వేతనాలు, శ్రమ శక్తి విలువ– అదనపు విలువ రేటు..
మునుపటి మూడు అధ్యాయాలలో ఉత్పత్తిలో అదనపు విలువ ఎలా పుడుతుందో తెలుసుకున్నాము. సంపూర్ణ, సాపేక్ష అదనపు విలువల భావనలను, సంపూర్ణ– సాపేక్ష అదనపు విలువలను ఉత్పత్తి చేసే సాధనాలను కూడా అభివృద్ధి చేశాము. కార్మికుడు తన శ్రమ విలువకు సమానమైన విలువ వరకు ఉత్పత్తిని చేసే స్థితినిదాటి పనిదినాన్ని పొడిగించడం ద్వారా సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తి జరుగుతుందనే విషయం గుర్తుకు రావచ్చు.
ఆ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధారణ భూమికను, సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి ప్రారంభ స్థానాన్ని ఏర్పరుస్తుంది. సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి, అవసరమైన, అదనపు శ్రమల మధ్య పనిదిన విభజనను, ఆ విధంగా అవసరమైన శ్రమకు మించి పనిదినానాన్ని పొడిగించడాన్ని సూచిస్తున్నది. అంటే ఐది సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తిని సూచిస్తున్నది.
అవసరమైన శ్రమ సమయాన్ని తగ్గించడం ద్వారా అంటే పనిదినంలో శ్రమ శక్తిని పునరుత్పత్తి చేయడానికి సరిపడా ఖర్చు అయ్యే పనిదిన భాగాన్నికుదించడం ద్వారా సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి జరుగుతుంది. శ్రమ ఉత్పాదకతను పెంచే సాంకేతిక మార్పుల ద్వారా ప్రాథమికంగా ఇది సంభవిస్తుంది. సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి ముఖ్యమైనది కావడానికి సాంకేతికతను నిరంతరం విప్లవాత్మకంగా మెరుగుపరచాలి. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి పునాదిగా/ ఆధారంగా ఇది అవసరం.
కార్మిక ప్రక్రియ సంస్థపరంగా ఈ విషయాన్ని చూడడంతో ప్రారంభిస్తే, అదనపు విలువ ఉత్పత్తి కొరకు ఉత్పత్తి ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కానీ దానిని మార్చని పెట్టుబడిదారుల ప్రత్యక్ష నియంత్రణలోకి వేతన కార్మికులుగా ఉత్పత్తిదారులను తీసుకురావడం సంపూర్ణ అదనపు విలువను ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. ‘శ్రమను మూలధనం అధికారికంగా లొంగదీసుకోవడంగా మార్క్స్ దీనిని పిలుస్తాడు’.
ఉదాహరణకు ఒక వ్యాపారి ఒక రైతు కుటుంబానికి చెందిన కార్మికులకు ముడి పదార్ధాలను అందిస్తే, వారు తమ ఇళ్ళ వద్ద ఉత్పత్తులను; ఉదాహరణకు బుట్టలను తయారు చేసి, వాటిని తిరిగి వ్యాపారికి అమ్మారు అనుకుందాము– ఇప్పుడు వ్యాపారి పెట్టుబడిదారునిగా మారి, బుట్టల ఉత్పత్తిదారులందరినీ ఒక దగ్గరకు చేరిస్తే, వారు గతంలో లాగానే సాంకేతికంగా ఏ మార్పూ లేకుండా బుట్టలను ఉత్పత్తి చేసినా ఉత్పత్తి సంబంధాలలో మార్పు వచ్చింది. ఇప్పుడు బుట్టలల్లే వారిని పెట్టుబడిదారుడు అధికారికంగా వేతన కార్మికులుగా లొంగదీసుకున్న విషయం మన కళ్ళముందు ఉన్నది.
ఇది ఉత్పత్తి పద్దతులలో మార్పులను, శ్రమ ప్రక్రియలో మార్పులను కలిగి ఉన్నందున, సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి, శ్రమ ప్రక్రియలో మూలధనం శ్రమను నిజంగా లొంగదీసుకోవడాన్ని క్రమంగా బలోపేతం చేస్తుంది.
