ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కొజికి వ్యతిరేకంగా సెప్టెంబరు 25న ఫ్రాన్స్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2007 అధ్యక్ష ఎన్నికల్లో లిబియా నుంచి అక్రమంగా నిధులు సేకరించడం వల్ల నేరానికి పాల్పడినట్టుగా ధృవీకరిస్తూ తీర్పునిచ్చింది. ఖచ్చితంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలని కూడా కోర్టు తేల్చి చెప్పింది. సాధారణంగా అన్ని కేసుల్లోనూ అప్పీలుకు అవకాశం ఉన్నా, ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని న్యాయస్థానం ప్రకటించటం విశేషం.
అప్పట్లో “అధ్యక్ష పదవి బరిలో ఉన్న సర్కొజి లిబియాలోని గడ్డాఫి ప్రభుత్వంతో అవినీతికరమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా తన ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధులను కమిషన్ రూపంలో సేకరించార”ని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
తాను ఎన్నికల్లో గెలిస్తే భవిష్యత్తులో గడ్డాఫికి, అతని బంధుమిత్రులకు కాంట్రాక్టులు ఇస్తామన్నది సర్కొజి ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా గడ్డాఫి బావమరిది అబ్దుల్లా సిన్యోసి అక్రమ నిధులను సర్కొజికి తరలించారు. సిన్యొసి 1989లో ఫ్రెంచి విమానం పేలుడు కేసులో నిందితుడు కూడా. ఈ బాంబుదాడిలో 171 మంది ప్రయాణీకులు మరణించారు.
అవినీతి, ఎన్నికల్లో ప్రజాధనం దుర్వినియోగం, ఎన్నికల ప్రచారానికి అక్రమ నిధుల సమీకరణ ఆరోపణలపై తగినన్ని సాక్ష్యాధారాలు లేనందున సర్కొజిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అయితే, దర్యాప్తు విభాగం సర్కొజికి వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో నిర్ధారించలేకపోయింది. ఈ నేరాలకు పాల్పడాలన్న ఉద్దేశ్యం స్పష్టంగా రుజువు అయినందున ఆ మేరకు సర్కొజి శిక్షార్హుడే అని న్యాయస్థానం ప్రకటించింది.
సర్కొజితో పాటు ఆయన అధ్యక్షకాలంలో కీలక బాధ్యతలు నిర్వహించిన మరో ఏడుగురిని కూడా న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వీరిలో సర్కొజికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన బ్రైక్ హోర్టెఫాక్స్, మాజీ హోంమంత్రి క్లాడ్ గ్యాంట్, సర్వసైన్యాధ్యక్షుడు కూడా ఉన్నారు.
న్యాయవ్యవస్థ అరుదైన తీర్పులు..
ఫ్రాన్స్‌లో ఈ విధంగా ఉన్నతస్థాయిలో ఉన్న ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణల్లో దోషులుగా నిర్ధారించబడటం ఇదే మొదటిసారి కాదు. 2011లో పూర్వపు అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ నిధుల దుర్వినియోగం, ప్రజా విశ్వాసం కోల్పోవటం వంటి ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డారు. 2020లో ప్రధాని ఫిలనోస్ నిధుల దుర్వినియోగం, కంపెనీ ఆస్తుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం వంటి నేరాల్లో దోషిగా నిర్ధారించబడ్డారు.
మాజీ మంత్రి, ఐఎంఎఫ్ మాజీ డైరెక్టర్ క్రిస్టినా లగార్డ్ కూడా ఇటువంటి ఆరోపణలపై దోషిగా ప్రకటించబడ్డారు. గతంలో కూడా 2021, 2023లో సర్కోజి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, పలుకుబడి దుర్వినియోగం, నిధుల దారి మళ్లింపు వంటి ఆరోపణలపై మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. మితిమీరిన ఎన్నికల వ్యయం కేసులో కూడా ఓ న్యాయమూర్తికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై కూడా సర్కొజి దోషిగా నిలిచారు.
ప్రజాస్వామిక దేశాల్లో మాజీ దేశాధినేతలు జైలు ఊచలు లెక్కించటం అత్యంత అరుదైన పరిణామంగానే చెప్పుకోవచ్చు. ప్రసుత్తం బ్రెజిల్ అధ్యక్షుడుగా ఉన్న లూలా ఓ కార్పొరేట్ కేసులో జైలుపాలయ్యారు. తర్వాత అప్పీలు దశలో కేసు కొట్టేయబడింది. మాజీ ఇజ్రాయెల్ ప్రధాని ఓమర్ట్ కూడా అవినీతి ఆరోపణల కారణంగా 2014లో జైలు శిక్ష అనుభవించారు. ముగ్గురు మాజీ కొరియా అధ్యక్షులు కూడా అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం, దేశద్రోహం వంటి ఆరోపణలపై జైలుపాలయ్యారు.
