
ఎపిసోడ్ 1- నిత్యాన్వేషి
వాయేజర్ అంతరిక్ష నౌకల(Voyager Spacecraft)కు సంబంధించిన ఒక వార్త ఈ మధ్య వైరల్ అయ్యింది. అదే సమయంలో ఎప్పటిలాగానే తప్పుడు సమాచారం కూడా ఇంటర్నెట్లో చొరపడింది.
ఇంతకీ ఈ వాయేజర్లు అంటే ఏంటి? చాలామంది వీటి పేర్లు వింటూ ఉంటారు. నాసా చేత ప్రయోగింపబడిన అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ప్రయోగాలలో ఉపయోగపడుతున్నాయనే కోణం మాత్రమే తెలుసు. వాటి గురించి అవసరమైన సమాచారాన్ని వివరంగా తెలుసుకుందాం.
అన్నీ సైన్సులో ఉన్నాయి ష! మొదటి సీరీస్‌లో ఆధునిక విజ్ఞానశాస్త్రానికి ఎలా బీజాలు పడ్డాయి? వాటి వెనుక ఎవరి కృషి ఉందనే సమాచారాన్ని మనం తెలుసుకున్నాము. దీంతో పాటూ, వారు చేసిన పరిశోధనలు, వాటి ఫలితాలు, ఆ రహస్యాలతో పాటూ ఆ పరిశోధనల ప్రాక్టికల్/నిజజీవిత ఉపయోగాలు కూడా చూశాము. అదే పద్ధతిని ఇక్కడా అవలంబిద్దాము.
అన్నిటి కంటే పవిత్రమైనది, అభివృద్ధికి దోహదం చేసేది ‘ప్రశ్న’. అదే మనకు గత సీరీస్‌లో పునాది.
గలిలేవ్ గలిలియ్కు బాగా సహకరించటమే కాకుండా, ఆయన పరిశోధనలకు తగిన గుర్తింపు రావటానికి సహకారం అందించిన తన మిత్రుడు క్రిస్ఫర్ క్లావియస్ కథనంతో మొదటి సీరీస్ ముగిసింది.
ఇప్పుడు గలిలేవ్ గలిలియ్ చేసిన పరిశోధనల విస్తృత ఫలితాల్లో ఒకటైన వాయేజర్ అంతరిక్ష పయనం గురించి తెలుసుకుంటూ, గలిలేవ్ కాలానికి వెళ్దాం.
వాయేజర్లు ప్రధానంగా రెండు..
వాయేజర్- 1, వాయేజర్- 2 ఈ రెండు నౌకలు నాసా చేత ప్రయోగించబడ్డాయి. 1977లో ప్రయోగించబడ్డ ఇవి, మానవ జాతి చరిత్రలో అత్యంత దూరప్రాంతాలకు చేరిన మానవ నిర్మిత వస్తువులు. నేను ఇది రాస్తున్న సమయానికి ఉన్న తాజా సమాచారం ఆధారంగా(2025 ఆగస్టు 11), సంవత్సరాల క్రితం ప్రయోగించిన ఈ వస్తువులు ఇప్పటికీ పని చేస్తున్నాయి.
ప్రయోగ తేదీలు
♦ వాయేజర్- 2: 1977 ఆగస్టు 20న ప్రయోగించబడింది(మొదటిది).
♦ వాయేజర్- 1: 1977 సెప్టెంబరు 5న ప్రయోగించబడింది(రెండవది, కానీ వేగవంతమైన మార్గంలో ప్రయాణించి ముందుకు దూసుకుపోయింది).
పేర్లు తేడాగా ఉన్నాయి కదా. అదే మేజిక్కు.
ఈ రెండు నౌకలు టైటాన్ IIIE రాకెట్లతో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించబడ్డాయి. గ్రహాల సమలేఖనం సద్వినియోగం చేసుకుని, గురుత్వాకర్షణ సహాయంతో సుదూర అంతరిక్ష ప్రయాణాలు చేయటానికి రూపొందించబడ్డాయి.
