చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత, పేదరికం లేని(జీరో పావర్టీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించటానికి 2025 మార్చి 30న ఉగాది రోజు- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీ4 పథకాన్ని చంద్రబాబు ఆర్భాటంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పీ4 అంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యమని అర్థ వివరణ ఇచ్చారు.
చంద్రబాబు విజన్‌లో ముఖ్యమైనది “స్వర్ణాంధ్ర 2047 విజన్”. ఇందులో భాగంగా రాష్ట్రంలో పేదరికాన్ని 2029 నాటికి నిర్మూలించడానికి; అంటే జీరో పావర్టి సాధించటానికి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.
ఈ పథకాన్ని ఏప్రిల్ 5న ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళ గ్రామంలో, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా- గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో ప్రజా వేదికల పేరుతో బహిరంగ సభలు నిర్వహించి మార్గదర్శి, బంగారు కుటుంబాలను ఎంపిక చేసే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పజెపుతున్నట్లు ప్రకటించారు.
స్వచ్ఛందమంటూనే బాధ్యతల అప్పగింత..
ఒక పక్కన ఇది స్వచ్ఛంద కార్యక్రమమని ప్రకటిస్తూ, ప్రభుత్వ అధికారులకు పథకానికి సంబంధించిన బాధ్యతలను అంటగడుతున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు కూడా మార్గదర్శకులుగా మారాలని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా స్పష్టం చేశారు. దీని మీద ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి, పీ4 బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పజెపుతున్నట్టుగా సెప్టెంబర్ 10న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో 14,954 సచివాలయాలను 2,14,084 క్లస్టర్లుగా విభజిస్తారు. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి మూడు క్లస్టర్ల బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మార్గదర్శి బంగారు కుటుంబాల మధ్య సమన్వయం చేయాలి. ఈ మొత్తం కార్యక్రమం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది.
దీనిని బట్టి చూస్తే, మొత్తం పీ4 పథకం అమలు బాధ్యతను సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం మోపింది. ఈ కార్యక్రమ బాధ్యతను ఉపాధ్యాయులపై పెట్టి ఏ విధంగా వ్యతిరేకతను తెచ్చుకుందో, అసలే వివిధ రకాల పనుల భారంతో సతమతమవుతున్న సచివాలయ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోబోతున్నది.
పథకానికి పునాదులు నూతన ఆర్థిక విధానాలే..
పీ4 పథకాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉగాది రోజున ప్రారంభించి ఆగస్టు 19న మంగళగిరిలో అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు తాను స్వయంగా కుప్పం నియోజకవర్గం నుంచి 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఏ మాత్రం మనసున్నా పీ4 ఆచరణ సాధ్యమే అని చంద్రబాబు పేర్కొన్నారు.
నానాటికి సమాజంలో ధనిక- పేద అంతరాలు పెరిగిపోతున్నాయి. దీంతో పేద వర్గాలలో నిరాశ, నిస్పృహలు నానాటికి ఎక్కువవుతున్నాయి. సమాజంలో పేదరికం పెరగటానికి మూలకారణాల్లోకి వెళ్లకుండా, చిట్కా వైద్యాలతో రోగాలను పోగొడతామనే చిట్కా వైద్యులలా చంద్రబాబు వైఖరి కనిపిస్తుంది.
కానీ విజన్ ప్రకారం తాను అద్భుతాలను సృష్టిస్తున్నానని ఆయన అనుకుంటున్నారు. తాను అనుకున్న విజన్ 2020 ప్రకారం, హైదరాబాదులో హైటెక్ సిటీని సృష్టించి అభివృద్ధిని సాధించానని అంటున్నారు. ఇప్పుడు విజన్ 2047 ప్రకారం పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా మార్చుతానని పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు.
ఈ విధంగా ప్రచారం చేయగలగటానికి, చంద్రబాబు విజన్‌తో ముందుకెళ్లడానికి కర్త, కర్మ, క్రియ ప్రపంచ బ్యాంకు రూపొందించిన నూతన ఆర్థిక విధానాలేనని వేరే చెప్పనవసరం లేదు. ఇందుకు తార్కాణం చంద్రబాబు తననుతాను ప్రపంచ బ్యాంకు సీఈఓనని గర్వంగా చెప్పుకోవటమే.
పీవీ నరసింహారావు కాలంలో ప్రారంభించబడిన నూతన ఆర్థిక విధానాలలో భాగమైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను చంద్రబాబు అమలు చేయడంలో ఆనాటి నుంచి పోటీ పడుతూనే ఉన్నారు. చంద్రబాబు విజన్ 2047 ఆ విధానాలలో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు. ఆ విజన్‌కు పుట్టిన మానస పుత్రికే పీ4 పథకం.
సమసమాజ దృష్టితోనే పేదరిక నిర్మూలన సాధ్యం..
పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలా సాధ్యం అవుతుంది?
పీ4 పిచ్చి నుంచి చంద్రబాబు త్వరగా బయటపడాలని, లేకుంటే గతంలోలాగా అధికారానికే ముప్పు వస్తుందని చంద్రబాబు శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. అయినా చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా పీ4 పథకాన్ని అమలు చేయటానికి; అమలు పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సంస్థకు వైస్ చైర్మన్‌గా గతంలో ప్రణాళిక శాఖ ఛైర్మన్‌గా పనిచేసిన సీ కుటుంబరావును కూడా నియమించారు. కాబట్టి చంద్రబాబు అభిమానులు బాధపడుతున్నట్టు చంద్రబాబు పీ4 పిచ్చిలోనే ఉన్నారనేది స్పష్టం.
