
ఆధునిక సమాజంలో మనలో ప్రతీ ఒక్కరూ లేదా ప్రతీ కుటుంబం, రోజువారీ ఉపయోగానికి అవసరమైన ప్రతీ దానిని ఉత్పత్తి చేయదు. ఆధునిక సమాజంలో శ్రమ విభజన పరిధి అపారమైనది. పూర్వసమాజాలు కూడా సామాజిక శ్రమ విభజనను పంచుకున్నాయి. కానీ ఒకే స్థాయిలో కాదు.
ఆధునిక పెట్టుబడిదారీ సమాజాన్ని ప్రత్యేకంగా గుర్తించేది మార్కెట్ల- మార్కెట్ల కోసం ఉత్పత్తుల అపారమైన పెరుగుదల. మొదట పశ్చిమ యూరపులోనూ, ఆ తరువాత ప్రపంచమంతటా విస్తరించిన ప్రపంచ మార్కెట్ల అభివృద్ధి, మానవ చరిత్రలోనే సాపేక్షంగా ఇటీవలి దృగ్విషయం, పెట్టుబడిదారీ అభివృద్ధి ఫలసాయం. ఆధునిక సమాజంలో వాటిని మార్కెట్లో అమ్మే ఉద్దేశంతో ప్రజలు వస్తువులను క్రమపద్ధతిలో ఉత్పత్తి చేయడం, వారి అవసరాలను తీర్చడానికి ఇతర వస్తువులను కొనడాన్ని, నేటి ఆర్ధిక వ్యవస్థలు సరుకులను ఉత్పత్తి చేసేవని చెప్పడం ద్వారా సూచిస్తారు.
సరుకనేది మార్పిడి చేసే ఉద్దేశంతో ఏది బడితే దాన్ని ఉత్పత్తి చేసేది కాదు. మార్క్స్ వివరించినట్లు, ‘వివిధ రకాల శ్రమల ఫలితంగా, ప్రతిరకం శ్రమా స్వతంత్రంగా కొనసాగే, వ్యక్తిగత ఖాతాలలో చేరే ఒకదానికొకటి సంబంధించి అటువంటి ఉత్పత్తులు మాత్రమే సరకులుగా మారుతాయి’.
ఈ నిర్వచనం నుంచి(i) సరుకుల ఉత్పత్తికి సమాజంలో శ్రమ విభజన అవసరం కానీ అదే సరిపోదు. ఉదాహరణకు పురాతన భారతీయ గ్రామ సమాజంలో సామాజిక శ్రమ విభజన(వ్యవసాయం, చేతివృత్తులు)ఉంది. కానీ భూమి, ఇతర ఉత్పత్తి సాధనాలపై ఉమ్మడి యాజమాన్యంతో అక్కడ మార్కెట్ లేదు. సరకుల ఉత్పత్తీ లేదు. (ii) ప్రజలు తయారు చేసిన ఉత్పత్తులు సరుకులుగా మారడానికి ఉత్పత్తి సాధనాలు, శ్రమలో వ్యక్తిగత ఆస్తి అవసరం.
చారిత్రకంగా సరుకుల ఉత్పత్తి వంటివి, పురాతన యూరోపియన్ బానిస సమాజాల నుంచి ప్రారంభ ఆధునిక భూస్వామ్య పాలన వరకు వేర్వేరు రకాల సామాజిక వ్యవస్థల లక్షణం.
ఏమైనప్పటికీ, ఆధునిక యుగంలో మాత్రమే సామాజిక ఉత్పత్తి విధాన సరుకుల ఉత్పత్తి ఆధిపత్య అంశంగా మారుతుంది. ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానంలోనే సరుకుల ఉత్పత్తి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.
మార్క్స్‘పెట్టుబడి’లోని ప్రారంభ వాక్యాలలో: ‘పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రబలంగా ఉన్న సమాజాల సంపద “సరుకుల అపారమైన సంచితంగా” కనపడుతుంది. మన పరిశోధన అందువలన సరుకుల విశ్లేషణతో ప్రారంభం అవుతుంది’.
ఆధునిక సమాజంలో మానవులు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు పొందే సరుకుల రూపాలతో మార్క్స్ ప్రారంభించాడు. ఈ రూపం ప్రబలంగా ఉన్న ఉత్పత్తి విధాన చారిత్రక విశిష్టతను వెంటనే సూచిస్తుంది. సరుకు రూపాన్ని విశ్లేషించడం ద్వారా, పెట్టుబడిదారీ విధానంలో చాలా బాగా అభివృద్ధి చెందిన సరుకుల ఉత్పత్తి లక్షణాన్ని వెల్లడించే కొన్ని ప్రాథమిక వైరుధ్యాలను మార్క్స్ బయటకు తీసుకురాగలిగాడు. అదే సమయంలో సరుకు రూపాన్ని విశ్లేషించడం పెట్టుబడిదారీ రాజకీయ అర్ధశాస్త్రంపై అతని తదుపరి విశ్లేషణకు ప్రాథమికమైన మార్క్స్ విలువ సిద్ధాంతం అభివృద్ధి చెందడానికి దారి తీసింది.