ప్రయోగ ఉద్దేశ్యం
వాయేజర్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం బాహ్య సౌరమండల గ్రహాలను (outer planets) అన్వేషించడం. అంటే కుజుడు తరువాత వచ్చే asteroid beltకు అవతల ఉండే గ్రహాలు.
♦ ప్రాథమిక మిషన్: బృహస్పతి (Jupiter), శని (Saturn) గ్రహాలు, వాటి చంద్రులు, వలయాలు, వాతావరణాలు, అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయడం. వాయేజర్- 2 మాత్రమే యురేనస్(Uranus), నెప్ట్యూన్(Neptune)లను కూడా సందర్శించింది.
♦ విస్తరిత మిషన్: గ్రహాల అన్వేషణ తర్వాత, సూర్యుని ప్రభావం విస్తరించి ఉన్న ప్రాంతం(heliosphere), ముగిసే రేఖను (heliopause) దాటి, బాహ్యాంతరిక్ష ప్రదేశం (interstellar space)లోకి ప్రవేశించి, అక్కడి కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా వంటివి అధ్యయనం చేయడం. ఈ వ్యవహారం 1989లో ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది.
అదనంగా, రెండు నౌకలు “గోల్డెన్ రికార్డ్”(Golden Record) అనే 12-అంగుళాల బంగారు రికార్డును మోసుకెళ్తున్నాయి. ఇందులో భూమి గురించి చిత్రాలు, శబ్దాలు, సందేశాలు (55 భాషల్లో) ఉన్నాయి – బహుశా ఏలియన్స్ కనుగొనడానికి!
సిద్ధించిన విజయాలు
వాయేజర్ నౌకలు సౌరమండలం గురించి అనేక రీతులలో విప్లవాత్మక సమాచార సేకరణ చేశాయి. ఇవి మొదటి సారిగా బాహ్య గ్రహాల చిత్రాలు, డేటాను పంపాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
బృహస్పతి (Jupiter):
♦ బృహస్పతి చుట్టూ సన్నని వలయం ఉన్నట్టు కనుగొన్నది (వాయేజర్- 1).
♦ కొత్త చంద్రుల ఆవిష్కరణ- థీబ్(Thebe), మెటీస్ (Metis).
♦ ఐయో (I) చంద్రుడిపై అగ్నిపర్వతాలు (volcanoes) ఉన్నాయని మొదటి సాక్ష్యం.
♦ బృహస్పతి వాతావరణంలో మెరుపులు (lightning), రేడియేషన్ బెల్టులు.
♦ శని (Saturn):
♦ ఐదు కొత్త చంద్రులు, కొత్త వలయం (జీ-రింగ్).
♦ శని వలయాలలో “షెఫర్డ్” చంద్రులు (shepherd satellites) వలయాలను నియంత్రిస్తాయని కనుగొన్నది.
♦ టైటాన్ (Titan) చంద్రుడి (చంద్రుడు = ఉపగ్రహం) వాతావరణం గురించి వివరాలను (వాయేజర్ 1) ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.
♦ యురేనస్(Uranus) – వాయేజర్- 2 మాత్రమే:
♦ యురేనస్ చుట్టూ రింగులు, అయస్కాంత క్షేత్రం వివరాలు.
♦ కొత్త చంద్రులు, వాతావరణ లక్షణాలు.
♦ నెప్ట్యూన్ (Neptune) – వాయేజర్ 2 మాత్రమే:
♦ నెప్ట్యూన్ రింగులు, ట్రిటాన్ (Triton) చంద్రుడిపై గీజర్లు(geysers).
♦ నెప్ట్యూన్ వాతావరణంలో బలమైన గాలులు, మబ్బులు.
♦ బాహ్యంతరిక్ష ప్రదేశంలో (Interstellar Discoveries):
♦ సూర్యుని హీలియోస్ఫియర్ బయట మాగ్నెటిక్ బబుల్స్(magnetic bubbles) ఉన్నాయని కనుగొన్నది.