వారి విశ్లేషణాత్మక వ్యతాసాలు ముఖ్యమైనవి అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, సంపూర్ణ– సాపేక్ష అదనపు విలువలు ఏమైనా అదే తరానికి చెందిన అదనపు విలువలని పిలవబడుతున్న జాతులు. ఈ అధ్యాయంలో మనం సంపూర్ణ– సాపేక్ష అదనపు విలువల రెండింటి ఉత్పత్తి ప్రక్రియల పరిస్థితులలో అదనపు విలువ రేటును నియంత్రిస్తున్న నియమాలను అన్వేషించవలసి ఉంది.
అప్పుడు శ్రమ శక్తి విలువకూ, వేతనాలకూ మధ్య ఉన్న సంబంధాన్ని మనం పరిశీలించాలి. అంతేకాకుండా సంక్షిప్తంగా వివిధ వేతన రూపాలనూ, వేతనాలలో జాతుల మధ్య వ్యత్యాసాన్నీ చర్చించాలి. చివరగా, మూలధన సంచితంను పరిచయం ద్వారా మనం కొన్ని వ్యాఖ్యలు చేయవలసి ఉంది.
అదనపు విలువ రేట్లు..
అవసరమైన శ్రమకూ అదనపు శ్రమకూ మధ్య నిష్పత్తే అదనపు విలువ రేటు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా అదనపు విలువ రేటులో మార్పు అదనపు శ్రమలో మార్పువలన గానీ లేదా అవసరమైన శ్రమలో మార్పు ద్వారా గానీ లేదా ఆ రెండింటిలో మార్పు వలన గానీ చోటుచేసుకుంటుంది. ఇటువంటి మార్పులు పనిదిన మార్పులపైనా, శ్రమ ఉత్పాదకతపైనా, శ్రమ తీవ్రతపైనా ఆధారపడి ఉంటాయి. మనం మూడు ‘స్వచ్ఛమైన’ (కేసులను) విషయాలను గుర్తించవచ్చు.
శ్రమ తీవ్రతా, పనిదిన నిడివి స్థిరంగా ఉంటే, శ్రమ ఉత్పాదకతలో మార్పు ద్వారా మాత్రమే అదనపు విలువ రేటులో మార్పు సంభవించవచ్చు. శ్రమ ఉత్పాదకత పెరిగినప్పుడు, శ్రమ శక్తి విలువ, అందువలన అవసరమైన శ్రమ తగ్గిపోతుంది. అందువలన పనిదిన నిడివి నుంచి అవసరమైన శ్రమను తీసివేయగా వచ్చే అదనపు శ్రమ అలాగే అదనపు విలువ రేటు కూడా పెరిగిపోతుంది. ఇక్కడ అదనపు విలువ, శ్రమ శక్తి విలువా వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తాయి.
ఏమైనప్పటికీ ఉత్పాదకత పెరగడంతో అదనపు విలువ రేటు(దాని పర్యవసానంగా కార్మిక శక్తి విలువలో క్షీణత) పెరుగుతుంది. అయినప్పటికీ, కార్మికుడు వినియోగించే వస్తువుల పరిమాణం అంటే అతని జీవన ప్రమాణం పెరగడం ఖచ్చితంగా సాధ్యమే. శ్రమ శక్తి ధర ఇప్పుడు తగ్గిన శ్రమ శక్తి విలువ కన్నా ఎక్కువగా ఉన్నంత వరకూ(డబ్బు సరకు పరంగా వేతనాలు లెక్కించినప్పుడు) ఇది జరగవచ్చు.
