పేద పిల్లల తిండి గురించి, గరికపాటి ఇలా అన్నాడు.. అలా అన్నాడు.. అలా ఎందుకన్నాడు? అంటూ చాలామంది ఆశ్చర్యపోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.
పండితులమని విర్రవీగే ఇలాంటి వారు ఏదో అణగారిన వర్గాలను ఒకప్పుడు దయతో చూసి ఇప్పుడే కొత్తగా ఇలాంటి పైత్యాలను వెల్లగక్కుతున్నట్టు అందరికీ ఈ ఆశ్చర్యాలు ఎందుకో..!
ఆయనకు బలుపని, కొవ్వని, పండితుడేగానీ బుద్ధిలేదని(బుద్ధి లేకపోయినా పండితుడు కావచ్చన్న మాట) ఎవరికి తోచినట్టు వాళ్ళు అంటున్నారు.
అయితే, ఆయన అన్న మాటల్లో నిజంగా తప్పుందా!? ఉంటే, దాన్ని ప్రశ్నించే హక్కు మనకుందా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి.
సనాతనధర్మమా.. గాడిదగుడ్డా..
సనాతన ధర్మమైనా, పెట్టుబడిదారీ విధానమైనా అన్నీ దోపిడీ వ్యవస్థలే. ఒక వర్గాన్ని అణిచివేస్తేనే గానీ వీటికి మనుగడ ఉండదు.
సనాతన ధర్మానికి ఊపిరి అయిన మనుస్మృతిలో శూద్రుల భోజనాల గురించి చాలా చాలా నీచంగా చాలా స్పష్టంగా రాసుకున్నారు. పై మూడు వర్ణాలు తిన్న తర్వాత మిగిలిన ఎంగిలి కూడు మాత్రమే శూద్రులు తినాలి. హిందూమతం, సనాతన ధర్మం గొప్పదని చెప్పే ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా శూద్రులు మనుస్మృతిని తూచాతప్పకుండా పాటించి తీరాలి.
ఆయన గరికపాటి ఇంట్లో ఎంగిలి కూడు తినాలి..
అన్అపాలజిటిక్ సనాతని అయితే, అందులోనూ శూద్రుడు కాబట్టి ప్రతిరోజూ గరికపాటిలాంటి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళు తినగా మిగిలిన ఎంగిలి కూడు మాత్రమే తినాలి.
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సనాతనానికి గుడ్డిగా జేజేలు కొట్టే పల్లకీ కూలీలే కాదు, సనాతనధర్మం గొప్పదని భావించే ప్రతిఒక్కరూ అందులో ఉండే అనేక అనేక దరిద్రాలను(ఉదాహరణకు పెళ్ళైన శూద్ర వధువు మొదటి మూడు రాత్రులు పెళ్ళి జరిపించిన బ్రాహ్మణుడితో గడిపాకే భర్త దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటివి ఎన్నో) ఆమోదించి సనాతన ధర్మ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలి.
హిందూ మతం, హిందూ మతమని విర్రవీగుతున్న స్వార్థపరుల మీద ఏమాత్రం అభ్యంతరం లేకపోగా సమర్ధించే ఈ సమాజానికి, ఆ మతంలోని ధర్మాన్నే గరికపాటి బోధిస్తే ఎందుకీ ఉలికిపాటు? మీకొచ్చిన నొప్పేంటి? “మీ ధర్మాన్ని, మతాన్ని చూసి గర్వపడాలి”గాని వ్యతిరేకించడం ఎందుకు?
ఆహార నియంత్రణ దోపిడీకి సాధనం ..
ఆహారం అంటే శక్తి. ఆహారంపై నియంత్రణ అంటే మనుషులపై నియంత్రణ. హిందూ మతంలో పై వర్ణాలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలంటే మతం పేరుతో నియమాలు విధించాల్సిందే. ఈ నియమాలు సామాజిక నియంత్రణ + ఆర్థిక దోపిడీకి సాధనాలు.