♦ హెలియోపాజ్ దాటిన తర్వాత కూడా సూర్యుని అయస్కాంత క్షేత్రం మారదనేది ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ.
♦ బాహ్యంతరిక్ష కణాలు(Interstellar Particles), ప్లాస్మా వేవ్‌ల గురించి డేటా.
♦ “పేల్ బ్లూ డాట్”(Pale Blue Dot)– వాయేజర్- 1 నుంచి భూమిని ఒక చిన్న బిందువుగా చూపిన ప్రసిద్ధ చిత్రం(1990లో తీసింది). మనం నివసించే భూమి ఎంత చిన్నదో తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరిగాక మీమ్స్‌గా, వ్యక్తిత్వవికాస కథనాలలో ప్రధాన భాగమైంది.
మొత్తం మీద, 48 చంద్రులు, రింగ్ సిస్టమ్‌లు, అయస్కాంత క్షేత్రాల గురించి మొదటి సమాచారాన్ని(first information as discovered by human efforts) ఈ నౌకలు అందజేశాయి. ఇవి సౌరమండలం గురించి మన అవగాహనను పూర్తిగా మార్చేశాయి.
ప్రస్తుత స్థితి, స్థానం
♦ వాయేజర్- 1: బాహ్యాంతరిక్ష ప్రదేశంలో(interstellar space) ఉంది. ఇది 2012 ఆగస్టులో హీలియోపాజ్ దాటింది. ప్రస్తుతం సూర్యుని నుంచి భిన్న దిశలో ప్రయాణిస్తోంది.
♦ వాయేజర్- 2: కూడా బాహ్యాంతరిక్ష ప్రదేశంలో ఉంది. 2018 నవంబరులో హీలియోపాజ్ దాటింది.
ఇవి రెండూ ఇప్పటికీ పని చేస్తున్నాయి. కానీ, పవర్ సేవ్ చేయడానికి కొన్ని పరికరాలు ఆఫ్ చేయబడ్డాయి(ఉదా: వాయేజర్-1లో సీఆర్ఎస్ 2025 ఫిబ్రవరిలో ఆఫ్, వాయేజర్ 2లో ఎల్ఈసీపీ 2025 మార్చిలో ఆఫ్). పవర్ సోర్స్: రేడియోఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లు, ప్లుటోనియం- 238తో పని చేస్తాయి.
మనకు ఎంత దూరంలో ఉంది?
2025 ఆగస్టు 13 నాటికి(2025 జూలై డేటా ఆధారంగా):
♦ వాయేజర్- 1: సుమారు 25.1 బిలియన్ కిలోమీటర్లు(25,000,000,000 km) లేదా 167.3 AU (Astronomical Units). 1 AU అంటే భూమి-సూర్యుడి దూరం (149.6 మిలియన్ km). సిగ్నల్ మనకు చేరడానికి ఏకమార్గ ప్రయాణ సమయం(One way): సుమారు 23 గంటలు.
♦ వాయేజర్- 2: సుమారు 21 బిలియన్ కిలోమీటర్లు లేదా 140.17 AU. సిగ్నల్ టైమ్: సుమారు 19 గంటలు. వేగం: వాయేజర్ 1 – 17 km/s (సూర్యుని పట్ల), వాయేజర్ 2– 15 km/s. ప్రతి సంవత్సరం సుమారు 3-3.5 AU దూరం పెరుగుతుంది.
ఇంకెంతకాలం ప్రయాణిస్తుంది?
♦ ఆపరేషనల్ లైఫ్: పవర్ తగ్గిపోతున్నందున, ఇన్స్ట్రుమెంట్లు 2025- 2030 వరకు పని చేస్తాయి. కమ్యూనికేషన్ 2036 వరకు సాధ్యం(అంటే, భూమికి డేటా పంపడం). తర్వాత, పవర్ పూర్తిగా అయిపోతుంది. నౌకలు “సైలెంట్” అవుతాయి.