సంఖ్యా ఉదాహరణ ఇవ్వడానికి, పనిదినం నిడివి 10 గంటలు అనుకుందాము. ధనం రూపంలో అది 40 రూపాయలు. శ్రమ శక్తి విలువ 5 గంటలు అయితే, అది 15 రూపాయలకు సమానం. ప్రారంభంలో, వేతనం(ధన రూపంలో శ్రమ శక్తి ధర) శ్రమ శక్తి విలువకు సమానం అంటే రూ 15 అనుకంటే, ఇప్పుడు మెరుగుపడిన ఉత్పాదకత అవసరమైన శ్రమను మూడు గంటలకు అంటే ధన రూపంలో రూ 9 సమానంగా తగ్గిస్తుంది.
శ్రమ శక్తి ధర కొత్త విలువకు సమానంగా తగ్గకుండా రూ 12లకు అంటే 4 గంటల శ్రమకు మాత్రమే తగ్గితే అప్పుడు మనకు ఈ ఫలితాలు వస్తాయి. (a) అదనపు విలువ రేటు పైకి(5/5 కు బదులుగా 7/3 కి)పెరుగతుంది. కానీ(b) కార్మికుడు వినియోగించే వస్తు సేవలు పెరిగిపోతాయి.
మార్క్స్ ఈ విధంగా చెప్పాడు: ఈ విధంగా శ్రమ పెరుగుతున్న ఉత్పాదకతతో కార్మికుల శ్రమ శక్తి ధర తగ్గుతూ ఉంటుంది. కానీ దీనిని వెన్నంటి కార్మికుల మెరుగైన జీవనపరిస్థితులు రావడం సాధ్యమవుతుంది’.
తగ్గుతున్న నిజవేతనాల సిద్ధాంతాన్ని మార్క్స్కు ఆపాదించడం ఎంత అసంబద్ధమో మార్క్స్ ఈ ఉదాహరణ నుంచి ఎవరైనా తెలుసుకోవచ్చు. ‘అటువంటి సందర్భంలో కూడా శ్రమ శక్తి విలువ పతనం సంబంధిత అదనపు విలువ పెరుగుదలకు కారణమవుతుంది. దీంతో కార్మికునికీ, పెట్టుబడిదారునికీ మధ్య అగాధం విస్తరిస్తూనే ఉంటుంది.’ అన్న పై ఉదాహరణ తరువాత వాక్యాలలో, కార్మికవర్గాన్ని దారిద్య్రంలోకి నెట్టడం లేదా బాధలలోకి నెట్టడమని మార్క్స్ వ్యక్తీకరణ చేసిన విషయాన్ని చాలా మంది వేతనాలలో తరుగుదలగా తప్పుగా వ్యాఖ్యానించడం స్పష్టంగా కనపడుతుంది.
‘ఒక వైపున పెట్టుబడిదారుల ఒత్తిడీ, మరొక వైపు కార్మికుల ప్రతిఘటన వంటి ప్రత్యేక పరిస్థితులలో’ శ్రమ శక్తి ధరలు (వేతనాలు), శ్రమ శక్తి విలువకు భిన్నంగా ఉంటాయని మార్క్స్ విశ్లేషణ ఈ సందర్భంలో స్పష్టం చేస్తుంది.
శ్రమ ఉత్పాదకతా, పనిదినం( పొడవు) స్థిరంగా ఉంచబడ్డాయి. ఈ సందర్భంలో అదనపు విలువ పెరుగుదల శ్రమ తీవ్రత పెరుగుదల ద్వారా తీసుకురాబడుతుంది. నిర్ణీత పొడవు కలిగిన సాధారణ పని తీవ్రత కలిగిన పనిదినం కన్నా అధిక పని తీవ్రత కలిగిన పనిదినం విలువ ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఎక్కువ తీవ్రత శ్రమ శక్తి వేగవంతమైన వినియోగానికి, అంటే కార్మికుని ఎక్కువ శక్తి వినియోగానికి శ్రమ శక్తి అధిక విలువకు దారితీస్తుంది. పెరుగుదలను భర్తీ చేయడానికి తరచుగా పెరిగే వేతనాలు శ్రమశక్తి కొత్త, అధిక విలువ సంబంధించిన దాని క్షీణతను దాచి పెడతాయి.