పేదరికంలేని సమాజం ఒక్క మన రాష్ట్రంతోనే సాధ్యం కాదన్న విషయం జగమెరిగిన సత్యం. ఈ సత్యం చంద్రబాబుకు తెలియదా?
ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలుగా ఉన్న అమెరికా, జపాన్, జర్మనీ, చైనా దేశాలలో కూడా ప్రజలు పేదరికంతో బాధపడుతూనే ఉన్నారు. ఒకప్పుడు సోషలిస్ట్ దేశాలుగా వెలుగుందిన రష్యా, చైనా దేశాలలో ఆ తర్వాత ఆయా దేశాలలో వచ్చిన పరిణామాల రీత్యా సామాజిక అంతరాలు పెరుగుతూ ఉన్నాయి.
ప్రజల బలహీనతలను వాడుకోవడంలో అందెవేసిన చేయి..
వ్యక్తిగత ఆస్తిని వదిలిపెట్టి, మొత్తం వనరులను సమాజ పరంచేసి; మనిషి మనుగడకు అవసరమైన మేరకే వనరులను ఉపయోగించుకునే ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టేదే సమసమాజ దృష్టి. అటువంటి సామాజిక వ్యవస్థ సాధన కోసమే ఒక ప్రాపంచిక దృక్పథంతో కమ్యూనిస్టులు కృషి కొనసాగిస్తున్నారు. అటువంటి సామాజిక వ్యవస్థను సాధించనంత కాలం పేదరికాన్ని నిర్మూలించటం సాధ్యం కాదు.
మరి పేదరికాన్ని నిర్మూలిస్తామని, ఫలానా 2029 సంవత్సరం నాటికి పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మిస్తామని చంద్రబాబు పీ4 పథకం పేరుతో, తన అభిమానులు గట్టిగా వారిస్తున్నా- ఎందుకు ముందుకు వెళుతున్నారు? ఇందులో ప్రధానమైనది ప్రజల బలహీనతలను తమ రాజకీయలబ్ధి కోసం వాడుకోవడం. ఈ విషయంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఇతర రాజకీయ నాయకుల కంటే చంద్రబాబుకు ప్రపంచ బ్యాంకు స్థాయిలో విజన్ ఉండటమే దీనికి కారణం.
రాజుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రజలు తమ దయా దాక్షిణ్యాల మీద బతకాలి. ఈ ఫ్యూడల్ లక్షణాలలో భాగంగా భక్తి భావాలు పెరిగి జీవ కారుణ్య సిద్ధాంతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉన్నవాడు లేనివాడికి సహాయం చేయటమనేది ఈ జీవకారుణ్య సిద్ధాంతములోని ముఖ్య విషయం. దీని ప్రకారం సహాయం పొందిన పేదవారు ఎల్లకాలం కృతజ్ఞతా భావంతో ఉండిపోతారు. పీ4 పథకం ప్రకారం, సహాయం చేసిన మార్గదర్శుల పట్ల పేదలకు చెందిన బంగారు కుటుంబాలు సహజంగా కృతజ్ఞతా భావంతో ఉంటాయి. ఈ విధంగా సహాయం పొందటానికి సూత్రధారుడైన చంద్రబాబు పట్ల మరింతగా కృతజ్ఞతా భావం వెల్లివిరిసి, అది ఓట్ల రూపంలో చివరికి రుణం తీర్చుకుంటారు.
దీనికంటే ముఖ్యమైనది పేదరికంతో పెరుగుతోన్న ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఉద్యమాల వైపు ఆకర్షింపబడకుండా ఉండటమనేది పాలకవర్గాల అనుసరిస్తున్న రాజకీయ నీతి. ప్రపంచ బ్యాంకు విధానాలను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న చంద్రబాబు అసలైన రాజకీయ నీతి ఇది. ఈ నీతి తలకెక్కిన చంద్రబాబు తన శ్రేయోభిలాషులు ఎంత మొత్తుకున్నా ఈ పీ4 పథకాన్ని విడిచి పెట్టకపోవటంలో ఉన్న అసలైన రహస్యం ఇదే!
పేదరిక నిర్మూలన అనేది ఈ వ్యవస్థకు సంబంధించిన అంశం. ఇది చంద్రబాబు నాయుడి పేటెంట్ హక్కు కాదు. ఈ ఒక్క రాష్ట్రంలోనే పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పటం పేదలను మరికొంత కాలం పాటు వంచించటమే. పేదరిక నిర్మూలన జరగాలంటే ఈ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. ఈ మార్పుల కోసం సంఘర్షణ అనివార్యం.
ప్రజల శ్రమను దోచుకునే దోపిడీ శక్తులపై పోరాటం అనివార్యమని సమాజ పరిణామ చరిత్ర చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్నది.
పీ4 లాంటి తాత్కాలిక పథకాలతో పేదరికం సమూలంగా నిర్మూలన కాదని, పేదరికాన్ని పదికాలాలపాటు పెంచేవి మాత్రమేనని, కాబట్టి ప్రజలు తమ శ్రమకు తగిన ఫలితాన్ని సాధించే వర్గపోరాటాల ద్వారానే జీరో పావర్టీని సాధించగలుగుతారని ఎలుగెత్తి చాటుదాం!
ముప్పాళ్ళ భార్గవశ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు
ఫోన్ నం: 9848120105
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