♦ ప్రయాణం: పవర్ అయిపోయిన తర్వాత కూడా, ఇవి శాశ్వతంగా ప్రయాణిస్తాయి – ఎందుకంటే అంతరిక్షంలో ఘర్షణ లేదు. అవి నిశ్చల(inert objects) వస్తువులుగా మిల్కీ వే గెలాక్సీలో తిరుగుతాయి.
♦ భవిష్యత్ మైలురాళ్లు: 2026 నవంబరులో 1 లైట్-డే (25.9 బిలియన్ km) దూరం వరకు వాయేజర్- 1 చేరుతుంది. సుమారు 40,000 సంవత్సరాల తర్వాత, వాయేజర్-1 గ్లీస్ 445 నక్షత్రానికి(1.6 కాంతి సంవత్సరాల) చేరుతుంది, వాయేజర్- 2 రాస్ 248కు (1.7 కాంతి సంవత్సరాలు). ఒక నక్షత్రంతో ఢీకొనడానికి 1 సెక్స్టిలియన్ (10^21) సంవత్సరాలు పడుతుంది!
ఈ సమాచారం నాసా, విశ్వసనీయ మూలాల, భవదీయుని స్వీయ పరిశోధనల ఆధారంగా ఇవ్వబడింది. All details authentic up to mentioned Timeline. మరిన్ని వివరాలు కావాలంటే, NASA Voyager వెబ్సైట్ చూడండి.
వాయేజర్-1 అంతరిక్ష నౌక గురించి ఇటీవల సోషల్ మీడియాలో(ముఖ్యంగా ఫేస్బుక్, ఎక్స్ వేదికపై) కొన్ని వైరల్ పోస్టులు కనిపించాయి. ఇవి “కాంతి దినం దూరం”(one light-day distance) గురించి చర్చిస్తున్నాయి. ఈ పోస్టులు ఎక్కువగా Voyager- 1 ఇప్పటికే ఆ దూరం చేరిందని లేదా దగ్గర్లో ఉందని చెప్తున్నాయి. నేను ఈ క్లెయిమ్స్‌ను సరిజూసి నిజానిజాలు వివరిస్తాను.
సమాచారం నాసా, విశ్వసనీయ మూలాల, స్వీయ పరిశోధనల(original resrarvh matched with validated data) నుంచి సేకరించబడింది. అంతేకాకుండా, ప్రస్తుత తేదీ(2025 ఆగస్టు 13) ప్రకారం అప్డేట్ చేయబడింది.
♦ కాంతి దినం దూరం అంటే ఏంటి?
♦ ఒక “కాంతి దినం”(light day) అంటే కాంతి(లైట్) ఒక రోజు(24 గంటలు)లో ప్రయాణించే దూరం. ఇది సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు (25,900,000,000 km) లేదా 173 AU (Astronomical Units). ఒక AU అంటే భూమి- సూర్యుడి మధ్య దూరం(సుమారు 149.6 మిలియన్ km).
♦ ఇది సౌరమండలం బయటి ప్రాంతాలు అన్వేషించడానికి ఒక మైలురాయి, కానీ సుదూరంగా విస్తరించి ఉన్న ఈ అలవికాని విశ్వంలో దూరంగా ఉన్న చాలా చిన్న దూరం(ఉదాహరణకు, సమీప నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది).
♦ వైరల్ పోస్టులలో ఏం చెబుతున్నారు?
♦ ఎక్స్‌లో ఇటీవలి పోస్టులు(2025 జనవరి నుంచి ఆగస్టు వరకు) Voyager 1 గురించి వివిధ క్లెయిమ్స్ చేస్తున్నాయి:
♦ కొన్ని పోస్టులు(ఉదా, @astro_jaz నుంచి) “Voyager- 1 ఇప్పటికే ఒక light day చేరింది” అని తప్పుడు క్లెయిం చేశాయి. ఇవి విశ్వం విస్తారతను ఉదాహరణగా చూపిస్తున్నాయి.
