Reading Time: 3 minutes
ప్రపంచ జనాభాలో సగటు ఆయుర్దాయం లెక్కేసినప్పుడు జనాభా వయో పొందికల విషయంలో భారతదేశమే ముందంజలో ఉంది.
ఈ సానుకూలతతో భారతదేశం ఆర్థిక రంగంలో ఎన్నో విజయాలు సాధింవచ్చు. కానీ భారతదేశం ఆ దిశగా అడుగులేస్తోందా?
భారతదేశంలో పని చేయటానికి సిద్ధంగా ఉన్న యువశక్తి ఎక్కువగా ఉందని, అదే పెద్ద వనరు లేదా ఆస్తి అని పాలకులు తరచూ ప్రచారం చేస్తుంటారు.
పరిశోధకుల పరిభాషలో దీన్నే “డెమొగ్రాఫిక్ డివిడెండ్” అంటుంటారు.
డెమొగ్రాఫిక్ డివిడెండ్ అంటే, దేశ జనాభాలో శ్రమ చేయగల వయోజనుల సంఖ్య అధికంగా ఉండటం.
ఇంతమంది పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు- వారికి పని కల్పించి, ఉత్పాదక సామర్ధ్యం పెంచటం వైపు వారి శ్రమ శక్తిని మళ్లిస్తే ఆ దేశం సంపన్నదేశంగా ఎదుగుతుందన్నది ఓ తార్కిక ఆర్థిక సూత్రం.
మారుతున్న జనాభా పొందికను బట్టి నేటికీ భారతదేశానికి ఆ అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు చారిత్రకంగా జనాభా వయో పొందికలో వచ్చిన మార్పులు, రాబోయే కాలానికి సంబంధించిన అంచనాలను పరిశీలించాము.
డెమొగ్రాఫిక్ డివిడెండ్ సూత్రీకరణ
జనాభా వయో పొందికల అధ్యయనంలో నిష్ణాతుడు, ఆర్థికవేత్త డేవిడ్ ఈ బ్లూం తన సహచరులతో కలిసి 2003లో ఓ పుస్తకం రాశారు.
ఈ పుస్తకంలోనే “జనాభా వయో పొందికలతో వచ్చే ప్రయోజనాలు(డెమొగ్రాఫిక్ డివిడెండ్)” అనే పదాన్ని మొదటిసారిగా సూత్రీకరించారు.
ఏ దేశ జనాభాలోనైనా పని చేయటానికి సిద్ధంగా ఉన్న జనాభా ఎక్కువగా ఉంటే, సరైన విధానాల ద్వారా వీరికి పని కల్పించగలిగితే, వీరి శ్రమశక్తిని ఉపయోగించుకోగలిగితే ఆ దేశానికి ఆర్థిక ప్రయోజనం ఎక్కువగా ఉంటుందన్నది ఈ సూత్రీకరణ సారాంశం.
ఈ పదాన్ని జనాభా పొందిక అధ్యయనవేత్తలు, ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు తరచుగా ఉపయోగిస్తున్నారు.
జనాభాలో పని చేయగల శక్తి ఉన్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నంత మాత్రాన దానంతట అదే ఆర్థిక ప్రయోజనం కాదు.
ఆర్థిక ప్రయోజనంగా మారదు. ఆర్థికశాస్త్రం రీత్యా చూసినప్పుడు అటు యువతకూ, ఇటు వృద్ధులకూ ప్రభుత్వం ఆర్ధిక సహకారం అందించాల్సి ఉంటుంది.
పని చేయగల సామర్థ్యమున్న జనాభా మాత్రమే దేశ అభివృద్ధికి అవసరమైన సంపదను జోడించగలరని రచయితలు ప్రతిపాదించారు.
