వేతనంతో కూడిన, వేతనం లేని శ్రమల మధ్య వ్యత్యాసాన్ని కూడా ముక్క వేతనాలు(Piece-wages) అస్పష్టం చేస్తాయి. కార్మికుల మధ్య పోటీని అవి ఇంకా తీవ్రతరం చేస్తాయి. ప్రతి కార్మికుని వేతనం అతను ఉత్పత్తి చేసిన వస్తువు సంఖ్యపై ఆధారపడి ఉన్నందున, తనకిచ్చిన సమయంలో తనకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో వస్తువులను ఉత్పత్తి చెయ్యడానికి ఆతను ప్రయత్నిస్తాడు.
శ్రమ తీవ్రతను చాలా ఎక్కువ చేయడానికీ, కార్మికుల మధ్య పోటీకి కూడా ఇది దారితీస్తుంది. కార్మికుడు చేసే ఈ అధిక శ్రమ ముక్క వేతనాలను నిర్ణయించడానికి ఆధారమైన నిబంధనల సవరణకు ఆ తరువాత దారితీస్తుంది. కార్మికుల వేతనాన్ని సమర్ధవంతంగా తగ్గిస్తుంది.
ఇంకా, వేతన రూపమే శ్రమను తీవ్రతరం చేయడానికి కార్మికుని బలవంతం చేస్తున్నందున, ఉత్పత్తి ప్రక్రియను పర్యవేక్షించి నియంత్రించవలసిన అవసరం తగ్గిపోతుంది. అ విధంగా పెట్టుబడిదారుడు పర్యవేక్షణ ఖర్చులను ఆదా చేసుకోవడానికి తోడ్పడుతుంది. ముక్క వేతనాలు(Piece-wages) ఇంతకూ ముందు ఉదాహరించిన వ్యవస్థ వెలుపల ఉంచే దానికి సారూప్యత గల గృహ కార్మికుల(ఇంటిలోనే ఉంది పనిచేసే) నూతన రూపాలకు కూడా దారితీస్తుంది. చారిత్రకంగా గమనించబడిన రెండు పరిణామాలను ఇది కలిగి ఉంది.
ఒక వైపు ముక్క వేతనాలు పెట్టుబదిదారునికీ, వేతన కార్మికునికీ మధ్య (పరాన్నజీవులు) దళారులు ఉండడాన్ని, తాము అద్దెకు తీసుకున్న శ్రమను మరొకరికి అద్దెకు ఇవ్వడాన్ని సులభతరం చేస్తుంది. మరొక వైపు ఒక్కొక్క ముక్కకు ఇంత ధర అని మేస్త్రీతో ఒప్పందం చేసుకోవడానికి పెట్టుబడిదారునికీ, ప్రధాన కార్మికుడు(మేస్త్రీ) స్వయంగా ఒక నిర్ణీత ధరకు తన సహాయ కార్మికులను నియమించుకోవడం, వేతనాలు చెల్లించడానికీ అనుమతి ఇస్తుంది. మూలధనం ద్వారా కార్మికులను దోపిడీ చేయడం ఇక్కడ సాటి కార్మికుడు కార్మికుడిని దోచుకోవడం ద్వారా ఆచరణలో జరుగుతుంది.
ముక్క వేతనం– నిర్ణీత కాల వ్యవధి వేతనాలు రెండూ కూడా పెట్టుబడిదారుడికీ, వేతన కార్మికుడికీ మధ్య ఉన్న ఒకే సంబంధం దోపిడీ సంబంధం ద్వారా అంచనా వేస్తారు. అదే సమయంలో కార్మికుల మధ్య పరస్పర సంబంధాలు కొంత మేరకు భిన్నంగా ఉంటాయి. కార్మికుల మధ్య వ్యక్తిగత విభేదాలను పెంచి వారి మధ్య పోటీని పెంచుతాయి. అది ఈ ప్రతికూల పాత్ర పోషిస్తున్నప్పటికీ ముక్క వేతనాలు(పీస్ వేజెస్) వ్యక్తిత్వానికి కల్పిస్తున్న విస్తృత పరిధి వ్యక్తిగత వక్తిత్వ వికాసానికీ దాంతోపాటు స్వేచ్ఛా, స్వాతంత్రం, కామికుల స్బీయ నియంత్రణ అభివృద్ధికి దారితీస్తాయి.
వేతన వ్యత్యాసాలు..