సరుకుల విశ్లేషణ చాలా సంగ్రహమైనదీ. అంతేకాకుండా, పెట్టుబడి కష్టమైన భాగం. ఒక మారు ఈ విశ్లేషణను అర్ధం చేసుకున్న తరువాత, తరువాతి పెట్టుబడి భాగాలను అర్ధం చేసుకోవడం ఏమంత కష్టం కాదన్నది గుర్తుంచుకోవాలి.
మార్క్ సరకుల విశ్లేషణను వివరించే ప్రయత్నమే ఈ ప్రస్తుత వ్యాసం. సరుకు ద్విముఖ లక్షణంతో వస్తుంది. తరువాత అర్ధ శాస్త్రవేత్తలచే తప్పుగా అర్ధం చేసుకోబడిన విలువ అనే భావన, చివరగా మార్క్స్ వాడిన ‘కమోడిటీ ఫెటిసిజం’(సరకుల పట్ల వ్యామోహం)అన్న పద వివరణ వచ్చాయి.
వినియోగ విలువ- మారకపు విలువ..
ప్రతి సరుకుకూ రెండు అంశాలు ఉంటాయి. ఒకవైపున ఒక వస్తువుగా ఉపయోగపడే కొన్ని సహజ లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల ఒక పెన్ను దానితో ఎవరైనా రాయగల ఉపయోగకరమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ దృష్టితో చూస్తే, దానిని ఉపయోగకరంగా చేసే ఒక భౌతిక, రసాయనాల సేకరణ – సరుకుకు ఉపయోగ విలువ ఉంది.
మరొక వైపున సరుకును ఉత్పత్తి చేసిన వ్యక్తికి ఇది ఆసక్తి ఉన్న ఉపయోగ విలువ కాదు. కానీ కొన్ని ఇతర సరుకులకు సంబంధించి దాని మార్పిడి విలువ ఆసక్తికరమైనది. ఆవిధంగా ఇతర సరుకుతో సంబంధంలో ఒక పెన్నుకు మారకపు విలువ ఉంది. ఒక సరుకు వినియోగ విలువ, మార్పిడి విలువ రెండూ కలిగి ఉన్నదని ఎవరైనా చెప్పవచ్చు.
ఉదాహరణకు, ఒక జత చెప్పులతో ఒక పెన్నుకు గల మార్పిడి విలువను నిర్ణయించేది ఏమిటి? మనం దానికి వెంటనే సమాధానం ఇవ్వము. ఒక జత చెప్పులకు ఐదు పెన్నులు మారకం అయ్యాయని అనుకుంటే సమీకరణం: 5 పెన్నులు = 1 జత చెప్పులని వస్తుంది. పరిణామాత్మక(5కి 1)అంశం ప్రస్తుతానికి వదిలివేయబడితే, అది పెన్నులను చెప్పులతో సమానం చేస్తుంది. ఇది గుణాత్మక, పరిణామాత్మక సమీకరణం. ఒకే రకమైన కొలత వేయగలిగినది ఏదో పెన్ను- చెప్పులకు మధ్య ఉమ్మడిగా ఉండాలి. అసమాన సరకులలో ఒక దానికొకటి మార్పిడి చేసుకునేలా చేస్తున్న ఈ ఉమ్మడి అంశం ఏమిటి? అన్నది గుణాత్మక సమస్య.
సరుకులను ఒక దాని నుండి మరొక దానిని వేరు చేసి చూపేది వాటికున్న ఉపయోగ విలువ అయినందున అది భౌతిక, రసాయనిక లేదా ఇతర సహజ లక్షణం కాదు. అన్నిటికన్నా అధికమైన సామాజిక అమరికయిన డబ్బే సరకుల ఉత్పత్తి పరిణామం అయినందున, దాని స్వంత మూలమే మారకపు విలువ ఆధారంగా చేసిన ముందస్తు వివరణ ద్వారా వివరించాల్సి ఉన్నందున, ఒకదానికొకటి సరుకులను సమానం చేసేది డబ్బని చెప్పడం ఏమీ వివరించదు.