దేశ జనాభాలో పిల్లల సంఖ్య తగ్గిపోయి, పని చేయగల వయస్సులో ఉన్న జనాభా సంఖ్య ఎక్కువై, వృద్ధుల జనాభా మరీ ఎక్కువ మోతాదులో లేని స్థితికి దేశ జనాభా పొందిక చేరినప్పుడు అది ఆర్థికవేత్తలు సూత్రప్రాయంగా ప్రతిపాదిస్తున్న ప్రయోజనాలను అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
తగ్గిపోతున్న పిల్లల జనాభా
భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు 1980 దశకం నాటి నుంచి తగ్గనారంభించింది. సంతానోత్పత్తి రేటు తగ్గటం దీనికి ఒక కారణం.
గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. తాజా అంచనాల ప్రకారం, భారతీయ మహిళలు వారి జీవిత కాలంలో 2.1 మంది కంటే తక్కువ సంఖ్యలోనే పిల్లలకు జన్మనిచ్చే ఆరోగ్య సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
దేశ జనాభాలో యువతరం, శ్రామికతరం ఇప్పుడున్న మోతాదులోనే కొనసాగాలంటే- ప్రతి మహిళా కనీసం 2.1 మందికి జన్మనిచ్చే పరిస్థితి ఉండాలి.
ఇంకా తేలిగ్గా చెప్పాలంటే, ఇప్పుడున్న జనాభా ఇదే మోతాదులో ఉండాలంటే భారతీయ మహిళలు శిశు- బాల మరణాలు వంటి అనేక వైపరీత్యాలను దాటి బతికి ఉండే ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాల్సి ఉంటుంది.
దేశ జనాభా పొందికలో ఇదో కీలకమైన మైలురాయి. సంతానోత్పత్తి రేటు ఈ మోతాదు కంటే తగ్గిపోతే దేశ నికర జనాభా తగ్గటం మొదలవుతుంది.
తాజా అంచనాల ప్రకారం, భారతీయ మహిళల సంతానోత్పత్తి సామర్థ్యం- పైన చెప్పినదాని కంటే తక్కువగానే ఉంది.
ఈ విధంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గటంతో 2000 సంవత్సరం నాటికే దేశ జనాభాలో పిల్లల మోతాదు తగ్గడం మొదలైంది.
భారతదేశంలో పుట్టే పిల్లల సంఖ్య సహస్రాబ్ది ఆరంభం నాటికి పతాక స్థాయికి చేరింది. ఆ సమయంలో ఏడాదికి రెండుకోట్ల తొంభై లక్షలమంది పిల్లలు పుట్టేవారు.
ప్రస్తుతం ఈ సంఖ్య రెండు కోట్ల ముప్పై లక్షలకు పడిపోయింది.
అంటే గడచిన దశాబ్దానికి పైగా దేశంలో ఏడాదికి రెండుకోట్ల ముప్పై లక్షల మంది పిల్లలు మాత్రమే జన్మిస్తున్నారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత తగ్గనున్నది.
అంటే, పుట్టిన బిడ్డల మొదలు 14 ఏళ్ల వయస్సున్న పిల్లల వరకు దేశ జనాభాలో నికర పిల్లల మోతాదు తగ్గుతూ వస్తోంది.
మారుతున్న జనాభా ముఖచిత్రం: గణాంకాలు
2010 నుంచే దేశ జనాభాలో పిల్లల మోతాదు తగ్గటం మొదలైంది.
ఓ సమయంలో దేశ జనాభా 124 కోట్లుగా ఉన్నప్పుడు అందులో14 ఏళ్ల పిల్లల సంఖ్య 39 కోట్లుగా ఉండేది.
మన దేశ జనాభా చరిత్రలో మొత్తం జనాభాలో పిల్లల వాటా కుడిఎడంగా నాల్గోవంతుకు చేరటం ఇదే మొదటిసారి.
దేశ జనాభాను 15 ఏళ్ల అంతరమున్న బృందాలుగా విడగొడితే, గతంలో దేశ జనాభాలో అత్యధికులు 15 ఏళ్ల లోపున్నవారే ఉండేవారు.
ప్రస్తుతం దేశంలో పదిహేనేళ్ల లోపున్న పిల్లల జనాభా 34 కోట్ల యాభై లక్షలకు పడిపోయింది.
