కనులున్నవి చూసేందుకే కాదు..
మూసుకుని ఉండేందుకు కూడా!
అంతర్దృష్టి కోసం!
చెవులున్నవి వినేందుకే కాదు..
నిశ్శబ్దాన్ని కూడా ఆస్వాదించేందుకు!
చెప్పని విషయాలను కూడా గ్రహించేందుకు!!
నోరున్నది మాట్లాడేందుకే కాదు..
మౌనంగా సంభాషించేందుకు కూడా!
నిశ్శబ్ద సౌందర్యాన్ని ప్రకటించేందుకు కూడా!!
కాళ్ళున్నవి నడిచేందుకు, పరిగెత్తేందుకే కాదు..
ఒకే ప్రదేశంలో కూర్చోని
నిశ్చలత్వం రుచి చూసేందుకు కూడా!
మనసున్నది కేవలం ఆలోచించేందుకే కాదు..
ఆ ఆలోచనా స్రవంతి పరుగులను, అలజడుల తరంగాలను
ప్రశాంత తత్త్వం దిశగా మళ్లించేందుకు కూడా!
భావోద్వేగ పరంపరను మూకుమ్మడిగా చల్లార్చి,
భావ రహిత అనుభవాన్ని అనుభూతించేందుకు కూడా!!
కానీ..
చేతులున్నవి?
ముడుచుకొని
ఉండేందుకు కాదు..
సాటి సమాజానికి చేయూతనందించేందుకు..!
మరో వైపు…
పిడికిలి బిగించి పోరాట పటిమను
ప్రదర్శించేందుకు…!!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