చివరగా వేతనాల గురించి మన చర్చను ముగించడానికి జాతీయ వేతన వ్యత్యాసాల అంశం వైపు మన దృష్టిని సారిద్దాము. శ్రమ శక్తి విలువ అని పిలవబడే దానిలో నైతిక, చారిత్రిక అంశం చేరి ఉన్నదనే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా కార్మిక వర్గం ఏ వర్గం నుంచి పుట్టిందో ఆ వర్గ ప్రజల ఉనికి నిర్దిష్ట పరిస్థితులను ఈ నైతిక, చారిత్రక పరిస్థితి ఉదాహరిస్తుంది. ఏదైతే శ్రమ శక్తి విలువకు వర్తిస్తుందో అదే జాతీయ వేతన వ్యత్యాసాలకు వర్తిస్తుంది.
కావున, వివిధ దేశాల(జాతుల) వేతనాల మధ్య వ్యత్యాసాలను పోల్చి చూసేటప్పుడు శ్రమ శక్తి విలువ మొత్తం మార్పులను నిర్ణయించే, జీవితం సహజంగా, చారిత్రకంగా అభివృద్ధి చెందిన ప్రధాన అవసరాల ధర– పరిధి, కార్మికుల శిక్షణకు అయ్యే ఖర్చు, మహిళా, బాల కార్మికుల శ్రమ పోషించిన భాగం, శ్రమ ఉత్పాదకత, దాని విస్తృత, ముమ్మర పరిమాణం 18 వంటి అన్ని అంశాలనూ మనం పరిగణనలోకి తీసుకోవాలి.
వివిధ దేశాలలోని శ్రమ శక్తి విలువ, వేతనాల మధ్య వ్యత్యాసాలకు తోడుగా కార్మికుల ఉత్పాదక శక్తిలోని వ్యత్యాసం అంతర్జాతీయ వస్తువుల(సరకుల) మార్పిడి నియమాల మార్పులను సూచిస్తుంది. మరింత ఉత్పాదక శక్తి గల అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఒక గంట పని ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఒక గంట పనికన్నా ఎక్కువ విలువ కలిగి ఉంటుంది.
ఒక దేశంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందితే అంతర్జాతీయంగా పోల్చి చూసినప్పుడు ఆ దేశంలోని కార్మికుల ఉత్పాదక శక్తి పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దానికి లక్షణంగా ఉన్న కార్మికుడి అధిక ఉత్పాదకత ముఖ్య పరిణామంగా అభివృద్ధి చెందిన ఆర్ధికవ్యవస్థలో వేతన రేటు అధికంగా ఉంటుంది. అయినప్పటికీ వెనుకబడిన దేశంతో పోల్చి చూసినప్పుడు అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలో అదనపు విలువ రేటు అధికంగానే ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలోని ఒక సగటు కార్మికుని జీవన ప్రమాణం(ఆ విధంగా నిజ వేతనం కూడా) భారత దేశ పరిశ్రమలోని ఒక సగటు కార్మికుని జీవన ప్రమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది.
అదే సమయంలో అమెరికాలోని కార్మికుని ఉత్పాదక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలోని 8 గంటల పనిదినంలో ఒక కార్మికుడు తన శ్రమ శక్తికి తగిన విలువ ఉత్పత్తిని రెండు గంటలలోనే చేస్తుండగా భారత దేశంలోని కార్మికుడు తన 9 గంటల పనిదినంలో సగ భాగాన్ని తన దయనీయ జీవనాధారం కొరకు వెచ్చించే స్థితికి ఇది దారితీస్తుంది. ఆ విధంగా కార్మికుడు వినియోగించుకున్న వస్తువులు, సేవల రూపంలో నిజవేతనం అమెరికాలో చాలా ఎక్కువే– అయినప్పటికీ, భారత దేశంలో అదనపు విలువ రేటు శాతం 100 (4 ½ / 4 ½) కాగా అమెరికాలో అదనపు విలువ రేటు 400 శాతం (8/2) ఉంటుంది.