అంటే ఇది 15- 29 సంవత్సరాల వయస్సున్న వారి కంటే తక్కువగా, 30- 44 ఏళ్ల వయస్సున్న వారి జనాభాతో సమానంగా ఉంది.
సాపేక్షంగా చూసినప్పుడు, దేశ జనాభాలో పిల్లల మోతాదు తగ్గిపోతుంది. 1960 దశకం నాటికి దేశ జనాభాలో 40 శాతం మంది 14 ఏళ్ల లోపు ఉండేవారు.
ఈ మోతాదు 2025 నాటికి 25 శాతానికి పడిపోయింది. ముందు ముందు ఈ మోతాదు మరింత తగ్గనున్నది.
వివిధ రాష్ట్రాల మధ్య సామాజిక, ఆర్థిక రంగాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ- అన్ని రాష్ట్రాల్లో పిల్లల మోతాదు తగ్గడంలో సారూప్యత ఉండటం గమనించాల్సిన విషయం.
కేవలం బీహార్లో మాత్రమే 2036 వరకు పిల్లల మోతాదు నికరంగా కొనసాగనున్నది. ఆ తర్వాతే అక్కడ కూడా తగ్గనుంది.
పతాక స్థాయికి శ్రమశక్తి
సాధారణంగా 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న జనాభాను ఆ దేశపు శ్రమ శక్తిగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ వయో బృందాల జనాభా మొత్తం జనాభాలో 60 శాతం వరకూ ఉంది. అయితే దేశంలో సంతానోత్పత్తి రేటు, మొత్తం జనాభాలో 15 ఏళ్ల లోపున్న పిల్లల మోతాదును చారిత్రక కోణంలో పరిశీలించినప్పుడు రానున్నకాలంలో పనిచేయగల జనాభా మోతాదు క్రమంగా తగ్గనుంది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, రానున్న మూడు- నాలుగేళ్లల్లో దేశ జనాభాలో పనిచేయగల సామర్థ్యమున్న జనాభా మోతాదు పతాక స్థాయికి చేరనుంది. ఆ తర్వాత ఈ సామర్ధ్యం గల జనాభా మోతాదు తగ్గటమే తప్ప పెరిగే అవకాశం లేదు.
నికర సంఖ్యల్లో చూస్తే, 2040 నాటికి దేశ జనాభాలో 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకున్న జనాభా సంఖ్య 100 కోట్లకు చేరనుంది. ఆ తర్వాత నుంచి ఈ జనాభా సంఖ్య తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
పెరగనున్న వృద్ధుల భారం
2025 నాటికి దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన జనాభా 11 శాతానికి చేరుకున్నది. సగటు ఆయుర్దాయం పెరగడంతో రానున్న కాలంలో దేశ జనాభాలో వీరి సంఖ్య మరింత పెరగనుంది. కేరళ వంటి రాష్ట్రాల్లో మొత్తం జనాభాలో 20 శాతం అంటే ఐదో వంతు ఈ వృద్ధులే ఉండనున్నారు.
2050 తర్వాత దేశంలో నికరంగా పెరిగే జనాభా 60 ఏళ్ల పైబడిన వారిదే. రానున్న రెండు దశాబ్దాల్లో దేశ జనాభాలో పిల్లల సంఖ్య కంటే వృద్ధుల సంఖ్యే ఎక్కువ కానుంది. దేశ జనాభాలో వృద్ధుల మోతాదు పెరగటం అంటే పని చేయలేక బతకటం కోసం మరొకరిపైనో లేక ప్రభుత్వం ఇచ్చే పథకాలు, ప్రయోజనాలపైనో ఆధారపడే వారి సంఖ్య పెరగటమే.
వ్యాస రచయిత ఎస్ రుక్మిణి- డేటా ఫర్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు. ఈ విశ్లేషణ మొదట డేటా ఫర్ ఇండియా వెబ్సైట్లో ప్రచురించబడింది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.