కార్ల్ మార్క్స్ ప్రకారం, సమాజంలో మనుషుల మధ్య విభజన అనేది ఉత్పత్తి సాధనాలు(మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్) ఎవరికి ఉన్నాయో దాని ఆధారంగానే ఉంటుంది.
మనువాదంలో కూడా ఉత్పత్తి సాధనమైన భూమి, జ్ఞానం, అధికారాలు అన్నీ కూడా పైవర్ణాల చేతిలోనే ఉంటాయి. పని, ఉత్పత్తి కింది వర్ణాలు(శూద్రులు) చేయాలి.
అయినప్పటికీ వారికి వాటిపై హక్కులేకుండా చేసినప్పుడు మాత్రమే దోపిడీ వర్గం సామాజిక ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే వ్యవస్థగా మారుతుంది.
ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి వీళ్ళు పేదల ఆహారాన్నే కాదు ఆలోచనలను కూడా నియంత్రిస్తారు. మతం అనే ఆయుధంతో కింది వర్గాలపై హీన భావాన్ని చొప్పించి, వారు హీనమైనవారని వారిచేతే ఆమోదింపజేసి (వారికి ఆలోచన లేకుండా చేసి) పై వర్ణాల ఆధిపత్యమనేది అత్యంత సహజమైన విషయంగా మొత్తం సమాజాన్నే భ్రమింపజేస్తారు.
మంచి తిండి తింటే ఒళ్ళు మండదా..
ప్రవచనాల పేరుతో పనీపాటా లేకుండా ఎందుకూ పనికిరాని సొల్లు కబుర్లు చెప్పి ప్రజల్ని ఏమార్చుతూ కోట్లు గడించే గరికపాటి లాంటి వాళ్ళకు, పెట్టుబడి పేరుతో కార్మికుల రక్తాన్ని పీల్చి లాభాలకు లాభాలు గడించే కార్పొరేట్లకు తేడా ఏమీ లేదు, అంతా దోపిడీ వర్గానికి చెందినవాళ్ళే.
మరి వీరితో సమానమైన తిండి అణగారిన వర్గాలు కూడా తినాలని చూస్తే వీళ్ళకు ఒళ్ళు మండదా?
అసలు సనాతన ధర్మం ప్రకారం, కింది కులాల పిల్లలు ఎవరైనా చదువుకోవాలని చూస్తే వాళ్ళ నాలికల మీద వాతలు పెట్టాలి. గొంతులో సీసం పోయాలి. అలాంటిది దయ తలిచి చదువుకోనిస్తే ఇంకా గుడ్డు గాడిదగుడ్డు కావాలంటారా?
అంబేడ్కర్ రచనల్లో ఒకచోట: ఒకసారి మహారాష్ట్రలో కిందికులానికి చెందిన ఒక పెళ్ళి భోజనంలో పాయసం లాంటి స్వీట్ ఏదో పెట్టుకున్నారట. అది తెలిసి ఆ ఊరి అగ్రకులాల వాళ్ళంతా “మీ మొహాలకు స్వీట్ కావాలా?” అంటూ కత్తులు, కర్రలతో దాడి చేసి చివరకు ఆ పెళ్ళి కొడుకుని చంపేశారు. వాళ్ళ చెమటతో వాళ్ళు సంపాదించుకున్న తిండి తినే హక్కు కూడా వాళ్ళకు లేదు. ఇదీ మన సనాతన ధర్మం.
ముసుగు తొలగక తప్పదు..
ఇలాంటి అధర్మాన్ని ఈ దేశ విధానాలుగా మార్చడానికి పాలకులు ఉవ్విళ్ళూరుతుంటే, ఆ ట్రాప్లో పడిపోయి గొర్రెల్లాగా ప్రజలు తలలూపుతున్నారుగా; మరి గరికపాటి మాటలకు సన్మానించి ధర్మాన్ని నిలబెట్టాలిగానీ, ఆయనలాగా ద్వంద్వ వైఖరి ఎందుకు?