ఈ దిగువ విధంగా చెప్పినప్పుడు మార్క్స్ ఈ విషయాన్నే ఖచ్చితంగా ఎత్తి చోప్పుతున్నాడు: రెండవ దేశంలోని శ్రమ ధరను అదనపు విలువతోనూ ఉత్పత్తి చేసిన సరుకు ధరతోనూ పోల్చి చూసినప్పుడు శ్రమ ధర సాపేక్షంగా మొదటిదేశంలో కన్నా ఎక్కువగా ఉండగా, దినసరి లేదా వారానికి ఇచ్చే వేతనం; రెండవ(వెనుకబడిన, తక్కువ ఉత్పాదక శక్తి కలిగిన) దేశంలో కన్నా మొదటి (ఎక్కువ ఉత్పాదకత కలిగిన)దేశంలో ఎక్కువగా ఉండడంలో ఇది తరచుగా కనపడుతుంది.
ఈ సందర్భంలో కేవలం కార్మికుని అధిక ఉత్పాదకతే అధిక నిజ వేతనాలను సాధ్యం చేస్తుందన్న విషయాన్ని గుర్తించడం ముఖ్యం. శ్రమ ఉత్పాదకత ద్వారా వేతనాలు నిర్ణయించబడతాయని(లేదా వేతనాలను ఉత్పాదకతతో ముడి పెట్టాలని), కార్మికునికి లభించేది కార్మికుడు తాను ఉత్పత్తి చేసిన దానికి అనుగుణంగా ఉంటుందనే అర్ధంలో పెట్టుబడిదారీ ఆర్దికవేత్తలూ ప్రతినిధులూ పదేపదే నొక్కి చెబుతారు. దానికి భిన్నంగా, వేతనాలకూ శ్రమ ఉత్పాదకతకూ సంబంధం లేదు. కానీ శ్రమ శక్తి విలువ చుట్టూ అల్లాడుతూ ఉంటుందన్నది మార్క్స్ అభిప్రాయం.
ఈ రెండవది ఉత్పాదకత, కార్మిక వర్గం ఏర్పడిన చారిత్రక పరిస్థితుల(నైతిక, చారిత్రక అమాసమని పిలవబడే వాటి) రెండింటి పని. కారీపై తన దాడిలో మార్క్స్ చెప్పినట్లు, ‘ప్రతిచోటా కార్మికుని ఉత్పాదకత నిష్పత్తిలో వేతనాల పెరుగుదల, పతనం ఉంటుందని నిరూపించడానికి కారీ ప్రయత్నించాడు. అదనపు విలువ ఉత్పత్తిపై మనం చేసిన విశ్లేషణ మొత్తం ఈ నిర్ధారణ అసంబద్ధతను ఎత్తిచూపింది.’
ఒక పునశ్చరణ– సింహావలోకనం..
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంపై మార్క్స్ విశ్లేషణపై ఈ అధ్యాయాల శ్రేణిలో విశ్లేషణాత్మక నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సమూహాలనే(బిల్డింగ్ బ్లాకులనే) వాటిని మనం ఇప్పటివరకు అభివృద్ధి చేశాము. చెప్పాలంటే పెట్టుబడిదారీ ఉత్పత్తికి సరుకును ఒక కణంగా ప్రారంభించాము. ఆ తరువాతిది/ రెండవది (పెట్టుబడిదారీ ఉత్పత్తి) సరుకుల ఉత్పత్తి సాధారణీకరణ,అత్యున్నత అభివృద్ధి తప్ప మరొకటి కాదు. సరుకు విలువా, వినిమయ విలువాని మనం తెలుసుకున్నాము; సామాజిక సంబంధాల పరంగా చూస్తే ఇది మొత్తం సామాజిక శ్రమలోని కొంత భాగాన్ని కలిగిఉంది, అందువలన ఇది ఒక విలువ,నైరూప్య శ్రమ లేదా సాధారణ శ్రమ సమ్మేళనం.
కొన్ని సహజ లక్షణాలు కలిగి ఉన్న నిర్దిష్ట విషయంగా చూసినప్పుడు అది ఒక నిర్దిష్ట రకమైన శ్రమ లేదా నిర్దిష్ట శ్రమ ఉత్పత్తి అయిన
వినిమయ విలువ. పరిమాణాత్మకంగా చూసినప్పుడు సరుకుల పునరుత్పత్తికి అవసరమైన సామాజిక శ్రమ కాలమే విలువ. విలువ అనే భావనను గుణాత్మకంగానూ, పరిణామాత్మకంగానూ అర్ధం చేసుకొని విలువ అనే భావనకూ సరకులపై గల వ్యామోహానికీ మధ్యగల సంబంధాన్ని మనం అధ్యయనం చేశాము.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 32వ భాగం, 31వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
