొత్తవి కావాలి
పాత గాయాలను పరామర్శించేందుకు
బట్టలకు ఎర్ర రంగు వేస్తున్నారు
చేనేత కార్మికులా వాళ్ళు
ఎరుపు నెత్తురు
నెత్తురు ఎరుపు
ముసలి రక్తమా పడుచు రక్తమా
ముస్లిం రక్తమా యూదు రక్తమా
దేశ దేశాల గర్భసంచులు తొలగిస్తున్న అగ్ర రాజ్యం వైద్యుడు
సుంకాల సునామిలో
కొట్టుకు పోతున్న అర్ధాకలితో
నిద్ర పోయే నిరుపేద దేశాలు
మా నాన్నమ్మ నడిచిన నేల ఇది
అందుకే ఈ మట్టి మీద మమకారం
కొన్ని రోజులు బతకాలనే ఆశ కాదు
కొన్ని మధుర జ్ఞాపకాలను మరణించనివ్వకుండా
బతికించుకోవాలని
నేల మళ్ళీ పిల్లల్ని పెడుతుంది
నేనొక ఆకాశాన్ని కలగన్నాను
అక్కడ స్వేచ్ఛగా పక్షులు ఎగురుతున్నాయి
యుద్ధ విమానాల జాడే లేదు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
