దాడిలో చేయి విరగడంతో పాటు రషీద్ తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప గాయాలతో తన అన్నయ్య మాత్రం తప్పించుకున్నారు.
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్ సరిహద్దు కుప్వారా జిల్లా నివాసి డానిష్ గనయ్, చలికాలంలో జీవనాధారం కోసం గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో కశ్మీరీ శాలువా వ్యాపారిగా పని చేస్తున్నారు.
తన పేద కుటుంబానికి సహాయపడటం కోసం ఈ ఏడాది తనతో వ్యాపారం చేయాలని చిన్న తమ్ముడు తాబిష్ రషీద్‌పై ఒత్తిడి తెచ్చారు.
జనవరి 28న సాయంత్రం హిమాచల్ ప్రదేశ్‌లోని పవిత్ర స్థలం పాంటా సాహెబ్‌లో శాలువలను విక్రయించి, ఇద్దరు సోదరులు ఉత్తరాఖండ్‌లో తాము బస చేస్తున్న ప్రాంతానికి తిరుగు ప్రయాణమైయ్యారు.
ఆ రాష్ట్ర సరిహద్దులో ఉన్న వికాస్ నగర్లో తినడానికి ఒక దుకాణం వద్ద ఆగారు.
తన తలపై బలంగా ఇనుప రాడ్‌తో కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లేముందు. “వీరు ముస్లింలు, ముందుగా ఒకరిని అంతం చేద్దాం, ఆ తర్వాత మిగతావాడిని చూసుకుందాం” అంటూ దాడికి పాల్పడిన వారు దుకాణదారుడితో అన్న మాటలను రషీద్ విన్నారు.
“మేము కశ్మీరీ భాషలో మాట్లాడటాన్ని తొలుత దుకాణదారుడే నేరంగా భావించారు. ఉత్తరాఖండ్ కశ్మీర్ కాదని తను అన్నారు. తర్వాత మమ్మల్ని గట్టిగా నెట్టుతూ ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని గదమాయించారు. మేము కుర్చిలో నుంచి పైకి లేచి నిలబడగా, మా వద్ద ఉన్న శాలువాలు, ఇతర వస్తువులను లాక్కొని రోడ్డుపై విసిరి పారేశారు” అని రషీద్ ఫోన్ ద్వారా ‘ది వైర్’కు చెప్పారు.
“ఇలాంటి అవమానానికి” తాము అర్హులం కాదని, అయినా మేము ఎలాంటి తప్పు చేయలేదని దుకాణదారుడితో వారు వాదనకు దిగారు.
మానవత్వాన్ని చాటుకున్న స్థానికుల్లో కొందరు
“ఆయన వెంటనే లాఠీ తీసుకొని దుకాణం బయట మా సోదరుణ్ని కొట్టడం మొదలుపెట్టాడు. నేను సోదరుణ్ని కాపాడటానికి ప్రయత్నిస్తుండగా- ముస్లిం కావడం, కశ్మీరీ కావడం నేరంగా భావించేలా ఇనుప రాడ్‌తో వచ్చిన మరో వ్యక్తి మాట్లాడారు. ఆయన నన్ను ఒకవైపు నెట్టేసి తల పగలగొట్టాడు, దాంతో నేను స్పృహ కోల్పోయాను” అని రషీద్ వివరించారు.
ఉత్తరాఖండ్ వికాస్ నగర్లో సోదరులను కలవడానికి వెళ్లిన కుప్వారాకు చెందిన మరో నివాసి మహ్మద్ షఫీక్- దుకాణదారుడు, తన సహచరులు దాడి చేసిన వాస్తవాన్ని ధ్రువీకరించారు.
కొంతమంది స్థానిక హిందూ మహిళలు, పురుషులు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ ఇద్దరినీ కాపాడటం పట్ల ఆయన ప్రశంసించారు.
రషీద్ చేయి విరగడంతో పాటు తీవ్రంగా గాయపడగా, స్వల్ప గాయాలతో తన పెద్దన్న తప్పించుకున్నారు. “తాబిష్ తలపై ఎనిమిది నుంచి పది కుట్లు పడ్డాయి” అని షఫీక్ చెప్పారు.