చాలా మంది గరికపాటి పేదల పక్షాన మాట్లాడతాడని సమర్ధిస్తున్నారు. అది ఆయన చాకచక్యం. కేవలం సొల్లు కబుర్లతో బుర్రలేని వాళ్ళనే కాదు, అప్పుడప్పుడూ ప్రొగ్రెసివ్ మాటలతో ఎంతో కొంత ఆలోచించేవాళ్ళను కూడా తన వైపుకు తిప్పుకోవాలనే ఎత్తుగడ తప్ప మరోటికాదు. ద్వంద్వ వైఖరితో ముసుగులు వేసుకుని ఎంత నటించినా అసలు రంగు అప్పుడప్పుడూ ఇలా బయట పడక తప్పదు. కుల అహంకారం బట్టబయలు కాకా తప్పదు.
నిజంగా పేదల విషయంలో కొంచమైనా నిజాయితీ ఉన్న వాడు ఎవ్వడూ కలలో కూడా ఇలాంటి చెత్త వాగుడు వాగడు.
“చదువుకునే పిల్లలకి ఇన్ని సౌకర్యాలా? ఇక వాడికి చదువేమొస్తుంది” అట. వాడి చదువు పట్ల ఈయన గారికి ఎంత శ్రద్ధో అన్నట్టు బిల్డప్. పేద పిల్లలకు కడుపునిండా తిండి, బట్ట కూడా సౌకర్యాలే, కానీ, ప్రవచనాలు చెప్పే ఇలాంటి సోమరులకు మాత్రం చేతి వేళ్ళకు ఉంగరాలు, మెడలో బంగారు గొలుసులు-(పంచములు మట్టి మూకుడులోనే తినాలి, ఇనప నగలే ధరించాలి, బంగారం వెండిలాంటివి పెట్టుకుంటే వాళ్ళను చంపే హక్కు కూడా వీళ్ళకు వస్తుంది ది గ్రేట్ సనాతన ధర్మంలో), ఏసీ కార్లు, ఏసీ రూములు, ఉచిత విమాన ప్రయాణాలు, అర్హత లేని గౌరవాలు ఏవీ వీళ్ళకు సౌకర్యాలు కావు, అన్నీ ప్రాథమిక అవసరాలు మాత్రమే.
పనికిరాని పాండిత్యం
చిన జీయర్ అని ఇంకో పనీపాట లేని ఆయన భోజనం తినే విధానాన్ని తెలుపుతూ గతంలో ఓ పెద్ద వీడియోనే చేశాడు.
ముందు పరమాన్నం, గారెలు, తర్వాత పప్పు, ఆపై కూర, పచ్చడి, పులిహోరా, రసం, పెరుగు ఇలా క్రమపద్ధతిలో తినాలట.
వీళ్ళు ఊరిమీద పడి శ్రమజీవుల్ని దోచుకుంటూ నిత్యం పంచభక్ష్య పరమాన్నాలతో బొజ్జలు పెంచుకోవచ్చు కానీ పేదల పిల్లలు కోడిగుడ్డు తిన్నా వీళ్ళకు ఒళ్ళంతా కారం పూసినట్టుంటుంది.
కొందరైతే ఈయనకు ఆకలి తెలియదు, పేదల తిండి గురించి తెలియదు అందుకే ఇలా మాట్లాడాడు అని జాలి చూపిస్తున్నారు. వాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదో ధర్మశాస్త్రాల పేరుతో శాసిస్తూ రాసుకున్న వీళ్ళకా తెలియంది. అన్నీ బాగా తెలుసుకాబట్టే, ప్రభుత్వ అండదండలతో మతం మత్తులో అణచివేతను మళ్ళీ మొదలు పెట్టారు.
ఆ మధ్య చిన జీయర్ కూడా చెప్పాడు. కులాలు పోకూడదట. ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకోవాలట. అంటే, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతూనే ఉండాలి తప్ప చదువుకోకూడదు.
వీళ్ళు చెప్పే సోది వినకపోతే, సామాన్య ప్రజలకు కించిత్ నష్టమైనా జరుగుతుందా? వీళ్ళ ప్రవచనాలు గంటలు గంటలు వినినంత మాత్రాన ఏ ఒక్కడి కడుపు అయినా నిండుతుందా? సమాజానికి ఏమాత్రం పనికిరాని వీళ్ళ పాండిత్యం వీళ్ళ ఆధిపత్యానికి మాత్రం మహా బాగా పనికొస్తుంది.