వినియోగ విలువగా వాటి పాత్రను వదిలి వేస్తె, చాలా విభిన్నమైన సరకులను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే [విక్రేత(అమ్మేవాని) భాగం నుండి సంగ్రహణ ద్వారా మార్పిడి ఖచ్చితంగా వర్గీకరించబడుతున్నందున]వాటికి ఒక ఉమ్మడి గుణం ఉన్నదని మనం కనుగొంటాము.
మానవ శ్రమ ఉత్పత్తి అయినందున అవి ఫలితాలు, ఇంకా చెప్పాలంటే సమాజంలో ఖర్చు చేసిన శ్రమలో వివిధ భాగాల ఖర్చు. ఆలోచనలో ఇక్కడ ఒక గెంతు వేయడం జరిగిందని గమనించడం ముఖ్యం. వివిధ సరుకులతో అనుబంధించబడిన వినియోగ విలువల నిర్దిష్ట లక్షణాల నుంచి సంగ్రహించడంలో ఈ సరుకులలోకి వెళుతున్న(నూలులో వడకడం, బట్టలో నేత వంటి) వివిధ రకాల శ్రమల నిర్దిష్ట లక్షణాల నుండి కూడా మనం తప్పనిసరిగా సంగ్రహిస్తున్నాము.
వివిధ సరుకుల గుణాత్మక సమానత్వం(ప్రారంభానికి ముందస్తు షరతు) కోసం ఉమ్మడి అంశం అవన్నీ కూడా పాలుపంచుకున్న నిర్దిష్ట రకాల శ్రమతో సంబంధం లేకుండా ‘సాధారణంగా మానవ శ్రమ’ ఉత్పత్తులని ఆవిధంగా సైద్ధాంతిక దృక్కోణం నుండి మనం చెప్పగలం. వాటిని విలువలుగా చేస్తున్న ఈ లక్షణాన్నే సరుకులన్నీ పంచుకున్నాయి.
దీనినే మార్క్స్ ఇలా చెప్పాడు: వాటన్నిటికీ ఉమ్మడిగా ఉన్న ‘ఈ సామాజిక పదార్ధ స్పటికాలుగా చూసినప్పుడు [“సాధారణంగా మానవ శ్రమ” స్పటికాలు, లేదా సంగ్రహించబడిన శ్రమ] అవి (సరకులు) విలువలు.
దీని ఆధారంగా మారకపు విలువ కేవలం విలువ అసాధారణ రూపం కాగా, ఒక సరుకును విలువ, వినియోగ విలువ రెండింటిగానూ చూడవచ్చు. విలువ అనే పదానికి గుణాత్మకంగా మార్క్స్ అనుకున్న అర్ధం ఒక సరుకు ఇతర సరకులన్నిటితో పంచుకున్న “సంగ్రహించబడిన మానవ శ్రమ” అనబడే నిర్దిష్ట సామాజిక లక్షణం.
విలువ, సంగ్రహించబడిన శ్రమ అనే పదాల ప్రాముఖ్యతలోనికి చొచ్చుకుపోవాలి. అలా చేసే ముందు, మారకపు విలువ సమస్య పరిణామాత్మక అంశానికి సంక్షిప్తంగా తిరిగి వద్దాము.
గుణాత్మకంగా మాట్లాడినప్పుడు సరకు విలువ దాని రూపొందించబడిన లక్షణం లేదా సంగ్రహించబడిన దానిలో మానవ శ్రమ సంయోగం. విలువ పరిణామాత్మక కొలత అది సరకు ఉత్పత్తిలో ఇమిడి ఉన్న శ్రమ సమయం పరిమాణం లేదా దానిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన శ్రమ సమయమని సూచిస్తున్నది. దీనికి మరింత అర్హత అవసరం, లేకపోతే ఉదాహరణకు ఒక పెన్నును ఉత్పత్తి చేయడానికి ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే దాని విలువ అంత ఎక్కువ, తక్కువ సామర్ధ్యం గల ఉత్పత్తిదారుడు ఎక్కువ విలువను సృష్టిస్తాడనే నిర్ధారణకు ఎవరైనా రావచ్చు.
ఇలాంటి అపోహలను నివారించడానికి, విలువ అనేది సామాజిక లక్షణం, సామాజికంగా నిర్ణయించబడుతుందని నొక్కి చెప్పడానికి మార్క్స్ ఈ విధంగా చెప్పాడు: ‘ఒక వస్తువు విలువ పరిమాణాన్ని నిర్ణయించేది సామాజికంగా అవసరమయ్యే శ్రమ లేదా దాని ఉత్పత్తికి సామాజికంగా అవసరమయ్యే శ్రమ’.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఏడవ భాగం, ఆరవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.