♦ మరికొన్ని (ఉదా., @latestinspace) “48 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా Voyager 1 ఇంకా 1 light day చేరలేదు” అని సరైన వాస్తవాన్ని చెబుతున్నాయి. అంతేకాకుండా, ఇది కూడా బాగా వైరల్ అయింది(10,000+ లైక్స్).
♦ ఇతర పోస్టులు Voyager- 1 దూరం(15 బిలియన్ మైళ్లు లేదా 24 బిలియన్ km) గురించి మాట్లాడుతున్నాయి. కానీ light dayతో సంబంధం లేకుండా మిషన్ సక్సెస్ లేదా టెక్నాలజీ గురించి ఫోకస్ చేస్తున్నాయి (ఉదా, పాత Fortran కోడ్, 69KB మెమరీతో పని చేయడం).
♦ వెబ్ సెర్చ్‌లో కనిపించిన వైరల్ క్లెయిమ్స్: కొన్ని ఆర్టికల్స్, యూట్యూబ్ వీడియోలు “Voyager- 1 ఇప్పుడే 1 light day చేరింది” అని తప్పుడు తంబ్ నెయిల్‌లు ఉపయోగిస్తున్నాయి. కానీ వీడియో కంటెంట్‌లో 2026లో చేరుతుందని చెబుతున్నాయి.
♦ నిజానిజాలు: Voyager 1 ప్రస్తుత స్థితి
♦ ప్రస్తుత దూరం: 2025 ఆగస్టు 11 నాటికి, Voyager 1 సూర్యుని నుంచి సుమారు 167.3 AU (లేదా 25.1 బిలియన్ km) దూరంలో ఉంది. భూమి నుంచి సిగ్నల్ చేరడానికి సుమారు 23 గంటలు పడుతోంది. ఇది ఇంకా 1 light day (173 AU) చేరలేదు. ఇంకా సుమారు 6 AU(900 మిలియన్ km) దూరం ఉంది.
♦ ఎప్పుడు చేరుతుంది?: Voyager-1 2026 నవంబరు చివరి లేదా 2027 జనవరి మొదట్లో 1 light day దూరం చేరుతుంది. మానవ నిర్మిత వస్తువులలో ఈ మైలురాయిని చేరటంలో ఇది మొదటిది.
♦ వేగం, ప్రయాణం: Voyager- 1 సుమారు 17 km/s(61,200 km/h) వేగంతో ప్రయాణిస్తోంది. 1977లో ప్రయోగించబడిన తర్వాత, ఇది 2012లో సౌరమండలం బయటి ప్రాంతం(హెలియోపాజ్) దాటి అంతర్ గ్రహాంతర ప్రదేశంలోకి ప్రవేశించింది. ఇప్పటికీ డేటా పంపుతోంది. కానీ, పవర్ తగ్గిపోతున్నందున 2030లోపు ఆపరేషన్స్ ముగియవచ్చు.
♦ వైరల్ క్లెయిమ్స్ ఎందుకు తప్పు?: కొన్ని పోస్టులు, వ్యాసాలు దూరాన్ని రౌండ్-అప్ చేసి “ఇప్పుడే చేరింది” అని చెబుతున్నాయి. కానీ, అధికారిక నాసా డేటా ప్రకారం ఇంకా కాదు. ఉదాహరణకు, సిగ్నల్ టైమ్ 23 గంటలు అని చెప్పి “దాదాపు 1 light day” అని మిస్లీడ్ చేస్తున్నాయి, కానీ ఖచ్చితంగా 24 గంటలు(1 light day) కాదు.
♦ ఎందుకు ఈ విషయం వైరల్ అయింది?