కొత్త స్థాయి పని తీవ్రత సాధారణమైతే, అంటే ఉత్పత్తి అన్ని శాఖలలో ప్రబలంగా ఉంటే అది అదనపు విలువకు మూలంగా నిలిచిపోతుంది. ఏమైనప్పటికీ, ఒక దేశ నిర్దిష్ట ఆర్ధిక పరిస్థితులలో ఏకరీతి పని తీవ్రత ధోరణి ఉన్నప్పటికీ అంతర్జాయంగా పని తీవ్రతలో వ్యత్యాసాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
శ్రమ తీవ్రతనూ, దాని ఉత్పాదకతనూ స్థిరంగా ఉండనిద్దాం. అప్పుడు అదనపు విలువలో పెరుగుదల (దాని నిష్పత్తి) తప్పనిసరిగా పనిదినాన్ని పొడిగించడం ద్వారానే జరుగుతుంది. ఇది (i)శ్రమ శక్తి తరుగుదల(అరుగుదల)అందువలన దాని రోజువారీ విలువ పెరుగుదలలోనూ, ఈ సందర్భంలో (ii) అదనపు విలువా, శ్రమ శక్తి ఒకే దిశలో పయనించడంలో ఖచ్చితంగా కనపడుతుంది.
పెరిగిన వేతనాలు(అదనపు శ్రమకాలానికి ఇచ్చే భత్యం వగైరాలు) కొంత మేరకు పనిదినాన్ని పొడిగించడం వలన సంభవించే పెరిగిన శ్రమ శక్తి తరుగుదలను (అరుగుదల) భర్తీ చేస్తాయి. ఒక నిర్దిష్ట పరిమితిని మించి పెరిగిన వేతనాలు తరిగిన శ్రమ శక్తిని భర్తీ చేయడానికి సరిపోవనే విషయాన్ని మనం గుర్తించాలి. దాని ఫలితంగా ‘శ్రమ శక్తి ధర, దాని దోపిడీల పరిణామం తదనుగుణంగా ఉండడం ఆగిపోతుంది’.
రెండవ(కేసు) అంశం చేసినట్లు, మూడవ(కేసు) అంశం సంపూర్ణ అదనపు విలువ ఉత్పత్తికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మొదటి(కేసు) అంశం స్వచ్ఛమైన సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నదన్నది స్పష్టం.
ఏమైనప్పటికీ, ఆచరణలో మూడు నిర్ణయాత్మక అంశాలు, శ్రమ శక్తి ఉత్పాదకత, శ్రమ తీవ్రత, పనిదినం నిడివిలో, దోపిడీ రేటులలో ఏదో ఒకదానిలో మాత్రమే మార్పులు జరగవు. కానీ అన్నింటిలో ఒకే సారి జరుగుతాయి. ‘ఒకే సమయంలో పనిదినాన్ని కుదించడం, శ్రమ తీవ్రతనూ, ఉత్పాదక శక్తిని పెంచడం’ ప్రస్తుత ధోరణిగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో ఉంది.
పెట్టుబడిదారీ జ్ఞానం ప్రబలమైన గాల్ బ్రియత్లు పేర్కొన్నట్లు ఆ పెట్టుబడిదారీ విధానం అదనపు విలువనూ, లాభాన్నీ వదలుకొని సోషలిజం వైపు కలవడం కాకుండా వాస్తవానికి వీలైనంత ఎక్కువగా శ్రమ తీవ్రతను పెంచడానికి చేసిన త్వరపెట్టడం వంటి ప్రయత్నాలు(1970ల మధ్యలో) లార్డ్స్తన్ ఒహియో, అమెరికాలోని జనరల్ మోటార్స్ కర్మాగారంలో సమ్మె రూపంలో వెలుగులోకి వచ్చాయి. త్వరపెట్టడం, టేలరిజంవంటి అంశాలన్నిటినీ హేరీ బ్రేవర్మాన్ అద్భుతంగా విశ్లేషించాడు.
పెట్టుబడిదారీ సమర్ధత..