1980- 88 మధ్యకాలంలో కొరియా అధ్యక్షుడుగా పని చేసిన దేవూకుకు ఏకంగా ఉరిశిక్ష విధించింది అక్కడి న్యాయ వ్యవస్థ. తర్వాత దాన్ని జీవిత ఖైదుగా మార్చింది.
కొంతమందికి జైలు శిక్ష విధించినా వారి వయస్సు, ఆరోగ్యం వంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని తర్వాత శిక్షలు తగ్గించారు. ఉదాహరనకు ఇటలీ మాజీ అధ్యక్షుడు బెర్లుస్కొని లైంగిక, పన్నుల ఎగవేత వంటి ఆరోపణలపై జైలు శిక్ష విధించినా తర్వాత కాలంలో ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా తొలగించారు.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చిరాక్ను కూడా ముద్దాయిగా ప్రకటించి జైలు శిక్ష విధించినా, తర్వాత జైలు జీవితం నుంచి మినహాయింపు ఇచ్చారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు జైలు శిక్ష విధించినా ఆరోగ్య కారణాల రీత్యా విడుదల చేశారు. మరికొంతమంది జైలు జీవితం తప్పించుకోవడానికి ఏకంగా దేశం విడిచి పారిపోయారు.
కాలానికి ఎదురీదుతున్న న్యాయ వ్యవస్థ..
2017లో ధాయలాండ్ ప్రధాని షినవార్త ఇలా దేశం విడిచి వెళ్లిపోగా జీవితాంతం తానే దేశాధ్యక్షుడిని అని ప్రకటించుకున్న హైతీ నేత జీన్ క్లాడ్ డువెలియర్ చివరకు ఫ్రాన్స్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో మర్కెల్ పెటీన్కు కూడా జైలు శిక్ష విధించినా తర్వాత దాన్ని గృహనిర్బంధంగా మార్చారు. కానీ ఫ్రాన్స్‌లో అధ్యక్షుడుగా పని చేసిన వ్యక్తి- జైలు జీవితం గడపాల్సి రావటం ఇదే ప్రథమం కావటంతో ఈ కేసు ఫ్రాన్స్ రాజకీయ చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోనుంది.
ఫ్రాన్స్ రాజకీయాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం జరిగింది. పరిపాలన స్థంభించిపోయింది. అధ్యక్షుడు మాక్రోన్ పాలనలో ఆరో ప్రధాని గత మార్చిలోనే రాజీనామా చేశారు. తీవ్ర మితవాద పక్షం ప్రతినిధిగా ముందుకొచ్చిన మరిన్ లీపెన్ మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కన్నారు. ఈ కేసులో నాలుగేళ్లపాటు జైలుశిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.(ఇందులో రెండేళ్ల జైలు శిక్షను తగ్గించారు. మరో రెండేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. గృహ నిర్భంధానికి గుర్తుగా ఆమె ఈ రెండేళ్ల పాటూ ఎలక్ట్రానిక్ బ్రేస్లెట్ ధరించాలి). తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ వేసిన అప్పీలు 2026 మార్చిలో తీర్పు వెలువడనున్నది.
ఈ తీర్పుల ద్వారా ఫ్రెంచి న్యాయ వ్యవస్థ రాజకీయాలపై తనదే పైచేయి అని నిరూపించుకుంటోంది. అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవడానికి, శిక్షలు వేయటానికి వెనకాడటం లేదు. మరో మాటగా చెప్పుకోవాలంటే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు అడ్డు అదుపు లేకుండా, నీతీ నియమాలు గాలికొదిలి వ్యవహరిస్తున్న సమయంలో ఫ్రెంచి న్యాయ వ్యవస్థ కాలానికి ఎదురీదుతోంది. ప్రజాతంత్ర రాజ్యాంగ ప్రమాణాలు తుంగలో తొక్కి, తనపై ఉన్న కేసులను తానే రద్దు చేసుకోవటం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త న్యాయ సూత్రాలకు తెరతీశారు.
ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు, నాయకులు, వ్యవస్థల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. దీంతో ప్రజాస్వామ్యం నిస్సారమవుతోంది. రాజకీయనాయకులు, వ్యవస్థల బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేకపోవటం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద లక్షణాలతో కూడిన మితవాద రాజకీయాలు అందలమెక్కుతున్నాయి.