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారు..
ఇక పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసేవాళ్ళను చూస్తే నవ్వొస్తుంది. ప్రభుత్వాలు దోపిడీ వర్గాలకు కొమ్ము కాస్తాయి కాబట్టే ఇలాంటి వాళ్ళకు అలాంటి అవార్డులు వస్తాయి.
పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దనే ప్రభుత్వాలకు ఈయన మాటలకు తేడా ఏముంది?!
“స్కూళ్ళలో భోజనాలు పెట్టం, చదివితే చదవండి పోతేపోండి, అనే దమ్ముందా ఏ ప్రభుత్వానికైనా” అని ప్రశ్నిస్తున్నాడు ఈ మహా పండితుడు.
అవును, ఏ ప్రభుత్వానికీ దమ్ములేదు. ఒళ్ళొంచే పనిలేకుండా, ఏమాత్రం కష్టపడకుండా మతాన్ని అడ్డుపెట్టుకుని సొల్లు కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే ఇలాంటి సోమరుల నిజస్వరూపం బయటపెట్టే దమ్ము ఏ ప్రభుత్వానికీ లేదు.
మిమ్మల్ని గుడ్డిగా నమ్మే మూర్ఖుల ఓట్లు కావాలి. దొంగలంతా కలిసి ఊళ్ళు పంచుకోవాలిగా- ఒకరి గుట్టు ఒకరు కాపాడుకుంటూ ప్రజల్ని మూర్ఖుల్ని చేయడంలో కలిసికట్టుగా పనిచేస్తారు.
విప్లవాన్ని అడ్డుకోవడానికే సంక్షేమం
పేదల ఆకలి తీర్చడం దానం కాదు, అది సమాజం తిరిగి చెల్లించాల్సిన అప్పు. ఆకలితో ఉన్న పిల్లవాడితో చదువు గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడడం అంటే, గొలుసులతో కాళ్ళు కట్టేసిన మనిషిని పరిగెత్తమని చెప్పడం లాంటిది.
మన ప్రభుత్వాలకు బాగా తెలుసు ఖాళీ ప్లేట్లు ఉన్న చోట వర్గపోరాటం మొదలయ్యే ప్రమాదముందని.
అందుకే ఈ మాత్రం సంక్షేమమైనా పేదలకు దక్కుతుంది తప్ప పేదల మీద ప్రేమతో కాదు.
పాలకులు ప్రజల్లోకి నెమ్మదిగా ఎక్కిస్తున్న మతమనే విష బీజాలే, ఇలాంటి కుల అహంకారులకు ఇలా మాట్లాడే ధైర్యాన్ని ఇస్తుంది.
ఈ మత పిచ్చి ఇలాగే ముదురుతూపోతే ఏదో ఒకరోజు ఈ దేశంలో మనుస్మృతిని అమలుచేయాలంటూ డిమాండ్ చేసే కొండంత ధైర్యం కూడా వీళ్లకు అలవోకగా వచ్చేస్తుంది.
అలాంటి పరిస్థితి బీజేపీ పాలకులే తీసుకొస్తారు. ఈ మత మౌఢ్యాన్ని మొక్కగా ఉన్నప్పుడే తుంచి పారేయకపోతే వృక్షమైపోయాక చేసేదీమీ ఉండదు బానిస బతుకుల్ని ఆహ్వానించడం తప్ప.
మార్క్స్ చెప్పిన వర్గాలు(క్లాసెస్) మారే అవకాశం ఉంటుంది.
కానీ మనువాదం కులాన్ని జన్మతోనే స్థిరం చేస్తుంది కాబట్టి దోపిడీ మరింత బలాన్ని పుంజుకుంటుంది.
కుల వ్యవస్థని, దాన్ని శాసించే మత ఛాందసాన్ని తిరస్కరించడం ఒక్కటే మార్గం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