సాపేక్ష అదనపు విలువను ఉత్పత్తి చేసే ప్రతి ప్రయత్నంలోనూ పెట్టుబడిదారుడు ప్రతి చోటా శ్రమను(ఉత్పత్తి సాధనాలను) పొదుపుగా వాడడం మనం చూశాం. పెట్టుబడిదారీ పక్షపాతులు దీనిని పెట్టుబడిదారీ విధానం సామర్ధ్యం, హేతుబద్ధతగా చూపారు. కానీ అటువంటి వాదనలు సామాజిక స్థాయిలో ఈ వ్యవస్థ అసమర్ధతను, పనికిమాలిన తనాన్ని విస్మరిస్తాయి.
మార్క్స్ దీనిని ఈ విధంగా వివరించాడు: పెట్టుబడి దారీ విధానం ఒక వైపున ప్రతి వ్యాపారంలోనూ పొదుపును పాటిస్తూనే మరొక వైపు తన అరాచక పోటీ వ్యవస్థ ద్వారా శ్రమ శక్తినీ, సామాజిక ఉత్పత్తి సాధనాలనూ అత్యంత దారుణమైన దుర్వినియోగానికి పాల్పడుతుంది. అది సృష్టించేవి ప్రస్తుతం అనివార్యమైనవే కానీ వాటంతట అవి చేసే నిరుపయోగమైన అత్యధిక ఉద్యోగాల సృష్టిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
శ్రమ శక్తి ఉత్పాదకతను పెంచే సాంకేతిక విప్లవాలు కఠినమైన, వ్యర్ధమైన శ్రమ నుంచి మానవావళిని విముక్తి చేస్తాయనే విషయాన్ని నొక్కి చెప్పవలసి ఉంది. శాస్త్ర సాంకేతిక పురోగమనం ఎప్పుడూ/ నిరంతరం అవసరమైన శ్రమ సమయాన్ని తగ్గిస్తుంది. కానీ పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని రద్దు చేయడం ద్వారా మాత్రమే పనిదినాన్ని అవసరమైన శ్రమ కాలానికి తగ్గించగలం. ఏమైనప్పటికీ మార్క్స్ ఎత్తిచూపినట్లు రెండు కారణాల వలన సోషలిస్టు సమాజంలో అవసరమైన ఈ శ్రమ కాలం ఎక్కువగా ఉంటుంది.
ఒక వైపు జీవనభృతి ప్రమాణం అనే భావన గణనీయంగా విస్తరించిన కారణంగా పూర్తిగా భిన్నమైన జీవన ప్రమాణాలను కార్మికుడు డిమాండు చేస్తాడు. మరొక వైపున అదనపు శ్రమలో కొంత భాగం ఇప్పుడు అవసరమైన శ్రమలో భాగం అవుతుంది. నిధులను కూడ బెట్టడానికి అవసరమైన శ్రమ అని నా అభిప్రాయం.
అధిక ఉత్పాదక అంశమే కాకుండా వ్యక్తుల మేధో, ‘సామాజిక అభివృద్ధికి, శ్రమకు తగిన నిష్పత్తిలో సమయాన్ని సమాజం ఇస్తుంది. సమాజంలోని అర్హులైన సభ్యులందరికీ సమంగా భాగమిస్తుంది. అంతేకాకుండా సహజపని భారాన్ని తమ భుజాలపై నుంచి సమాజంలోని మరొక స్థాయిలోని వారి భుజాలపై మోపే అధికారాన్ని ఒక ప్రత్యేక వర్గం కోల్పోతుంది’.
పెట్టుబడిదారీ సమాజంలో ప్రజల మొత్తం జీవిత కాలాన్ని శ్రమ సమయంగా మార్చడం ద్వారా ఖాళీ సమయం ఒక వర్గానికి లభిస్తున్నందున ఇది నిజంగా చాలా కీలకమైన అంశం. పెట్టుబడిదారీ సామర్ధ్యం యొక్క నిజమైన సారం ఇదే.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 30వ భాగం, 29వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