ఈ మధ్యనే మాజీ రాజకీయ నిపుణుడు గిలియానో ది ఎంపోలి ప్రచురించిన విశ్లేషాత్మక వ్యాసంలో అన్ని రకాల ప్రజాస్వామిక ప్రమాణాలను, విలువలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తున్న నికృష్ట రాజకీయవర్గం గురించి వివరించారు. వివేకవంతంగా విధాన నిర్ణయాలు రూపొందించే స్థానంలో ఒంటెత్తు పోకడలతో విధాన నిర్ణయాలు రూపొందించటం, రాజకీయ తరగతి ఎంచుకున్న ఉదారవాద రాహిత్యాన్ని ఓ బ్రాండ్‌గా మార్చి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేయటం వంటి పరిణామాల నడుమ రాజకీయాల్లో శాశ్వతమైన అనిశ్చితిని సృష్టిస్తున్నారు. ఈ అనిశ్చితినే ఉపయోగించుకుంటూ పదేపదే అధికారం దక్కించుకుంటున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ వాదులు, మీడియా, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామిక దేశాలు- పైన ప్రస్తావించిన తరహా రాజకీయ నాయకత్వం ప్రజాస్వామ్య మనుగడకు విసురుతున్న సవాలును ఎదుర్కోవటంలో నిస్సత్తువగా వ్యవహరిస్తున్నాయని ఎంపొలి ఆక్షేసిస్తారు. ఈ శక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటంలో బలహీనంగా ఉండడటం, లేదా సిద్ధంకాకపోవటం, ఉల్లంఘనలను నిలదీయటంలో, ప్రజాస్వామిక ప్రమాణాలు కాపాడటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎంపొలి ఆరోపణ.
ఇటువంటి పరిణామాల నేపథ్యంలో, తప్పు చేస్తే చివరకు అధ్యక్షులనైనా వదలకుండా ఫ్రెంచి న్యాయస్థానాలలాంటివి శిక్షించటానికి సిద్ధపడటం విశేషంగానే చెప్పుకోవాలి. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని అమలు చేస్తున్న అరుదైన తరుణం ఇది.
తమ తీర్పులను వెలువరిస్తూ న్యాయమూర్తులు ‘రాజ్యాంగ వ్యవస్థలను, ప్రమాణాలను, క్రమశిక్షణను అమలు చేసి దేశమంతా ఆయా వ్యవస్థలు, ప్రమాణాలు, విలువలకు కట్టుబడి ఉండేలా చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన హోదాల్లో ఉన్న వారే వీటిని ఉల్లంఘించటం ప్రజల్లో ఆయా వ్యవస్థలు, విలువల పట్ల ఉన్న విశ్వాసాన్ని నీరుగారుస్తున్నందున తాము ఇటువంటి కఠినమైన తీర్పులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది’ అంటూ తమ తీర్పులను సమర్ధించుకుంటున్నారు. గణతంత్ర వ్యవస్థ ప్రయోజనాల రీత్యా ఈ తీర్పులు అనివార్యమని న్యాయమూర్తులు అంటున్నారు.
సమాజం, రాజకీయాలు పరస్పర విరుద్ధ శిబిరాలుగా చీలిపోయిన నేటి పరిస్థితుల్లో- వికృత ఉదారవాదులు ఈ నిర్ణయాలు రాజకీయాల్లో న్యాయవ్యవస్థ జోక్యమంటూ గగ్గోలు పెట్టే అవకాశం లేకపోలేదు. సర్కొజిని సమర్ధించే మితవాదులు, మీడియా న్యాయ వ్యవస్థ హద్దు మీరుతోంది అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరైతే ఈ తీర్పులను న్యాయ వ్యవస్థ చేస్తున్న తిరుగుబాటుగా కూడా భావిస్తున్నారు.
అంతేకాదు, ఫ్రాన్స్‌లో న్యాయమూర్తుల నియామకంపై రాజకీయ నాయకత్వం పట్టు బిగించాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. పద్నాలుగవ లూయి బోనపార్టెను తలపిస్తూ సర్కొజి తానే రాజ్యం, తానే దేశమని ప్రకటించారు. తనకు శిక్ష విధించటం అంటే యావత్తు ఫ్రెంచి రిపబ్లిక్కును జైల్లో పెట్టడమే అంటున్నారు. ఈ తీర్పుపై విమర్శలే కాదు. హింసాత్మక స్పందనలూ వ్యక్తమయ్యాయి. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని చంపుతామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.
మితవాద రాజకీయాల ముందు రాజ్యాంగ వ్యవస్థలు మోకరిల్లుతున్న సమయంలో న్యాయస్థానాలు ఎదురొడ్డి నిలవటం ప్రశంసనీయమే.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ నాయకత్వంలో నడుస్తున్న సామాజిక శాస్త్ర అధ్యయనాల సంస్థ సెరిలో పరిశోధకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
