2023 మేలో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన మూక దాడిలో తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే వుంగ్జాగియన్ వాల్టే గత వారం మరణించారు.
ప్రత్యేక జిల్లా కోసం జోమి కమ్యూనిటీ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించే వరకు ఆయన అంత్యక్రియలు నిర్వహించబోమని ఆయన కుటుంబం పేర్కొంది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే వుంగ్జాగియన్ వాల్టే మరణం మణిపూర్‌లో రాజకీయ వివాదానికి దారితీసింది.
ప్రత్యేక జిల్లా కోసం జోమి కమ్యూనిటీ దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించే వరకు ఆయన అంత్యక్రియలు నిర్వహించబోమని ఆయన కుటుంబం స్పష్టం చేసింది.
జోమీ వర్గానికి చెందిన వాల్టే, 2023 మే 4న ఇంఫాల్‌లో జరిగిన మూక దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
మెయితీ, కుకి-జో వర్గాల మధ్య హింస చెలరేగిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. అప్పటి నుంచి గాయాల నుంచి కోలుకోని ఆయన, గత వారం హర్యానాలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.
ది హిందూ కథనం ప్రకారం, ఆయన మరణంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కూడా కుటుంబం డిమాండ్ చేసింది.
కుటుంబ సభ్యుల కోరిక మేరకు, వాల్టే మృతదేహాన్ని మొదట ఢిల్లీ నుంచి ఐజ్వాల్(మిజోరం)కు విమానంలో పంపించి, ఆపై ఫిబ్రవరి 24న రోడ్డు మార్గంలో ఆయన స్వస్థలమైన మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌కు తరలించారు.
పలువురి నివాళి..
దారి పొడవునా వందలాది మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించారు.
వాల్టే కుటుంబ సభ్యులను మణిపూర్ మంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ పరామర్శించి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారని ఆ వార్తాపత్రిక తెలిపింది.
అయితే, వాల్టే కుమారుడు జోసెఫ్ మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు అంత్యక్రియలు జరగవని స్పష్టం చేశారు.
ఈ డిమాండ్లను ఇప్పటికే మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు సమర్పించినట్టు ఆయన తెలిపారు.
ఫిబ్రవరి 24న చురచంద్‌పూర్‌లో పూర్తి బంద్ పాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు రాష్ట్ర సంతాప దినాలుగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 25న చురచంద్‌పూర్ ఆసుపత్రిలో వాల్టే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని జోమి కౌన్సిల్ అధ్యక్షుడు వుమ్సువాన్ నౌలక్ తెలిపారు.
తదుపరి కార్యాచరణను కుకి-జో కమ్యూనిటీ నాయకులు నిర్ణయిస్తారని ఆయన అన్నారు.
“మా దగ్గర డిమాండ్ల జాబితా ఉంది. ప్రభుత్వం ఆ షరతులను అంగీకరించకపోతే, ఖననం చేయడం అసంభవం” అని ఆయన స్పష్టం చేశారు.
ఇంతలో, చురచంద్‌పూర్‌ను గవర్నర్ భల్లా సందర్శించి వాల్టేకు నివాళులర్పించారు. అలాగే మృతుడి కుటుంబ సభ్యులను కలిసి తన సంతాపాన్ని తెలిపారు.
మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ కూడా దీనికి హాజరయ్యారు.
ఆ కుటుంబం తమ డిమాండ్ల జాబితాను గవర్నర్ భల్లాకు సమర్పించిందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ది హిందూకు తెలిపారు. ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడం అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని, దీనికి ఎన్నికైన ప్రభుత్వ అంగీకారం, సమయం రెండూ అవసరమని ఆయన అన్నారు. “ఇది మూడు లేదా నాలుగు రోజుల్లో సాధ్యపడేది కాదు”అని అధికారి తెలిపారు.
మోదీకి వాల్టే లేఖ..
చికిత్స పొందుతున్న సమయంలో, వాల్టే 2025 సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు.
ఇంటికి తిరిగి వెళుతుండగా మెయితీ మిలీషియా (అరంబై టెంగోల్) తనపై దారుణంగా దాడి చేసిందని అందులో పేర్కొన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన, పక్షవాతానికి గురై శారీరకంగా వికలాంగులయ్యారు. ఇంతటి తీవ్రమైన సంఘటన జరిగినప్పటికీ, ప్రత్యేక దర్యాప్తు(సీబీఐ/ఎన్ఐఏ) ప్రారంభించలేదని, తమ సమాజం ఇప్పటికీ అణగదొక్కబడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2023 మే 3న జాతి హింస చెలరేగిన మరుసటి రోజున(మే 4న), ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఇంఫాల్‌లోని కార్యాలయం నుంచి వాల్టే తిరిగి వస్తుండగా ఒక గుంపు ఆయనపై దాడి చేయడం గమనించదగ్గ విషయం. ఈ దాడిలో కుకి వర్గానికి చెందిన ఆయన డ్రైవర్‌ను చంపేయగా, మెయితీ వర్గానికి చెందిన భద్రతా అధికారిని మాత్రం గుంపు ప్రాణాలతో వదిలేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. వాల్టే మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
