♦ రాజకీయ ప్రక్రియ వల్ల ప్రభావితం కాకూడదు
♦ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్న ఉద్బోధ
“రాష్ట్రాలను తమ ఆధీనంలో ఉన్నట్టుగా(సబార్డినేట్లుగా) కాకుండా సమాన స్థాయి సమన్వయకర్తలుగా(కోఆర్డినేట్లుగా)” చూడాలని, అధికారాల విభజన అనేది “సహ-సమానుల మధ్య రాజ్యాంగపరమైన ఏర్పాటు” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అన్నారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగపరమైన పరిపాలన చెక్కుచెదరకుండా ఉండాలంటే భారత ఎన్నికల సంఘం కచ్చితంగా స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుందని వచ్చే ఏడాది దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నట్టు ది ట్రిబ్యూన్ కథనం తెలియజేసింది.
“ఈ సంస్థలు రాజకీయ ప్రక్రియ వల్ల ప్రభావితం కాకుండా స్వతంత్రంగా పనిచేయడం అత్యంత ముఖ్యం” అని ఏప్రిల్ 4న పాట్నాలోని చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రాజేంద్ర ప్రసాద్ స్మారకోపన్యాసంలో జస్టిస్ నాగరత్న చెప్పారు.
“కాన్స్టిట్యూషనలిజం బియాండ్ రైట్స్: వై స్ట్రక్చర్ మ్యాటర్స్” అనే అంశంపై ఆమె ఈ ప్రసంగం చేశారు.
“సకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వంలో మార్పులు సాఫీగా జరుగుతాయని మన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం నిరూపించింది. ఆ ఎన్నికల ప్రక్రియపై నియంత్రణ కలిగి ఉండటం అంటే, వాస్తవానికి రాజకీయ పోటీ పరిస్థితులపైనే నియంత్రణ సాధించడం లాంటిది” అని ఆమె అన్నారు.
కీలక సంస్థలకు ప్రత్యేక బాధ్యతలు..
ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘం- ఈ మూడింటి రూపకల్పన వెనుక ఒకే విధమైన లాజిక్ ఉందని జస్టిస్ నాగరత్న తెలిపారు.
తటస్థతను కాపాడటంలో సాధారణ రాజకీయ ప్రక్రియ సరిపోని రంగాలను పర్యవేక్షించేందుకు వీలుగా- ఈ సంస్థలను బయటి ప్రభావాలకు లోనుకాకుండా, ప్రత్యేక నైపుణ్యంతో, నిర్దిష్ట బాధ్యతలతో తీర్చిదిద్దారని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రాలు గులాములు కావు.. సమన్వయకర్తలుగా చూడాలి..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను తమ “సబార్డినేట్లు”గా(ఆధీనంలో ఉన్నట్లుగా) కాకుండా “కోఆర్డినేట్లు”గా(సమాన స్థాయి సమన్వయకర్తలుగా) చూడాలని జస్టిస్ నాగరత్న కోరారు.
అధికారాల విభజన అనేది “సహ-సమానుల మధ్య రాజ్యాంగపరమైన ఏర్పాటు” అని ఆమె పేర్కొన్నట్లు ట్రిబ్యూన్ కథనం వెల్లడించింది.
“అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. రాజ్యాంగంలో నిర్దేశించిన మేరకు మినహా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో(సబార్డినేట్‌గా) ఉండేవి కావు. కాబట్టి, అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉందనే దానితో సంబంధం లేకుండా రాష్ట్రాలకు దక్కాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే” అని నాగరత్న స్పష్టం చేశారు.
రాజకీయాలకు అతీతంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
“కేంద్ర-రాష్ట్ర సంబంధాల వ్యవహారంలో వివిధ పార్టీల మధ్య విభేదాలను లేదా భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టాలి. ఎందుకంటే కేంద్ర-రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగబద్ధమైన పరిపాలన పరిధిలోకి వస్తాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉంది అనే అంశంపై ఇవి ఆధారపడి ఉండకూడదు” అని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