♦ Voyager మిషన్ మానవులకు వారు సృష్టించిన వస్తువుల ద్వారా చేస్తున్న సుదూర, సమదీర్ఘపు అన్వేషణ. అంతేకాకుండా, light day అనే మైలురాయి విశ్వం విస్తారతను హైలైట్ చేస్తుంది (ఉదా: విశ్వం బిలియన్ల లైట్-ఇయర్ల విస్తీర్ణం). పోస్టులు ఇలాంటి ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్‌తో వైరల్ అవుతున్నాయి.
♦ మరికొన్ని పోస్టులు Voyager- 1 ఇటీవలి సమస్యలు(ఉదా: ఫ్రోజెన్ థ్రస్టర్స్ రిపేర్) గురించి మాట్లాడుతున్నాయి. ఇది కూడా వైరల్ అయింది.
మొత్తంగా, వైరల్ పోస్టులలో కొన్ని తప్పుడు క్లెయిమ్స్ ఉన్నాయి – Voyager-1 ఇంకా 1 light day చేరలేదు, కానీ త్వరలో (2026లో) చేరుతుంది.అదే చేరకపోతే వాయేజర్- 2 చేరే అవకాశం లోనే లేదు (అసలు చేరుతుందా అనేది కాదు, ప్రస్తుతం చేరిందా లేదా అనేది ముఖ్యం).
అసలు బాహ్య గ్రహాలు కాకుండా మన మానవులు బాహ్యాంతరిక్ష ప్రయోగాలు చేయబూనటం వివరాలు సేకరించటానికి బీజం పడింది ఒక శాస్త్రవేత్త పరిశోధనల వల్ల. ఆయనే మనం మాట్లాడుకునే గెలీలియో.
గలిలేవ్ గలిలియ్ (Galileo Galilei)..
ఈయన17వ శతాబ్దంలోని ఇటాలియన్ శాస్త్రవేత్త. ఆయన పేరు తెలియదంటే బడి వయసు రాని పిల్లలయినా అయి ఉండాలి. లేదా ఏవైనా నిర్మానుష్య ప్రాంతాల్లో కొండ గుహలలో జీవితకాలం ఉండి ఉండాలి. ఆయన పరిశోధనలు ఆధునిక అంతరిక్ష/ఖగోళశాస్త్రానికి పునాది వేశాయి. ముఖ్యంగా, బృహస్పతి (Jupiter) గ్రహం, దాని చంద్రుల గురించిన ఆయన ఆవిష్కరణలు(discoveries) వాయేజర్(Voyager) అంతరిక్ష మిషన్ ఉద్భవానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా దోహదం చేశాయి. ఇక్కడ ఆధారాలతో సహా, వివరంగా చూద్దాం.
♦ గలిలియ్ పరిశోధనలు: పునాది
♦ 1610లో గలిలేవ్ గలిలియ్ తన టెలిస్కోప్ ఉపయోగించి బృహస్పతి చుట్టూ నాలుగు పెద్ద చంద్రులు(Galilean moons: Io, Europa, Ganymede, Callisto) తిరుగుతున్నట్టు మొదటిసారి కనుగొన్నాడు. ఇది సూర్యకేంద్రక సిద్ధాంతం (Copernican model)కు బలమైన సాక్ష్యం ఇచ్చింది. ఇది భూకేంద్రక సిద్ధాంతాన్ని (భూమి కేంద్రంగా) తిరస్కరించడానికి సహాయపడింది.
♦ ఈ ఆవిష్కరణలు సౌరమండలం బాహ్య గ్రహాల(outer planets) గురించి మానవ జ్ఞానాన్ని విప్లవాత్మకంగా మార్చాయి. ఆధునిక అంతరిక్ష అన్వేషణలకు ప్రేరణ ఇచ్చాయి. గలిలియ్ పరిశోధనలు బృహస్పతి సిస్టమ్‌ను అధ్యయనం చేయడానికి ఆసక్తి పెంచాయి. ఇది తర్వాతి శతాబ్దాల్లో మరింత అద్భుతమైన టెలిస్కోప్‌లు, అంతరిక్ష మిషన్లకు దారి తీసింది.