“నేను స్పృహలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆసుపత్రిలో ఇతర శాలువా వ్యాపారస్తులు, కొంతమంది స్థానికుల మధ్య ఉన్నాను”అని రషీద్ తెలిపారు.
సోదరుల తప్పు ఏమీ లేదని దాడికి సాక్షిగా ఉన్న ఒక హిందూ మహిళ నిర్ధారించిన విషయాన్ని- తర్వాత తన సోదరుని ద్వారా రషీద్ తెలుసుకున్నారు.
సోదరుల తండ్రి జనవరి 29న ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు.
స్పందించిన రాజకీయ పార్టీలు
భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023లోని నిబంధన 117(2)(స్వచ్ఛందంగా గాయపరచడం), 352(ప్రజల శాంతికి భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా కించపరుస్తూ రెచ్చగొట్టడం) కింద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులకు వ్యతిరేకంగా వికాస్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్), ఇతరులు డిమాండ్ చేశారు.
ఈ కేసులో ఇంతవరకు ఎవరినైనా అరెస్టు చేశారా అన్న విషయం వెంటనే తెలియరాలేదు.
పోలీసులు కేసు నమోదు చేయడానికి ఆధారపడిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బాధితులపై స్థానిక వర్గాలు ఒత్తిడి పెంచుతున్నాయని, ఉత్తరాఖండ్‌లో కశ్మీరీ శాలువలను విక్రయిస్తూ జీవనోపాధిని పొందుతున్న కనీసం మరో ఇద్దరు వ్యక్తులు చెప్పారు. ఈ వాదనలను ‘ది వైర్’ వెంటనే ధ్రువీకరించలేకపోయింది.
“మా నాన్న ఇక్కడే ఉన్నారు, ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు” అని గద్గద స్వరంతో రషీద్ అన్నారు. “ఈ రోజు మాపై దాడి చేశారు, రేపు వేరేవారి మీద చేయవచ్చు. దేశంలో దాదాపు రోజువారీగా కశ్మీరీలతో ఇలాగే జరుగుతోంది. దెబ్బలు తినడానికే కశ్మీరీలు ఈ ప్రపంచంలోకి వచ్చారా? నిందితులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోనట్లయితే, అది మరిన్ని దాడులకు రెచ్చగొట్టడం అవుతుంది.”
బాధితుల సొమ్ము మాయం
దాడి తర్వాత సుమారు 21 వేల రూపాయల నగదుతో పాటు తమ శాలువాలు, ఇతర వస్తువులు కనిపించడం లేదని రషీద్ బాధపడ్డారు. “వేల రూపాయల విలువ చేసే 47 శాలువాలను ఎత్తుకెళ్లారు” అని తను తెలియజేశారు.
పేద కుటుంబాలకు చెందిన వందలాది మంది కశ్మీరీ పురుషులు, చలికాలంలో లోయ నుంచి బయటకు వచ్చి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కశ్మీరీ శాలువాలు, ఇతర హస్తకళా వస్తువులను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారిలో కొంతమంది హిందూ మితవాద ముఠాల దాడులకు గురవుతున్నారు. ఇది రాజకీయ పార్టీలు, కార్యకర్తలు- ఆందోళన చెందుతున్న పౌరుల ఆగ్రహానికి కారణమవుతోంది.
కశ్మీరీ శాలువాల అమ్మకందారులపై దాడుల్లో ఈ ఏడాది ప్రత్యేకంగా ఉత్తరాఖండ్ కేంద్రబిందువుగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఇలాంటి దాడులే నమోదయ్యాయి.
కొద్ది రోజుల క్రితమే, హిమాచల్‌లోని కాంగ్రా జిల్లా డెరా ప్రాంతంలో హిందూ మితవాద గుంపులు హెచ్చరించినప్పటికీ “భారత్ మాతా కీ జై” అని పలకడానికి నిరాకరించినందుకు ఒక కశ్మీరీ శాలువా అమ్మకందారుడిని వేధించారు.
ఉత్తరాఖండ్‌లో డిసెంబర్ 22న మరో కశ్మీరీ శాలువా విక్రయదారుడిపై దాడి జరిగింది. ఆ ఘటనలో అనుమానిత బజరంగ్ దళ్ కార్యకర్తను, తన సహచరులను అరెస్టు చేశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