♦ వాయేజర్ మిషన్ ఉద్భవానికి దోహదం..
♦ ప్రేరణ: బృహస్పతి, దాని చంద్రుల గురించి శాస్త్రీయ ఆసక్తిని గలిలియ్ ఆవిష్కరణలు పెంచాయి, ఇది 20వ శతాబ్దంలో నాసా వంటి సంస్థలు బాహ్య గ్రహాలను అన్వేషించడానికి ప్రేరణ ఇచ్చింది. వాయేజర్ మిషన్ (1977లో ప్రయోగించబడింది) ప్రధాన లక్ష్యం బృహస్పతి, శని, ఇతర బాహ్య గ్రహాలను అధ్యయనం చేయడం– ఇది గలిలియ్ మొదట కనుగొన్న గ్రహాలు, చంద్రులపై దృష్టి సారించింది.
♦ నేరుగా అధ్యయనం: వాయేజర్- 1, 2 నౌకలు 1979లో బృహస్పతి వద్దకు చేరి, గలిలియ్ కనుగొన్న చంద్రుల గురించి వివరమైన డేటా సేకరించాయి. ఉదాహరణకు: Io చంద్రుడిపై అగ్నిపర్వతాలు (volcanoes), భూకంపాలు కనుగొన్నది.
♦ యూరోప్‌ను జీవం ఉండే అవకాశం ఉన్న ప్రదేశంగా గుర్తించింది (ఐస్ ఉపరితలం క్రింద సముద్రం ఉండవచ్చు).
♦ బృహస్పతి రింగ్ సిస్టమ్, మేఘాల నిర్మాణాలు వివరించింది.
♦ గలిలియ్ పరిశోధనలు లేకుండా, ఈ గ్రహాలు, చంద్రుల గురించి ముందస్తు జ్ఞానం లేకుండా వాయేజర్ మిషన్ రూపొందించబడి ఉండేది కాదు. ఆయన ఆవిష్కరణలు మిషన్ లక్ష్యాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇంకా వాయేజర్ డేటా గలిలియ్ పరిశీలనలను విస్తరించి, విప్లవాత్మక ఆవిష్కరణలు చేసింది (ఉదా: బృహస్పతిపై మెరుపులు, రేడియో వేవ్‌లు).
♦ కౌనసాగింపు – తర్వాతి మిషన్లు..
♦ వాయేజర్ తర్వాత, నాసా గలిలియ్ పేరుతోనే ఒక మిషన్ (Galileo spacecraft, 1989లో ప్రయోగం) రూపొందించింది, ఇది బృహస్పతిని ఆర్బిట్ (చుట్టూ తిరిగి) చేసి, చంద్రుల గురించి మరిన్ని వివరాలు సేకరించింది. ఇది గలిలేవ్ గలిలియ్ పరిశోధనల వారసత్వాన్ని కొనసాగించింది.
♦ ఇప్పుడు, JUICE, Europa Clipper వంటి మిషన్లు గలిలియ్ ఆవిష్కరణలు, ఇవన్నీ వాయేజర్ డేటా ఆధారంగా రూపొందించబడుతున్నాయి.
మొత్తంగా, గలిలియ్ పరిశోధనలు వాయేజర్ మిషన్‌ను ప్రేరేపించి, దాని లక్ష్యాలను నిర్దేశించాయి. అంతేకాకుండా, సౌరమండలం అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచాయి.
సరదాగా ఒక మాట చెప్పుకుందామా? అంతరిక్షంలో కూడా అభిమానులు ఉన్న ఏకైక నటుడు శోభన్ బాబు. నమ్మరా? ఏకంగా గురు గ్రహం (క్లాసీగా, కనీకనిపించకుండా), శనిగ్రహం రింగులు మెయింటెయిన్ చేస్తున్నాయి. ఆఖరికి నెప్ట్యూన్ కూడా.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.